మల్టీస్టారర్ తీయడం కష్టమేమీ కాదు
మల్టీస్టారర్ తీయడం కష్టమేమీ కాదు
Published Tue, Jan 7 2014 10:51 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM
‘మల్టీస్టారర్ చిత్రాలు తీయడం అంత కష్టం కాదు.. అందులో పనిచేసే హీరోలు ఎంత స్టార్‌లైనా కథను అనుసరించి తమ పని తాము చేసుకుపోతే ఇబ్బందులు అనేవి ఉండవు. నా వరకు నేను తీసిన ఏ సినిమాలోనూ నటులతో ఇబ్బంది పడలేదు.’ అని దర్శకురాలుగా మారిన నృత్య దర్శకురాలు ఫరాఖాన్ వ్యాఖ్యానించారు. 2007లో వచ్చిన ‘ఓం శాంతి ఓం’ సినిమాలో ఆమె ఒక పాటలో 31 మంది టాప్ హీరో, హీరోయిన్లను చూపించారు. స్టార్ నటులు షారూఖ్ ఖాన్, అభిషేక్ బచ్చన్, దీపికా పడుకొనేతో పాటు బొమ్మన్ ఇరానీ, సోనూ సూద్, వివాన్ షా వంటి వారితో ప్రస్తుతం ‘హ్యాపీ న్యూ ఇయర్’ సినిమా తీస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ‘ మల్టీస్టారర్ తీయడం పెద్ద కష్టం కాదు.. ఉదాహరణకు తీసుకుంటే.. హ్యాపీ న్యూ ఇయర్ సినిమాలో షారూఖ్ ఒక్కడిదే ముఖ్య పాత్ర అనుకుంటే పొరపాటు. స్క్రిప్ట్‌లో ఆరుగురూ ప్రధాన పాత్రధారులే.. ప్రతి ఒక్కరికీ తగిన పాత్ర ఉంది.
వాటికి అనుగుణంగా డైలాగులు ఉంటాయి. పాత్ర చిత్రీకరణ ఉంటుంది. ఎవరిని తక్కువ చేసి చూపించినా దాని ప్రభావం మొత్తం చిత్రంపై పడుతుంది..అందుకే నేను స్క్రిప్ట్‌కే ప్రాధాన్యమిస్తా..’ అని ఆమె అన్నారు. అలాగే షారూఖ్ ఖాన్ కూడా మొదటి నుంచి నాకు ఈ విషయంలో చాలా మద్దతు ఇస్తున్నాడన్నారు. ‘ఇందులో అందరి పాత్రలూ ప్రధానమైనవే.. వివాన్ లేదా సోనూ సూద్‌ల పాత్రలకూ కూడా తగిన ప్రాధాన్యతనివ్వు.. అప్పుడే సినిమాకు న్యాయం జరుగుతుంది అని షారూఖ్ మొదటి నుంచి చెబుతున్నాడు..’ అని ఆమె చెప్పారు. ‘ఈ సినిమాలో నటులందరూ ఎటువటి బేషజాలు లేకుండా పనిచేస్తున్నారన్నారు. సినిమా ఇప్పటికే 95 శాతం పూర్తయ్యింది. దీపావళికి ఈ సినిమా సందడి చేస్తుంది..’ అని ఆమె చెప్పారు. 2004లో షారూఖ్ ఖాన్ ‘మై హూనా’ సినిమాతో ఫరాఖాన్ దర్శకురాలిగా బాలీవుడ్‌కు పరిచయమయ్యారు.
తర్వాత మళ్లీ 2008లో షారూఖ్‌తో ‘ఓం శాంతి ఓం’ తీశారు. 2010లో అక్షయ్‌కుమార్, కత్రినా కైఫ్ జంటగా ‘తీస్ మార్‌ఖాన్’ సినిమా తీశారు. ఇప్పుడు తీస్తున్న ‘హ్యాపీ న్యూ ఇయర్’ షారూఖ్‌తో దర్శకురాలిగా ఆమె మూడో సినిమా. అయితే దర్శకురాలిగా ఎక్కువ సినిమాలు చేయలేకపోవడానికి వేరే కారణంపై ఆమె స్పందిస్తూ..‘నేను సినిమా ఫ్యాక్టరీని కాదు.. దర్శకురాలిని మాత్రమే.. మంచి కథ తయారుచేసుకొని, తర్వాత కథకు సరిపడా నటులను ఎంపిక చేసుకోవడం మొదలు అన్ని పనులు చేసుకోవడానికి కొంత సమయం పడుతుంది. అందుకే పదేళ్లలో కేవలం నాలుగు సినిమాలు మాత్రమే చేయగలిగాను..’ అని అన్నారు. అయితే మంచి సినిమా చేయాలంటే కనీసం రెండేళ్ల సమయం పడుతుందని ఆమె అభిప్రాయపడ్డారు.
Advertisement
Advertisement