సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో బయోగ్రాఫికల్ మూవీ లక్ష్మీస్ ఎన్టీఆర్. ఎన్టీఆర్ జీవితంలోని కీలక సంఘటన ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ మినహా మిగతా ప్రాంతాల్లో రిలీజ్ అయి ఘన విజయం సాధించింది. అయితే ఆంధ్ర ప్రదేశ్‌లో ఎన్నికల హడావిడి ముగియటంతో ఇక రిలీజ్‌కు లైన్ క్లియర్ అయినట్టే అని భావించారు. కానీ పరిస్థితి అలా కనిపించటం లేదు. రేపు సినిమా విడుదల చేయనున్నట్లు సినిమా నిర్మాత రాకేష్ రెడ్డి, దర్శకులు రాంగోపాల్ వర్మలు ఇప్పటికే ప్రకటించారు.
ఎన్నికలు పూర్తయ్యాయని సినిమా విడుదలకు అనుమతి ఇవ్వమని ఈ నెల 25న చిత్ర దర్శకులు రాంగోపాల్ వర్మ కేంద్ర ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ లో మే1 సినిమా విడుదలకు సన్నాహాలు చేశారు. అయితే ఈ ఏప్రిల్ 10వ తేదిన సినిమా విడుదలను ఆపుతూ కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. అదే ఉత్తర్వులు అమలులోనే ఉన్నాయని రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.
సినిమా విడుదలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం నుండి ఎలాంటి తాజా ఉత్తర్వులు తమకు అందలేదని సీఈవో గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. గతంలో కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసిన ఉత్తర్వులను అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలకు పంపించామని తెలిపారు. కాగా కేంద్ర ఎన్నికల సంఘం సినిమా విడుదలను ఆపుతూ జారీ చేసిన ఉత్తర్వులు ఎన్నికల కోడ్ అమలులో ఉన్న మే 27 వ తేది వరకు ఉంటాయన్నారు ద్వివేదీ. దీంతో రేపు ఆంధ్రప్రదేశ్‌లో లక్ష్మీస్ ఎన్టీఆర్ రిలీజ్ లేనట్టే అన్న టాక్ వినిపిస్తోంది. అయితే మే 1న సినిమాను రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించిన వర్మ, వాయిదాపై ఎలాంటి ప్రకటనా చేయలేదు.
Comments
Please login to add a commentAdd a comment