'ఎక్కడికి పోతావు చిన్నవాడా' మూవీ రివ్యూ | Ekkadiki Pothavu Chinnavada Movie Review | Sakshi
Sakshi News home page

'ఎక్కడికి పోతావు చిన్నవాడా' మూవీ రివ్యూ

Published Fri, Nov 18 2016 1:10 PM | Last Updated on Mon, Sep 4 2017 8:27 PM

'ఎక్కడికి పోతావు చిన్నవాడా' మూవీ రివ్యూ

'ఎక్కడికి పోతావు చిన్నవాడా' మూవీ రివ్యూ

టైటిల్ : ఎక్కడికి పోతావు చిన్నవాడా
జానర్ : రొమాంటిక్ థ్రిల్లర్
తారాగణం : నిఖిల్ సిద్ధార్థ్, నందితా శ్వేతా, హేబా పటేల్,  వెన్నెల కిశోర్
సంగీతం : శేఖర్ చంద్ర
దర్శకత్వం : విఐ ఆనంద్
నిర్మాత : పి.వి. రావు

స్వామిరారా, కార్తీకేయ, సూర్య వర్సెస్ సూర్య లాంటి సినిమాలతో ట్రాక్ లోకి వచ్చినట్టుగానే కనిపించిన నిఖిల్, తరువాత శంకరాభరణం సినిమాతో నిరాశపరిచాడు. ఆ సినిమా ఫెయిల్యూర్ తో ఆలోచనలో పడ్డ ఈ యంగ్ హీరో రొటీన్ కమర్షియల్ జానర్ ను పక్కన పెట్టి మరోసారి తనకు బాగా కలిసొచ్చిన ప్రయోగానికే ఓటు వేశాడు. రొమాంటిక్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఎక్కడికి పోతావు చిన్నవాడా, నిఖిల్ కెరీర్ ను తిరిగి ట్రాక్ లోకి తీసుకువచ్చిందా..?


కథ :

అర్జున్(నిఖిల్ సిద్ధార్థ్) ఇంజనీరింగ్ స్టూడెంట్.. ఎగ్జామ్ రాసిన వెంటనే తనను ప్రేమించిన అమ్మాయి అయేషాను పెళ్లి చేసుకోవడానికి రిజిస్టర్ ఆఫీస్కు వెళతాడు. కానీ ఎంత సేపు ఎదురుచూసినా అయేషా అక్కడికి రాదు. దీంతో అయేషా తనను మోసం చేసిందని, ఇంక జీవితంలో ఎవరికోసం ఇంతలా వెయిట్ చేయకూడదని నిర్ణయించుకుంటాడు. అయేషాను మరిచిపోయి కెరీర్ మీద దృష్టి పెట్టిన అర్జున్, గ్రాఫిక్ డిజైనర్గా సెటిల్ అవుతాడు. అదే సమయంలో తన ఫ్రెండ్ అన్న, కిశోర్( వెన్నెల కిశోర్) వింతగా ప్రవర్తిస్తుండటంతో అతడికి వైద్యం చేయించడానికి కేరళలోని మహిషాసుర మర్థిని ఆలయానికి తీసుకెళతాడు.

అక్కడ ఉన్న సమయంలో విజయవాడ నుంచి తన అక్క వైద్యం కోసం వచ్చిన అమల అనే అమ్మాయి అర్జున్కు పరిచయం అవుతుంది. మూడు రోజుల్లోనే ఇద్దరు దగ్గరవుతారు. తెల్లవారితే తన ప్రేమ విషయం చెప్తుంది అనుకున్న సమయంలో అమల అక్కడి నుంచి చెప్పా పెట్టకుండా వెళ్లిపోతుంది. ఆమెను వెతుక్కుంటూ విజయవాడ వెళ్లిన అర్జున్.. ఆమె చాలా ఏళ్ల కిందటే చనిపోయిందని తెలుసుకొని షాక్ అవుతాడు.

తరువాత తనకు కేరళలో కలిసి అమ్మాయి హైదరాబాద్లో అర్జున్కు కనిపిస్తుంది. అప్పుడే అసలు విషయం తెలుస్తుంది. తన అసలు పేరు నిత్య అని తనలోకి అమల అనే అమ్మాయి ఆత్మ ప్రవేశించటంతో కేరళలో వైద్యానికి తీసుకువెళ్లారని, అక్కడే తనకు పరిచయం అయ్యిందని అర్థం అవుతుంది. అదే సమయంలో మరోసారి అమల నుంచి అర్జున్కు ఫోన్ వస్తుంది. నిన్ను కలవడానికి వస్తున్నా అని ఫోన్ చేసి చెపుతుంది అమల. అసలు అమల, అర్జున్ వెంటే ఎందుకు పడుతుంది..? నిఖిల్ ప్రేమించిన అయేషాకు ఏం అయ్యింది..? ఈ కథకు పార్వతికి సంబంధం ఏంటి..? చివరకు అమల ఆత్మ ఏమైంది..? అన్నదే మిగతా కథ.


నటీనటులు :

విభిన్న కథలను ఎంచుకొని సక్సెస్ సాధిస్తున్న హీరో నిఖిల్ సిద్ధార్ధ్ మరోసారి సక్సెస్ సాధించాడు. కాలేజ్ స్టూడెంట్, కెరీర్లో సెటిల్ అయిన వ్యక్తిగా రెండు లుక్స్లో మంచి వేరియేషన్ చూపించాడు. తన ప్రతీ సినిమాకు నటుడిగా మరో మెట్టు ఎదుగుతూ వస్తున్నాడు. తొలిసారిగా తెలుగు తెరకు పరిచయమైన నందితా శ్వేత మంచి నటన కనబరిచింది. ముఖ్యంగా హర్రర్ సన్నివేశాల్లో ఆమె నటన సూపర్బ్. హేబా పటేల్ మరోసారి అల్లరి పిల్లగా అలరించింది. నటనకు పెద్దగా స్కోప్ లేకపోయినా గ్లామర్ షోతో ఆకట్టుకుంది. అవికాఘోర్ పాత్ర సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్. తెర మీద కనిపించేది కొద్దిసేపే అయినా.. తనదైన నటనతో మెప్పించింది అవికా. ఇతర పాత్రల్లో వెన్నెల కిశోర్, ప్రవీణ్, తనికెళ్ల భరణి తమ పరిది మేరకు ఆకట్టుకున్నారు.
సాంకేతిక నిపుణులు :

టైగర్ సినిమాతో దర్శకుడిగా మారిన విఐ ఆనంద్ రెండో ప్రయత్నంలో ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం సక్సెస్ ఫార్ములాగా మారిన కామెడీ హర్రర్ జానర్నే నమ్ముకున్నా.. ఎక్కడా రొటీన్ సినిమా అన్న ఫీలింగ్ కలగకుండా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్తో సినిమాను నడిపించాడు. కథా కథనాల విషయంలో ఆనంద్ తీసుకున్న కేర్ ప్రతీ సీన్ లోనూ కనిపిస్తుంది. సినిమాకు మరో మేజర్ హైలెట్ సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫి. మహిషాసుర మర్థనీ ఆలయం, ఫస్ట్ హాఫ్లో వచ్చే సాంగ్స్ విజువల్గా చాలా బాగున్నాయి. శేఖర్ చంద్ర సంగీతం కూడా సినిమా మూడ్కు తగ్గట్టుగా ఉంది. ఎడిటింగ్, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.


ప్లస్ పాయింట్స్ :
నందిత శ్వేత, నిఖిల్ నటన
స్క్రీన్ప్లే
కామెడీ

మైనస్ పాయింట్స్ :
అన్కన్విన్సింగ్ క్లైమాక్స్
అక్కడక్కడా స్లో నేరేషన్

ఓవరాల్గా ఎక్కడికి పోతావు చిన్నవాడా.. మరోసారి నిఖిల్ కెరీర్ను ట్రాక్ లోకి తీసుకొచ్చే  రొమాంటిక్ కామెడీ థ్రిల్లర్

- సతీష్ రెడ్డి, ఇంటర్నెట్ డెస్క్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement