
‘సై, దూకుడు, శ్రీమంతుడు, బిందాస్, మగధీర’, ఏక్ నిరంజన్’ వంటి సినిమాల్లో ప్రతినాయకుడిగా నటించిన శ్రావణ్ రాఘవేంద్ర కథానాయకుడిగా పరిచయం అవుతున్న సినిమా ‘ఎదురీత’. లియోనా లిషోయ్ కథానాయిక. బాలమురుగన్ దర్శకత్వంలో శ్రీ భాగ్యలక్ష్మి ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై బోగారి లక్ష్మీనారాయణ నిర్మిస్తున్నారు. ఈ సినిమా టీజర్‌ను హీరో కల్యాణ్ రామ్ విడుదల చేశారు. శ్రావణ్ రాఘవేంద్ర మాట్లాడుతూ– ‘‘ఒకరోజు మా నాన్నగారు సినిమా గురించి అడుగుతూ టైటిల్ ఏంటి? అన్నారు. ‘ఎదురీత’ అని చెప్పా. అప్పుడు ఆయన ఆ సినిమా గురించి తెలుసా? ఆ టైటిల్ పవర్ తెలుసా? అని ప్రశ్నించారు. నందమూరి తారకరామారావుగారు 1977లో నటించిన ‘ఎదురీత’ గురించి చెప్పారు. స్వర్గంలో ఉన్న ఎన్టీఆర్‌గారికి, ప్రేక్షకులకు చెబుతున్నా.. ‘ఎదురీత’ టైటిల్‌కు కచ్చితంగా న్యాయం చేస్తాం. ఓ తండ్రి, కుమారుడు మధ్య కథ సాగుతుంది. ఇదొక ఎమోషనల్ డ్రామా.
ఎంతగానో ప్రేమించే కొడుకును తండ్రి మర్చిపోతాడు. తర్వాత ఏం జరిగిందనేది కథ? నన్ను సినిమా ఇండస్ట్రీకి కోడి రామకృష్ణగారు పరిచయం చేస్తే.. రాజమౌళిగారు ‘సై’ సినిమాతో బ్రేక్ ఇచ్చారు. ఆయనలా ప్రతి నిమిషం సినిమా గురించి ఆలోచిస్తారు మా దర్శకుడు. నాకు తండ్రి తర్వాత తండ్రిలాంటి వారు బోగారి లక్ష్మీనారాయణ’’ అన్నారు. ‘‘ఈ సినిమాకు ‘ఎదురీత’ టైటిల్ నా గురించే పెట్టారేమో అని ఆలోచనలో పడ్డాను. ఎందుకంటే... నా జీవితమంతా ఎదురీతే. నేను నిర్మాత కాకముందు.. సినిమా అంటే 200 రూపాయలు పెట్టి టికెట్ కొనుక్కుని చూడటమే అనుకునేవాణ్ణి. నిర్మాత అయ్యాక... టికెట్ రేటు 2000 రూపాయలు పెట్టినా తక్కువే అనిపిస్తోంది. సినిమా తీయడంలో ఉన్న కష్టం అర్థమైంది’’ అని బోగారి లక్ష్మీనారాయణ అన్నారు. ‘‘లక్ష్మీనారాయణగారికి ఇది తొలి సినిమా అయినా ఎక్కడా రాజీ పడకుండా తీశారు’’ అన్నారు బాలమురుగన్. ‘‘ఇదొక ఎమోషనల్ ఫిల్మ్. అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నా’’ అన్నారు లియోనా లిషోయ్. నటీనటులు జియా శర్మ, శాన్వీ మేఘన, భద్రమ్, ఫైట్ మాస్టర్ రామకృష్ణ, కెమెరామేన్ విజయ్ అర్బుదరాజ్, ఎడిటర్ రామచంద్రన్ తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: అరల్ కొరెల్లి, లైన్ ప్రొడ్యూసర్: ప్రకాష్ మనోహరన్.
Comments
Please login to add a commentAdd a comment