
దీప్తి సునయన
ఇబ్రహీంపట్నం : బుల్లితెరపై పల్లెటూరి తార తళుక్కుమన్నది. ‘స్టార్ మా’లో ప్రసారమవుతున్న బిగ్‌బాస్–2 రియాల్టీషోలో సెలబ్రెటీల సరసన ఆ గ్రామీణ యువతికి ఆవకాశం దక్కింది. ఇప్పటికే అబ్బురపరిచే డ్యాన్సులు, అద్బుతమైన డబ్‌స్మాష్ విన్యాసాలతో యూట్యూబ్, ఇన్‌స్ట్రాగ్రామ్, ఫేస్ బుక్‌ల్లో సంచలనం సృష్టించింది.
రంగమ్మ మంగమ్మ ఏంపిల్లడూ... అంటూ సాగే పాటను డబ్‌స్మాష్ చేసి తన అద్భుతమైన నటనా ప్రావీణ్యంతో ప్రేక్షకుల నిరాజనాలను అందుకుంది. కోటీ 23 లక్షల మంది ఈ సాంగ్‌ను వీక్షించారు. కళకు సృజనాత్మకతను జోడించి సినీ, టీవి, సామాజిక మాధ్యమాల్లో ఒక వెలుగు వెలుగుతోంది దీప్తి సునయన.
ఆమె ప్రతిభను గుర్తించి బిగ్‌బాస్ నిర్వాహకులు ఆమెకు బిగ్‌బాస్–2 రియాల్టీషోలో అవకాశం కల్పించారు. హీరో నాని హోస్ట్‌గా వ్యవహరిస్తున్న బిగ్‌బాస్ షోలో ఆమె తన ప్రతిభను ప్రదర్శిస్తోంది.
ఇంతకు ఈ యువతి ఎవరు.....
దీప్తి సునయన ఇబ్రహీంపట్నం మండలం చర్లపటేల్‌గూడ గ్రామ పంచాయతీపరిధిలోని కర్ణంగూడ గ్రామానికి చెందిన బీజేపీ జాతీయ కిసాన్ మోర్చా కార్యవర్గసభ్యుడు నల్లబోలు భోజిరెడ్డి కూతురు. ప్రస్తుతం వీరు నగరశివార్లలోని కర్మన్‌ఘాట్‌లో నివాసముంటున్నారు.
నగరంలోని సెయింట్ ఆన్స్ కళాశాలలో దీప్తి బీఎస్సీ పూర్తిచేసింది. విద్యనభ్యసిస్తూనే తనలోని కళకు మెరుగులు దిద్దుకుంది. డ్యాన్స్‌లో ప్రతిభాపాటవాలు పొందింది. సినిమాల్లోని హీరో హీరోయిన్లు నటించిన సన్నివేశాలకు అనుగుణంగా వినూత్నరీతిలో నటించి యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసి లక్షలాది మంది విక్షకులను సంపాదించుకుంది.
నిఖిల్ హీరోగా నటించిన కిరాక్ పార్టీ సినిమాలో హీరోయిన్ స్నేహితురాలిగా దీప్తి నటించింది. ఈ నేపథ్యంలో బిగ్‌బాస్–2 రియల్టీషోలో నటిస్తుండటంతో ఈ ప్రాంతవాసులు ఎంతో గర్వపడుతున్నారు.
సంతోషంగా ఉంది
తన కుతూరు బిగ్‌బాస్ షోలో పాల్గొంటుండటం ఎంతో సంతోషాన్ని కలిగిస్తుందని దీప్తి సునయన తండ్రి భోజిరెడ్డి తెలిపారు. తాను ఎంచుకున్న రంగంలో రాణించేందుకు తన కుతూరు పట్టుదలతో కృషిచేస్తోందన్నారు. తమ కుటుంబం నుంచి ఒక తార పుట్టుకురావడం ఎంతో ఆనందాన్ని కలుగజేస్తుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment