dyavuda movie
-
‘ద్యావుడా’ డైరెక్టర్‌కు హైకోర్టు నోటీసులు
హైదరాబాద్: ద్యావుడా సినిమాపై హైకోర్టులో వేసిన పిటిషన్‌పై విచారణ జరిగింది. హిందువుల మనోభావాలను కించపరిచే విధంగా చిత్రాన్ని నిర్మించారని, ఈ చిత్రం విడుదలకు ఎలాంటి అనుమతులు ఇవ్వొద్దంటూ సుభద్రమ్మ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసివంది. దీనిపై మంగళవారం విచారించిన హైకోర్టు చిత్ర నిర్మాత, దర్శకుడు సాయిరామ్ దాసరికి, ఏపీ, తెలంగాణ హోంశాఖలకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను వచ్చే మంగళవారానికి వాయిదా వేసింది. -
‘ద్యావుడా’ డైరెక్టర్ అరెస్టు
హైదరాబాద్: ‘ద్యావుడా’ సినిమా డైరెక్టర్ ను పోలీసులు అరెస్టు చేశారు. సినిమాలో హిందూదేవుళ్లపై అభ్యంతరకర సన్నివేశాలను యూట్యూబ్‌లో పోస్టు చేసిన డైరెక్టర్ సాయిరాంను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గుంటూరు జిల్లా తెనాలి పట్టణానికి చెందిన దాసరి సాయిరాం డైరెక్టర్‌గా, వైఎస్సార్ జిల్లా కడప నగరానికి చెందిన గజ్జెల హరి కుమార్‌రెడ్డి ప్రొడ్యూసర్‌గాను ఇటీవల ద్యావుడా సినిమాను చిత్రీకరిస్తున్నారు. కొత్త సంవత్సరం మొదటి రోజున విడుదలైన ఈ సినిమా టీజర్ విపరీతంగా అలజడి సృష్టించింది. ఇందులో ఒక సన్నివేశంలో శివుడిపై అభ్యంతరకర సన్నివేశం ఉందంటూ పలు వర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. భజరంగ్‌దళ్‌కు చెందిన యు. నవీన్ చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు గురువారం సాయిరాంను అదుపులోకి తీసుకున్నారు. కాగా కర్ణాటక, ఉజ్జయినిలోని దేవాలయాల్లో సిగరెట్లు, మద్యంతో శివునికి పూజా కార్యక్రమాలు నిర్వహించే ఆచారం ఉందని, వాటి స్ఫూర్తిగానే తాను సినిమాలో అటువంటి సన్నివేశాలను ఉంచినట్లు సాయిరాం విచారణలో వెల్లడించాడని పోలీసులు చెప్పారు. అంతేకాకుండా, ఈ అభ్యంతరకర సన్నివేశాలను తొలగించాలని యూట్యూట్ యాజమాన్యం దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు తెలిపారు. ప్రొడ్యూసర్ హరికుమార్‌రెడ్డి పరారీలో ఉన్నాడని వివరించారు. -
'ద్యావుడా' దర్శకుడి క్షమాపణ
ద్యావుడా సినిమా దర్శకుడు సాయిరాం దాసరి పత్రికాముఖంగా హిందువులకు క్షమాపణలు తెలిపారు. కొత్త సంవత్సరం మొదటి రోజున విడుదలైన ఈ సినిమా టీజర్ విపరీతంగా అలజడి సృష్టించింది. దాంతో దర్శకుడు స్పందించారు. ''హిందువుల మనో భావాలను దెబ్బతీయాలనేది నా ఉద్దేశం కాదు. నేనూ హిందువునే. కానీ ఇంతమంది నా సినిమా టీజర్ చూసి స్పందిస్తుంటే దానికి బాధ్యత వహిస్తూ ముందుగా హిందూ సోదరులందరికీ క్షమాపణ తెలుపుతున్నాను. కాకపోతే కర్ణాటకలోని ఉజ్జయిని దేవాలయంలో సిగరెట్లు, మద్యంతో శివునికి పూజా కార్యక్రమాలు నిర్వహించే ఆచారం ఉంది. మేము ఆ ఆచారాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఈ సినిమాలో చివరికి శివమహత్యాన్ని చూపించే ప్రయత్నం చేశాం. కానీ సినిమా విడుదలకు ముందే భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని భావించి.. ఆ దృశ్యాలను మా సినిమా నుంచి తొలగిస్తున్నాము. ఈ సందర్భంగా మరోసారి తెలుగు భక్తులకు నేను క్షమాపణ తెలుపుతున్నాను'' అని ఆ ప్రకటనలో తెలిపారు.