
నాయుడుపేటటౌన్: దీపావళి సెలవులకు ఇంటికి వచ్చేస్తున్నానమ్మా అని చెప్పిన కుమారుడు నిర్జీవంగా అతని మృతదేహాన్ని ఇంటికి తీసుకురావడంతో ఆ తల్లి పడిన వేదన అంతా ఇంతా కాదు. చెన్నై మెరీనా బీచ్‌లో విహారానికి వెళ్లి మృత్యువాత పడ్డ బీటెక్ విద్యార్థి గిండి శ్రావణ్‌కుమార్(18) మృతదేహాన్ని సోమవారం మధ్యాహ్నం నాయుడుపేటలోని నివా సానికి తీసుకువచ్చారు. దీంతో ఇంటి వద్ద కుటుంబసభ్యులతోపాటు బంధువులు, స్నేహితుల రోదనలు మిన్నంటాయి. తమ్ముడు మృతిచెందినట్లు తెలుసుకున్న అమెరికాలో ఎంబీబీఎస్ చదువుతున్న గిండి సాయికుమార్ హుటాహుటాన బయలుదేరి నాయుడుపేటకు సోమవారం రాత్రి చేరుకుంటున్నట్లు అతని స్నేహితులు తెలిపారు.
కళాశాల నిర్వాహకుల తీరుపై కుటుంబ సభ్యుల ఆవేదన
చెన్నైలోని జయ ఇంజినీరింగ్ కళాశాలలో మొదటి సంవత్సరం బీటెక్ చదువుతున్న శ్రావణ్‌కుమార్ ఆదివారం కళాశాలలోని హాస్టల్ నుంచి దీపావళి టపాసులు కొనుగోలు చేసేందుకు వెళుతున్నామని చెప్పి ఐదు మంది విద్యార్థులతో కలిసి బయటకు వచ్చాడు. అనంతరం బీచ్‌లో సరదాగా గడిపేందుకు వెళ్లారు. అక్కడ పెద్ద ఎత్తున వచ్చిన అలల తాకిడికి శ్రావణ్‌కుమార్ ఊపిరాడక మృతిచెందాడు. శ్రావణ్‌కుమార్ మృతిపై కనీసం కుటుంబసభ్యులకు కళాశాల యాజమాన్యం ప్రతినిధులు సమాచారం ఇవ్వకపోవడంపై కుటుంబసభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రావణ్‌కుమార్ స్నేహితుడు సమాచారం ఇవ్వడంతోనే తెలుసుకోగలిగామని వాపోయారు.
Comments
Please login to add a commentAdd a comment