Ee Nagaraniki Emaindi
-
ఈ నగరానికి ఏమైంది పార్ట్ 2 ఎప్పుడంటే..!
-
ఎంగేజ్మెంట్ చేసుకున్న టాలీవుడ్ నటుడు.. ఫోటో వైరల్!
ఈ నగరానికి ఏమైంది? సినిమా చూడనివారు ఉండరు. ఈ చిత్రంలో సాయి సుశాంత్ రెడ్డి తన నటనతో అందరినీ మెప్పించాడు. ఈ చిత్రంలో అతని పాత్రకు ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యారు. చిన్న సినిమా అయినా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఇటీవలే ఈ చిత్రం రిలీజై ఐదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రి రీలీజ్ కూడా చేశారు. (ఇది చదవండి: అందరినీ వేడుకుంటున్నా.. అర్థం చేసుకోండి: నిహారిక ) అయితే తాజాగా ఈ నగరానికి ఏమైంది? చిత్ర నటుడు సాయి సుశాంత్ రెడ్డి నిశ్చితార్థం చేసుకున్నాడు. ఈ విషయాన్ని తన ఇన్‌స్టాలో పంచుకున్నారు. తనకు కాబోయే అమ్మాయికి ఎంగేజ్మెంట్ ఉంగరం పెడుతున్న ఫోటోను పోస్ట్ చేశారు. ఇది చూసిన ఫ్యాన్స్ కాబోయే జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియా తెగ వైరలవుతోంది. అయితే ఆ అమ్మాయి ఎవరు అనే వివరాలు తెలియరాలేదు. కాగా.. సుశాంత్ రెడ్డి గతేడాది నాగచైతన్య నటించిన థ్యాంక్యూ చిత్రంలో నటించారు. (ఇది చదవండి: బలగం మూవీ అరుదైన ఘనత.. ఇంతవరకు ఏ సినిమాకు దక్కలేదు!) View this post on Instagram A post shared by Sai Sushanth Reddy (@saisushanthreddy) -
లైంగిక ఆరోపణలు: క్లారిటీ ఇచ్చిన విశ్వక్ సేన్
2017లో 'వెళ్లిపోమాకే' చిత్రంతో ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు విశ్వక్ సేన్. తొలి సినిమాతోనే సైమా అవార్డు కొట్టేసిన ఈ యంగ్ హీరో 'ఫలక్‌నుమా దాస్'తో దర్శకుడు, రచయిత, సహ నిర్మాతగా అవతారం ఎత్తాడు. ఈ సినిమాతో పాటు ఆ తర్వాత వచ్చిన 'హిట్' కూడా ప్రేక్షకులను మెప్పించడంతో యూత్ ఫేవరెట్ స్టార్‌గా నిలిచాడీ యంగ్ హీరో. ఇదిలా వుంటే విశ్వక్ సేన్ తాజా ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. తన అసలు పేరు దినేశ్ కార్తీక్ అని, జాతకాల ప్రకారం దాన్ని విశ్వక్ సేన్‌గా మార్చుకున్నట్లు తెలిపాడు. ఇది బెంగాలీ పేరు అని, తండ్రే స్వయంగా తనకు ఈ పేరు మార్చాడని పేర్కొన్నాడు. నిజానికి తనకు ఓ వైపు నటించడంతో పాటు దర్శకత్వం చేయాలనే ఆలోచన 7వ తరగతిలోనే పురుడు పోసుకుందని చెప్పుకొచ్చాడు. అయితే ఇండస్ట్రీకి వచ్చాక తనలాంటి కొత్తవాడిని పెట్టుకుని సినిమా ఎవరు తీస్తారని, అందుకే సొంతంగా సినిమా చేయాలనుకున్నాని మనసులోని మాటను బయటపెట్టాడు. కానీ ఆ సమయంలో తరుణ్ భాస్కర్.. 'ఈ అబ్బాయి బాగున్నాడు, పిలవండి' అని చెప్పడంతో తరుణ్‌ను కలిశాడు విశ్వక్. అప్పుడు ఆయన 'ఫలక్‌నుమాదాస్ తీస్తున్నావంట కదా, మరి నా సినిమా చేస్తావా?' అని అడిగాడు. అవకాశం తనను వెతుక్కుంటూ రావడంతో ఆనందంతో ఉబ్బితబ్బిబ్బైన విశ్వక్.. 'మీరు సినిమా చాన్స్ ఇస్తే నా సినిమా ఆపేస్తా' అని చెప్పాడు. ఆ ఒక్క మాటతో తరుణ్‌కు అతడి మీద ఎనలేని నమ్మకం కలిగింది. అలా 'ఈ నగరానికి ఏమైంది?' సినిమాలో అవకాశం వచ్చింది. కానీ అతడి ఆశల మీద నీళ్లు చల్లుతూ.. విశ్వక్ అసలు మంచివాడు కాదంటూ తరుణ్‌కు ఓ మెయిల్ వచ్చింది. 'విశ్వక్ సేన్ నాకు మత్తు మందు ఇచ్చి, నాతో అసభ్యంగా ప్రవర్తించాడు. నా పరిస్థితి ఏ హీరోయిన్‌కీ రావద్దు. మీరు వాడిని సినిమాలో పెట్టుకుంటే మీడియా ముందుకెళ్లి ఏం చేయాలో నాకు తెలుసు' అంటూ వార్నింగ్ ఇచ్చిందో అమ్మాయి. ఇది తెలిసిన విశ్వక్.. ఇదంతా తను అంటే గిట్టనివాళ్లు చేశారని భావించాడు. ఎవరో కుట్ర పన్ని కావాలని ఇదంతా చేశాడని నిరూపించాడు. అలా తరుణ్ దర్శకత్వంలో 'ఈ నగరానికి ఏమైంది?' సినిమాలో నటించాడు. చదవండి: నీ మీద ఒట్టు, చచ్చిపోతా: విశ్వక్సేన్కు బెదిరింపులు -
‘మజిలీ, జర్నీ’ మస్త్ ఉన్నాయ్..
హిమాయత్‌నగర్: ఆ అందం పుట్టి పెరిగింది మన హైదరాబాద్‌లోనే. ఇప్పటికి చేసినవి రెండు సినిమాలే అయినా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకోవడంతో పాటు తన నవ్వుతో కుర్రకారు గుండెల్లో నిలిచిపోయింది. చురుకైన చూపులతో 2017లో జరిగిన ఫెమీనా మిస్ ఇండియా–తెలంగాణ పోటీల్లో పాల్గొని ‘మిస్ తెలంగాణ’గా నిలిచింది. ఆమే సిమ్రాన్ చౌదరి. నటిగా టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన సిమ్రన్.. ‘ఈ నగరానికి ఏమైంది’ చిత్రంలో శిల్పగా మెరిసింది. ‘హమ్ తుమ్’ సినిమాలో హీరోయిన్గా చేసి తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. త్వరలో హీరో సుశాంత్‌తో కలిసి కొత్త సినిమాతో మనముందుకు రానున్న సిమ్రాన్ చౌదరి హిమాయత్‌నగర్‌లో మెరిసింది. ఈ సందర్భంగా ‘సాక్షి’తో ప్రత్యేకంగా ముచ్చటించి ఎన్నో విషయాలు పంచుకుంది. ఆ వివరాలు ఆమె మాటల్లోనే.. నేను పుట్టి పెరిగిందంతా సిటీలోనే కాబట్టి నగరంపై అటాచ్ బాగా ఉంది. ఫ్రెండ్స్ తక్కువగానే ఉన్నారు. కానీ..ఉన్న వారితోనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తుంటా. కాఫీ అంటే చాలా ఇష్టం. ఖాళీ దొరికినప్పుడల్లా ‘రోస్టరీ కాఫీ హౌజ్’కి వెళ్తుంటా. షూటింగ్ లేని సమయాల్లో ట్యాంక్‌బండ్, చార్మినర్, హైటెక్‌సిటీ ఏరియాల్లో చక్కర్లు కొడుతుంటా. టైం దొరికినప్పుడల్లా ట్రావెలింగ్ చేస్తుంటాను. బుక్స్ ఎక్కువగా చదువుతుంటా. సిటీలోనే చదువుకున్నాను. స్కూల్ ఎడ్యుకేషన్ అంతా ‘డీఆర్ఎస్ ఇంటర్నేషనల్ స్కూల్, కాలేజీ సెంట్ ఫ్రాన్సిస్ ఉమెన్స్ డిగ్రీ కాలేజీలో సాగింది. నేను మోడలింగ్ చేస్తున్నప్పటి నుంచి ఫ్రెండ్స్ అందరూ యంకరేజ్ చేస్తుండేవాళ్లు. సినిమాల్లోకి అడుగుపెట్టాక వాళ్లను కలిస్తే చాలు తెగ ఆటపట్టింస్తుంటారు. యాడ్స్టూమూవీస్ సినిమాల్లోకి రావాలనే కోరిక చిన్నప్పటి నుంచి ఉంది. ఆ కోరికతోనే ముందుగా మోడలింగ్‌లోకి అడుగుపెట్టాను. అంతకంటే ముందుగా నా 12 ఏళ్ల వయసులో కొన్ని కమర్షియల్ యాడ్స్ చేశాను. అవి నాకెంతో గుర్తింపునిచ్చాయి. తర్వాత పలు దేశాల్లో మోడల్‌గా ర్యాంప్‌లో షోల్లో పాల్గొన్నాను. తర్వాత అలా సినిమాల్లోకి వచ్చాను. ఇప్పటికి చేసినవి రెండు సినిమాలే అయినా ప్రస్తుతం చేతినిండా పెద్ద పెద్ద ప్రాజెక్టులు ఉన్నాయి. అలోవెరాతోఅందం రెట్టింపు.. ఈ మధ్య అందరూ ఎందుకింత అందంగా ఉన్నావ్? ఏం తింటున్నావ్.. అంటూ అడుగుతున్నారు. అలా అడుగుతుంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది. చిన్నప్పటి నుంచి నేను అలోవెరా వాడుతున్నాను. అలోవెరా తింటాను, బాడీకి అప్లై చేస్తాను. అలోవెరా జ్యూస్ తాగుతాను. అదే నా అందం సీక్రెట్. డైలీ జిమ్, స్విమ్మింగ్ తప్పనిసరి. ఇంకా బాక్సింగ్, యోగా, బాస్కెట్‌బాల్, డ్యాన్స్ కూడా చేస్తుంటా. ఫుడ్ విషయంలో మాత్రం ఇంట్లో అమ్మ చేతి వంటలకే నా తొలి ఓటు. కెమెరా ముందూ, వెనకా ఒకేలా.. కెమెరా ముందొక విధంగాను.. వెనక మరో విధంగా ఉండటం నాకు రాదు. సినిమాలో చేసిన క్యారెక్టర్ని బట్టి ఆ అమ్మాయి బయట కూడా అలాగే ఉంటుందనుకోవడం తప్పు. అది చూసే వాళ్లను బట్టి ఉంటుంది. కేవలం పాత్ర కోసం అలా నటించాల్సి ఉంటుంది. అంతేతప్ప మరేం కాదు. పాత్రను బట్టి నటించే నేను మాత్రం వ్యక్తిత్వం విషయంలో మాత్రం కెమెరా ముందు.. వెనుకా ఒకేలా ఉంటాను. ఐ యామ్ ఏ పెట్ లవర్ ³ంపుడు జంతువులంటే నాకు చాలా ఇష్టం. వాటికి సేవ చేయాలనే తపన చిన్నప్పటి నుంచి ఉంది. అందుకే ‘బ్లూ క్రాస్’లో నేను కూడా వలంటీర్‌గా చేరిపోయా. సమయం దొరికినప్పుడల్లా అక్కడున్న పెట్స్‌కి సర్వీస్ చేస్తుంటా. వాటికేమైనా ఆపద వస్తే ఆదుకుంటా. అక్కడున్న సభ్యులతో కలసి నేను కూడా ఒక ఆర్డనరీ వలంటీర్‌గానే పనిచేస్తూ ఉండడంతో పాటు ఇష్టమైన జంతువులకు దగ్గరగా ఉండడం ఆనందాన్నిస్తుంది. ‘మజిలీ, జర్నీ’ మస్త్ ఉన్నాయ్ ఇటీవల ‘మజిలీ, జర్నీ’ సినిమాలు చూశా మస్త్ ఉన్నాయి. మజిలీలో నాగచైతన్య యాక్టింగ్‌కి చాలా కనెక్ట్ అయ్యాను. ఇక సమంత గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఐ యామ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ హర్. హీరో మహేష్‌తో సినిమా చేయాలనే కోరిక ఉంది. బాలీవుడ్లో సంజయ్‌లీలా బన్సాలీ దర్శకత్వంలో ఒక్క సినిమా అయినా చేస్తాను. ప్రస్తుతం హీరో సుశాంత్ పక్కన హీరోయిన్గా చేస్తున్నాను. త్వరలో ఆ సినిమా అభిమానుల ముందుకు వస్తుంది.. అంటూ ముగిచింది. -
అది రాంగ్ స్టెప్
‘‘ఫ్రెండ్షిప్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ మధ్యకాలంలో ఎక్కువ సినిమాలు రాలేదు. ఈ నేపథ్యంలోని ‘ఈ నగరానికి ఏమైంది’, హుషారు’ ఒకేసారి మొదలయ్యాయి. అయితే ఆ సినిమా రిలీజ్ అయింది. నలుగురు స్నేహితులు కలిసి చేసే సాహసాలే మా చిత్రం’’ అని తేజస్ కంచర్ల అన్నారు. శ్రీహర్ష కొనుగంటి దర్శకత్వంలో తేజస్, దక్ష, అభినవ్, ప్రియా ముఖ్య తారలుగా తెరకెక్కిన చిత్రం ‘హుషారు’. బెక్కెం వేణుగోపాల్, రియాజ్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 14న విడుదల కానున్న సందర్భంగా హీరో తేజస్ చెప్పిన విశేషాలు. ∙మాది సినిమా బ్యాక్‌గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ కాదు. సినిమాలపై ఇంట్రెస్ట్‌తో ఇంజనీరింగ్ మధ్యలోనే ఆపేసి అవకాశాల కోసం ప్రయత్నాలు మొదలెట్టా. తేజాగారి ‘నీకు నాకు’లో హీరోగా అవకాశం ఫస్ట్ నాకే వచ్చింది. ‘అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేయి, నెక్ట్స్ సినిమాలో హీరోగా చేద్దువుగానీ’ అని తేజాగారు అన్నారు. ఆ సినిమా చేయడంవల్ల చాలా విషయాలు నేర్చుకున్నా. ∙నిర్మాత కేయస్ రామారావుగారు, మా నాన్న స్నేహితులు. దాంతో ప్రకాశ్‌రాజ్‌గారి ‘ఉలవచారు బిర్యాని’ చిత్రంలో అవకాశం వచ్చింది. ఆ సినిమా చేస్తున్నప్పుడే విభిన్న కథలు ఎంచుకోవాలని ఫిక్స్ అయ్యాను. రెండో సినిమా ‘కేటుగాడు’ చేశాను. అది రాంగ్ స్టెప్ అని అర్థం అయ్యింది. ‘హుషారు’ నా మూడో సినిమా. ఈ సినిమా మేకింగ్‌లో ఆలస్యం అయ్యింది. అయినా కూడా నిర్మాత వేణుగోపాల్‌గారు మాలో హుషారు నింపారు. ∙కాలేజ్ పూర్తయిన తర్వాత లైఫ్‌లో ఏం చేయాలి? అని ఆలోచిస్తున్న టైమ్‌లో మా ఫ్రెండ్‌కి క్యాన్సర్ వస్తుంది. అప్పుడు అతని స్నేహితులుగా మేం ఎలా రియాక్ట్ అయ్యాం? లైఫ్‌లో ఎలా ఎదిగాం? అన్నదే చిత్రకథ. ఇందులో నా రియల్ లైఫ్‌కు దగ్గరగా ఉండే ఆర్య అనే పాత్ర చేశా. ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారని నమ్ముతున్నా. ఇకపై లీడ్ క్యారెక్టర్స్ మాత్రమే చేద్దాం అనుకుంటున్నాను. వెంకీ కుడుముల దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాను. పెద్ద బ్యానర్లో మరో సినిమా కోసం చర్చలు జరుగుతున్నాయి. -
దర్శకుడిగా మారనున్న హీరో
టాలీవుడ్ నటులుగా సక్సెస్ సాధించి దర్శకులుగా మారుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఇప్పటికే అవసరాల శ్రీనివాస్, వెన్నెల కిశోర్ తాజాగా రాహుల్ రవీంద్రన్ దర్శకులుగా మారి సత్తా చాటారు. వీరిలో వెన్నెల కిశోర్ సక్సెస్ కాలేకపోయినా అవసరాల, రాహుల రవీంద్రన్‌లు విజయం సాదించారు. తాజాగా ఈ లిస్ట్‌లో మరో హీరో చేరేందుకు రెడీ అవుతున్నాడు. తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ నగరానికి ఏమైంది..? సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు విశ్వక్సేన్ మెగాఫోన్ పట్టేందుకు రెడీ అవుతున్నాడు. వెళ్లిపోమాకే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఈ యువ నటుడు గతంలో ఓ షార్ట్ఫిలింస్కు దర్శకత్వం వహించాడు. ప్రస్తుతం ‘అంగమలై డైరీస్’ అనే మలయాళ సినిమాను తెలుగులో రీమేక్ చేసే ప్రయత్నాల్లో ఉన్నాడు విశ్వక్సేన్. త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌పై అధికారిక ప్రకనట వెలువడనుంది. -
ఈ 'నలుగురు'
శ్రీనగర్‌కాలనీ: ‘ఈ నగరానికి ఏమైంది’ మూవీ తెలుగు సినీ పరిశ్రమలో ఒక కొత్తదనాన్ని తీసుకొచ్చింది. సినిమా ఇలా కూడా తీయొచ్చని నిరూపించింది. నలుగురు స్నేహితుల జర్నీని చాలా సహజంగా తెరకెక్కించారు దర్శకుడు తరుణ్‌భాస్కర్. ఇటీవల విడుదలైన ఈ సినిమా మంచి టాక్ సంపాదించింది. ప్రధాన పాత్రల్లో నటించిన నలుగురిలో... ముగ్గురు పక్కా హైదరాబాదీలు. ఇక్కడే పుట్టి పెరిగారు. మరొకరు గుంటూరు అబ్బాయ్. వీరిలో ఇద్దరు జాబ్ వదిలేసి, మరో ఇద్దరు సినిమాలపై ఆసక్తితో ఇండస్ట్రీకి వచ్చారు. ఈ నలుగురిని ‘సాక్షి’ పలకరించగా ఎన్నో విషయాలు చెప్పారు. ఆ విశేషాలివీ... బిర్యానీ ఇష్టం... నేను హైదరాబాద్‌లోనే పుట్టి పెరిగాను. నా అసలు పేరు దినేష్‌నాయుడు. స్క్రీన్ నేమ్ విశ్వక్సేన్ నాయుడు. ముచ్చటగా మూడో పేరు ఈ చ్రితంలో వివేక్. జర్నలిజం డిగ్రీలో చేరి మధ్యలోనే ఆపేశాను. ఇక్కడే పుట్టి పెరిగాను కాబట్టి నగర సంస్కృతి సంప్రదాయాలపై మంచి అవగాహన ఉంది. హైదరాబాద్ దమ్ బిర్యానీ అంటే చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచే నటుడు కావాలని ఉండేది. నటన, డ్యాన్స్ మీద ఆసక్తితో డ్యాన్స్ స్కూల్ నడిపాను. ఆ తర్వాత థియేటర్ ఆర్టిస్ట్ అయ్యాను. నటన మీద పట్టు వచ్చాక ‘వెళ్లిపోయాకే’ అనే చిత్రంలో హీరోగా చేశాను. అనంతరం ఓ మళయాల చిత్రం హక్కులు కొని నా స్వీయ దర్శకత్వంలో సినిమా తీద్దామనుకునే సమయంలో తరుణ్‌భాస్కర్ నుంచి పిలుపొచ్చింది. ఆడిషన్‌కు వెళ్లి సెలెక్ట్ అయ్యాను. చిత్రంలో లీడ్ రోల్ చేసినందుకు సంతోషంగా ఉంది. ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. కొత్త సినిమా అవకాశాలు వస్తున్నాయి. (విశ్వక్సేన్ నాయుడు– చిత్రంలో వివేక్) డైరెక్షన్ టు యాక్షన్ మాది గుంటూరు. నగరంలోని మాసబ్‌ట్యాంక్‌లో ఆర్కిటెక్చర్లో డిగ్రీ చేశాను. ఫ్రెండ్ ద్వారా దర్శకుడు తరుణ్‌భాస్కర్‌ని కలిసి అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేరాను. చిత్రంలో ఓ పాత్ర కోసం మేము ఆడిషన్ నిర్వహించాం. అయితే ఎవరూ సెట్ కాకపోవడంతో, నా బిహేవియర్ చూసి తరుణ్‌భాస్కర్ ఆడిషన్ ఇవ్వమన్నారు. నాకు నటించడం చేతకాదని చెప్పాను. అయినా ఆడిషన్ ఇవ్వమన్నారు. రూమ్‌లో ప్రిపేర్ అయ్యి ఆడిషన్ ఇచ్చాను. తరుణ్‌భాస్కర్‌కి నచ్చడంతో చిత్రంలో ఉపేంద్ర పాత్ర ఇచ్చారు. చిత్రంలో ఉప్పు పాత్రకు మంచి స్పందన వచ్చినందుకు ఆనందంగా ఉంది. స్పైసీ ఫుడ్ ఇష్టం. నాకు రాయడం చాలా ఇష్టం. మంచి రచయితగా, నటుడిగా ఇండస్ట్రీలో ఉండాలన్నదే నా ఆశయం. (వెంకటేష్ కుకుమాను – చిత్రంలో ఉపేంద్ర) ఐ లైక్ లాంగ్‌డ్రైవ్... నేను పక్కా హైదరాబాదీ. ఇక్కడే ఇంటర్ వరకు చదివాను. తర్వాత యూఎస్‌లో ఎకనామిక్స్‌లో డిగ్రీ చేశాను. నగరానికి తిరిగొచ్చి, ఒక నెల రీసెర్చ్ అనలిస్ట్‌గా జాబ్ చేశాను. ఫ్రెండ్ ద్వారా దర్శకుడు తరుణ్‌భాస్కర్‌ని కలిశాను. పెళ్లిచూపుల తర్వాత మరో సినిమా తీసేందుకు వాళ్లు అప్పుడే ప్లాన్ చేస్తున్నారు. ఆ తర్వాత ఆడిషన్‌కి వెళ్లి సెలెక్ట్ అయ్యాను. సినిమాలో మంచి పాత్ర చేసినందుకు, ప్రేక్షకులు ఆదరిస్తున్నందుకు ఆనందంగా ఉంది. హైదరాబాద్ బిర్యానీ చాలా ఇష్టం. ఫ్రెండ్స్‌తో లాంగ్‌డ్రైవ్స్‌కి వెళ్తుంటాను. మంచి నటుడిగా పేరు తెచ్చుకోవాలని ఉంది. (సాయి సుశాంత్‌రెడ్డి – చిత్రంలో కార్తీక్) నాంపల్లి నా అడ్డా... నాంపల్లి నా అడ్డా... విజ్ఞాన్ కాలేజీలో ఇంజినీరింగ్ చేశాను. ఆ తర్వాత డెల్ కంపెనీలో రీసెర్చ్ అనలిస్ట్‌గా జాబ్ చేశాను. కానీ నాకు జాబ్ సెట్ అవ్వదని అనిపించింది. థియేటర్‌కి వెళ్లాను. అక్కడే నటనలో ఓనమాలు నేర్చుకున్నాను. థియేటర్ ఆర్టిస్ట్‌గా చేస్తూనే.. ఐదు షార్ట్ఫిలిమ్స్ కూడా చేశాను. సోషల్ మీడియాలో నా నటన చూసి ‘జగన్నాటకం’ అనే చిత్రంలో అవకాశం వచ్చింది. ఆ తర్వాత సుమంత్ హీరోగా తెరకెక్కిన ‘మళ్లీరావా’లో మంచి పాత్ర చేశాను. ఆడిషన్స్‌కు వెళ్లి తరుణ్‌భాస్కర్ చిత్రానికి ఎంపికయ్యాను. డిఫరెంట్ పాత్రలు చేయాలన్నదే నా ఆశ. దర్శకుడు తేజ, ఆది సాయికిరణ్ చిత్రాల్లో అవకాశాలు వచ్చాయి. (అభినవ్ గోమటం – చిత్రంలో కౌషిక్) -
రాజ్ కుమార్ హిరాణితో తరుణ్ భాస్కర్
డైరెక్టర్ తరుణ్ భాస్కర్ బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరాణిని ముంబాయిలో కలిశారు. ఈ నగరానికి ఏమైంది చిత్ర స్పెషల్ షో సందర్భంగా వీరిద్దరు కలుసుకున్నారు. ఇటీవల రిలీజ్ అయిన రాజ్ కుమార్ హిరాణి ‘సంజు’, తరుణ్ భాస్కర్ ‘ఈ నగరానికి ఏమైంది?’ సినిమాల గురించి చర్చించుకున్నట్టుగా తెలుస్తోంది. భవిష్యత్తులో తరుణ్ భాస్కర్ తీయాలనుకుంటున్న సినిమాలకు సంబంధించిన ఆలోచనలను కూడా హిరిణితో చర్చించారట. సంజయ్ దత్ బయోపిక్ ఆధారంగా రాజ్ కుమార్ హిరాణి దర్శకత్వంలో తెరకెక్కిన సంజు గత శుక్రవారం రిలీజ్ అయి సూపర్ హిట్ టాక్‌తో దూసుకుపోతోంది. తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ నగరానికి ఏమైంది చిత్రం కూడా అదే రోజు రిలీజ్ అయి తెలుగు రాష్ట్రాల్లో మంచి టాక్ సొంతం చేసుకుంది. -
పైరసీని ఎంకరేజ్ చేయవద్దు – డి. సురేశ్‌బాబు
‘‘ఈ నగరానికి ఏమైంది?’ సినిమాని ఇంత పెద్ద సక్సెస్ చేసిన ప్రేక్షకులందరికీ కృతజ్ఞతలు. తరుణ్, ఇతర నటీనటులకు థ్యాంక్స్. వాళ్ల కృషికి ప్రేక్షకులు మంచి ఫలితాన్ని ఇచ్చారు. సినిమా చూసిన వారందరూ మా చిన్నతనంలో జరిగిన విషయాలను గుర్తుకు తెస్తోందని, చాలా ఎంటర్టైనింగ్గా ఉందని అంటున్నారు’’ అని నిర్మాత డి. సురేశ్‌బాబు అన్నారు. విశ్వక్సేన్, సాయిసుశాంత్, వెంకట్ కాకుమాను, అభినవ్ గోమటం, అనీషా ఆంబ్రోస్, సిమ్రాన్ చౌదరి ముఖ్య తారలుగా తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఈ నగరానికి ఏమైంది?’. డి. సురేశ్‌బాబు నిర్మించిన ఈ సినిమా జూన్ 29న విడుదలైంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన సక్సెస్ మీట్లో సురేశ్‌బాబు మాట్లాడుతూ– ‘‘సినిమా అనేది చాలా మంది కష్టం. ఎంతోమంది భవిష్యత్ సినిమాపై ఆధారపడి ఉంటుంది. అందుకే పైరసీని ఎంకరేజ్ చేయవద్దు. సినిమా విడుదలైన కొన్ని రోజులకే డిజిటల్ ప్లాట్‌ఫామ్స్, శాటిలైట్ ప్లాట్‌ఫామ్స్‌లోకి వస్తున్నందున పైరసీలో చూడాల్సిన అవసరం లేదు’’ అన్నారు. ‘‘ప్రేక్షకుల రెస్పాన్స్ చూసి చాలా ఆనందంగా అనిపించింది. ఈ సినిమాను కొందరు ‘పెళ్ళిచూపులు’తో పోల్చుకుంటున్నారు. కానీ ఇది డిఫరెంట్ మూవీ. రెండింటికీ పోలిక లేదు. రివ్యూస్ అనేవి బాధ్యతతో రాయాలి. ఎందుకంటే సినిమాను చాలా కష్టపడి తీస్తాం. రివ్యూస్ వల్లనే ‘పెళ్ళిచూపులు’ పెద్ద హిట్ అయ్యింది. ‘ఈ నగరానికి ఏమైంది?’కి కూడా మంచి రివ్యూస్ వచ్చాయి. ఓ రివ్యూ చదివి డిస్ట్రబ్ అవడం వల్లే అలా మెసేజ్ పెట్టాను. ఇకపై సోషల్ మీడియాలో ఉండకూడదని నిర్ణయించుకున్నా’’ అన్నారు తరుణ్ భాస్కర్. నటీనటులు అభినవ్ గోమటం, విశ్వక్ సేన్, సాయిసుశాంత్, సిమ్రాన్ చౌదరి పాల్గొన్నారు. -
ఈ నగరానికి ఏమైంది ? మూవీ టీంతో చిట్ చాట్
-
ఆమె నటనకు ఇంప్రెస్ అయ్యా : రాజమౌళి
హైదరాబాద్ : దర్శక దిగ్గజం ఎస్ఎస్. రాజమౌళి రెండు సినిమాలపై ప్రశంసల జల్లులు కురిపించారు. అందులో ఒకటి సమ్మోహనం కాగా, మరో మూవీ నేడు విడుదలైన ఈనగరానికి ఏమైంది. ఇటీవల విడుదలై హిట్ టాక్ సొంతం చేసుకున్న సమ్మోహనం మూవీని కాస్త ఆలస్యంగా చూశాను. కానీ ఇంప్రెస్ అయ్యాను. సుధీర్ బాబు, అదితి రావు హైదరీ నటన ఆకట్టుకుంది. సీనియర్ నటుడు నరేష్ అద్భుతంగా చేశారు. మూవీ యూనిట్‌కు కంగ్రాట్స్ అని రాజమౌళి ట్వీట్ చేశారు. శివలెంక కృష్ణప్రసాద్ నిర్మించిన సమ్మోహనం మూవీకి ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వం వహించారు. పెళ్లి చూపులు మూవీతో టాలీవుడ్లో తనదైన ట్రెండ్ సృష్టించిన యువ దర్శకుడు తరుణ్ భాస్కర్. తాజాగా ఆయన దర్శకత్వం వహించిన ‘ఈ నగరానికి ఏమైంది’ చూసి తరుణ్‌ను రాజమౌళి మెచ్చుకున్నారు. మంచి కామెడీ ఉంది. మూవీ యూనిట్‌కు అభినంనలు అంటూ’ మరో ట్వీట్ చేశారు రాజమౌళి. Watched #Sammohanam little late... Quite impressed with @aditiraohydari‘s performance. @isudheerbabu is good too. @ItsActorNaresh garu is hilarious. Belated Congratulations to the team... 😊 — rajamouli ss (@ssrajamouli) 29 June 2018 Tharun Bhascker does it again. A ‘Sukoon’ film with lots of laughter. Hearty Congrstulations to team #EeNagaranikiEmaindi... — rajamouli ss (@ssrajamouli) 29 June 2018 -
‘ఈ నగరానికి ఏమైంది?’ మూవీ రివ్యూ
టైటిల్ : ఈ నగరానికి ఏమైంది? జానర్ : కామెడీ ఎంటర్టైనర్ తారాగణం : విశ్వక్ సేన్ నాయుడు, సుశాంత్, అభినవ్ గోమఠం, వెంకటేష్ కాకుమాను, అనీషా ఆంబ్రోస్, సిమ్రన్ చౌదరి సంగీతం : వివేక్ సాగర్ దర్శకత్వం : తరుణ్ భాస్కర్ నిర్మాత : డి. సురేష్ బాబు పెళ్లి చూపులు సినిమాతో సూపర్ హిట్ అందుకున్న తరుణ్ భాస్కర్. కాస్త గ్యాప్ తీసుకొని మరో ఇంట్రస్టింగ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. పక్కా యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ నగరానికి ఏమైంది? సినిమాను సురేష్ ప్రొడక్షన్స్ లాంటి ప్రతిష్టాత్మక సంస్థ నిర్మించటంతో సినిమాపై ఆసక్తి పెరిగింది. అందుకు తగ్గట్టుగా డిఫరెంట్ ప్రమోషన్స్ కూడా సినిమా మీద హైప్ క్రియేట్ చేశాయి. పదికి పైగా చిన్న సినిమాలు రిలీజ్ అవుతున్న ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాతో తరుణ్ భాస్కర్ మరోసారి తన ప్రత్యేకతను చాటుకున్నాడా..? ఈ నగరానికి ఏమైంది? యాడ్ రేంజ్లో సినిమా కూడా సక్సస్ అయ్యిందా..? కథ; ఈ నగరానికి ఏమైంది? నలుగురు మధ్య తరగతి యువకుల కథ. వివేక్ (విశ్వక్ సేన్ నాయుడు), కార్తిక్ (సుశాంత్ రెడ్డి), కౌశిక్ (అభినవ్ గోమఠం), ఉపేంద్ర (వెంకటేష్ కాకుమాను)లు చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు. కార్తీక్ తాను పనిచేస్తున్న క్లబ్ ఓనర్ కూతురిని పెళ్ళి చేసుకొని అమెరికాలో సెటిల్ అవ్వాలని కలలు కంటుంటాడు. కౌశిక్ డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా పనిచేస్తూ ఎప్పటికైనా యాక్టర్ అవ్వాలని ప్రయత్నిస్తుంటాడు. ఉపేంద్ర పెళ్లి క్యాసెట్స్ ఎడిటింగ్ చేస్తూ ఉంటాడు. (సాక్షి రివ్యూస్) ఈ కథలో కీలకమైన వివేక్ దర్శకుడిగా ఎదగటానికి షార్మ్ ఫిలింస్ తీసి ప్రూవ్ చేసుకోవాలనుకుంటాడు. కానీ ప్రేమ విఫలం కావటంతో మధ్యానికి బానిసై ఫ్రెండ్స్‌కు దూరంగా ఉంటుంటాడు. కానీ అనుకున్నట్టుగా కార్తీక్‌కి ఓనర్ కూతురితో పెళ్లి కుదరటంతో పార్టీ చేసుకోవడానికి అందరూ ఒక్కటవుతారు. బార్లో ఫ్రెండ్స్ అంతా బాగా తాగేసి అనుకొని పరిస్థితుల్లో గోవా వెళ్లిపోతారు. అలా గోవా చేరిన నలుగురు స్నేహితులు ఏం చేశారు..? ఈ ప్రయాణం వారికి జీవితం అంటే ఏంటో ఎలా చూపించింది.? ఈ ట్రిప్ తరువాత వారు ఎలా మారిపోయారు? అన్నదే మిగతా కథ. నటీనటులు ; సినిమా అంతా నలుగురు కుర్రాళ్ల చుట్టూనే తిరుగుతుంది. పెద్దగా పరిచయం లేని నటీనటులను ఎంచుకున్న దర్శకుడు వాళ్ల నుంచి సహజమైన నటనను రాబట్టుకున్నాడు. వివేక్ పాత్రలో విశ్వక్ సేన్ సీరియస్‌నెస్ తో పాటు బాధని కూడా పలికించాడు. సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ కౌశిక్ పాత్రలో కనిపించిన అభినవ్ గోమఠం. అభినవ్ తెర మీద కనిపించిన ప్రతీసారి ప్రేక్షకుడు కడుపుబ్బా నవ్వుకుంటాడు.(సాక్షి రివ్యూస్) చిన్న చిన్న పంచ్ డైలాగ్స్‌తో ఫన్నీ ఎక్స్ప్రెషన్స్ తో ఆకట్టుకున్నాడు అభినవ్. ఇతర పాత్రల్లో సుశాంత్, ఉపేంద్రలు తమ పాత్రలకు న్యాయం చేశారు. వివేక్ ప్రేమ కథలో వచ్చే శిల్ప పాత్రలో సిమ్రాన్ చౌదరి అందంగా కనిపించారు. మోడ్రన్ అమ్మాయిగా అనీషా ఆంబ్రోస్ అందం, అభినయంతో ఆకట్టుకుంది. విశ్లేషణ ; పెళ్లిచూపులు లాంటి క్లాస్ సినిమా తరువాత పక్కా యూత్ ఫుల్ ఎంటర్టైనర్ను ఎంచుకున్న దర్శకుడు తరుణ్ భాస్కర్ ఈ సినిమా కూడా అంతే డిఫరెంట్ గా తెరకెక్కించాడు. గతంలో తెలుగు తెర మీద చూడని సరికొత్త ట్రీట్మెంట్ ఈ సినిమాలో కనిపిస్తుంది. ఎక్కడా కావాలని ఇరికించిన ఎమోషన్స్, బిల్డప్ సీన్స్, డ్రామా లేకుండా సినిమా అంతా సహజంగా సాగుతుంది. నలుగురు స్నేహితుల మధ్య జరిగే సాధారణ కథను ఆసక్తికరంగా తెరమీద చూపించటంలో తరుణ్ భాస్కర్ విజయం సాధించాడు. చాలా సందర్భాల్లో తనలోని రచయిత దర్శకుడిని డామినేట్ చేశాడు. `జీవితమంటే.. నచ్చిన వాళ్లతో ఉంటూ, నాలుగు మెతుకులు తింటూ, నచ్చిన పని చేసుకోవడమే` లాంటి డైలాగ్స్ మనసును తాకుతాయి. (సాక్షి రివ్యూస్) ఫ్రెండ్స్ మధ్య జరిగే సన్నివేశాలను ఇంట్రస్టింగ్‌గా తెరకెక్కించిన దర్శకుడు.. వివేక్ ప్రేమకథ, బ్రేకప్ లను చాలా సాదాసీదాగా తెరకెక్కించాడు. తొలి భాగం కామెడీ సీన్స్ తో వేగంగా కథ నడిచినా.. ద్వితీయార్థం కాస్త నెమ్మదించింది. వివేక్ సాగర్ అందించిన పాటలు పరవాలేదనిపించినా.. నేపథ్య సంగీతం ఆకట్టుకుంటుంది. ఎడిటింగ్ విషయంలో ఇంకాస్త దృష్టి పెట్టాల్సింది. సినిమాటోగ్రఫి, నిర్మాణ విలువలు బాగున్నాయి. ప్లస్ పాయింట్స్ ; లీడ్ యాక్టర్స్ నటన డైలాగ్స్ మైనస్ పాయింట్స్ ; అక్కడక్కడా నెమ్మదించిన కథనం లవ్ స్టోరి సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్. -
స్టార్స్‌తో సినిమా తీయడం రిస్క్
‘‘హ్యాంగోవర్, దిల్ చహ్తా హై, జిందగీ నా మిలేంగా దోబారా’ లాంటి సినిమాలన్నీ బడ్డీ కామెడీలు. అలాంటి సినిమాలు తెలుగులో రాలేదు. ఆ స్టైల్లో రాసుకున్న సినిమానే ‘ఈ నగరానికి ఏమైంది’’ అని దర్శకుడు తరుణ్ భాస్కర్ అన్నారు. విశ్వక్ సేన్, సాయి సుశాంత్, వెంకట్ కాకుమాను, అభినవ్ గోమటం, అనీషా అంబ్రోస్, సిమ్రాన్ చౌదరి ముఖ్య పాత్రల్లో తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో డి.సురేశ్ బాబు నిర్మించిన ఈ సినిమా ఈరోజు విడుదలవుతోంది. తరుణ్ భాస్కర్ చెప్పిన విశేషాలు... ► ‘పెళ్ళిచూపులు’ సక్సెస్ అర్థం కావడానికి టైమ్ పట్టింది. ఈ షాక్‌లో నుంచి బయటకు రావడానికి, కొంచెం బ్యాలెన్స్ రావడానికి సమయం పట్టింది. ‘పెళ్ళిచూపులు’ సినిమాకి ప్లస్ పాయింట్ కథ. ‘ఈ నగరానికి ఏమైంది’ చిత్రానికి కూడా అదే ప్లస్ పాయింట్. కథ విన్న వెంటనే సురేశ్‌బాబుగారు ఓకే అన్నారు. షూటింగ్‌లోనూ ఎలాంటి మార్పులు చెప్పలేదు. ►కొత్త వాళ్లతో కథ చెప్పడానికి స్కోప్ ఎక్కువ ఉంటుంది. స్టార్స్‌తో అయితే కథ వాళ్ల చుట్టూ తిరగాలి. అలా రాయడం నాకు కొత్త. నిజమైన రిస్క్ స్టార్స్‌తో సినిమా తీయడమే. కొత్తవాళ్లతో ఆల్రెడీ చేశాను. అదే నమ్మకంతో ‘ఈ నగరానికి ఏమైంది’ చేశా. ►‘పెళ్ళిచూపులు’ హిట్ తర్వాత చాలా మంది హీరోలు జెన్యూన్‌గా అప్రిషియేట్ చేశారు. మంచి పాయింట్ ఉంటే అప్రోచ్ అవ్వమన్నారు. సినిమా పూర్తిగా అర్థం అవ్వాలి. అది అయ్యాక వాళ్లను అప్రోచ్ అవ్వాలనుకుంటున్నా. ►జనంలో క్యూరియాసిటీ పెంచడం కోసమే కాకుండా సినిమాలో మెయిన్ థీమ్ కూడా అదే ఉండటంతో ‘ఈ నగరానికి ఏమైంది’ అనే టైటిల్ ఫిక్స్ చేశాం. ఈ టైటిల్ నా ఫ్రెండ్ కౌశిక్ చెప్పారు. సురేశ్‌బాబుగారు కూడా బావుంది అనడంతో ఫిక్స్ అయ్యాం. తాగుడుకు బానిసత్వం గురించి ఈ సినిమాలో డిస్కస్ చేశాం. ఫన్నీ ఎంటర్టైనింగ్ మూవీ. తర్వాతి సినిమా గురించి ఇంకా ఆలోచించలేదు. ముందు కథ రాస్తా. అది ఎవరికి సూట్ అవుతుందనిపిస్తే వాళ్లను అప్రోచ్ అవుతా. -
టైటిల్ చూడగానే కంగారుపడ్డాను
‘‘అర్బన్ డెవలెప్మెంట్ మినిస్టర్‌గా ఈ టైటిల్ చూడగానే కంగారుపడ్డాను. హైదరాబాద్ రోడ్ల గురించి పేపర్లో రాస్తుంటారు ‘ఈ నగరానికి ఏమైంది’ అని. దానితో ఈ సినిమాకి ఏం సంబంధం లేదనుకుంటాను (నవ్వుతూ)’’ అన్నారు తెలంగాణ సమాచార సాంకేతిక, మున్సిపల్ అండ్ అర్బన్ డెవలెప్మెంట్ మినిస్టర్ కేటీఆర్. ‘పెళ్ళి చూపులు’ ఫేమ్ తరుణ్ భాస్కర్ తెరకెక్కించిన చిత్రం ‘ఈ నగరానికి ఏమైంది’. విశ్వక్ సేన్, సాయి సుశాంత్, వెంకట్ కాకుమాను, అభినవ్ గోమటం, అనీషా ఆంబ్రోస్, సిమ్రాన్ చౌదరి ముఖ్య పాత్రల్లో నటించారు. డి. సురేశ్ బాబు నిర్మించిన ఈ చిత్రానికి సంగీతం వివేక్ సాగర్. ఈ చిత్రం ప్రీ–రిలీజ్ ఫంక్షన్ హైదరాబాద్‌లో జరిగింది. ఈ వేడుకలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కేటీఆర్ మాట్లాడుతూ– ‘‘తరుణ్ భాస్కర్ నన్ను ఆహ్వానించినప్పుడు ఒక్కటే అడిగాను. మీ టీమ్ అంతా హ్యాండ్ల్యూమ్ వేసుకుంటానంటేనే వస్తాను అని. అన్నట్టుగానే అందరూ వేసుకున్నారు. ‘పెళ్ళి చూపులు’ సినిమాను బాగా ఎంజాయ్ చేశాను. తరుణ్ ఫ్యామిలీ నాకు బాగా తెలుసు. సురేశ్‌బాబు ‘పెళ్ళి చూపులు’ చూడమని చెప్పారు. జనరల్‌గా ఫస్ట్ సినిమా హిట్ అయితే నెక్ట్స్ సినిమా పెద్ద పెద్ద స్టార్స్‌తో హంగామాగా ఉంటుంది. కానీ మళ్లీ కొత్తవాళ్ళతో సినిమా చేస్తున్నా అనేసరికి నాకేం అర్థం కాలేదు. కామెడీ సినిమాలంటే నాకు చాలా ఇష్టం. ‘హ్యాంగోవర్, దిల్ చాహ్తా హై’ లాంటి కూల్ సినిమాలాగా ఈ సినిమా ఉంటుందనుకున్నాను. ఇంకా బెటర్‌గా ఉంటుందనుకుంటున్నాను. తెలుగు సినిమాల్లో ఛేంజ్ కనిపిస్తోంది. సందీప్ రెడ్డి, సంకల్ప్ రెడ్డి ఇలా చాలామంది చేతుల్లో ఒక జాయ్‌ఫుల్ రైడ్‌గా తెలుగు ఇండస్ట్రీ ఉంటుందనుకుంటున్నాను. ఈ దర్శకులంతా హద్దుల్ని చెరిపేస్తున్నారు. ఈ సినిమా ‘పెళ్ళి చూపులు’ కంటే పెద్ద సక్సెస్ కావాలి. తరుణ్... నీకంటూ ఓ పాత్ క్రియేట్ చేసుకోవాలని కోరుకుంటున్నాను’’ అన్నారు. రానా మాట్లాడుతూ – ‘‘తరుణ్ అంటే ఎందుకో నాకు ఇష్టం. నేను చదివిన స్కూల్లోనే చదివాడు. నా జూనియర్. హెచ్పీయస్ (హైదరాబాద్ పబ్లిక్ స్కూల్) నుంచి వచ్చిన ప్రతి ఒక్కరిలో ఒక గర్వం ఉంటుంది. ఆ గర్వం అతనిలోనూ ఉంది. ఫస్ట్ హిట్ కొట్టగానే స్టార్స్‌తో డీల్ మేకింగ్ చేసి కరెప్ట్ అయ్యే ఇండస్ట్రీ ఇది. అలా లొంగిపోకుండా మళ్లీ ఓ కథను చెప్పడానికి సిద్ధమైనందుకు చాలా హ్యాపీగా, ప్రౌడ్‌గా ఉంది. మా కంపెనీలో భాగమైనందుకు ఇంకా హ్యాపీ’’ అన్నారు. మోహనకృష్ణ ఇంద్రగంటి మాట్లాడుతూ – ‘‘పెళ్ళిచూపులు’ సినిమా చూసి తరుణ్ నువ్వు మారొద్దు అని చెప్పాను. ఈ ట్రైలర్ చూస్తే అర్థం అవుతోంది. తరుణ్ వర్క్‌కి నేను పెద్ద ఫ్యాన్. ‘సమ్మోహనం’ సినిమాలో కూడా అందుకే చిన్న గెస్ట్ అపియరెన్స్ చేయించాను. ఈ సినిమా కచ్చితంగా సక్సెస్ అవుతుందనుకుంటున్నాను’’ అన్నారు. తరుణ్ భాస్కర్ మాట్లాడుతూ – ‘‘కొత్త సినిమాలు ఎందుకు చేయాలి? కొత్తవాళ్లను ఎందుకు తీసుకు రావాలంటే.. ఎక్కడో దాక్కుండిపోయిన జెమ్స్‌ను బయటకు తీసుకురావచ్చు. అలాంటి వాళ్లను బయటకు తీసుకురావడం హానర్‌గా ఉంది. ప్రొడ్యూసర్ సురేశ్‌బాబుగారికి థ్యాంక్స్ చెప్పాలి. ఇండిపెండెంట్ ఫిల్మ్ మేకర్స్‌కి ఆయన ఫాదర్ ఫిగర్లాగా. మా కంటే మోడ్రన్, ముందు చూపు ఉన్న నిర్మాత. ఎటువంటి ఈగో లేని మనిషి. ‘పెళ్ళి చూపులు’ అప్పుడు, ఆ తర్వాత కూడా చాలా హెల్ప్ చేశారు. నికేత్ లాంటి గ్రేట్ టాలెంట్ పరిచయం అయ్యాడు. విజువల్స్ అద్భుతంగా ఉంటాయి. లత గురించి చెప్పకపోతే నాకు రాత్రి అన్నం ఉండదు. చాలా బాగా వర్క్ చేసింది. వివేక్ సాగర్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు’’ అన్నారు.‘‘ఆడిషన్స్‌లో సెలెక్ట్ అవ్వడం హ్యాపీ. సినిమాని చాలా ఎంజాయ్ చేస్తూ చేశాం’’ అన్నారు అభినవ్ గోమటం. ‘‘ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ కచ్చితంగా ఈ సినిమాను ఎంజాయ్ చేస్తారు’’ అన్నారు సాయి సుశాంత్. ‘‘వెళ్లిపోమాకే’ సినిమా చూడమని చాలా మందికి షేర్ చేశా. కానీ ఈ సినిమాకి అలా అవసరం లేదు. అందరూ కచ్చితంగా వస్తారు. ఈ సినిమాను రిపీటెడ్‌గా చూస్తారు’’ అన్నారు విశ్వక్ సేన్. ‘‘డైరెక్షన్ డిపార్ట్మెంట్ నుంచి యాక్టింగ్‌కి రావడం మంచి ఎక్స్పీరియన్స్. తరుణ్, లత, నికేత్ అందరితో వర్క్ చేయడం హ్యాపీగా ఉంది’’ అన్నారు వెంకటేశ్ కాకమాను. -
‘ఈ నగరానికి..’ చీఫ్ గెస్ట్‌గా కేటీఆర్!
మొదటి సినిమాతోనే సెన్సేషన్ క్రియేట్ చేసిన డైరెక్టర్ తరుణ్‌భాస్కర్. పెళ్లి చూపులు సినిమా తరుణ్ భాస్కర్‌ను స్టార్ డైరెక్టర్‌గా నిలబెట్టింది. తన రెండో సినిమాను చాలా గ్యాప్ తీసుకుని సురేష్ ప్రొడక్షన్స్‌పై తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. ‘ఈ నగరానికి ఏమైంది?’ అనే టైటిల్‌తో వస్తోన్న ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నేడు(జూన్ 25) నిర్వహించబోతున్నారు. ఈ వేడుకకు రాష్ట్ర ఐటీ మంత్రి కే తారక రామారావు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. సినిమా పరిశ్రమతో అత్యంత సన్నిహితంగా ఉండే కేటీఆర్ ఇటీవలే రంగస్థలం, భరత్ అనే నేను ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తాజాగా ఈ నగరానికి ఏమైంది? మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు హాజరుకాబోతున్నారు. కేటీఆర్‌తో పాటు రానా, నాగ చైతన్య, విజయ్‌దేవరకొండ ముఖ్య అతిథులుగా రాబోతున్నారు. టీజర్, సాంగ్స్, పోస్టర్స్‌తో ఆకట్టుకుంటోన్న ఈ సినిమాను.. నలుగురు స్నేహితుల పాత్రల చుట్టూ తిరిగే కథగా తెరకెక్కించారు తరుణ్ భాస్కర్. ఈ సినిమా కూడా పెళ్లి చూపులు సినిమాలా విజయం సాధిస్తుందని చిత్ర యూనిట్ భావిస్తోంది. వివేక్ సాగర్ సంగీతమందించిన ఈ సినిమా జూన్ 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. #EeNagaranikiEmaindi pre-release event will be held today at 6 pm. @KTRTRS,@RanaDaggubati @chay_akkineni and @TheDeverakonda are going to be the chief guests with many others. Venue Raavi Narayana Reddy auditorium (near Lotus Pond) #ENEOnJune29th #TharunBhascker @SureshProdns pic.twitter.com/x7yrCnI10F — BARaju (@baraju_SuperHit) June 25, 2018 -
ఈ నగరానికి ఏమైంది? : రేపే ప్రీ రిలీజ్
మొదటి సినిమాతోనే ఘన విజయాన్ని సొంతం చేసుకున్నారు తరుణ్ భాస్కర్. పెళ్లి చూపులు లాంటి చిన్న సినిమాతో పెద్ద విజయాన్ని సాధించారు. గ్యాప్ తీసుకుని తన రెండో సినిమాతో మళ్లీ ప్రేక్షకులను పలకరించేందుకు సిద్దమయ్యారు. నీ గ్యాంగ్‌తో థియేటర్‌కి రా చూస్కుందాం అంటూ సినిమాపై ఆసక్తిని పెంచారు. నలుగురు స్నేహితుల పాత్రల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమా యూత్‌ను ఆకర్షించేలా ఉంది. ఈ నగరానికి ఏమైంది? అంటూ అందరికీ పరిచయమైన యాడ్‌లోని లైన్‌ను టైటిల్‌గా పెట్టారు. సోషల్ మీడియాలో ఈ సినిమాపై పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. సురేష్ ప్రొడక్షన్స్ నిర్మిస్తోన్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను రేపు (జూన్ 25) నిర్వహించబోతున్నట్లు ప్రకటించారు. ఈ మూవీ జూన్ 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
నాన్నగారి బయోపిక్ ఆలోచన లేదు
‘‘పెళ్ళి చూపులు’ సక్సెస్ తర్వాత తరుణ్ భాస్కర్‌కి పెద్ద స్టార్‌తో సినిమా చేసే చాన్స్ వచ్చినా తగ్గాడు. తనకు ఇంకా నేర్చుకోవాలని ఉంది. ఇప్పుడా ప్రాసెస్‌లో ఉన్నాడు. ఓ రోజు తప్పకుండా హైట్స్‌కి రీచ్ అవుతాడు. అది గ్యారంటీ’’ అన్నారు నిర్మాత డి. సురేశ్‌బాబు. విశ్వక్ సేన్, సాయి సుశాంత్, వెంకట్ కాకుమాను, అభినవ్ గోమతం, అనీషా ఆంబ్రోస్, సిమ్రాన్ చౌదరి ముఖ్య పాత్రల్లో తరుణ్ భాస్కర్ డైరెక్షన్లో ఆయన నిర్మించిన ‘ఈ నగరానికి ఏమైంది’ ఈ నెల 29న రిలీజవుతోంది. ఈ సందర్భంగా సురేశ్‌బాబు చెప్పిన విశేషాలు... ► మా బ్యానర్లో చిన్న సినిమా చేసినా, పెద్ద సినిమా చేసినా 2 పాయింట్స్ ఉంటాయి. కొత్తవారిని, కొత్త ట్యాలెంట్‌ని పరిచయం చేయడం, ఫిల్మ్ మేకింగ్ ప్రాసెస్‌ని ఇంకా బెటర్ చేయడం. ఇస్రో లాంటి చాలా సంస్థలు పనిని క్రమశిక్షణతో ఒక ప్రాసెస్‌లో చేస్తాయి కాబట్టే వరల్డ్ క్లాస్ సక్సెస్‌ని అచీవ్ చేస్తున్నాయి. అదే రివల్యూషన్, అంత క్రమశిక్షణ ఫిల్మ్ మేకింగ్‌లోనూ రావాలి. దీన్ని ఆచరణలో పెట్టడం కష్టమేం కాదు. కచ్చితంగా చేరుకుంటాం. ► మనం సినిమా చూడ్డానికి వెళ్లి కూర్చోగానే లైట్స్ ఆఫ్ చేసి, స్క్రీన్‌పై ఏదో ప్లే చేస్తారు. ఆ వీడియోకి మనం కనెక్ట్ అయితే సినిమా హిట్.. లేకపోతే ఫ్లాప్.. సింపుల్ ఫార్ములా. సింక్ సౌండ్ ప్రాసెస్‌లోనే ఫిల్మ్ మేకింగ్ జరగాలి. ఈ రోజుల్లో యంగ్ ఫిల్మ్ మేకర్స్ దానికే ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. ► ‘ఈ నగరానికి ఏమైంది’ షూటింగ్ జరుగుతున్నప్పుడు రెండుసార్లు సెట్స్‌కి వెళ్లాను. ప్రతీదీ పర్ఫెక్ట్గా అనిపించింది. నాన్నగారి (రామానాయుడు) బయోపిక్ రిస్క్. ‘మహానటి, సంజు’ లాంటి బయోపిక్స్ వేరు, వాళ్లు ఒకే లైఫ్‌లో మల్టిపుల్ లైవ్స్ బతికారు. నాన్నగారి లైఫ్ అలా కాదు. నిజానికి ఒక స్టోరీలో కాంట్రవర్సీస్ లేకపోతే ఆ స్టోరీ ఎవరూ వినరు.. చూడరు. ప్రస్తుతానికి నాన్నగారి బయోపిక్ ఆలోచన లేదు. ► సురేశ్ ప్రొడక్షన్స్ ఏ సినిమా నిర్మించినా పార్టనర్స్‌ని కలుపుకోవడానికే ఇష్టపడతాను. మా ప్రొడక్షన్లో బాబీ డైరెక్షన్లో వెంకటేశ్, చైతన్య సినిమా ఉంటుంది. ఒక్కో సినిమాకి ఒక్కో ప్రాసెస్ ఉంటుంది. రాజమౌళి ‘బాహుబలి’కి ఐదేళ్లు పట్టింది. మా బ్యానర్లో గుణశేఖర్ డైరెక్షన్లో ‘హిరణ్యకశ్యప’కు చాలా రోజులుగా వర్క్ జరుగుతోంది. ఏదైనా పర్ఫెక్ట్గా అయ్యాకే సెట్స్‌పైకి వస్తుంది. మేకింగ్ కూడా అంతే పర్ఫెక్ట్గా ఉంటుంది. -
ఒకే రోజు 7 సినిమాలు
ఈ నెలాఖరున వెండితెర మీద సినిమా పండుగ కనిపించనుంది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఏడు సినిమాలు జూన్ 29న రిలీజ్‌కు రెడీ అవుతున్నాయి. స్టార్ హీరోలు బరిలో లేకపోవటంతో చిన్న సినిమాలు వరుస రిలీజ్‌లకు క్యూ కడుతున్నాయి. అయితే ఒకేరోజు ఏడు సినిమాలు రిలీజ్ కు రెడీ అవుతుండటంతో థియేటర్ల సమస్య తలెత్తే అవకాశం ఉందని భావిస్తున్నారు. 29న రిలీజ్ అవుతున్న సినిమాలో కాస్త హైప్ ఉన్న ఒకే ఒక్క సినిమా ‘ఈ నగరానికి ఏమైంది..?’ పెళ్లిచూపులు సినిమాతో సూపర్ హిట్ అందుకున్న తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమా యూత్‌ను ఆకట్టుకుంటుందన్న నమ్మకంతో ఉన్నారు చిత్రయూనిట్. జబర్దస్త్ ఫేం షకలక శంకర్ హీరోగా తెరకెక్కిన శంభో శంకర కూడా అదే రోజు రిలీజ్ అవుతోంది. ప్రమోషన్స్ గట్టిగా చేస్తుండటంతో ఈ సినిమాపై కూడా మంచి బజ్ క్రియేట్ అయ్యింది. నందు హీరోగా తెరకెక్కిన కన్నుల్లో నీ రూపమే, గ్రాఫిక్స్ ప్రధానంగా రవి వీడే దర్శకత్వంలో తెరకెక్కిన సంజీవని, రవిచావలి డైరెక్ట్ చేసిన సూపర్ స్కెచ్, మోహన్ లాల్, అల్లు శిరీష్ ప్రధాన పాత్రల్లో నటించిన మలయాళ డబ్బింగ్ సినిమా యుద్ధభూమి జూన్ 29న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాయి. -
నా కథను నేను రాసుకున్నా
‘‘పెళ్ళి చూపులు’’ సినిమా 2016జూలై 29న విడుదలైనా నిన్ననే రిలీజ్ అయినట్లు ఉంది. ‘పెళ్లి చూపులు’ సినిమా చూసిన సురేశ్‌బాబుగారు ఈ సినిమా 100 రోజులు ఆడుతుందన్నారు. నవంబర్ 5న ఆ సినిమా 100వ రోజు. అదేరోజు నా పుట్టిన రోజు కావడం విశేషం’’ అని దర్శకుడు తరుణ్ భాస్కర్ అన్నారు. విశ్వక్ సేన్, సాయి సుశాంత్, వెంకట్ కకుమను, అభినవ్ గోమతం, అనీషా ఆంబ్రోస్, సిమ్రాన్ చౌదరి ముఖ్య తారలుగా ఆయన దర్శకత్వంలో డి.సురేశ్ బాబు నిర్మించిన ‘ఈ నగరానికి ఏమైంది’ చిత్రం ఈనెల 29న విడుదలవుతోంది. ఈ సందర్భంగా యూనిట్, కొందరు సామాన్యులకు చిత్రం ప్రదర్శించారు. అనంతరం తరుణ్ భాస్కర్ మాట్లాడుతూ– ‘‘పెళ్లి చూపులు’ సినిమా తర్వాత నా రెండో సినిమాకి సురేశ్‌బాబుగారు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. ఏ కథ రాయాలని చాలా ఆలోచించా. చాలా మంది వద్ద సలహాలు తీసుకున్నా. ఆ టైమ్‌లో ‘నా గురించే నేను ఎందుకు రాసుకోకూడదు?’ అనిపించి, నా కథను నేను రాసుకున్నా. నా ఫ్రెండ్స్ గురించి, మా జీవన ప్రయాణంలో జరిగిన సంఘటనలను ‘ఈ నగరానికి ఏమైంది’ కథ రాశా. సినిమాలో సస్పెన్స్ ఎలిమెంట్స్ ప్రేక్షకులకు కొత్త ఫీల్ కలిగిస్తాయి’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: నికేత్ బొమ్మిరెడ్డి, సంగీతం: వివేక్ సాగర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వెంకట్ సిద్దారెడ్డి, కో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: శ్రీనివాస్ కౌశిక్, లైన్ ప్రొడ్యూసర్: సాయికరణ్ గద్వాల్. -
‘సిస్టర్.. ఎంకరేజ్ న్యూ టాలెంట్.. ప్లీజ్’
తొలి చిత్రం పెళ్లి చూపులు సినిమాతో సంచలన విజయం సాధించిన దర్శకుడు తరుణ్ భాస్కర్. లఘు చిత్ర నేపథ్యం తో వెండితెర అరంగేట్రం చేసిన ఈ యువ దర్శకుడు తొలి సినిమాతోనే మంచి టాలెంట్ ఉన్న దర్శకుడిగా ప్రూవ్ చేసుకున్నాడు. తొలి చిత్రం ఘనవిజయం సాధించినా.. రెండో సినిమాను ప్రారంభించేందుకు చాలా సమయం తీసుకున్నాడు తరుణ్. తన రెండో సినిమాను డిఫరెంట్ కాన్సెప్ట్‌తో సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్లో రూపొందిస్తున్నారు. తెలుగు ప్రేక్షకుల్లో ఎంతో పాపులర్ అయిన ఈ నగరానికి ఏమైంది..? అనే పదాన్నే సినిమా టైటిల్ గా తీసుకున్న తరుణ్ భాస్కర్ మరోసారి విభిన్న కథా కథనాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. నూతన నటీనటులు విశ్వక్ సేన్, సుశాంత్ రెడ్డి, అభినవ్, వెంకటేష్‌లతో పాటు అనీషా ఆంబ్రోస్, సిమ్రాన్ చౌదరి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయ్యింది. -
‘ఈ నగరానికి ఏమైంది?’
-
ఈ సండే నగరానికి... ట్రైలర్ వస్తోందంట!
ఓ చిన్న సినిమాతో పెద్ద విజయాలు చాలా మంది అందుకున్నారు. అలాంటి జాబితాలో పెళ్లి చూపులు సినిమా డైరెక్టర్ తరుణ్ భాస్కర్ ఉండాల్సిందే. పెళ్లి చూపులు సినిమాతో టాలీవుడ్లో సెన్సేషన్ క్రియేట్ చేశాడు. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమా తరువాత తరుణ్ భాస్కర్ ఇప్పటివరకు ఇంకో సినిమాను తెరకెక్కించలేదు. తాజాగా ‘ఈ నగరానికి ఏమైంది?’ సినిమాను ప్రకటించాడు. టైటిల్‌తోనే అందరిలో ఆసక్తిని రేకెత్తించారు డైరెక్టర్. ఓ నలుగురు స్నేహితుల మధ్య జరిగే కథ, ఆ కథకు గోవా నేపథ్యాన్ని జోడించి.. యూత్‌ఫుల్ ఎంటర్టైన్మెంట్గా ఈ సినిమాను తెరకెక్కించనున్నట్లు సమాచారం. ఈ సినిమా ట్రైలర్‌ను ఆదివారం విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ‘ఈ ఆదివారం నగరానికి మంచి ట్రేలర్ వస్తుంది’ అని పోస్టర్‌ను రిలీజ్ చేశారు. సురేశ్ ప్రొడక్షన్స్‌పై తెరకెక్కుతున్న ఈ మూవీకి వివేక్ సాగర్ సంగీతమందిస్తున్నారు. This Sunday will not be like any other SUNDAY... SUN might come and go... But our Trailer can’t 😎... Vasthundi anthe ⚡️⚡️... Kaaskondi. #ENETrailerOnSunday pic.twitter.com/c3wNOp1HWK — Suresh Productions (@SureshProdns) June 8, 2018 -
‘ఈ నగరానికి ఏమైంది?’ మోషన్ పోస్టర్
పెళ్లి చూపులు మూవీతో చిన్న సినిమా స్టామినా ఏంటో నిరూపించాడు ఆ చిత్ర దర్శకుడు తరుణ్ బాస్కర్. తీసిన ఆ ఒక్క సినిమాతో పెద్ద సక్సెస్ సాధించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. పెళ్లి చూపులు సినిమా వచ్చి రెండేళ్లు గడుస్తున్నా... ఇంకో సినిమాను తెరకెక్కించలేదు ఈ యువ దర్శకుడు. ఈ నగరానికి ఏమైంది అంటూ సాగే ఒకప్పటి ఫేమస్ యాడ్‌లోని ఫస్ట్ లైన్‌ను తన సినిమా టైటిల్‌గా ఎంచుకున్నాడు. నీ గ్యాంగ్‌తో థియేటర్‌కు రా చూస్కుందాం అంటూ టైటిల్ పోస్టర్‌ను రిలీజ్ చేసి ప్రేక్షకుల్లో ఆసక్తిగా రేకెత్తెలా చేశాడు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ మోషన్ పోస్టర్‌ను విడుదల చేశారు. దీంట్లో సినిమాలోని నలుగురు కుర్రాళ్లను పరిచయం చేశాడు. మీరంతా గ్యాంగ్‌తో రండి... ఈ సమ్మర్లో మిమ్మల్ని గోవాకు తీసుకెళ్తాం అంటూ పోస్టర్‌ను రిలీజ్చేశారు. సురేష్ ప్రొడక్షన్స్‌పై తెరకెక్కిస్తున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.