'కేశవ' మూవీ రివ్యూ | KESHAVA Movie Review | Sakshi
Sakshi News home page

'కేశవ' మూవీ రివ్యూ

Published Fri, May 19 2017 11:54 AM | Last Updated on Tue, Sep 5 2017 11:31 AM

'కేశవ' మూవీ రివ్యూ

'కేశవ' మూవీ రివ్యూ

టైటిల్ : కేశవ
జానర్ : క్రైం థ్రిల్లర్
తారాగణం : నిఖిల్ సిద్ధార్థ్, రీతూ వర్మ, ఇషా కొప్పీకర్, ప్రియదర్శి
సంగీతం : సన్నీ ఎమ్.ఆర్
దర్శకత్వం : సుధీర్ వర్మ
నిర్మాత : అభిషేక్ నామా

రెగ్యులర్ కమర్సియల్ జానర్ కు భిన్నంగా వరుస ప్రయోగాలతో సక్సెస్ లు సాధిస్తున్న యంగ్ హీరో నిఖిల్, మరో డిఫరెంట్ మూవీతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. అరుదైన గుండె జబ్బుతో ఎక్కువగా ఆవేశపడలేని ఓ యువకుడు తన పగను ఎలా తీర్చుకున్నాడన్న కథతో తెరకెక్కిన కేశవ, మరోసారి నిఖిల్ మార్క్ చూపించిందా..? ఈ ప్రయోగంతో నిఖిల్ తన సక్సెస్ ట్రాక్ ను కంటిన్యూ చేశాడా..? లవర్ బాయ్ ఇమేజ్ నుండి బయటపడి పూర్తి సీరియస్ క్యారెక్టర్ లో నిఖిల్ ఎంత వరకు ఆకట్టుకున్నాడు..?


కథ :
కాకినాడ లా కాలేజ్ లో ఫైనల్ ఇయర్ చదువుతున్న పి. కేశవ శర్మ(నిఖిల్) అరుదైన గుండె జబ్బుతో ఇబ్బంది పడుతుంటాడు. అందరికీ ఎడమ పక్కన ఉండే గుండె, తనకు కుడి పక్కన ఉంటుంది. దీని కారణంగా ఏ మాత్రం ఆవేశపడినా, అలిసి పోయినా గుండె ఆగిపోయి చనిపోతాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న కేశవ వరుసగా పోలీసు అధికారులను హత్య చేస్తుంటాడు. హత్య చేసిన తరువాత చిన్న క్లూ కూడా వదిలి పెట్టకుండా.. చనిపోయిన వారి శవాలను ఉరి వేసి వెళ్లిపోతాడు. అదే సమయంలో కాలేజ్ లో జాయిన్ అయిన కేశవ చిన్ననాటి స్నేహితురాలు సత్యభామ(రీతూ వర్మ), అతన్ని గుర్తు పట్టి దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తుంది.

ఈ హత్యలు చేస్తుంది ఎవరు..? కారణం ఏంటి..? అన్న విషయం కనిపెట్టేందుకు పోలీస్ డిపార్టెమెంట్ కేసును స్పెషల్ ఆఫీసర్ షర్మిలా మిశ్రా(ఇషా కొప్పికర్) కు అప్పగిస్తుంది. ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టిన షర్మిలకు కేశవ మీద అనుమానం వస్తుంది. మరో పోలీస్ అధికారి హత్య సమయంలో కేశవను అరెస్ట్ చేస్తుంది. తన పగ తీరకుండానే అరెస్ట్ అయిన కేశవ ఎలా తప్పించుకున్నాడు..? అసలు కేశవ ఈ హత్యలు ఎందుకు చేస్తున్నాడు..? స్పెషల్ ఆఫీసర్ షర్మిలా ఈ కేను ఎలా సాల్వ్ చేసింది..? ఇన్ని మర్డర్లు చేసిన కేశవ చివరకు ఏమయ్యాడు..? అన్నదే మిగతా కథ.


నటీనటులు :
ప్రయోగాత్మక చిత్రాలు చేసినా.. లుక్ విషయంలో ఎప్పుడ లవర్ బాయ్ లానే కనిపిస్తూ వచ్చిన నిఖిల్.. ఈ సినిమాలో డిఫరెంట్ లుక్ లో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా సినిమా అంతా ఒకే ఎక్స్ప్రెషన్ తో బరువైన ఎమోషన్ ను మోస్తున్నట్టుగా మంచి నటన కనబరిచాడు. హీరోయిన్ రీతూవర్మ ఆకట్టుకుంది. అందంతో పాటు అభినయంతోనూ మెప్పించింది. చాలా కాలం తరువాత తెలుగు తెర మీద కనిపించిన ఇషా కొప్పీకర్, పోలీస్ అధికారి పాత్రకు పర్ఫెక్ట్ గా సూట్ అయ్యింది. కామెడీకి పెద్దగా స్కోప్ లేకపోయినా.. ఉన్నంతలో వెన్నెల కిశోర్, ప్రియదర్శి, సుదర్శన్, సత్యల కామెడీ అలరిస్తుంది. ఇతర పాత్రల్లో అజయ్, బ్రహ్మాజీ, రావూ రమేష్ లు తమ పాత్రలకు న్యాయం చేశారు.

సాంకేతిక నిపుణులు :
నిఖిల్ తో రెండో సినిమా చేసిన సుధీర్ వర్మ మరోసారి అద్భుతమైన టేకింగ్తో ఆకట్టుకున్నాడు. రోటీన్ రివేంజ్ కథను ఆకట్టుకునే స్క్రీన్ ప్లేతో ఆసక్తికరంగా మలిచాడు. సినిమాను రెండు గంటల లోపే ముగించిన సుధీర్, కమర్షియల్ ఎలిమెంట్స్ పేరుతో అనవసరమైన కామెడీ, రొమాంటిక్ సీన్స్ ఇరికించకుండా సినిమాను ఒకే మూడ్ లో నడిపించాడు. చాప్టర్ లుగా కథను నడిపించడం, అందుకు తగ్గట్టుగా ఫ్లాష్ బ్యాక్ ను కూడా కొంచెం కొంచెంగా రివీల్ చేయటం సినిమా చివరి వరకు సస్పెన్స్ కొనసాగేలా చేసింది. తొలి భాగాన్ని ఎంతో గ్రిప్పింగ్ గా నడిపించిన సుధీర్, సెకండ్ హాఫ్ లో మాత్రం స్లో అయ్యాడు. అయితే ప్రీ క్లైమాక్స్ నుంచి సినిమా మరోసారి స్పీడందుకోవటం సినిమాకు ప్లస్ అయ్యింది. దివాకర్ మణి సినిమాటోగ్రఫి సినిమాకు మరో ఎసెట్. తన ఫ్రేమ్స్, లైటింగ్ తో సినిమా మూడ్ ను క్యారీ చేశాడు. ఎడిటింగ్, మ్యూజిక్, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.

ప్లస్ పాయింట్స్ :
నిఖిల్ నటన
స్క్రీన్ ప్లే
సినిమా నిడివి
బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్

మైనస్ పాయింట్స్ :
సెకండ్ హాఫ్ స్లో నారేషన్
రొటీన్ స్టోరి

కేశవ... ఇంటెన్స్ క్రైం థ్రిల్లర్.


- సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement