ఓ దొంగ ప్రేమ! | Dwaraka Latest Telugu Movie audio released | Sakshi
Sakshi News home page

ఓ దొంగ ప్రేమ!

Published Mon, Oct 17 2016 10:41 PM | Last Updated on Tue, Aug 14 2018 3:47 PM

ఓ దొంగ ప్రేమ! - Sakshi

ఓ దొంగ ప్రేమ!

కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రాలను ప్రేక్షకులకు అందించే కొన్ని సంస్థల్లో సూపర్‌గుడ్ ఫిలింస్ ఒకటి. తాజాగా ఈ సంస్థ నిర్మించిన చిత్రం ‘ద్వారక’. ‘పెళ్లిచూపులు’ ఫేం విజయ్ దేవరకొండ, పూజా జవేరి జంటగా నటించారు. సూపర్‌గుడ్ ఫిలింస్ అధినేత ఆర్‌బీ చౌదరి సమర్పణలో శ్రీనివాస్ రవీంద్ర దర్శకత్వంలో లెజెండ్ సినిమా పతాకంపై ప్రద్యుమ్న, గణేష్ నిర్మించారు. సాయికార్తీక్ స్వరపరచిన ఈ చిత్రం పాటల సీడీని ఆర్‌బీ చౌదరి విడుదల చేయగా, ట్రైలర్‌ను దర్శకులు వంశీ పైడిపల్లి, శ్రీవాస్, దశరథ్ ఆవిష్కరించారు.
 
ఆర్‌బీ చౌదరి మాట్లాడుతూ- ‘‘మా బ్యానర్ ద్వారా ఇప్పటి వరకూ ఎంతోమంది దర్శకులు, నిర్మాతలు, నటీనటులను పరిచయం చేశాం. ‘ద్వారక’తో శ్రీనివాస్‌ను దర్శకునిగా, ప్రద్యుమ్న, గణేష్‌లను నిర్మాతలుగా పరిచయం చేస్తుండడం ఆనందంగా ఉంది’’ అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ- ‘‘ద్వారక అనగానే శ్రీకృష్ణుడు గుర్తుకొస్తాడు. కృష్ణుడంటే నాకు ప్రేమ. ఆ కృష్ణుడు వెన్న దొంగ. మా చిత్రంలోని హీరో కూడా దొంగే. ఓ అమ్మాయి ప్రేమలో పడతాడు. అప్పుడు అతని జీవితంలో ఎటువంటి మార్పు వచ్చిందన్నదే కథ. విజయ్ నటనలో కొత్త కోణం చూపించే చిత్రమిది.
 
సాయికార్తీక్ మంచి ప్రతిభాశాలి. కానీ, ఇప్పటి వరకూ ఆయనకు రావాల్సిన పేరు రాలేదు. ‘ద్వారక’తో ఆ లోటు తీరుతుంది’’ అని చెప్పారు. ‘‘ప్రొడక్షన్ విషయంలో ఆర్‌బీ చౌదరిగారు ఓ టీచర్‌లా నన్ను గైడ్ చేశారు. శ్యామ్ కె.నాయుడు కెమెరామ్యాన్‌గానే కాకుండా ప్రొడక్షన్ బాధ్యతలు చూసుకున్నారు. చిరంజీవిగారు మోషన్ పిక్చర్ రిలీజ్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయడం సంతోషంగా ఉంది’’ అని నిర్మాతల్లో ఒకరైన ప్రద్యుమ్న అన్నారు. విజయ్ దేవరకొండ, పూజా జవేరి, దర్శకులు తమ్మారెడ్డి భరద్వాజ, నందినీ రెడ్డి, మారుతి, సంగీతదర్శకుడు ఆర్‌పీ పట్నాయక్,  నిర్మాతలు గణేష్, రాజ్ కందుకూరి  తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement