ప్రముఖ దర్శకుడు బాలచందర్ కన్నుమూత
చెన్నై : కె.బాలచందర్గా సుప్రసిద్ధుడైన దర్శక ప్రముఖుడు కైలాసం బాలచందర్ చెన్నైలోని కావేరి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మరణించారు. ఆయన వయసు 84 సంవత్సరాలు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గత కొద్ది రోజుల నుంచి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మూత్రపిండాలకు సంబంధించిన సమస్య ఎక్కువ కావడంతో డయాలసిస్ చేశారు. చివరకు వెంటిలేటర్ మీద ఉంచి కూడా వైద్యం అందించారు. కానీ, వార్ధక్యం కారణంగా ఆయన శరీరం చికిత్సకు సహకరించకపోవడంతో వైద్యులు కూడా ఏమీ చేయలేకపోయారు.
బాలచందర్‌కు ఎనిమిదేళ్ల వయస్సు నుంచే సినిమాలపై ఆసక్తి కలిగింది. ఆ క్రమంలో 12వ ఏటే థియేటర్ ఆర్టిస్ట్ సంఘంలో సభ్యులయ్యారు. ఉన్నత విద్య పూర్తి చేసిన ఆయన తొలుత ఉపాధ్యాయ వృత్తిని చేపట్టారు. చెన్నై మహానగరంలోకి అకౌంట్ క్లర్క్‌గా అడుగుపెట్టారు. ఆ తరువాత యునెటెడ్ అమెరికన్ ఆర్టిస్టు నటన కంపెనీలో చేరారు.
అనంతరం అతి త్వరలోనే తన కంటూ సొంతంగా డ్రామా గ్రూప్‌ను తయారు చేసుకుని మేజర్ చంద్రకాంత్ నాటకాన్ని రూపొందించి దర్శకత్వం వహించారు. ఆ తరువాత అదే నాటకంతో వెండితెరపై దర్శకుడిగా అవతరించారు. రజనీకాంత్, కమలహాసన్, ప్రకాష్‌రాజ్, సరిత, వివేక్ వంటి ప్రముఖ నటీనటులను పరిచయం చేసిన ఘనత కె.బాలచందర్‌దే. ఈయన తమిళం, తెలుగు, హిందీ తదితర భాషల్లో 100 చిత్రాలకుపైగా చేసి భారతీయ సినీ కళామతల్లి గర్వించదగ్గ దర్శకుడిగా పేరొందారు.
ఎంజీఆర్ హీరోగా చేసిన దైవతాయ్ చిత్రానికి సంభాషణల రచయితగా సినీరంగంలో ప్రవేశించారు. భారత చలనచిత్ర రంగం అభివృద్ధికి ఆయన చేసిన కృషికి గాను 2010 సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని ప్రకటించింది. ఆయన ఇటీవలే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ‘అక్కినేని అంతర్జాతీయ పురస్కారం’ అందుకున్నారు. ఇది కథ కాదు, అంతులేని కథ, గుప్పెడు మనసు, ఆకలి రాజ్యం, రుద్రవీణ.. ఇలాంటి అద్భుత చిత్రరాజాలన్నీ బాలచందర్ దర్శకత్వ ప్రతిభకు మచ్చుతునకలు.