merina beach
-
రియల్ తలైవికి.. రీల్ తలైవి నివాళి
చెన్నై: రియల్ తలైవికి రీల్ తలైవి నివాళుల ర్పించారు. బాలీవుడ్ నటి కంగనా రనౌత్ దివంగత ముఖ్యమంత్రి జయలలిత జీవిత చరిత్రతో రూపొందుతున్న తలైవిలో టైటిల్ రోల్‌ను పోషించిన విషయం తెలిసిందే. ఈ చిత్రం తమిళం, తెలుగు, హిందీ భాషల్లో ఈనెల 10న విడుదలకు సిద్ధమైంది. చిత్ర ప్రమోషన్లో భాగంగా శనివారం చెన్నైకు చేరుకున్న నటి కంగనా రనౌత్ స్థానిక మెరీనా తీరంలోని జయలలిత సమాధి వద్దకు చేరుకుని నివాళి అర్పించారు. అనంతరం ఎంజీఆర్, కరుణానిధి సమాధులను దర్శించుకున్నారు. -
అమ్మ స్మారకం జాప్యం.. సీఎం అసంతృప్తి
సాక్షి, చెన్నై: మెరీనా తీరంలో చేపట్టిన దివంగత సీఎం జయలలిత స్మారక మందిరం నిర్మాణ పనుల్లో జాప్యం జరగడంపై సీఎం పళనిస్వామి అసంతృప్తి వ్యక్తం చేశారు. సెప్టెంబరులోపు పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. చెన్నై మెరీనా తీరంలో ఎంజియార్ సమాధికి కూతవేటు దూరంలో అమ్మ జయలలిత సమాధి ఉంది. ఇక్కడికి ప్రతి రోజూ సందర్శకులు పెద్ద సంఖ్యలో వచ్చి అమ్మ సమాధిని సందర్శిస్తున్నారు. ఈ క్రమంలో ఈ ప్రాంతాన్ని అత్యాధునిక హంగులతో స్మారక మందిరంగా తీర్చిదిద్దాలని సీఎం నిర్ణయించారు. ఈ వ్యవహారం కోర్టుకు వెళ్లడంతోపాటు కోస్టల్ అనుమతులు అంటూ వివాదం రేగింది. దీంతో పనులకు ఆటంకాలు తప్పలేదు. రాష్ట్రంలో ఉన్నది తమ ప్రభుత్వమే కావడంతో పనుల్ని ముందుకు తీసుకెళ్లేందుకు అన్నాడీఎంకే నాయకులు సిద్ధం అయ్యారు. ఆ మేరకు 2018 మేలో పనులకు శ్రీకారం చుట్టారు. 2019 ఫిబ్రవరిలో జయలలిత తొలి జయంతి సందర్భంగా దీనిని ప్రారంభించాలని తొలుత సంకల్పించినా, ఆటంకాల రూపంలో పనుల్లో జాప్యం తప్పడం లేదు. (రాజుకుంటున్న ఎన్నికల వేడి) సెప్టెంబరు వరకు గడువు.... గత ఏడాది చివర్లో ముగించి, ఈ ఏడాది రెండో జయంతి సందర్భంగా ప్రారంభిద్దామనుకున్నా ఆటంకాలు తప్పలేదు. సమాధి పరిసరాలను సుందరంగా, అత్యాధునిక హంగులతో తీర్చిదిద్దడం, జయలలిత జీవితం, సినిమా, రాజకీయ ఘనతను చాటేలా ఫొటో, వీడియో ప్రదర్శనను ఆ స్మారక మందిరంలో ఏర్పాటు చేస్తూ నిర్మాణాలు చేపట్టారు. ఆ పరిసరాల్ని ముస్తాబు చేసి నిర్మాణాలకు మెరుగులు దిద్దాల్సి ఉంది. ఫినిక్స్ పక్షి ఆకారంతో సమాధి స్మారకం నిర్మాణంతో అస్సలు సమస్య నెలకొని ఉంది. 15 మీటర్ల ఎత్తుతో, రెండు వైపులా ఆ పక్షి రెక్కలు 21 మీటర్ల ఉండేలా నిర్మాణం సాగుతోంది. ఐఐటీ మద్రాసు, అన్నా వర్సిటీ సాంకేతిక విభాగం సహకారంతో దుబాయ్ నుంచి తీసుకొచ్చిన పరికరాలతో ఈ ఫినిక్స్ పక్షి నిర్మాణాన్ని రూపొందిస్తున్నారు. పలు కారణాల వల్ల ఆగస్టు మొదటి వారానికి దీన్ని ప్రభుత్వానికి అప్పగించలేని పరిస్థితి. సెప్టెంబరు చివరి వరకు గడువు ఇవ్వాలని అధికారులు సీఎం పళనిస్వామి దృష్టికి తీసుకెళ్లారు. అదేవిధంగా జాప్యం, కరోనా తదితర సమస్యల వల్ల నిర్మాణ పనుల వ్యయం మరో పది కోట్లకు పెరిగినట్టు సమాచారం. వీటిని పరిశీలించిన సీఎం అసంతృప్తిని వ్యక్తం చేశారు. సెప్టెంబరు చివరి నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. డిసెంబరులో జయలలిత వర్ధంతి సందర్భంగా ఈ స్మారకం ప్రారంభం లక్ష్యంగా ప్రభుత్వం ఉన్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. దీంతో ఆగమేఘాల మీద పనులు సాగించేందుకు ప్రజా పనుల శాఖ వర్గాలు ఉరకలు తీస్తున్నాయి. మరో ఎనిమిది నెలల్లో అసెంబ్లీకి ఎన్నికలు రానున్న నేపథ్యంలో అమ్మ స్మారకం అన్నాడీఎంకే వర్గాలకే కాకుండా ప్రజలందరికీ ప్రత్యేక ఆకర్షణగా నిలవాలన్న కాంక్షతో సీఎం ఉన్నట్టు అధికారులు పేర్కొంటున్నారు. అలాగే పోయెస్ గార్డెన్ వేదా నిలయంకు కొత్త మెరుగులకు తగ్గ ఆదేశాలు జారీ చేసినట్టు సమాచారం. -
మెరీనా తీరంలో బైక్ రేసింగ్.. ఇద్దరు మృతి
చెన్నై : తమిళనాడులోని చెన్నై మెరీనా తీరంలో బైక్ రేసర్ల హల్చల్ చేశారు. బీచ్ రోడ్డులో అర్ధరాత్ని దాటక పలువురు యువకులు బైక్ రేసులు నిర్వహించారు. ఈ క్రమంలో బైక్‌పై నుంచి జారిపడ్డ ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. అయితే బైక్ రేస్‌లకు అనుమతి లేకపోయినప్పటికీ.. నిబంధనలను అతిక్రమిస్తూ మెరీనా తీరంలో దొంగచాటుగా బైక్ రేసుల నిర్వహించటం పరిపాటిగా మారింది. వీటిపై స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పటికైనా అధికారులు స్పందించి బైక్ రేస్‌లు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
మెరీనాలో మూడు మృతదేహాలు
తిరువొత్తియూరు: చెన్నై మెరీనా తీరంలోని శ్రామికుల విగ్రహం వెనుక ఆదివారం ఉదయం 7.30 గంటలకు గుర్తు తెలియని సుమారు 27 సంవత్సరాలు వయసు కలిగిన యువకుని మృతదేహం ఒడ్డుకు చేరింది. తరువాత ఉదయం 11.15 గంటలకు ఎంజీఆర్ సమాధి వెనుక భాగంలో జేఎన్ఎన్ కళాశాలలో చదువుతున్న కన్నన్ మృతదేహం ఒడ్డుకు చేరింది. ఈ క్రమంలోనే మధ్యాహ్నం 2.30 సమయంలో స్నేహితుడు జయకుమార్తో స్నానం చేస్తున్న సమయంలో నీటిలో గల్లంతైన జయచంద్రన్ మృతదేహం ఒడ్డుకు చేరింది. మృతదేహాలను స్వాధీనం చేసుకున్న అన్నాసమాధి పోలీసులు పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 8 గంటల వ్యవధిలో 3 మృతదేహాలు ఒడ్డుకు చేరడం పర్యాటకులను దిగ్భ్రాంతికి గురి చేసింది. సముద్రతీరంలో గస్తీ చేస్తున్న పోలీసులు కొన్ని రోజులుగా రాకపోవడంతో ఈ సంఘటనలు జరుగుతున్నాయని పలువురు వాపోయారు. -
ముద్దు ఎంత పని చేసింది...
చెన్నై : ప్రియురాలు సవాల్ విసిరింది. అలాంటి ఇలాంటి ఛాలెంజ్ కాదు. తాను చెప్పినట్లు వస్తే ముద్దు ఇస్తానంటూ బంపర్ ఆఫర్ ఇచ్చింది. ఇంకేముంది... ప్రేయసి ముద్దు కోసం ప్రియుడు సై అన్నాడు. అమ్మడు చెప్పినట్లే సిద్ధమై అతగాడు ఆశగా ముద్దు కోసం వచ్చాడు. తీరా అయ్యగారి వ్యవహారం అనుమానాస్పదంగా కనిపించడంతో స్థానికులు పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. దీంతో ఏదో అనుకుంటే ఇంకేదో అయ్యిందే అన్నట్లు... ఆ యువకుడు పోలీసుల విచారణలో అసలు విషయం బయటపెట్టాడు. ఈ సందర్భంగా చెన్నైలోని రాయపేటలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. తమిళనాడులోని పట్టాభిరామ్ తండురై గ్రామం పల్లవీధికి చెందిన శక్తివేల్ (22) అన్నాసాలైలోని ఐటీఐలో మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఐసీఐసీఐ బ్యాంక్ ట్రస్ట్ తరఫున ఉద్యోగ శిక్షణలో ఉండగా అక్కడే ఉన్న ఓ యువతితో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. ఆమెను ప్రేమికుల రోజున ముద్దు ఇవ్వమని అడగగా అందుకు అంగీకరించలేదు. ముద్దు కావాలంటే బురఖా ధరించి రాయపేట నుంచి మెరీనా బీచ్ వరకు రావాలని పందెం కాసింది. అలా చేస్తే ముద్దు ఇస్తానని చెప్పడంతో శక్తివేల్ బురఖా వేసుకుని ప్రియురాలి ఇంటికి వచ్చిన అతడు.. ఆ తర్వాత ఆమెతో మెరీనా బీచ్‌కు వెళ్లాడు. అయితే శక్తివేలు నడకతో పాటు, కాళ్లకు మగవాళ్ల ధరించే స్లిప్పర్స్, వీటితో పాటు అయ్యగారు వ్యవహారం తేడాగా ఉండటంతో... అనుమానం వచ్చిన స్థానికులు అతడిని పట్టుకుని చితకబాది, పోలీసులకు అప్పగించారు. పోలీసులు శక్తివేల్‌ను అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు. -
కన్నీటి సంద్రమైన మెరీనా తీరం
-
‘కావేరి’ నుంచి కడలి తీరం వరకు
సాక్షి ప్రతినిధి, చెన్నై: కావేరి నది.. కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల గుండా ప్రవహిస్తూ కడలిలో సంగమిస్తోంది. అదేవిధంగా జీవితంలో తన చివరి రోజులు కావేరి ఆస్పత్రిలో గడిపిన కరుణానిధి ప్రయాణం కూడా చెన్నైలోని కడలి తీరంలో ముగిసింది. 94 ఏళ్లపాటు సుదీర్ఘ జీవన ప్రయాణం సాగించిన కరుణ ఆస్పత్రిలో గడిపిన చివరి 11 రోజులను ఒక్కసారి మననం చేసుకుంటే.. జూలై 28: మూత్రవిసర్జన ఇబ్బందులతో ఇంటిలోనే చికిత్స పొందుతున్న కరుణ తెల్లవారుజామున 1.30 గంటలకు అకస్మాత్తుగా బ్లడ్‌ప్రెషర్‌కు గురికావడంతో కుటుంబ సభ్యులు కావేరి ఆస్పత్రిలో చేర్పించారు. జూలై 29: ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆస్పత్రికి చేరుకుని కరుణను పరామర్శించారు. అయితే అదేరోజు సాయంత్రానికి కరుణ పరిస్థితి విషమించినట్లు, కన్నుమూసినట్లు వదంతులు రేగడంతో రాష్ట్రంలో పరిస్థితి అల్లకల్లోలంగా మారింది. జూలై 30: తమిళనాడు సీఎం పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీర్‌సెల్వం ఆస్పత్రికి వెళ్లి పరామర్శించి కరుణ కోలుకుంటున్నారని ప్రకటించారు. జూలై 31: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సమీపంలో నిల్చుని ఉండగా, ఆయన వచ్చిన సమాచారాన్ని స్టాలిన్ తండ్రి కరుణ చెవిలో చెబుతున్న ఫొటోలు మీడియాకు విడుదల కావడంతో పార్టీ శ్రేణులు ఆనందించాయి. ఆగస్టు 1: తమిళ సినీ నటీనటులు స్టాలిన్, కనిమొళిని కలుసుకుని కరుణ క్షేమ సమాచారాలు తెలుసుకున్నారు. ఆగస్టు 2: కేరళ సీఎం పినరాయి విజయన్, మహాత్మా గాంధీ మనుమడు గోపాలకృష్ణ గాంధీ తదితరులు ఆస్పత్రిలో కరుణను పరామర్శించారు. ఆగస్టు 3: కరుణకు జాండీస్ సోకినట్లు గుర్తించి చికిత్స ప్రారంభించారు. మాజీ ప్రధానమంత్రి హెచ్డీ దేవగౌడ కరుణను పరామర్శించారు. ఆగస్టు 4: జాండీస్ ముదరడంతో కాలేయ వ్యాధికి చికిత్స చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర మంత్రి సురేష్ ప్రభు కావేరి ఆస్పత్రికి వచ్చి కరుణ క్షేమ సమాచారాలు తెలుసుకున్నారు. ఆగస్టు 5: రాష్ట్రపతి కోవింద్ వచ్చి వెళ్లారు. అయితే ఫొటోలు విడుదల కాలేదు. ఆస్పత్రి యాజమాన్యం బులెటిన్ కూడా విడుదల చేయలేదు. ఆగస్టు 6:కరుణ శరీరంలోని అనేక అవయవాలు పనిచేయడం మానివేశాయని, 24 గంటల తర్వాత కానీ ఏ విషయం చెప్పలేమని బులెటిన్ విడుదలైంది. ఆగస్టు 7: కావేరి ఆస్పత్రి పరిసరాల్లోకి తండోపతండాలుగా జనం చేరుకోవడం ప్రారంభించారు. సాయంత్రం 4.30 గంటలకు బులెటిన్ విడుదలైంది. అదేరోజు సాయంత్రం 6.10 గంటలకు కరుణానిధి కన్నుమూయగా 6.41 గంటలకు బులెటిన్ విడుదలైంది. ఆగస్టు 8: కరుణ భౌతికకాయాన్ని సీఐటీ నగర్ ఇంటి నుంచి తెల్లవారుజామున 5 గంటల సమయంలో చెన్నై రాజాజీ హాల్లో వీవీఐపీలు, ప్రజల సందర్శనార్థం ఉంచారు. రాత్రి 7.25 గంటలకు కరుణ అంతిమ సంస్కారాలు ముగిశాయి. -
ఎట్టకేలకు మెరీనా తీరంలోనే..
సాక్షి ప్రతినిధి, చెన్నై: డీఎంకే అధ్యక్షుడు కలైంజర్ కరుణానిధి అంతిమ సంస్కారాలు, సమాధి ఎక్కడనే వివాదానికి తెరపడింది. ఈ సందర్భంగా అధికార అన్నాడీఎంకే, ప్రధాన ప్రతిపక్ష డీఎంకే మధ్య హైడ్రామా నడిచింది. ఇరుపక్షాల వాదోపవాదాల అనంతరం చెన్నై మెరీనా బీచ్‌లోని అన్నాదురై సమాధి పక్కనే స్థలం కేటాయించాలని తమిళనాడు ప్రభుత్వాన్ని మద్రాసు హైకోర్టు బుధవారం ఆదేశించింది. మెరీనా బీచ్‌లో కరుణ అంతిమ సంస్కారాలకు స్థలం కేటాయించాల్సిందిగా డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్ మంగళవారం చేసిన వినతిని తమిళనాడు ప్రభుత్వం మొదట తిరస్కరించిన విషయం తెలిసిందే. బీచ్ తీరంలో సమాధులపై మద్రాసు హైకోర్టులో కేసులు, తద్వారా చట్టపరమైన చిక్కులు ఉన్నందున చెన్నై గిండీలోని గాంధీ మండపం పక్కనే రెండెకరాల ప్రభుత్వ స్థలాన్ని కేటాయిస్తున్నట్లు సీఎం ఎడపాడి పళనిస్వామి ప్రకటించారు. అయితే ఇందుకు డీఎంకే సహా అన్ని ప్రతిపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. చివరకు డీఎంకే నిర్వాహక కార్యదర్శి ఆర్ఎస్ భారతి చేత మంగళవారం రాత్రి 9.20 గంటలకు మద్రాసు హైకోర్టు ఇన్చార్జ్ ప్రధాన న్యాయమూర్తి కే.రమేష్, న్యాయమూర్తి సుందర్ సమక్షంలో స్టాలిన్ అత్యవసర పిటిషన్ దాఖలు చేయించారు. మరోవైపు ప్రభుత్వ నిర్ణయంపై నిరసనలు వ్యక్తమయ్యాయి. అభ్యంతర పిటిషన్లు వెనక్కు..: బీచ్‌లో సమాధులపై తాను వేసిన నాలుగు పిటిషన్లను కరుణ కోసం వెనక్కు తీసుకునేందుకు సిద్ధమని సీనియర్ న్యాయవాది దురైస్వామి ప్రకటించారు. అలాగే పీఎంకే నేత వేసిన పిటిషన్ సైతం ఉపసంహరిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఈ క్రమంలో స్టాలిన్ దాఖలు చేసిన అత్యవసర పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన న్యాయమూర్తులు మంగళవారం రాత్రి 10.30 గంటలకు విచారణ ప్రారంభించారు. ఈ వివాదంపై బుధవారం తెల్లవారుజామున 1.30 గంటల వరకు విచారణ జరిపి ఉదయం 8 గంటలకు వాయిదా వేశారు. . అభ్యంతర పిటిషన్లు అన్నింటినీ ఉపసంహరించిన కారణంగా మెరీనాబీచ్‌లో కరుణ సమాధికి అనుమతిస్తూ హైకోర్టు బుధవారం ఉత్తర్వులిచ్చింది. కన్నీటి పర్యంతమైన స్టాలిన్ మెరీనాబీచ్‌లో కరుణ సమాధికి కోర్టు ఆదేశాలు జారీచేసినట్లు తెలియగానే.. రాజాజీ హాల్లో కరుణ పార్థివదేహం పక్కన నిల్చుని ఉన్న స్టాలిన్ కన్నీటి పర్యంతమయ్యారు. పక్కనే ఉన్న దురైమురుగన్, కనిమొళి తదితర నేతలు స్టాలిన్‌ను దగ్గరకు తీసుకుని ఓదార్చారు. అన్నాదురై సమాధి పక్కనే కరుణ సమాధికి అనుమతి వచ్చినట్లు పార్టీ ఉప ప్రధాన కార్యదర్శి దురైమురుగన్ మైకులో ప్రకటించడంతో కార్యకర్తలు, ప్రజలు శాంతించారు. -
నింగికేగిన ‘నిధి’
సాక్షి ప్రతినిధి, చెన్నై: ‘ఇక సెలవ్..’ అంటూ తిరిగిరాని లోకాలకు తరలిపోయిన కలైజ్ఞర్ కరుణానిధికి తుదిసారి నివాళులర్పించేందుకు హాజరైన అభిమానులతో మెరీనా తీరం కన్నీటి సంద్రమైంది. అశ్రునయనాలు, బరువెక్కిన గుండెలతో, సైనిక లాంఛనాల మధ్య తమిళనాడు రాజకీయ కురువృద్ధుడు కరుణానిధి అంతిమ సంస్కారాలు బుధవారం చెన్నైలో పూర్తయ్యాయి. సరిగ్గా సాయంత్రం 4 గంటలకు కరుణ పార్థివదేహం రాజాజీహాల్ నుంచి మెరీనాబీచ్ వైపు సాగింది. ప్రజలు పెద్దఎత్తున అనుసరించడంతో భౌతికకాయం అంతిమ సంస్కార ప్రాంతానికి 6.15 గంటలకు చేరుకుంది. దారిపొడవునా ప్రజలు కరుణను తలచుకుని విలపించారు. కరుణానిధి ఇక లేరన్న వార్తను తట్టుకోలేక తమిళనాడులో 20 మంది చనిపోగా రాజాజీహాల్ వద్ద జరిగిన తొక్కిసలాటలో మరో ముగ్గురు మృతి చెందారు. ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లు సహా 26 మంది గాయపడ్డారు. కరుణానిధి మరణవార్త విని తిరువారూరు జిల్లాకు చెందిన గోవిందరాజ్ (60) అనే వీరాభిమాని వంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మాహుతి యత్నం చేశాడు. బారులు తీరిన అభిమానులు...: సుమారు ఏడాదిన్నరకు పైగా తీవ్ర అనారోగ్యంతో ఉన్న కరుణానిధి మంగళవారం సాయంత్రం కన్నుమూయటంతో తమిళనాడు యావత్తూ తల్లడిల్లింది. కరుణ పార్థివదేహాన్ని తొలుత బుధవారం తెల్లవారుజామున 5.30 గంటలకు రాజాజీ హాల్‌కు తరలించారు. త్రివిధ దళాలకు చెందిన అధికారులు జాతీయ పతాకాన్ని ఆయన భౌతికకాయంపై కప్పారు. కలైజ్ఞర్ను తుదిసారిగా చూసేందుకు తమిళనాడు నలుమూలల నుంచే కాకుండా ఆంధ్రప్రదేశ్, కర్నాటక, కేరళ, పుదుచ్చేరి, మహారాష్ట్రల నుంచి ప్రజలు భారీగా తరలివచ్చారు. కిలోమీటర్ల పొడవునా క్యూలో నిల్చుని కరుణకు కడసారి నివాళులర్పించారు. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల నుంచి బుధవారం ఉదయం చెన్నైకి చేరుకున్న రైళ్లన్నీ డీఎంకే అభిమానులు, కార్యకర్తలతో నిండిపోయాయి. బుధవారం తమిళనాడులో రాష్ట్రవ్యాప్తంగా వాహనాల రాకపోకలు స్తంభించాయి. వ్యాపార సంస్థలు, సినిమా హాళ్లు, హోటళ్లు, మాల్స్ మూతపడ్డాయి. ఆటోలు కూడా ఆగిపోయాయి. కన్నీరు మున్నీరైన కరుణ కుటుంబం: కరుణానిధి భౌతికకాయం వద్ద కుటుంబ సభ్యులంతా విషణ్ణ వదనాలతో నిలుచున్నారు. అళగిరి, స్టాలిన్, కనిమొళి తదితరులంతా శాశ్వత నిద్రలో ఉన్న తండ్రిని చూసి కన్నీరు మున్నీరయ్యారు. కొద్ది గంటలపాటు నిబ్బరంగా ఉన్న స్టాలిన్ మధ్యాహ్నం సమయంలో దుఃఖాన్ని ఆపుకోలేక విలపించారు. కరుణను కడసారి చూసేందుకు వస్తున్న వివిధ పార్టీల నేతలను ఒకవైపు పలకరిస్తూనే కన్నీటి పర్యంతమయ్యారు. మెరీనా బీచ్‌లో కరుణ సమాధికి స్థలం కేటాయించాలని కోర్టు ఆదేశించినట్లు తెలియగానే అశ్రు నయనాలతో అందరికీ నమస్కరించారు. హాజరైన పలువురు ప్రముఖులు: ప్రధాని మోదీ ఉదయం 11 గంటలకు చెన్నై విమానాశ్రయం నుంచి నేరుగా రాజాజీహాల్‌కు చేరుకున్నారు. కరుణకు నివాళులర్పించిన అనంతరం స్టాలిన్, కనిమొళిలను ఓదార్చారు. కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, పొన్ రాధాకృష్ణన్, ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, తమిళనాడు గవర్నర్ భన్వరిలాల్ పురోహిత్, ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం, స్పీకర్ ధనపాల్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, పుదుచ్చేరి, డిల్లీ, కర్నాటక ముఖ్యమంత్రులు చంద్రబాబు, కె.చంద్రశేఖర్‌రావు, నారాయణస్వామి, కేజ్రీవాల్, కుమారస్వామి, మాజీ ప్రధాని దేవేగౌడ, లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ తంబిదురై, సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరీ, ఎన్సీపీ అధ్యక్షుడు శరద్‌పవార్, బీజేపీ తమిళనాడు శాఖ అధ్యక్షురాలు తమిళిసై సౌందరరాజన్, తమిళనాడు కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు పి.చిదంబరం, రాష్ట్ర అధ్యక్షులు తిరునావుక్కరసర్, కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ అజాద్ నివాళులర్పించిన వారిలో ఉన్నారు. బందోబస్తులో 1.20 లక్షల మంది పోలీసులు కలైజ్ఞర్ అంతిమ సంస్కారాల సమయంలో అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా రాష్ట్రవ్యాప్తంగా 1.20 లక్షల మంది పోలీసులను మోహరించారు. చెన్నై గోపాలపురంలోని కరుణ నివాసం వద్ద పారామిలటరీ దళాలతో బందోబస్తు ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో బస్సుల రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు. వ్యాపార, వాణిజ్య సంస్థలు, మాల్స్ మూతపడ్డాయి. ‘కాగితం’ ప్లాన్‌కు అనుగుణంగానే.. చెన్నై: మెరీనా బీచ్‌లో కరుణానిధి అంత్యక్రియలకు మద్రాస్ హైకోర్టు అనుమతించిన సంగతి తెలిసిందే. బుధవారం ఉదయం ఈ కేసు విచారణ సందర్భంగా డీఎంకే నేత ఆర్ఎస్ భారతి.. కరుణానిధి అంత్యక్రియలను ఎక్కడ చేయాలనుకుంటున్నారో ఓ కాగితం మీద గీసిన ప్లాన్‌ను న్యాయస్థానానికి అందించారు. డీఎంకే వ్యవస్థాపకుడు సీఎన్ అన్నాదురై, మాజీ సీఎం జయలలిత స్మారకాల మధ్య ఉన్న ఖాళీ స్థలంలో కరుణ అంత్యక్రియలు జరుపుతామని వెల్లడించారు. దీనికి ప్రభుత్వ న్యాయవాది అభ్యంతరం తెలిపారు. గాంధీ మండపం సమీపంలో కరుణ అంత్యక్రియలతో పాటు స్మారకం ఏర్పాటుకు రెండు ఎకరాల స్థలం కేటాయించామన్నారు. అయితే ద్రవిడ ఉద్యమం, దాని భావజాలానికి సంబంధం లేని వ్యక్తులకు అక్కడ అంత్యక్రియలు నిర్వహించారని డీఎంకే న్యాయవాది కోర్టుకు విన్నవించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం కాగితంలో పేర్కొన్నదానికి అనుగుణంగానే కరుణ అంత్యక్రియలు నిర్వహించాలని స్పష్టం చేసింది. ప్రభుత్వ న్యాయవాది వ్యక్తం చేసిన అభిప్రాయాలను తోసిపుచ్చింది. జననంలోనూ మరణంలోనూ ఒకే నక్షత్రం, ఒకే వారం తిరువొత్తియూరు (చెన్నై): సాధారణంగా మనిషికి వేర్వేరు వారాలు, నక్షత్రాల్లో జనన, మరణాలు సంభవిస్తుంటాయి. లక్షల మందిలో ఏ ఒక్కరికో జననం, మరణం ఒకే వారం, ఒకే నక్షత్రంలో సంభవిస్తుంది. కరుణానిధికి జననంలోనూ, మరణంలోనూ ఒకే నక్షత్రం, ఒకే వారం రావడం విశేషం. ఆయన 1924 జూన్ 3న జన్మించారు. ఆ రోజు మంగళవారం కాగా, నక్షత్రం మృగశిర. ఆయన మరణించిన వారం, నక్షత్రం అవే కావడం విశేషం. పితృ సమానులు: సోనియా రాజకీయ కురువృద్ధుడు కరుణానిధి తనకు పితృసమానులని సోనియా గాంధీ పేర్కొన్నారు. అలాంటి గొప్పవ్యక్తిని కోల్పోవడం తనకు వ్యక్తిగతంగా పూడ్చలేని లోటన్నారు. ఈయన మార్గదర్శకత్వం లేకపోతే దేశం మరింత పేదరికంలోకి కూరుకుపోయుండేదని.. డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్‌కు రాసిన లేఖలో సోనియా పేర్కొన్నారు. రాజకీయ ప్రపంచంలో కరుణ ఓ గొప్ప శిఖరమని ఆమె ప్రశంసిచారు. తమిళ ప్రజలకు, భారతీయులకు ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని ఆమె లేఖలో పేర్కొన్నారు. ‘కరుణ మృతి నాకు వ్యక్తిగతంగా పెద్ద లోటు. నాపై ఆయన చూపిన ప్రేమాభిమానాలను ఎన్నటికీ మరువలేను. నాకు ఆయన పితృసమానులు’అని సోనియా ప్రశసించారు. కరుణకు పార్లమెంటు నివాళి న్యూఢిల్లీ: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధికి పార్లమెంటు బుధవారం ఘనంగా నివాళులర్పించింది. అనంతరం ఉభయ సభలను ఆయన గౌరవార్థం వాయిదా వేశారు. సాధారణంగా సిట్టింగ్ ఎంపీ మరణిస్తేనే సంతాపం తెలిపి సభను వాయిదా వేస్తారు. కరుణానిధి ప్రస్తుత సభలో సభ్యుడు కాకపోగా, గతంలోనూ ఆయన ఎప్పుడూ ఎంపీగా పనిచేసింది లేదు. తన సుదీర్ఘ రాజకీయ జీవితాన్ని తమిళనాడు శాసనసభకే ఆయన పరిమితం చేసుకున్నారు. అయినా సంప్రదాయాన్ని పక్కనబెట్టి బుధవారం కరుణానిధికి ఉభయ సభల్లోనూ నివాళులర్పించిన అనంతరం పార్లమెంటు వాయిదా పడింది. సభ ప్రారంభానికి ముందే కరుణానిధికి గౌరవ సూచకంగా సభను వాయిదా వేసే విషయమై రాజ్యసభ అధ్యక్షుడు వెంకయ్య వివిధ పార్టీల నేతలను సంప్రదించారు. కరుణానిధి దేశ రాజకీయాల్లోనే ఉద్దండుడంటూ సభను వాయిదా వేసేందుకు నేతలందరూ అంగీకరించారు. ఈ నిర్ణయానికి ప్రభుత్వం అనుకూలంగా ఉందని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అనంత్ కుమార్ కూడా వెల్లడించారు. కరుణానిధి గొప్ప దార్శనికత ఉన్న ప్రజా నేత అని లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ కొనియాడారు. మనస్సాక్షినే నమ్ముతాను.. ‘ఎంజీఆర్ సొంత పార్టీ పెట్టుకున్న తర్వాత కూడా మా మధ్య స్నేహం కొనసాగింది. ఇద్దరం వేరు వేరు పార్టీలకు నాయకులమైనప్పటికీ స్నేహితుల్లా మసలుకున్నాం. ఎంజీఆర్ తర్వాత, ఆ పార్టీ నాయకత్వం మమ్మల్ని ద్వేషించడం మొదలెట్టింది. కామరాజ్ – నేనూ దోస్తులమే. మాజీ కాంగ్రెస్ ముఖ్యమంత్రి భక్తవత్సలంతోనూ స్నేహం చేశాను. ఆర్ వెంకటరామన్ ఇప్పటికీ నా స్నేహితుడే (2007 నాటికి). తమిళనాడులో ఏఐఏడీఎంకే అని పిలవబడే పార్టీని మినహాయిస్తే, మిగిలిన వారితో మాకు మంచి స్నేహమే వుంది’ అని 2007లో ఓ వార్తా ్తసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కరుణ చెప్పారు. ‘నా మనస్సాక్షినే నేను నమ్ముతాను. నా దైవం అదొక్కటే’ అంటారు కరుణ. కరుణతో వాజ్‌పేయ్ బాగుండేవారు. ‘మా బంధం గట్టిగా ఉండడానికి మురసోలి మారన్ ఒకానొక కారణం’ అని కరుణ ఒక సందర్భంలో చెప్పారు. (వాజ్‌పేయ్ ప్రభుత్వంలో మారన్ కేబినెట్ మంత్రి పనిచేశారు. ఇప్పుడు లేరు)) ఈ నేతలిద్దరూ ఎమర్జెన్సీ కాలంలో ఒకే వేదికపై ప్రసంగాలు చేశారు. రాముడు నాకు శత్రువు కాదు.. వాల్మీకి రామాయణాన్నీ, తులసీ రామాయణాన్నీ చదివాను. పలు రామాయణాల్లో మాదిరిగానే తులసీ రామాయణంలో సీత రాముడి చెల్లెలు. వాల్మీకి రామాయణంలో మాత్రం ఆమె రాముడికి భార్య. ఆర్యులు – ద్రవిడుల మధ్య జరిగిన యుద్ధం ఆధారంగా రామాయణాన్ని రచించారు. రాముడు ఓ కల్పిత పాత్ర. జవహర్లాల్ నెహ్రూ కూడా రాముణ్ణి నాయకుడిగానే చూశారు. దేవుడిగా కాదు. సి. రాజగోపాలచారి రచించిన ‘చక్రవర్తి తిరుమగల్’ పుస్తకం ప్రకారం – రాముడు యువరాజు. దేవుడు కాదు. రాముడికి నేను శత్రువును కాను. ముస్లింలు / క్రైస్తవులు పండుగల వేళ ఆహ్వానిస్తే వెళతాం. అలాగే హిందువులూ ఆహ్వానిస్తే ఎందుకెళ్లం? అందులో తప్పేం లేదు కదా!.. – 2007లో కరుణానిధి ఇచ్చిన ఇంటర్వ్యూల నుంచి.. -
ముగిసిన కరుణానిధి అంతిమ సంస్కారాలు
-
మెరీనాబీచ్‌లో కరుణానిధి అంత్యక్రియలు
-
నాన్నా.. ఒక్కసారి పిలవొచ్చా : స్టాలిన్ భావోద్వేగం
చెన్నై : డీఎంకే అధినేత, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి మృతిపట్ల ఆయన కుమారుడు, పార్టీ నాయకుడు ఎంకే స్టాలిన్ విషాదాన్ని వ్యక్తం చేస్తు భావోద్వేమైన లేఖను రాశారు. చివరిసారిగా ఒక్క సారి నాన్నా(అప్పా).. అని పిలవనా అంటూ బుధవారం ఉద్వేగపూరితమైన లేఖ రాశారు. ఆ లేఖలో ఏం ఉందంటే.. ‘ అప్పా(నాన్న) ..అప్పా అని పిలిచేబదులు మిమ్మల్ని మా నాయకుడు(తలైవార్) అనే ఎక్కువ సార్లు పిలిచేవాడిని. చివరి సారిగా ఒక్క సారి నాన్నా అని పిలువనా లీడర్. ఎక్కడి వెళ్లాల్సివచ్చినా మాకు ముందే సమాచారం ఇచ్చేవారు. ఇప్పుడు ఎందుకు చెప్పకుండా వెళ్లిపోయావు. 33 ఏళ్ల క్రితం సమాధి గురించి మీరు చెప్పిన వాఖ్యలు నాకు బాగా గుర్తుకు ఉన్నాయి. ఎవరైతే విశ్రాంతి లేకుండా పని చేస్తారో వారు ఇక్కడ(సమాధి) విశ్రాంతి పొందుతారు’ అని చెప్పారు. మీరు తమిళ ప్రజల కోసం విశ్రాంతి లేకుండా కృషి చేసి సంతృప్తితో అక్కడికి(సమాధి) సేద తీరడానికి వెళ్లారని ఆశిస్తున్నా’ అని లేఖలో పేర్కొన్నారు. సాయంత్రం 4 గంటలకు రాజాజీ హాల్ నుంచి కరుణానిధి అంతిమయాత్ర ప్రారంభమైంది. వాలాజా రోడ్, చెపాక్ స్టేడియం మీదుగా గంటన్నరపాటు అంతిమయాత్ర సాగనుంది. అనంతరం సాయంత్రం 6 గంటలకు మెరీనా బీచ్‌లోని అన్నా స్క్వేర్ ప్రాగంణంలో ప్రభుత్వ లాంఛనాలతో కరుణానిధి అంత్యక్రియలు జరగనున్నాయి. ஒரே ஒருமுறை இப்போதாவது ‘அப்பா’ என அழைத்து கொள்ளட்டுமா ‘தலைவரே’! pic.twitter.com/HWyMPkSmLj — M.K.Stalin (@mkstalin) 7 August 2018 -
కరుణానిధి అంత్యక్రియలు పూర్తి
సాక్షి, చెన్నై : తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎం కరుణానిధి అంతిమ సంస్కారాలు పూర్తయ్యాయి. మెరీనా బీచ్‌లోని అన్నా స్క్వేర్ ప్రాంగణంలో ప్రభుత్వ లాంఛనాలతో కరుణ అంత్యక్రియలు ముగిశాయి. కుటుంబ సభ్యులు, లక్షలాది మంది అభిమానులు ఆశ్రునయనాలతో ఆయనకు తుది వీడ్కోలు పలికారు. సాయంత్రం 6.15 గంటలకు మెరీనా బీచ్‌కు చేరుకున్న ఆయన భౌతికకాయానికి తొలుత పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. ఆ తర్వాత త్రివిధ దళాలు ఆయన భౌతికకాయానికి గౌరవ వందనం సమర్పించాయి. కరుణానిధి పార్థీవదేహంపై కప్పి ఉంచిన జెండాను స్టాలిన్‌కు అందజేశారు. అనంతరం డీఎంకే జెండాను కప్పారు. ఆ తర్వాత కుటుంబ సభ్యులు ఒకరి తర్వాత ఒకరు కడసారి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు కన్నీటి పర్యాంతమయ్యారు. ఆ తర్వాత త్రివిధ దళాలు కరుణ పార్థీవదేహాన్ని ప్రత్యేకంగా తయారు చేసిన పేటికలో ఉంచి ఖననం చేశారు. ఆ సమయంలో భద్రత బలగాలు గౌరవసూచకంగా గాల్లోకి కాల్పులు జరిపారు. ఈ అంత్యక్రియలకు మాజీ ప్రధాని దేవేగౌడ, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, కేంద్ర మంత్రి పొన్ రాధకృష్ణన్, ఏపీ సీఎం చంద్రబాబు, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ డెరిక్ ఓబ్రీన్, తమిళనాడు మంత్రి డి జయకుమార్, గులాంనబీ అజాద్, శరద్ పవార్, వీరప్ప మొయిలీతోపాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. మెరీనా బీచ్ ఇసుకేస్తే రాలనంత జనంతో నిండిపోయింది. రాజాజీ హాల్ నుంచి సాయంత్రం 4 గంటలకు ప్రారంభమైన అంతిమయాత్ర వాలాజా రోడ్, చెపాక్ స్టేడియం మీదుగా దాదాపు రెండు గంటలకు పైగా కొనసాగింది. దారి పొడువునా అభిమానులు, కార్యకర్తలు, నాయకులు కరుణానిధికి కన్నీటి నివాళులర్పించారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
కరుణానిధి శవపేటిక మీద ఏం రాశారంటే..
చెన్నై : ‘విరామమన్నది ఎరుగక, నిరంతరం కృషి చేసిన వ్యక్తి ఇక్కడ విశ్రమిస్తున్నాడు’.. ఈ మాటలు కరుణానిధికి వర్తించినంత బాగా ఇంక ఎవరికి వర్తించవేమో. అందుకే శాశ్వత నిద్రలోకి జారుకుని విశ్రమిస్తోన్న ‘కలైజ్ఞర్’ శవపేటిక మీద ఈ మాటలనే చెక్కించారు. ఒకానొక సందర్భంలో కరుణానిధి తన కుమారుడు స్టాలిన్‌తో ‘మన సమాధి చూసిన జనాలు విశ్రాంతి అన్నది ఎరగకుండా పనిచేసిన వ్యక్తి ప్రస్తుతం ఇక్కడ సేద తీరుతున్నారని’ అనుకోవాలని చెప్పారట. ఈ మాటలు కరుణానిధికి సరిగ్గా సరిపోతాయి. అందుకే ఆయన శవ పేటికి మీద కొడుకు స్టాలిన్‌తో చెప్పిన మాటలనే తమిళంలో చెక్కించారు. సాయంత్రం 4 గంటలకు రాజాజీ హాల్ నుంచి కరుణానిధి అంతిమయాత్ర ప్రారంభమైంది. వాలాజా రోడ్, చెపాక్ స్టేడియం మీదుగా గంటన్నరపాటు అంతిమయాత్ర సాగనుంది. అనంతరం సాయంత్రం 6 గంటలకు మెరీనా బీచ్‌లోని అన్నా స్క్వేర్ ప్రాగంణంలో ప్రభుత్వ లాంఛనాలతో కరుణానిధి అంత్యక్రియలు జరగనున్నాయి. -
జనసంద్రంగా మారిన రాజాజీహాల్
-
కరుణ అంత్యక్రియలకు తొలగిన అడ్డంకి
-
హైకోర్టు తీర్పు : కన్నీటి పర్యంతమైన స్టాలిన్
చెన్నై : డీఎంకే అధినేత, మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి అంత్యక్రియలకు అడ్డంకులు తొలగిపోయాయి. చెన్నై మెరీనా బీచ్‌లో ఆయన ఖననానికి మద్రాస్ హైకోర్టు అనుమతి ఇచ్చింది. మెరీనా-అన్నా స్క్వేర్ వద్దనే కరుణానిధి అంత్యక్రియలు నిర్వహించేందుకు మద్రాస్ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సాయంత్రం కరుణానిధి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. హైకోర్టు వెలువడిన అనంతరం కరుణానిధి కుటుంబసభ్యులు భావోద్వేగానికి లోనై కన్నీటి పర్యంతమయ్యారు. కోర్టు కేసులు, నిబంధనలు సాకుగా చూపి మెరీనా బీచ్‌లో స్థల కేటాయింపులకు తమిళనాడు ప్రభుత్వం నిరాకరించిన విషయం తెలిసిందే. దీనిపై డీఎంకే నేతలు మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కరుణానిధి అంత్యక్రియలు మెరీనా బీచ్‌లో జరిపేలా అనుమతి ఇవ్వాలని కోరారు. మెరీనాలో కరుణానిధి అంత్యక్రియలకు స్థల కేటాయింపుపై హైకోర్టులో వాడివేడి వాదనలు జరిగాయి. గతంలో జానకీ రామచంద్రన్ అంత్యక్రియల విషయంలో డీఎంకే అనుమతి ఇవ్వలేదని ప్రభుత్వం వాదించింది. ప్రోటోకాల్ విషయంలో సిట్టింగ్, మాజీ సీఎంలు ఒకటి కాదని ప్రభుత్వం పేర్కొంది. ప్రభుత్వ వాదనను డీఎంకే న్యాయవాది తప్పుపట్టారు. ద్రవిడ నేతల సమాధుల పక్కనే కరుణానిధి అంత్యక్రియలు జరుపాలని డీఎంకే న్యాయవాది కోరారు. లేదంటే ప్రజల సెంటిమెంట్ దెబ్బతింటుందని డీఎంకే న్యాయవాది తెలిపారు. అయితే సెంటిమెంట్ల ఆధారంగా నిర్ణయం తీసుకోలేమని ప్రభుత్వ న్యాయవాది పేర్కొన్నారు. రాత్రికి రాత్రే మేనేజ్ చేసి, మెరీనా బీచ్‌లో పలువురి స్మారకాలపై అంతకముందు దాఖలు అయిన పిటిషన్లను డీఎంకే ఉపసంహరించేలా చేసిందని ప్రభుత్వ న్యాయవాది వాదించారు. మేనేజ్ చేశారనే వాదనపై డీఎంకే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఓ వైపు ప్రభుత్వం, మరోవైపు డీఎంకే వాదనలు విన్న హైకోర్టు జస్టిస్ సుందర్, కరుణానిధి అంత్యక్రియలు వారం పాటు వాయిదా వేద్దామా..?అంటూ సీరియస్‌గా వ్యాఖ్యానించారు. కరుణానిధి అంత్యక్రియలు మెరీనా బీచ్‌లో జరిగేలా తీర్పునిచ్చారు. హైకోర్టు తీర్పుపై డీఎంకే నేతలు హర్షం వ్యక్తం చేశారు. మద్రాస్ హైకోర్టు తీర్పు విన్న అనంతరం కరుణానిధి కుమారుడు ఎంకే స్టాలిన్ ఒక్కసారిగా కన్నీటి పర్యంతమయ్యారు. కాగ, గత కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న కరుణానిధి, మంగళవారం సాయంత్రం 6.10 గంటలకు కన్నుమూశారు. కరుణానిధి మృతితో తమిళనాడు శోకసంద్రంలో మునిగిపోయింది. ప్రస్తుతం కరుణానిధి పార్థీవదేహాన్ని ప్రజలు, ప్రముఖుల సందర్శనార్థం రాజాజి హాల్లో ఉంచారు. -
మెరీనాలో కరుణ అంత్యక్రియలకు నో
సాక్షి, చెన్నై : డీఎంకే అధినేత కరుణానిధి అంత్యక్రియలపై సందిగ్దం నెలకొంది. మెరీనా బీచ్‌లోని అన్నాదురై సమాది వెనుక భాగంలో కరుణానిధి అంత్యక్రియలు చేపట్టాలని కుటుంబ సభ్యులు భావించారు. కాగా, తమిళనాడు ప్రభుత్వం మెరీనా బీచ్‌లో కరుణానిధి అంత్యక్రియలు చేపట్టడానికి అనుమతి నిరాకరించింది. గాంధీ మండపం రోడ్డులో అంత్యక్రియలకు ప్రభుత్వం అనుమతించింది. అక్కడ రెండు ఎకరాల స్థలాన్ని కేటాయిస్తున్నట్టు తెలిపింది. దీనిపై డీఎంకే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. కరుణానిధి అంత్యక్రియలను ఎట్టి పరిస్థితుల్లోనూ మెరీనా బీచ్‌లోనే చేపడతామని డీఎంకే ప్రకటించింది. ఇందుకోసం కోర్టును ఆశ్రయించనున్నట్టు తెలిపింది. మెరీనాలో అనుమతి దొరికే వరకు కరుణ మృతదేహాన్ని ఆస్పత్రిలోనే ఉంచాలని డీఎంకే నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. క్రమశిక్షణ కలిగిన డీఎంకే కార్యకర్తలు సంయమనంతో మహానేతకు నివాళులు అర్పించాలని డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్ విజ్ఞప్తి చేశారు. -
దీపావళికి పండగకు ఇంటికొచ్చేస్తానమ్మా..
నాయుడుపేటటౌన్: దీపావళి సెలవులకు ఇంటికి వచ్చేస్తున్నానమ్మా అని చెప్పిన కుమారుడు నిర్జీవంగా అతని మృతదేహాన్ని ఇంటికి తీసుకురావడంతో ఆ తల్లి పడిన వేదన అంతా ఇంతా కాదు. చెన్నై మెరీనా బీచ్‌లో విహారానికి వెళ్లి మృత్యువాత పడ్డ బీటెక్ విద్యార్థి గిండి శ్రావణ్‌కుమార్(18) మృతదేహాన్ని సోమవారం మధ్యాహ్నం నాయుడుపేటలోని నివా సానికి తీసుకువచ్చారు. దీంతో ఇంటి వద్ద కుటుంబసభ్యులతోపాటు బంధువులు, స్నేహితుల రోదనలు మిన్నంటాయి. తమ్ముడు మృతిచెందినట్లు తెలుసుకున్న అమెరికాలో ఎంబీబీఎస్ చదువుతున్న గిండి సాయికుమార్ హుటాహుటాన బయలుదేరి నాయుడుపేటకు సోమవారం రాత్రి చేరుకుంటున్నట్లు అతని స్నేహితులు తెలిపారు. కళాశాల నిర్వాహకుల తీరుపై కుటుంబ సభ్యుల ఆవేదన చెన్నైలోని జయ ఇంజినీరింగ్ కళాశాలలో మొదటి సంవత్సరం బీటెక్ చదువుతున్న శ్రావణ్‌కుమార్ ఆదివారం కళాశాలలోని హాస్టల్ నుంచి దీపావళి టపాసులు కొనుగోలు చేసేందుకు వెళుతున్నామని చెప్పి ఐదు మంది విద్యార్థులతో కలిసి బయటకు వచ్చాడు. అనంతరం బీచ్‌లో సరదాగా గడిపేందుకు వెళ్లారు. అక్కడ పెద్ద ఎత్తున వచ్చిన అలల తాకిడికి శ్రావణ్‌కుమార్ ఊపిరాడక మృతిచెందాడు. శ్రావణ్‌కుమార్ మృతిపై కనీసం కుటుంబసభ్యులకు కళాశాల యాజమాన్యం ప్రతినిధులు సమాచారం ఇవ్వకపోవడంపై కుటుంబసభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రావణ్‌కుమార్ స్నేహితుడు సమాచారం ఇవ్వడంతోనే తెలుసుకోగలిగామని వాపోయారు. -
సిటీవాసులను కాపాడిన తమిళ పోలీసులు
సాక్షి, చెన్నై : చెన్నైలోని మెరీనా బీచ్‌లో స్నానానికి దిగిన అన్నదమ్ములను రాక్షస అల నీటిలోకి లాక్కెళ్లింది. హైదరాబాద్‌కు చెందిన రమణ (35), నరేంద్ర (28)లు చెన్నై మదురవాయల్ కృష్ణానగర్‌లోని తమ బంధువుల ఇంటికి ఇటీవల వచ్చారు. వీరిద్దరూ సోమవారం సాయంత్రం మెరీనా బీచ్‌కు వెళ్లారు. అక్కడ స్నానానికి దిగిన వీరిని రాక్షస అల నీటిలోకి లాక్కెళ్లడంతో స్థానికులు కేకలు వేశారు. అక్కడ గస్తీలో ఉన్న పోలీసులు రమణ, నరేంద్రలను రక్షించి ఒడ్డుకు చేర్చి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అన్నదమ్ములిద్దరినీ రక్షించిన పోలీసులను స్థానికులు అభినందించారు. -
అమ్మకోసం మెరినా బీచ్ దగ్గర ..
చెన్నై: అమ్మకోసం కన్నీటి సంద్రమైన తమిళనాడులో మరో అరుదైన ఘట్టం నమోదైంది. జయలలితకు అంత్యక్రియలు నిర్వహించిన మెరీనా బీచ్ వేలాదిమందితో మరోసారి పోటెత్తింది. దీంతో ఎంజీఆర్, జయలలితను సమాధుల ప్రదేశం పుణ్యక్షేత్రాన్ని తలపిస్తోంది. వేలాదిగా తరలి వచ్చిన మహిళలు, పురుషులు అమ్మకు నివాళిగా తలనీలాలు సమర్పిస్తూ ప్రియమైన అమ్మపై తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. జయలలిత ఆఖరి విశ్రాంత స్థలంవద్ద అన్నా డీఎంకే కార్యాకర్తలు, ఇతర అభిమానులు గౌరవం సూచకంగా తలనీలాలు సమర్పిస్తూ నివాళులర్పిస్తున్నారు. అసంఖ్యాకంగా హాజరైన ఆమె అభిమానులు సమాధిని దర్శించుకొని కన్నీరు మున్నీరవుతున్నారు. దీంతో అన్నాసలై జనసంద్రమైంది. దీంతో పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసి నియంత్రణ చర్యల్ని చేపట్టారు. -
కదం తొక్కిన ఆటోవాలా!
నగరంలో ఆటోలకు మీటర్లు ఏర్పాటు తప్పనిసరి చేయడంతో ఆటో వాలాలు కదం తొక్కారు. సోమవారం ఆరు చోట్ల ఆందోళనకు దిగి రోడ్డుపై బైఠారుుంచారు. ట్రాఫిక్‌కు ఆటంకం కలిగించడంతో పోలీసులు కన్నెర్ర చేశారు. ఆందోళనకారుల్ని చెదరగొట్టేందుకు లాఠీలకు పని పెట్టారు. దీంతో పలు చోట్ల ఉద్రిక్తత చోటు చేసుకుంది. సాక్షి, చెన్నై: నగరంలో ఆటోలకు మీటర్లు తప్పని సరి. ప్రభుత్వం నిర్ణయించిన చార్జీలే వసూలు చేయాల్సిందే. అయితే, మెజారిటీ శాతం ఆటోవాలాలు మాత్రం కుంటిసాకులతో మీటర్లు వేయడం లేదు. యథాప్రకారం పలు చోట్ల ప్రయాణికుల నుంచి అధిక చార్జీల దోపిడీకి దిగుతున్నారు. ఈ వ్యవహారం ఫిర్యాదుల రూపంలో ప్రభుత్వానికి చేరింది. ఆటో చార్జీల అమలుపై కొరడా ఝుళిపించాలని సీఎం జయలలిత ఆదేశాలు జారీ చేశారు. దీంతో వచ్చిన ఫిర్యాదుల మేరకు మూడు వేల ఆటోల్ని నగర ట్రాఫిక్, రవాణా శాఖ అధికారులు సీజ్ చేశారు. అన్ని ట్రాఫిక్ సిగ్నల్స్‌లో ప్రత్యేక ఫిర్యాదుల నెంబర్లను బోర్డుల రూపంలో ఉంచారు. ఏ ఆటో డ్రైవర్ అయినా సరే మీటర్ వేయకుంటే, ఎస్ఎంఎస్ల రూపంలో గానీ, ఫోన్ల రూపంలో గానీ ఫిర్యాదు చేస్తే చాలు సంబంధిత ఆటోల్ని ప్రత్యేక బృందాలు చుట్టుముట్టి సీజ్ చేస్తూ వస్తున్నాయి. దీంతో ఆటో వాలాలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. అదే సమయంలో తాము మీటర్లు వేస్తున్నా, ఫిర్యాదులు వెళ్లకపోయినా, పోలీసులు పని గట్టుకుని తమ మీద కేసులు వేస్తున్నారని, ఆటోల్ని సీజ్ చేస్తున్నారంటూ మరి కొందరు ఆటో డ్రైవర్లు ఆరోపిస్తున్నారు. ఆరుచోట్ల ఆందోళన: రెండు రోజుల క్రితం కమిషనరేట్ ఆవరణలో ఆందోళనకు దిగిన ఆటో డ్రైవర్లు, సోమవారం కదం తొక్కారు. నగరంలో ఆరు చోట్ల ఉదయాన్నే ఆందోళనకు దిగారు. చేపాక్కం అతిథి గృహాల వద్ద భారీ ఎత్తున నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఎస్ఎంఎస్ ఫిర్యాదుల విధానాన్ని వీడాలని, తమ మీద పనిగట్టుకుని వేస్తున్న కేసుల్ని ఎత్తి వేయాలని, ఆటోలను విడుదల చేయాలని నినదించారు. తమ డిమాండ్లను పరిష్కరించని పక్షంలో నగరాన్ని స్తంభింప చేస్తామని హెచ్చరించారు. ఇక్కడ నిరసన తెలియజేసిన బృందం రవాణా కమిషనర్ ప్రభాకర్ రావును కలుసుకుని వినతి పత్రం సమర్పించింది. మెరీనా తీరంలోని శ్రామిక విగ్రహం వద్ద మరో బృందం రోడ్డు పక్కనే ఆటోలను నిలిపి వేసి ఆందోళనకు దిగింది. పెద్ద ఎత్తున ఆటోలు బారులు తీరడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఆందోళనకారులను బుజ్జగించేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నించారు. అయితే, వారు భీష్మించుకుని కూర్చోవడంతో లాఠీలకు పని పెట్టారు. కనిపించిన వారందర్నీ చితకబాదారు. అందరినీ తరిమి కొట్టడంతో ఆ పరిసరాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసు లాఠీ దెబ్బలకు ముగ్గురు ఆటో డ్రైవర్లు గాయపడ్డారు. గిండి, సైదా పేటల్లోను ఆందోళన కారుల్ని చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీలకు పనిపెట్టారు. టీ నగర్ దురై స్వామి రోడ్డులో ఆటోవాలాల ఆందోళనతో ట్రాఫిక్‌కు తీవ్ర ఆటంకం ఏర్పడింది. పోలీసులు లాఠీలకు పని పెట్టేందుకు సిద్ధం కావడంతో ఆటో వాలాలు ఆందోళన విరమించారు. తిరువాన్నీయూర్ పరిసరాల్లోనూ ఆందోళనలు చోటు చేసుకున్నాయి. పోలీసుల తీరును నిరసిస్తూ నినాదాలతో కూడిన చిన్న సైజు స్టిక్కర్లు నగరంలోని ఆటోలపై కన్పించడం గమనార్హం. ఇందులో తమను వేధించడం మానుకోకుంటే, తీవ్ర పరిణామాలు చవి చూడాల్సి ఉంటుందని, తమ సత్తా ఏమిటో ఆందోళనల రూపంలో చూపించాల్సి ఉంటుందని హెచ్చరికలు జారీ చేశారు.