‘ద్యావుడా’ డైరెక్టర్ అరెస్టు
‘ద్యావుడా’ డైరెక్టర్ అరెస్టు
Published Thu, Jan 19 2017 2:17 PM | Last Updated on Tue, Sep 5 2017 1:37 AM
హైదరాబాద్: ‘ద్యావుడా’ సినిమా డైరెక్టర్ ను పోలీసులు అరెస్టు చేశారు. సినిమాలో హిందూదేవుళ్లపై అభ్యంతరకర సన్నివేశాలను యూట్యూబ్‌లో పోస్టు చేసిన డైరెక్టర్ సాయిరాంను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గుంటూరు జిల్లా తెనాలి పట్టణానికి చెందిన దాసరి సాయిరాం డైరెక్టర్‌గా, వైఎస్సార్ జిల్లా కడప నగరానికి చెందిన గజ్జెల హరి కుమార్‌రెడ్డి ప్రొడ్యూసర్‌గాను ఇటీవల ద్యావుడా సినిమాను చిత్రీకరిస్తున్నారు. కొత్త సంవత్సరం మొదటి రోజున విడుదలైన ఈ సినిమా టీజర్ విపరీతంగా అలజడి సృష్టించింది. ఇందులో ఒక సన్నివేశంలో శివుడిపై అభ్యంతరకర సన్నివేశం ఉందంటూ పలు వర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. భజరంగ్‌దళ్‌కు చెందిన యు. నవీన్ చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు గురువారం సాయిరాంను అదుపులోకి తీసుకున్నారు.
కాగా కర్ణాటక, ఉజ‍్జయినిలోని దేవాలయాల్లో సిగరెట్లు, మద్యంతో శివునికి పూజా కార్యక్రమాలు నిర్వహించే ఆచారం ఉందని, వాటి స్ఫూర్తిగానే తాను సినిమాలో అటువంటి సన్నివేశాలను ఉంచినట్లు సాయిరాం విచారణలో వెల్లడించాడని పోలీసులు చెప్పారు. అంతేకాకుండా, ఈ అభ్యంతరకర సన్నివేశాలను తొలగించాలని యూట్యూట్ యాజమాన‍్యం దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు తెలిపారు. ప్రొడ్యూసర్ హరికుమార్‌రెడ్డి పరారీలో ఉన్నాడని వివరించారు.
Advertisement
Advertisement