సాక్షి ప్రతినిధి, చెన్నై: కావేరి నది.. కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల గుండా ప్రవహిస్తూ కడలిలో సంగమిస్తోంది. అదేవిధంగా జీవితంలో తన చివరి రోజులు కావేరి ఆస్పత్రిలో గడిపిన కరుణానిధి ప్రయాణం కూడా చెన్నైలోని కడలి తీరంలో ముగిసింది. 94 ఏళ్లపాటు సుదీర్ఘ జీవన ప్రయాణం సాగించిన కరుణ ఆస్పత్రిలో గడిపిన చివరి 11 రోజులను ఒక్కసారి మననం చేసుకుంటే..
జూలై 28: మూత్రవిసర్జన ఇబ్బందులతో ఇంటిలోనే చికిత్స పొందుతున్న కరుణ తెల్లవారుజామున 1.30 గంటలకు అకస్మాత్తుగా బ్లడ్‌ప్రెషర్‌కు గురికావడంతో కుటుంబ సభ్యులు కావేరి ఆస్పత్రిలో చేర్పించారు.
జూలై 29: ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆస్పత్రికి చేరుకుని కరుణను పరామర్శించారు. అయితే అదేరోజు సాయంత్రానికి కరుణ పరిస్థితి విషమించినట్లు, కన్నుమూసినట్లు వదంతులు రేగడంతో రాష్ట్రంలో పరిస్థితి అల్లకల్లోలంగా మారింది.
జూలై 30: తమిళనాడు సీఎం పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీర్‌సెల్వం ఆస్పత్రికి వెళ్లి పరామర్శించి కరుణ కోలుకుంటున్నారని ప్రకటించారు.
జూలై 31: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సమీపంలో నిల్చుని ఉండగా, ఆయన వచ్చిన సమాచారాన్ని స్టాలిన్ తండ్రి కరుణ చెవిలో చెబుతున్న ఫొటోలు మీడియాకు విడుదల కావడంతో పార్టీ శ్రేణులు ఆనందించాయి.
ఆగస్టు 1: తమిళ సినీ నటీనటులు స్టాలిన్, కనిమొళిని కలుసుకుని కరుణ క్షేమ సమాచారాలు తెలుసుకున్నారు.
ఆగస్టు 2: కేరళ సీఎం పినరాయి విజయన్, మహాత్మా గాంధీ మనుమడు గోపాలకృష్ణ గాంధీ తదితరులు ఆస్పత్రిలో కరుణను పరామర్శించారు.
ఆగస్టు 3: కరుణకు జాండీస్ సోకినట్లు గుర్తించి చికిత్స ప్రారంభించారు. మాజీ ప్రధానమంత్రి హెచ్‌డీ దేవగౌడ కరుణను పరామర్శించారు.
ఆగస్టు 4: జాండీస్ ముదరడంతో కాలేయ వ్యాధికి చికిత్స చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర మంత్రి సురేష్ ప్రభు కావేరి ఆస్పత్రికి వచ్చి కరుణ క్షేమ సమాచారాలు తెలుసుకున్నారు.
ఆగస్టు 5: రాష్ట్రపతి కోవింద్ వచ్చి వెళ్లారు. అయితే ఫొటోలు విడుదల కాలేదు. ఆస్పత్రి యాజమాన్యం బులెటిన్ కూడా విడుదల చేయలేదు.
ఆగస్టు 6:కరుణ శరీరంలోని అనేక అవయవాలు పనిచేయడం మానివేశాయని, 24 గంటల తర్వాత కానీ ఏ విషయం చెప్పలేమని బులెటిన్ విడుదలైంది.
ఆగస్టు 7: కావేరి ఆస్పత్రి పరిసరాల్లోకి తండోపతండాలుగా జనం చేరుకోవడం ప్రారంభించారు. సాయంత్రం 4.30 గంటలకు బులెటిన్ విడుదలైంది. అదేరోజు సాయంత్రం 6.10 గంటలకు కరుణానిధి కన్నుమూయగా 6.41 గంటలకు బులెటిన్ విడుదలైంది.
ఆగస్టు 8: కరుణ భౌతికకాయాన్ని సీఐటీ నగర్ ఇంటి నుంచి తెల్లవారుజామున 5 గంటల సమయంలో చెన్నై రాజాజీ హాల్‌లో వీవీఐపీలు, ప్రజల సందర్శనార్థం ఉంచారు. రాత్రి 7.25 గంటలకు కరుణ అంతిమ సంస్కారాలు ముగిశాయి.
‘కావేరి’ నుంచి కడలి తీరం వరకు
Published Thu, Aug 9 2018 4:03 AM | Last Updated on Thu, Aug 9 2018 4:03 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment