కదం తొక్కిన ఆటోవాలా!
నగరంలో ఆటోలకు మీటర్లు ఏర్పాటు తప్పనిసరి చేయడంతో ఆటో వాలాలు కదం తొక్కారు. సోమవారం ఆరు చోట్ల ఆందోళనకు దిగి రోడ్డుపై బైఠారుుంచారు. ట్రాఫిక్‌కు ఆటంకం కలిగించడంతో పోలీసులు కన్నెర్ర చేశారు. ఆందోళనకారుల్ని చెదరగొట్టేందుకు లాఠీలకు పని పెట్టారు. దీంతో పలు చోట్ల ఉద్రిక్తత చోటు చేసుకుంది.
సాక్షి, చెన్నై:
నగరంలో ఆటోలకు మీటర్లు తప్పని సరి. ప్రభుత్వం నిర్ణయించిన చార్జీలే వసూలు చేయాల్సిందే. అయితే, మెజారిటీ శాతం ఆటోవాలాలు మాత్రం కుంటిసాకులతో మీటర్లు వేయడం లేదు. యథాప్రకారం పలు చోట్ల ప్రయాణికుల నుంచి అధిక చార్జీల దోపిడీకి దిగుతున్నారు. ఈ వ్యవహారం ఫిర్యాదుల రూపంలో ప్రభుత్వానికి చేరింది. ఆటో చార్జీల అమలుపై కొరడా ఝుళిపించాలని సీఎం జయలలిత ఆదేశాలు జారీ చేశారు. దీంతో వచ్చిన ఫిర్యాదుల మేరకు మూడు వేల ఆటోల్ని నగర ట్రాఫిక్, రవాణా శాఖ అధికారులు సీజ్ చేశారు. అన్ని ట్రాఫిక్ సిగ్నల్స్‌లో ప్రత్యేక ఫిర్యాదుల నెంబర్లను బోర్డుల రూపంలో ఉంచారు. ఏ ఆటో డ్రైవర్ అయినా సరే మీటర్ వేయకుంటే, ఎస్‌ఎంఎస్‌ల రూపంలో గానీ, ఫోన్ల రూపంలో గానీ ఫిర్యాదు చేస్తే చాలు సంబంధిత ఆటోల్ని ప్రత్యేక బృందాలు చుట్టుముట్టి సీజ్ చేస్తూ వస్తున్నాయి. దీంతో ఆటో వాలాలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. అదే సమయంలో తాము మీటర్లు వేస్తున్నా, ఫిర్యాదులు వెళ్లకపోయినా, పోలీసులు పని గట్టుకుని తమ మీద కేసులు వేస్తున్నారని, ఆటోల్ని సీజ్ చేస్తున్నారంటూ మరి కొందరు ఆటో డ్రైవర్లు ఆరోపిస్తున్నారు.
ఆరుచోట్ల ఆందోళన: రెండు రోజుల క్రితం కమిషనరేట్ ఆవరణలో ఆందోళనకు దిగిన ఆటో డ్రైవర్లు, సోమవారం కదం తొక్కారు. నగరంలో ఆరు చోట్ల ఉదయాన్నే ఆందోళనకు దిగారు. చేపాక్కం అతిథి గృహాల వద్ద భారీ ఎత్తున నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఎస్‌ఎంఎస్ ఫిర్యాదుల విధానాన్ని వీడాలని, తమ మీద పనిగట్టుకుని వేస్తున్న కేసుల్ని ఎత్తి వేయాలని, ఆటోలను విడుదల చేయాలని నినదించారు. తమ డిమాండ్లను పరిష్కరించని పక్షంలో నగరాన్ని స్తంభింప చేస్తామని హెచ్చరించారు. ఇక్కడ నిరసన తెలియజేసిన బృందం రవాణా కమిషనర్ ప్రభాకర్ రావును కలుసుకుని వినతి పత్రం సమర్పించింది.
మెరీనా తీరంలోని శ్రామిక విగ్రహం వద్ద మరో బృందం రోడ్డు పక్కనే ఆటోలను నిలిపి వేసి ఆందోళనకు దిగింది. పెద్ద ఎత్తున ఆటోలు బారులు తీరడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఆందోళనకారులను బుజ్జగించేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నించారు. అయితే, వారు భీష్మించుకుని కూర్చోవడంతో లాఠీలకు పని పెట్టారు. కనిపించిన వారందర్నీ చితకబాదారు. అందరినీ తరిమి కొట్టడంతో ఆ పరిసరాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసు లాఠీ దెబ్బలకు ముగ్గురు ఆటో డ్రైవర్లు గాయపడ్డారు. గిండి, సైదా పేటల్లోను ఆందోళన కారుల్ని చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీలకు పనిపెట్టారు. టీ నగర్ దురై స్వామి రోడ్డులో ఆటోవాలాల ఆందోళనతో ట్రాఫిక్‌కు తీవ్ర ఆటంకం ఏర్పడింది. పోలీసులు లాఠీలకు పని పెట్టేందుకు సిద్ధం కావడంతో ఆటో వాలాలు ఆందోళన విరమించారు. తిరువాన్నీయూర్ పరిసరాల్లోనూ ఆందోళనలు చోటు చేసుకున్నాయి. పోలీసుల తీరును నిరసిస్తూ నినాదాలతో కూడిన చిన్న సైజు స్టిక్కర్లు నగరంలోని ఆటోలపై కన్పించడం గమనార్హం. ఇందులో తమను వేధించడం మానుకోకుంటే, తీవ్ర పరిణామాలు చవి చూడాల్సి ఉంటుందని, తమ సత్తా ఏమిటో ఆందోళనల రూపంలో చూపించాల్సి ఉంటుందని హెచ్చరికలు జారీ చేశారు.