ఇదే కరెక్ట్ అనిపించింది!
‘‘నేను పీజీ వరకు వైజాగ్‌లో చదువుకున్నాను. చిన్నప్పటి నుండి సాహిత్యాభిమానిని. పీజీ కాగానే రెండేళ్లు వ్యాపారం చేసాను. అందులో కిక్ దొరకలేదు. ఒక స్నేహితుని ద్వారా అనుకోకుండా చిత్ర పరిశ్రమకు వచ్చాను. ఇదే కరెక్ట్ అనిపించింది’’ అని శ్రీనివాస్ రవీంద్ర అన్నారు. విజయ్ దేవరకొండ, పూజా ఝవేరి జంటగా ఆర్బీ చౌదరి సమర్పణలో రూపొందిన ‘ద్వారక’ చిత్రం ద్వారా దర్శకునిగా పరిచయమవుతున్నారు శ్రీనివాస్ రవీంద్ర. ప్రద్యుమ్న చంద్రపాటి–గణేశ్ పెనుబోతు నిర్మించిన ఈ చిత్రం వచ్చే నెల 3న విడుదల కానుంది.
దర్శకుడు శ్రీనివాస్ మాట్లాడుతూ – ‘‘తమ్మారెడ్డి భరద్వాజ, దశరద్, శ్రీను వైట్ల తదితరుల దగ్గర అసిస్టెంట్‌గా చేశా, పవన్‌కళ్యాణ్‌గారి దగ్గర ఏడాది పాటు రైటర్‌గా చేశా. దర్శకుడు శ్రీవాస్‌గారికి నాలుగు సంవత్సారాల కిందట ‘ద్వారక’ కథ చెప్పాను. ఆయనకి బాగా నచ్చటంతో మా ఇద్దరికీ పరిచయమైన ప్రద్యుమ్నగారికి చెప్పించారు. కథ విన్న వెంటనే, ఈ సినిమా మనం చేస్తున్నామని, షేక్‌హ్యాండిచ్చి అడ్వాన్సు ఇచ్చారు.
విజయ్ దేవరకొండ అద్భుతంగా నటించాడు. కథ విషయానికి వస్తే, దేవుడు అంటే ఏంటి? అని హీరో ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటాడు. శ్రీకృష్ణుడు దొంగ, రొమాంటిక్‌గా కూడా ఉంటాడు. కానీ, నేను సర్వాంతర్యామి అంటాడు. ఈ సినిమాలో మా హీరో ఎర్రశ్రీనుగా దొంగ పాత్రలో కనపడతాడు. హీరోయిన్ పాత్ర పేరు వసుధ. వసుధతో ప్రేమలో పడ్డ తర్వాత హీరో ఏవిధంగా పరిణతి చెందాడో చెప్పే కథే ఈ సినిమా. ఇది వ్యంగ్య హాస్య చిత్రం. అందరూ చూసే విధంగా ఉంటుంది ’’ అన్నారు.