Ee Nagaraniki Emaindi Review, in Telugu | ఈ నగరానికి ఏమైంది? మూవీ రివ్యూ
Sakshi News home page

Published Fri, Jun 29 2018 7:57 AM | Last Updated on Fri, Jun 29 2018 7:15 PM

Ee Nagaraniki Emaindi Telugu Movie Review - Sakshi

టైటిల్ : ఈ నగరానికి ఏమైంది?
జానర్ : కామెడీ ఎంటర్‌టైనర్‌
తారాగణం : విశ్వక్ సేన్ నాయుడు, సుశాంత్, అభినవ్ గోమఠం, వెంకటేష్ కాకుమాను, అనీషా ఆంబ్రోస్, సిమ్రన్ చౌదరి
సంగీతం : వివేక్‌ సాగర్‌
దర్శకత్వం : తరుణ్‌ భాస్కర్‌
నిర్మాత : డి. సురేష్‌ బాబు

పెళ్లి చూపులు సినిమాతో సూపర్‌ హిట్ అందుకున్న తరుణ్‌ భాస్కర్‌. కాస్త గ్యాప్‌ తీసుకొని మరో ఇంట్రస్టింగ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. పక్కా యూత్‌ ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ గా తెరకెక్కిన ఈ నగరానికి ఏమైంది? సినిమాను సురేష్‌ ప్రొడక్షన్స్‌ లాంటి ప్రతిష్టాత్మక సంస్థ నిర్మించటంతో సినిమాపై ఆసక్తి పెరిగింది. అందుకు తగ్గట్టుగా డిఫరెంట్ ప్రమోషన్స్‌ కూడా సినిమా మీద హైప్‌ క్రియేట్‌ చేశాయి. పదికి పైగా చిన్న సినిమాలు రిలీజ్  అవుతున్న ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాతో తరుణ్‌ భాస్కర్‌ మరోసారి తన ప్రత్యేకతను చాటుకున్నాడా..? ఈ నగరానికి ఏమైంది? యాడ్‌ రేంజ్‌లో సినిమా కూడా సక్సస్‌ అయ్యిందా..?

కథ;
ఈ నగరానికి ఏమైంది? నలుగురు మధ్య తరగతి యువకుల కథ. వివేక్ (విశ్వక్ సేన్ నాయుడు), కార్తిక్ (సుశాంత్ రెడ్డి), కౌశిక్ (అభినవ్ గోమఠం), ఉపేంద్ర (వెంకటేష్ కాకుమాను)లు చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు. కార్తీక్‌ తాను పనిచేస్తున్న క్లబ్‌ ఓనర్‌ కూతురిని పెళ్ళి చేసుకొని అమెరికాలో సెటిల్‌ అవ్వాలని కలలు కంటుంటాడు. కౌశిక్‌ డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా పనిచేస్తూ ఎప్పటికైనా యాక్టర్‌ అవ్వాలని ప్రయత్నిస్తుంటాడు. ఉపేంద్ర పెళ్లి క్యాసెట్స్‌ ఎడిటింగ్‌ చేస్తూ ఉంటాడు. (సాక్షి రివ్యూస్‌) ఈ కథలో కీలకమైన వివేక్‌ దర్శకుడిగా ఎదగటానికి షార్మ్‌ ఫిలింస్ తీసి ప్రూవ్‌ చేసుకోవాలనుకుంటాడు. కానీ ప్రేమ విఫలం కావటంతో మధ్యానికి బానిసై ఫ్రెండ్స్‌కు దూరంగా ఉంటుంటాడు. కానీ అనుకున్నట్టుగా కార్తీక్‌కి ఓనర్‌ కూతురితో పెళ్లి కుదరటంతో పార్టీ చేసుకోవడానికి అందరూ ఒక్కటవుతారు. బార్‌లో ఫ్రెండ్స్‌ అంతా బాగా తాగేసి అనుకొని పరిస్థితుల్లో గోవా వెళ్లిపోతారు. అలా గోవా చేరిన నలుగురు స్నేహితులు ఏం చేశారు..? ఈ ప్రయాణం వారికి జీవితం అంటే ఏంటో ఎలా చూపించింది.? ఈ ట్రిప్ తరువాత వారు ఎలా మారిపోయారు? అన్నదే మిగతా కథ.

నటీనటులు ;
సినిమా అంతా నలుగురు కుర్రాళ్ల చుట్టూనే తిరుగుతుంది. పెద్దగా పరిచయం లేని నటీనటులను ఎంచుకున్న దర్శకుడు వాళ్ల నుంచి సహజమైన నటనను రాబట్టుకున్నాడు. వివేక్‌ పాత్రలో విశ్వక్‌ సేన్‌ సీరియస్‌నెస్‌ తో పాటు బాధని కూడా పలికించాడు. సినిమాకు మేజర్‌ ప్లస్ పాయింట్‌ కౌశిక్ పాత్రలో కనిపించిన అభినవ్‌ గోమఠం. అభినవ్‌ తెర మీద కనిపించిన ప్రతీసారి ప్రేక్షకుడు కడుపుబ్బా నవ్వుకుంటాడు.(సాక్షి రివ్యూస్‌) చిన్న చిన్న పంచ్ డైలాగ్స్‌తో ఫన్నీ ఎక్స్‌ప్రెషన్స్‌ తో ఆకట్టుకున్నాడు అభినవ్‌. ఇతర పాత్రల్లో సుశాంత్‌, ఉపేంద్రలు తమ పాత్రలకు న్యాయం చేశారు. వివేక్‌ ప్రేమ కథలో వచ్చే శిల్ప పాత్రలో సిమ్రాన్‌ చౌదరి అందంగా కనిపించారు. మోడ్రన్ అమ్మాయిగా అనీషా ఆంబ్రోస్‌ అందం, అభినయంతో ఆకట్టుకుంది.

విశ్లేషణ ;
పెళ్లిచూపులు లాంటి క్లాస్‌ సినిమా తరువాత పక్కా యూత్‌ ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ను ఎంచుకున్న దర్శకుడు తరుణ్‌ భాస్కర్‌ ఈ సినిమా కూడా అంతే డిఫరెంట్ గా తెరకెక్కించాడు. గతంలో తెలుగు తెర మీద చూడని సరికొత్త ట్రీట్మెంట్ ఈ సినిమాలో కనిపిస్తుంది. ఎక్కడా కావాలని ఇరికించిన ఎమోషన్స్‌, బిల్డప్‌ సీన్స్‌, డ్రామా లేకుండా సినిమా అంతా సహజంగా సాగుతుంది. నలుగురు స్నేహితుల మధ్య జరిగే సాధారణ కథను ఆసక్తికరంగా తెరమీద చూపించటంలో తరుణ్ భాస్కర్‌ విజయం సాధించాడు. చాలా సందర్భాల్లో తనలోని రచయిత దర్శకుడిని డామినేట్‌ చేశాడు. `జీవితమంటే.. నచ్చిన వాళ్లతో ఉంటూ, నాలుగు మెతుకులు తింటూ, నచ్చిన పని చేసుకోవడమే` లాంటి డైలాగ్స్‌ మనసును తాకుతాయి. (సాక్షి రివ్యూస్‌) ఫ్రెండ్స్‌ మధ్య జరిగే సన్నివేశాలను ఇంట్రస్టింగ్‌గా తెరకెక్కించిన దర్శకుడు.. వివేక్‌ ప్రేమకథ, బ్రేకప్‌ లను చాలా సాదాసీదాగా తెరకెక్కించాడు. తొలి భాగం కామెడీ సీన్స్‌ తో వేగంగా కథ నడిచినా.. ద్వితీయార్థం కాస్త నెమ్మదించింది. వివేక్‌ సాగర్ అందించిన పాటలు పరవాలేదనిపించినా.. నేపథ్య సంగీతం ఆకట్టుకుంటుంది. ఎడిటింగ్ విషయంలో ఇంకాస్త దృష్టి పెట్టాల్సింది. సినిమాటోగ్రఫి, నిర్మాణ విలువలు బాగున్నాయి.

ప్లస్‌ పాయింట్స్‌ ;
లీడ్‌ యాక్టర్స్‌ నటన
డైలాగ్స్‌

మైనస్‌ పాయింట్స్‌ ;
అక్కడక్కడా నెమ్మదించిన కథనం
లవ్‌ స్టోరి

సతీష్‌ రెడ్డి జడ్డా, ఇంటర్‌నెట్‌ డెస్క్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement