kaveri hospital
-
టీటీడీ ఈవో ధర్మారెడ్డికి పుత్రశోకం.. గవర్నర్, సీఎం సంతాపం
సాక్షి, చెన్నై/జూపాడుబంగ్లా/సాక్షి, అమరావతి: తిరుమల తిరుపతి దేవస్థానాల (టీటీడీ) ఈవో ఎ.వి.ధర్మారెడ్డికి పుత్రశోకం కలిగింది. ఆయన కుమారుడు చంద్రమౌళిరెడ్డి అలియాస్ శివ (28) చెన్నై కావేరి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం ఉదయం 8.20 గంటలకు కన్నుమూశారు. ధర్మారెడ్డి కుటుంబంలో తీవ్రవిషాదం నెలకొంది. చెన్నైలో బీటెక్ పూర్తిచేసి ముంబైలో ఫైనాన్స్ కన్సల్టెంటుగా ఉద్యోగం చేస్తున్న చంద్రమౌళి ఈనెల 18వ తేదీన చెన్నైలో తన స్నేహితుడితో కలిసి కారులో వెళ్తున్న సమయంలో గుండెపోటుకు గురయ్యారు. దీంతో ఆయన్ని ఆళ్వార్‌పేటలోని కావేరి ఆస్పత్రికి తరలించారు. కార్డియాక్ అరెస్ట్‌తో ఆస్పత్రిలో చేరిన చంద్రమౌళికి ఎక్మో చికిత్స అందిస్తున్నామని, నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని ఆస్పత్రి వర్గాలు సోమవారం బులెటిన్ ద్వారా తెలిపాయి. ఈ సమాచారంతో పెద్దసంఖ్యలో ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రముఖులు, చెన్నైలోని తెలుగు ప్రముఖులు, అధికారులు, సన్నిహితులు కావేరి ఆస్పత్రికి చేరుకుని ధర్మారెడ్డి కుటుంబాన్ని పరామర్శించారు. మూడురోజుల పాటు చంద్రమౌళికి వైద్యులు అత్యవసర వైద్యచికిత్స చేశారు. ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత విషమించి బుధవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఇందుకు సంబంధించిన బులెటిన్‌ను ఆస్పత్రివర్గాలు 11 గంటల సమయంలో విడుదల చేశాయి. అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి పళనిస్వామి, మాజీ మంత్రులు, పలువురు «ప్రముఖులు ధర్మారెడ్డిని ఓదార్చారు. చంద్రమౌళి కళ్లను కుటుంబసభ్యులు దానం చేశారు. చంద్రమౌళి భౌతికకాయాన్ని ధర్మారెడ్డి స్వగ్రామం నంద్యాల జిల్లా జూపాడుబంగ్లా మండలం పారుమంచాలకు ప్రత్యేక అంబులెన్స్‌లో మధ్యాహ్నం 12 గంటల సమయంలో చెన్నై నుంచి తరలించారు. చంద్రమౌళి మృతితో పారుమంచాల గ్రామంలో విషాదం అలుముకుంది. గురువారం గ్రామంలోని వారి పొలంలో అంత్యక్రియలు నిర్వహించేందుకు బంధువులు ఏర్పాట్లు చేస్తున్నారు. గవర్నర్, సీఎం సంతాపం: టీటీడీ ఈవో ధర్మారెడ్డి కుమారుడు చంద్రమౌళి ఆకస్మిక మృతి పట్ల గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వేర్వేరుగా సంతాపం తెలిపారు. ధర్మారెడ్డి కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. చదవండి: (Vijayawada: గల్ఫ్ సర్వీసులకు డిమాండ్ ఫుల్) -
కావేరి ఆస్పత్రి నుంచి రజనీకాంత్ డిశ్చార్జ్
-
హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన రజనీకాంత్
Superstar Rajinikanth Discharged From Hospital: ప్రముఖ నటుడు రజనీకాంత్ ఆదివారం రాత్రి కావేరి ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అక్టోబరు 28(గురువారం) సాయంత్రం చెన్నైలోని కావేరి హాస్పిటల్లో ఆయన చేరారు. సాధారణ వైద్య పరీక్షల కోసమేనని ఆయన కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. అయితే రజనీకాంత్ మెదడులోని రక్తనాళాల్లో కొన్ని బ్లాక్స్ గుర్తించి చికిత్స చేసినట్లు చెన్నైలోని కావేరి ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోమని రజనీకి వైద్యులు సూచించారు. ఆదివారం రాత్రి రజనీకాంత్ ఇంటికి చేరుకోవడంతో ఆయన ఫ్యాన్స్ సంతోష పడుతున్నారు. -
రజనీకాంత్ కు సీఎం పరామర్శ ఆరోగ్యంపై ఆరా
-
రజనీకాంత్ ఆరోగ్యంపై స్పందించిన భార్య లతా
-
రజనీకాంత్ ఆరోగ్యంపై స్పందించిన భార్య లతా
Latha Rajinikanth Reacts On Rajinikanth Health: సూపర్‌స్టార్ రజనీకాంత్ ఆరోగ్యంపై ఆయన భార్య లతా రజనీకాంత్ స్పందించారు. సోషల్ మీడియాలో వస్తున్న వదంతులను నమ్మవద్దని ఫ్యాన్స్‌కు పిలుపునిచ్చారు. సాధారణ హెల్త్ చెకప్‌లో భాగంగానే రజనీ ఆసుపత్రిలో చేరారని, అభిమానులు ఆందోళన చెందవద్దని కోరారు. ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని పేర్కొన్నారు. కాగా నిన్న సాయంత్రం రజినీకాంత్ చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. రెండు రోజుల క్రితమే ఢిల్లీ నుంచి వచ్చిన రజినీకాంత్ గురువారం సాయంత్రం హుటాహుటిన రజినీ అకస్మాత్తుగా ఆసుపత్రిలో చేరడంతో అభిమానులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. చదవండి: అభిమానులకు క్షమాపణలు చెప్పిన డైరెక్టర్ అజయ్‌భూపతి ఆసుపత్రిలో చేరిన సూపర్ స్టార్ రజనీకాంత్ -
‘కావేరి’ నుంచి కడలి తీరం వరకు
సాక్షి ప్రతినిధి, చెన్నై: కావేరి నది.. కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల గుండా ప్రవహిస్తూ కడలిలో సంగమిస్తోంది. అదేవిధంగా జీవితంలో తన చివరి రోజులు కావేరి ఆస్పత్రిలో గడిపిన కరుణానిధి ప్రయాణం కూడా చెన్నైలోని కడలి తీరంలో ముగిసింది. 94 ఏళ్లపాటు సుదీర్ఘ జీవన ప్రయాణం సాగించిన కరుణ ఆస్పత్రిలో గడిపిన చివరి 11 రోజులను ఒక్కసారి మననం చేసుకుంటే.. జూలై 28: మూత్రవిసర్జన ఇబ్బందులతో ఇంటిలోనే చికిత్స పొందుతున్న కరుణ తెల్లవారుజామున 1.30 గంటలకు అకస్మాత్తుగా బ్లడ్‌ప్రెషర్‌కు గురికావడంతో కుటుంబ సభ్యులు కావేరి ఆస్పత్రిలో చేర్పించారు. జూలై 29: ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆస్పత్రికి చేరుకుని కరుణను పరామర్శించారు. అయితే అదేరోజు సాయంత్రానికి కరుణ పరిస్థితి విషమించినట్లు, కన్నుమూసినట్లు వదంతులు రేగడంతో రాష్ట్రంలో పరిస్థితి అల్లకల్లోలంగా మారింది. జూలై 30: తమిళనాడు సీఎం పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీర్‌సెల్వం ఆస్పత్రికి వెళ్లి పరామర్శించి కరుణ కోలుకుంటున్నారని ప్రకటించారు. జూలై 31: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సమీపంలో నిల్చుని ఉండగా, ఆయన వచ్చిన సమాచారాన్ని స్టాలిన్ తండ్రి కరుణ చెవిలో చెబుతున్న ఫొటోలు మీడియాకు విడుదల కావడంతో పార్టీ శ్రేణులు ఆనందించాయి. ఆగస్టు 1: తమిళ సినీ నటీనటులు స్టాలిన్, కనిమొళిని కలుసుకుని కరుణ క్షేమ సమాచారాలు తెలుసుకున్నారు. ఆగస్టు 2: కేరళ సీఎం పినరాయి విజయన్, మహాత్మా గాంధీ మనుమడు గోపాలకృష్ణ గాంధీ తదితరులు ఆస్పత్రిలో కరుణను పరామర్శించారు. ఆగస్టు 3: కరుణకు జాండీస్ సోకినట్లు గుర్తించి చికిత్స ప్రారంభించారు. మాజీ ప్రధానమంత్రి హెచ్డీ దేవగౌడ కరుణను పరామర్శించారు. ఆగస్టు 4: జాండీస్ ముదరడంతో కాలేయ వ్యాధికి చికిత్స చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర మంత్రి సురేష్ ప్రభు కావేరి ఆస్పత్రికి వచ్చి కరుణ క్షేమ సమాచారాలు తెలుసుకున్నారు. ఆగస్టు 5: రాష్ట్రపతి కోవింద్ వచ్చి వెళ్లారు. అయితే ఫొటోలు విడుదల కాలేదు. ఆస్పత్రి యాజమాన్యం బులెటిన్ కూడా విడుదల చేయలేదు. ఆగస్టు 6:కరుణ శరీరంలోని అనేక అవయవాలు పనిచేయడం మానివేశాయని, 24 గంటల తర్వాత కానీ ఏ విషయం చెప్పలేమని బులెటిన్ విడుదలైంది. ఆగస్టు 7: కావేరి ఆస్పత్రి పరిసరాల్లోకి తండోపతండాలుగా జనం చేరుకోవడం ప్రారంభించారు. సాయంత్రం 4.30 గంటలకు బులెటిన్ విడుదలైంది. అదేరోజు సాయంత్రం 6.10 గంటలకు కరుణానిధి కన్నుమూయగా 6.41 గంటలకు బులెటిన్ విడుదలైంది. ఆగస్టు 8: కరుణ భౌతికకాయాన్ని సీఐటీ నగర్ ఇంటి నుంచి తెల్లవారుజామున 5 గంటల సమయంలో చెన్నై రాజాజీ హాల్లో వీవీఐపీలు, ప్రజల సందర్శనార్థం ఉంచారు. రాత్రి 7.25 గంటలకు కరుణ అంతిమ సంస్కారాలు ముగిశాయి. -
కరుణానిధి కన్నుమూత
సాక్షి, చెన్నై : డీఎంకె అధినేత, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎం. కరుణానిధి(94) కన్నుమూశారు. కావేరి ఆస్పత్రిలో ఆయన మంగళవారం సాయంత్రం 6.10 నిమిషాలకు తుదిశ్వాస విడిచారు. ఈ మేరకు కావేరి ఆస్పత్రి అధికారిక ప్రకటన విడుదల చేసింది. కరుణానిధి మరణంతో ఆయన కుటుంబ సభ్యులు, డీఎంకే కార్యకర్తలు, అభిమానులు విషాదంలో మునిగిపోయారు. కొద్ది రోజులుగా మృత్యువుతో పోరాడిన ఆయన ఈ సాయంత్రం తనువు చాలించారు. జూలై 24 నుంచి ఆయన కావేరి ఆస్పత్రిలో ఉన్నారు. కరుణానిధిని కాపాడేందుకు వైద్యులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. అవయవాలు చికిత్సకు స్పందించకపోవడంతో ఆయన చనిపోయారని డాక్టర్లు ప్రకటించారు. కరుణానిధి పార్థీవ దేహాన్ని కాసేపట్లో ఆస్పత్రి నుంచి గోపాలపురంలోని నివాసానికి తరలించనున్నారు.రాజకీయ కురువృద్ధుడు కరుణానిధి మరణవార్త తెలియగానే డీఎంకే నాయకులు, కార్యకర్తలు, అభిమానులు విషాదంలో ముగినిపోయారు. తమ అభిమాన నాయకుడు ఇక లేరన్న వాస్తవాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. మరోవైపు రాష్ట్రంలో పరిస్థితులు అదుపు తప్పకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. చెన్నైతో పాటు పలు ప్రాంతాల్లో భారీ సంఖ్యలో పోలీసులను మొహరించారు. తమిళనాడు-కర్ణాటక సరిహద్దులో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఏడు రోజుల పాటు సంతాప దినాలు తమిళనాడులో రేపు, ఎల్లుండి ప్రభుత్వ కార్యక్రమాలు రద్దయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం రేపు సెలవు ప్రకటించింది. ఏడు రోజుల పాటు సంతాప దినాలు పాటించాలని నిర్ణయించింది. రేపు ఉదయం 7 గంటల నుంచి రాజాజీ హాల్లో అభిమానుల సందర్శనార్థం కరుణానిధి పార్థీవదేహాన్ని ఉంచుతారు. చదవండి - ఎం. కరుణానిధి జీవిత చరిత్ర (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) కావేరి ఆస్పత్రి వద్ద టెన్షన్ (మరిన్ని చిత్రాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
తమిళనాడులో హైటెన్షన్
సాక్షి, చెన్నై: డీఎంకే చీఫ్, రాజకీయ కురువృద్ధుడు ఎం.కరుణానిధి (94) ఆరోగ్యం మరింత విషమించడంతో కావేరి ఆసుపత్రి వద్ద ఉద్విగ్న, ఉద్రిక్త వాతావరణం నెలకొంది. శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా కావేరి ఆసుపత్రితో పాటు రాజారత్నం స్టేడియంలో పోలీసులను భారీగా మొహరించారు. ఆస్పత్రి పరిసరాలతో పాటు చెన్నైలోని పలు ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఆస్పత్రి ప్రాంగణంలో డీఎంకే కార్యకర్తలు, అభిమానుల రోదనలు మిన్నంటాయి. వృద్ధాప్యం కారణంగా ఆయన శరీరంలోని అంతర్గత అవయవాలు చికిత్సకు స్పందించే స్థితిలో లేనట్లు సమాచారం. దీంతో ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేస్తూ డీఎంకే నాయకులు, కార్యకర్తలు ఆసుపత్రి వద్దకు భారీగా చేరుకున్నారు. ఇదిలా ఉండగా.. కరుణానిధి కుమారుడు, డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్ ఈరోజు ముఖ్యమంత్రి పళనిస్వామిని కలిసి తన తండ్రి ఆరోగ్య వివరాలు వివరించారు. మరోవైపు తమిళనాడు డీజీపీ రాష్ట్రం అంతటా హైఅలర్ట్ ప్రకటించారు. జిల్లాల్లో ఉన్న పోలీసు అధికారులు అంతా చెన్నైకి రావాలని, సెలవుల్లో ఉన్నవారు వెంటనే విధుల్లో చేరాలని ఆదేశించారు. ఢిల్లీలో ఉన్న తమ ఎంపీలు, నాయకులు చెన్నైకి రావాల్సిందిగా డీఎంకే పార్టీ కార్యాలయం ఆదేశించింది. తాజా హెల్త్ బులెటిన్ విడుదల కరుణానిధి ఆరోగ్యంపై తాజా హెల్త్ బులిటన్‌ను మంగళవారం సాయంత్రం కావేరి ఆసుపత్రి డాక్టర్లు విడుదల చేశారు. ఆయన ఆరోగ్యం అత్యంత విషమంగా ఉందని డాక్టర్లు పేర్కొన్నారు. కొన్ని గంటలుగా అవయవాలు చికిత్సకు సహకరించడంలేదని తెలిపారు. చికిత్స అందించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నామని వైద్యులు పేర్కొన్నారు. -
కరుణానిధిని పరామర్శించిన వైఎస్సార్సీపీ నేతలు
-
కరుణ కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నాం
సాక్షి ప్రతినిధి, చెన్నై : డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి పూర్తిగా కోలుకుని.. ప్రజా జీవితంలోకి రావాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయి రెడ్డి, మాజీ పార్లమెంటు సభ్యుడు వై.వి.సుబ్బారెడ్డి, మాజీ మంత్రి బొత్సా సత్యనారాయణ ఆకాంక్షించారు. పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు చెన్నై కావేరి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కరుణానిధిని వారు పరామర్శించారు. సోమవారం రాత్రి 8.00 గంటలకు కావేరి ఆస్పత్రికి చేరుకున్న నేతలు డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్, ఎంపీ కనిమొళిని కలుసుకుని కరుణానిధి క్షేమ సమాచారాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో విజయసాయి రెడ్డి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకే పార్టీ ప్రతినిధులుగా కరుణను పరామర్శించేందుకు వచ్చామని, స్టాలిన్, కనిమొళిని కలుసుకున్నామని ఆయన చెప్పారు. కరుణ ఆరోగ్యం కొంత సంక్లిష్టంగా ఉన్నా.. భగవంతుడి దయవల్ల ఆయన కోలుకుంటారని ఆశిస్తున్నట్లు తెలిపారు. కరుణానిధి వంటి మహోన్నత నేత సేవలు తమిళనాడుకు ఎంతో అవసరమని ఆయన పేర్కొన్నారు. వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ మరికొన్ని రోజుల్లో కరుణ సంపూర్ణమైన ఆరోగ్యంతో ఆస్పత్రి నుంచి డిచ్ఛార్జ్ కావాలని దేవున్ని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. చెన్నైలో తెలుగు ప్రముఖుడు జనార్దన్ రెడ్డి, వైఎస్ అనిల్‌రెడ్డి వారితో ఉన్నారు. -
మళ్లీ విషమంగా మారిన కరుణానిధి ఆరోగ్యం
-
కరుణానిధికి రాష్ట్రపతి కోవింద్ పరామర్శ
సాక్షి, చెన్నై: డీఎంకే అధినేత, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధిని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆదివారం పరామర్శించారు. కావేరి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయనను రాష్ట్రపతి సందర్శించారు. ఈ సందర్భంగా కరుణానిధికి అందిస్తున్న వైద్యచికిత్సల గురించి స్టాలిన్‌ను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రపతి వెంట తమిళనాడు గవర్నర్ బన్వరీలాల్, రాష్ట్ర మంత్రి జయకుమార్ ఉన్నారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో కొద్దిరోజుల కిందట కరుణానిధి చెన్నైలోని కావేరీ ఆస్పత్రిలో చేర్పించిన సంగతి తెలిసిందే. కరుణానిధి ఆరోగ్యం కుదుటపడిందని, ఆయన వేగంగా కోలుకుంటున్నారని వైద్య వర్గాలు చెప్తున్నాయి. ప్రస్తుతం కరుణానిధి ఆరోగ్యం నిలకడగా ఉంది. -
కరుణకు రాహుల్, రజనీ పరామర్శ
సాక్షి ప్రతినిధి, చెన్నై: డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి ఆరోగ్యం మంగళవారం మరింత మెరుగుపడింది. నాలుగు రోజులుగా దేశవాప్తంగా ఉత్కంఠ రేకెత్తించిన కరుణ కాసేపు కళ్లు తెరిచారు. కుమారుడు స్టాలిన్ పలకరింపునకు స్పందించారు. వృద్ధాప్య రుగ్మతలతో సతమతం అవుతున్న కరుణానిధి ఆరోగ్యం మరింత క్షీణించడంతో గతనెల 28న ఆస్పత్రిలో చేర్పించిన సంగతి తెలిసిందే. గొంతుకు అమర్చిన కృత్రిమశ్వాస గొట్టాన్ని మార్చిన కారణంగా ఆయన ఇన్ఫెక్షన్కు గురయ్యారు. ఆనాటి నుంచి స్పృహలేని స్థితిలో ఉండిన కరుణానిధి క్రమేణా కోలుకుంటున్నారు. ఇదిలాఉండగా, కరుణను పరామర్శించేందుకు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ మంగళవారం కావేరీ ఆస్పత్రికి వచ్చారు. కరుణ కుమారుడు స్టాలిన్, కుమార్తె కనిమొళి రాహుల్‌ను కరుణ వద్దకు తీసుకెళ్లారు. ఈ సమయంలో స్టాలిన్.. కరుణ చెవివద్ద ‘రాహుల్ వచ్చారు’ అని చెప్పగా కళ్లు తెరిచి తలతిప్పి చూశారు. అలాగే, నటుడు రజనీకాంత్‌తోపా టు పలువురు తమిళ చిత్రరంగ ప్రముఖులు కావేరి ఆస్పత్రి వచ్చి కరుణ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కరుణ ఆరోగ్యం మరింత మెరుగుపడినా మరికొంతకాలం ఆస్పత్రిలో ఉండాల్సిన అవసరం ఉందని కావేరి ఆస్పత్రి బులెటిన్‌లో పేర్కొంది. -
మెరుగవుతున్న కరుణ ఆరోగ్యం
సాక్షి ప్రతినిధి, చెన్నై: ద్రావిడ మున్నేట్ర కజగం(డీఎంకే) అధినేత ఎంకే కరుణానిధి(94) ఆరోగ్యం ప్రస్తుతం మెరుగుపడుతోందని ఆయన కొడుకు, డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్ స్పష్టంచేశారు. గొంతులో అమర్చిన ట్రాకియాస్టమీ ట్యూబ్ మార్పిడి కారణంగా కరుణకు స్వల్పంగా జ్వరం, ఇన్ఫెక్షన్ సోకిందన్నారు. ప్రస్తుతం జ్వరంతో పాటు శరీరంలోని ఇన్ఫెక్షన్ తగ్గుముఖం పడుతోందన్నారు. కరుణానిధి ఆరోగ్యంపై వస్తున్న వదంతుల్ని నమ్మవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అత్యుత్తమ వైద్యుల బృందం 24 గంటల పాటు కరుణకు చికిత్స అందజేస్తోందని స్టాలిన్ తెలిపారు. కలైంజర్ ఆరోగ్యం ఇప్పుడిప్పుడే కుదుట పడుతున్నందున గోపాలపురంలోని ఆయన నివాసానికి రావొద్దని పార్టీ నేతలు, కార్యకర్తలు, సాధారణ ప్రజలను స్టాలిన్ కోరారు. పరామర్శల వెల్లువ.. కరుణ ఆరోగ్యం క్షీణించిందన్న వార్తల నేపథ్యంలో రాష్ట్రపతి కోవింద్, ప్రధాని∙మోదీ, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ తదితరులు స్టాలిన్, కుమార్తె కణిమొళికి ఫోన్ చేసి కరుణ∙ఆరోగ్యంపై వాకబు చేశారు. తండ్రి అనారోగ్యం నేపథ్యంలో కరుణ పెద్ద కుమారుడు అళగిరి తన కుమారుడు దురై దయానిధిని వెంటపెట్టుకుని గోపాలపురంలోని ఇంటికి శుక్రవారం చేరుకున్నారు. డీఎంకే అధినేతగా కరుణానిధి శుక్రవారంతో 50వ వసంతంలోకి అడుగుపెట్టిన వేళ ఆయన కుమారుడు స్టాలిన్ స్పందించారు.‘ సవాళ్లను విజయాలుగా మార్చుకునే మన నాయకుడు గత 50 సంవత్సరాలుగా తమిళనాడు రాజకీయాల్లో దృఢమైన శక్తిగా ఉన్నారు’ అని ట్వీట్ చేశారు. కొనసాగిన ఉత్కంఠ.. కరుణ ఆరోగ్యం స్వల్పంగా క్షీణించిందని కావేరీ ఆస్పత్రి యాజమాన్యం ప్రకటించడంతో డ్రామా మొదలైంది. డిప్యూటీ సీఎం పన్నీర్‌సెల్వం, తోటి మంత్రులు కరుణ ఇంటికి వెళ్లి స్టాలిన్‌ను కలవడం, ఇంటివద్ద పెద్ద సంఖ్యలో పోలీసుల్ని మోహరించడంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రజల్లో టెన్షన్ పెరిగింది. మెరీనా బీచ్‌లోని అన్నాదురై సమాధి దగ్గర ప్రభుత్వం స్థల పరిశీలన చేస్తోందని వార్తలొచ్చాయి. చివరకు కరుణ ఆరోగ్యం మెరుగుపడుతోందని స్టాలిన్ ప్రకటించినప్పటికీ ఆయన ఇంటివద్ద నేతలు, కార్యకర్తల్లో ఆందోళన తగ్గలేదు. కాగా, కరుణకు పూర్తి విశ్రాంతి అవసరమని డీఎంకే వర్గాలు తెలిపాయి. ముందస్తుగా ఖరారైన పర్యటన నేపథ్యంలో ఉపరాష్ట్రపతి వెంకయ్య ఆదివారం చెన్నైకి చేరుకోనున్నారు. -
ఆసుపత్రిలో చేరిన కరుణానిధి
చెన్నై: డీఎంకే అధినేత కరుణానిధిని బుధవారం తెల్లవారుజామున చెన్నైలోని కావేరి ఆసుపత్రికి తరలించారు. గతేడాది జరిగిన శస్త్రచికిత్సలో భాగంగా పీఈజీ ట్యూబ్‌ను మార్చాలి ఉన్నందుకే ఆయన ఆసుపత్రిలో చేరినట్లు ఆసుపత్రి ఓ ప్రకటనలో పేర్కొంది. బుధవారమే ఆయన్ను ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేస్తామని వెల్లడించింది. -
మళ్లీ ఆస్పత్రిలో కరుణ
► స్వల్ప వ్యవధిలో రెండోసారి ►నిలకడగా ఉందన్న వైద్యులు ► కరుణ ఆరోగ్యంపై కలకలం అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత కన్నుమూసి పదిరోజులు దాటగానే డీఎంకే అధ్యక్షులు కరుణానిధి అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరడం రాష్ట్రంలో కలకలం సృష్టించింది. స్వల్ప వ్యవధిలో రెండుమార్లు ఆసుపత్రి పాలుకావడంతో పార్టీ కార్యకర్తలు ఆందోళన చెందారు. పలువురు నేతలు ఆస్పత్రికి వెళ్లి కరుణను పరామర్శించారు. సాక్షి ప్రతినిధి, చెన్నై: వృద్ధాప్యంతో బాధపడుతున్న కరుణానిధి అనారోగ్యానికి గురికావడంతో ఈనెల 1వ తేదీన చెన్నై ఆళ్వార్‌పేటలోని కావేరీ ఆసుపత్రిలో చేరారు. డీహైడ్రేషన్, పౌష్టికాహారలోపం ఏర్పడడంతో అనారోగ్యంపాలైనట్లు వైద్యులు తెలిపారు. అనేక వైద్య పరీక్షలు నిర్వహించి చికిత్స చేశారు. దీంతో ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోగా ఈనెల 7వ తేదీన డిశ్చార్జ్ అయ్యారు. ఇదిలా ఉండగా, నగరంలో తీవ్రమైన చలివాతావరణం నెలకొనడంతో గురువారం రాత్రి శ్వాసతీసుకునేందుకు ఇబ్బంది పడ్డారు. దీంతో ఆయన కుటుంబ సభ్యులు హడావుడిగా వైద్యులను ఇంటికి రప్పించారు. గొంతునొప్పి, ఊపిరితిత్తుల వ్యాధి, ఇన్ ఫెక్షన్ల వల్ల శ్వాస తీసుకోవడంలో ఆయన ఇబ్బంది పడుతున్నారని, ఆసుపత్రిలో చేర్చి చికిత్స చేయాల్సిన అవసరం ఉందని పరీక్షలు నిర్వహించిన వైద్యులు తెలిపారు. దీంతో కరుణ కుటుంబ సభ్యులు గురువారం రాత్రి 11.10 గంటల సమయంలో హుటాహుటిన చెన్నై ఆళ్వార్‌పేటలోని కావేరీ ఆసుపత్రిలో చేర్చారు. కరుణానిధితోపాటూ ఆయన సతీమణి రాజాత్తి అమ్మాళ్, కుమారుడు స్టాలిన్, కుటుంబ సభ్యులు ఆసుపత్రికి చేరుకున్నారు. అత్యవసర చికిత్సా విభాగంలో ఉంచి కరుణకు చికిత్స అందిస్తున్నారు. చికిత్సకు ఆయన శరీరం స్పందిస్తున్నదని, ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో వైద్యులు పేర్కొన్నారు. కావేరీ ఆసుపత్రి మేనేజింగ్ డైరెక్టర్ అరవిందన్ మాట్లాడుతూ, ఊపిరితిత్తులు, గొంతులో ఇన్ఫెక్షన్ తో కరుణానిధి బాధపడుతున్నారని చెప్పారు. ఆయనకు జరుగుతున్న చికిత్సతో కోలుకుంటున్నారని తెలిపారు. కరుణకు జరుగుతున్న చికిత్సను గోప్యంగా ఉంచబోమని డీఎంకే ఎమ్మెల్యే దురైమురుగన్ స్పష్టం చేశారు. తమిళనాడు కాంగ్రెస్ కమిటీ మాజీ అధ్యక్షులు ఈవీకేఎస్ ఇళంగోవన్, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి త పాండియన్, వీసీకే అధ్యక్షులు తిరుమావళవన్ పరామర్శించారు. కరుణ ఆరోగ్యంపై కంగారు:కరుణానిధి ఆసుపత్రిలో చేరారనే సమాచారం డీఎంకే నేతలు, కార్యకర్తల్లో కంగారురేకెత్తించింది. ఈనెల మొదటి వారంలో ఆసుపత్రిలో చేరి ఆరోగ్యం కుదుటపడిందని 7వ తేదీన డిశ్చార్జయిన కరుణానిధి వారం రోజుల్లో మళ్లీ ఆసుపత్రి పాలుకావడం ఆందోళన కలిగించింది. శుక్రవారం తెల్లవారగానే పెద్ద సంఖ్యలో పార్టీ నేతలు, కార్యకర్తలు కావేరీ ఆసుపత్రి ముందు గుమికూడారు. తమ నేత ఆరోగ్యం ఎలా ఉందని ఆడిగి తెలుసుకున్నారు. కరుణానిధికి వచ్చిన ముప్పు ఏమీలేదు, కోలుకుంటున్నారని నచ్చజెప్పి పంపుతున్నారు. -
కరుణానిధి ఆరోగ్యంపై ఆందోళన
చెన్నై: డీఎంకే అధినేత కరుణానిధి అనారోగ్యంతో చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో చేరారు. గొంతు, శ్వాసకోశ సమస్యలతో ఆసుపత్రిలో చేరిన కరుణానిధి ఆరోగ్యంపై ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు. శుక్రవారం కావేరి ఆసుపత్రి కరుణానిధి ఆరోగ్యంపై కావేరి ఆసుపత్రి హెల్త్ బులిటెన్ విడుదల చేయనుండటంతో పెద్ద సంఖ్యలో ఆసుపత్రి వద్దకు చేరుకుంటున్నారు. కొద్ది రోజుల క్రితం శ్వాసకోశ సమస్యతో కరుణానిధి ఇదే ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. -
కరుణానిధికి మరోసారి అస్వస్థత
-
కరుణానిధికి మరోసారి అస్వస్థత
చెన్నై: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే పార్టీ అధ్యక్షుడు కరుణానిధి మరోసారి అస్వస్థతకు గురయ్యారు. గురువారం రాత్రి అనారోగ్యానికి గురైన ఆయన్ను కుటుంబసభ్యులు కావేరి ఆసుపత్రికి తీసుకువెళ్లారు. గొంతు, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ కారణంగా శ్వాస తీసుకోవడానికి ఆయన ఇబ్బంది పడుతున్నారని ఆస్పత్రి విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యుల బృందం ఆయనకు చికిత్స అందిస్తున్నామని పేర్కొంది. గత 15 రోజుల్లో కరుణానిధి రెండవ సారి అస్వస్థతకు గురయ్యారు. డిసెంబర్ 1వ తేదీన డీహైడ్రేషన్, అలర్జీ సంబంధిత అనారోగ్య కారణాలతో కరుణానిధి కావేరి ఆస్పత్రిలో చేరారు. వారం రోజుల పాటు చికిత్స పొందిన అనంతరం డాక్టర్లు ఆయన్ను డిశ్చార్జ్ చేశారు. కొన్ని రోజులపాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించిన విషయం తెలిసిందే. -
కరుణానిధికి అస్వస్ధత
-
కరుణానిధికి అస్వస్ధత
చెన్నై: తమిళనాడు డీఎంకే పార్టీ అధ్యక్షుడు కరుణానిధి అస్వస్ధతకు గురయ్యారు. గురువారం తెల్లవారుజామున అనారోగ్యానికి గురైన ఆయన్ను కావేరి ఆసుపత్రికి తరలించారు. అలర్జీ సంబంధిత కారణాల వల్ల ఆయన్ను ఆసుపత్రికి తరలిస్తున్నట్లు తెలిసింది. కాగా, కరుణానిధి ఆరోగ్య పరిస్ధితిపై కావేరి ఆసుపత్రి ఓ ప్రకటన విడుదల చేసింది. కరుణానిధి ఆరోగ్యం నిలకడగానే ఉందని చెప్పింది. ప్రస్తుతం ఆయనకు న్యూట్రిషన్, హైడ్రేషన్ లకు సంబంధించిన చికిత్సలు చేస్తున్నట్లు పేర్కొంది. కొద్ది రోజుల పాటు కరుణానిధి ఆసుపత్రిలోనే ఉండాల్సిన అవసరం ఉందని చెప్పింది. -
దర్శక దిగ్గజం సినీ ప్రస్థానం
చెన్నై: ప్రఖ్యాత దర్శకుడు కె.బాలచందర్ మంగళవారం రాత్రి 7.05 నిమిషాలకు చెన్నైలోని కావేరీ ఆసుపత్రిలో కన్నుమూశారు. ఆయన వయస్సు 84 సంవత్సరాలు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. అభిమానుల సందర్శనార్థం బాలచందర్ బౌతికకాయాన్ని రేపు ఆయన నివాసంలో ఉంచుతారు. గురువారం బీసెంట్ నగర్‌లోని శశ్మానవాటికలో ఆయన అంత్యక్రియలు నిర్వహిస్తామని బాలచందర్ కుమారుడు ప్రసన్న వెల్లడించారు. 1930, జులై 9న తమిళనాడులోని తంజావూర్లో బాలచందర్ జన్మించారు. 1964లో రచయితగా సినీ రంగ ప్రవేశం చేశారు. తమిళ, తెలుగు, కన్నడ, హిందీ చిత్ర రంగంలో దాదాపు 101 చిత్రాలకు దర్శకత్వం వహించారు. అలాగే పలు టీవీ సీరియళ్లకు రచన, దర్శకత్వం వహించారు. తెలుగులో భలే కోడళ్లు చిత్రానికి ఆయన దర్శకత్వం వహించారు. ఆకలిరాజ్యం, అంతులేని కథ, రుద్రవీణ, మరో చరిత్ర, గుప్పెడు మనసు, ఆడవాళ్లు మీకు జోహార్లు, భలే కోడళ్లు, సత్తెకాలపు సత్తయ్య, బొమ్మా బొరుసా, జీవితరంగం, తొలికోడి కూసింది, కోకిలమ్మ, చిలకమ్మ చెప్పింది తదితర చిత్రాలకు దర్శకత్వం వహించారు. రజనీకాంత్, కమల్ హాసన్, ముమ్ముటీ, ప్రకాశ్ రాజ్‌లను చిత్ర రంగానికి పరిచయం చేశారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంతో హిందీలో తొలి సారిగా పాటలు పాడించిన ఘనత బాలచందర్కే దక్కుతుంది. అబద్ధం, రెట్టసుళి, ఉత్తమ విలన్ చిత్రాలలో బాలచందర్ నటించారు. పురస్కారాలు: 1973 లో తమిళనాడు ప్రభుత్వం నుంచి కలైమామణి అవార్డు అందుకున్నారు 1987లో భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో బాలచందర్‌ను సత్కరించింది. 2010లో దాదాసాహెబ్ పాల్కె అవార్డును అందుకున్నారు. 9 జాతీయ ఫిల్మ్ ఫేర్ అవార్డులు, పలు ఫిల్మ్ ఫేర్ అవార్డులు అందుకున్నారు. 1982లో ఏక్ దూజే కేలియే చిత్రానికి కథ స్క్రీన్ ప్లే ఉత్తమ అవార్డు అందుకున్నారు. 2010లో ఏఎన్ఆర్ అవార్డులను అందుకున్నారు. -
ప్రముఖ దర్శకుడు బాలచందర్ కన్నుమూత
-
ప్రముఖ దర్శకుడు బాలచందర్ కన్నుమూత
చెన్నై : కె.బాలచందర్గా సుప్రసిద్ధుడైన దర్శక ప్రముఖుడు కైలాసం బాలచందర్ చెన్నైలోని కావేరి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మరణించారు. ఆయన వయసు 84 సంవత్సరాలు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గత కొద్ది రోజుల నుంచి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మూత్రపిండాలకు సంబంధించిన సమస్య ఎక్కువ కావడంతో డయాలసిస్ చేశారు. చివరకు వెంటిలేటర్ మీద ఉంచి కూడా వైద్యం అందించారు. కానీ, వార్ధక్యం కారణంగా ఆయన శరీరం చికిత్సకు సహకరించకపోవడంతో వైద్యులు కూడా ఏమీ చేయలేకపోయారు. బాలచందర్‌కు ఎనిమిదేళ్ల వయస్సు నుంచే సినిమాలపై ఆసక్తి కలిగింది. ఆ క్రమంలో 12వ ఏటే థియేటర్ ఆర్టిస్ట్ సంఘంలో సభ్యులయ్యారు. ఉన్నత విద్య పూర్తి చేసిన ఆయన తొలుత ఉపాధ్యాయ వృత్తిని చేపట్టారు. చెన్నై మహానగరంలోకి అకౌంట్ క్లర్క్‌గా అడుగుపెట్టారు. ఆ తరువాత యునెటెడ్ అమెరికన్ ఆర్టిస్టు నటన కంపెనీలో చేరారు. అనంతరం అతి త్వరలోనే తన కంటూ సొంతంగా డ్రామా గ్రూప్‌ను తయారు చేసుకుని మేజర్ చంద్రకాంత్ నాటకాన్ని రూపొందించి దర్శకత్వం వహించారు. ఆ తరువాత అదే నాటకంతో వెండితెరపై దర్శకుడిగా అవతరించారు. రజనీకాంత్, కమలహాసన్, ప్రకాష్‌రాజ్, సరిత, వివేక్ వంటి ప్రముఖ నటీనటులను పరిచయం చేసిన ఘనత కె.బాలచందర్దే. ఈయన తమిళం, తెలుగు, హిందీ తదితర భాషల్లో 100 చిత్రాలకుపైగా చేసి భారతీయ సినీ కళామతల్లి గర్వించదగ్గ దర్శకుడిగా పేరొందారు. ఎంజీఆర్ హీరోగా చేసిన దైవతాయ్ చిత్రానికి సంభాషణల రచయితగా సినీరంగంలో ప్రవేశించారు. భారత చలనచిత్ర రంగం అభివృద్ధికి ఆయన చేసిన కృషికి గాను 2010 సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని ప్రకటించింది. ఆయన ఇటీవలే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ‘అక్కినేని అంతర్జాతీయ పురస్కారం’ అందుకున్నారు. ఇది కథ కాదు, అంతులేని కథ, గుప్పెడు మనసు, ఆకలి రాజ్యం, రుద్రవీణ.. ఇలాంటి అద్భుత చిత్రరాజాలన్నీ బాలచందర్ దర్శకత్వ ప్రతిభకు మచ్చుతునకలు. మరిన్ని చిత్రాలకు క్లిక్ చేయండి -
బాలచందర్‌కు రజనీ, కుష్బూ పరామర్శ
ప్రముఖ దర్శకుడు కె. బాలచందర్ క్రమంగా కోలుకుంటున్నారని చెన్నైలోని కావేరి ఆస్పత్రి వైద్యులు తెలిపారు. బాలచందర్ ఆరోగ్యంపై ఆస్పత్రి వైద్యులు బులెటిన్ విడుదల చేశారు. ఆయన చికిత్సకు స్పందిస్తున్నారని, క్రమంగా ఆరోగ్యం మెరుగుపడుతోందని చెప్పారు. కాగా, తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్, కాంగ్రెస్ నాయకురాలు కుష్బూ కావేరి ఆస్పత్రికి వెళ్లి అక్కడ చికిత్స పొందుతున్న బాలచందర్‌ను పరామర్శించారు. ఆయన ఆరోగ్యం బాగానే ఉందని, దానిపై ఎవరూ ఎలాంటి వదంతులు సృష్టించొద్దని ఈ సందర్భంగా కుష్బూ చెప్పారు. -
ప్రముఖ దర్శకుడు బాలచందర్ పరిస్థితి విషమం
-
ప్రముఖ దర్శకుడు బాలచందర్ పరిస్థితి విషమం
ప్రముఖ దర్శకుడు కె.బాలచందర్ పరిస్థితి విషమంగా మారింది. ప్రస్తుతం చెన్నై నగరంలోని కావేరి ఆస్పత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. ఆయన పరిస్థితి ఇబ్బందికరంగా ఉన్నట్లు అక్కడి వైద్యులు తెలిపారు. విశ్వవిఖ్యాత నటుడు కమల్‌హాసన్ తన గురువుగా బాలచందర్‌ను అభివర్ణిస్తారు. రజనీకాంత్, కమల్‌హాసన్, ప్రకాష్ రాజ్ లాంటి అనేకమంది ప్రముఖ నటులను చిత్ర పరిశ్రమకు పరిచయం చేసిన ఘనత బాలచందర్దే. అనారోగ్యం విషయం తెలిసిన వెంటనే కమల్‌హాసన్ ఆయన కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి వివరాలు కనుక్కున్నారు. కొంతకాలంగా బాలచందర్ అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయనకు శ్వాసకోశ సమస్యలతో పాటు, మూత్రపిండాలకు సంబంధించిన సమస్యలు కూడా ఉన్నాయి. దీంతోనే ఆయన కావేరి ఆస్పత్రిలోచికిత్స పొందుతున్నారు. అయితే, సోమవారం ఉదయం ఉన్నట్టుండి బాలచందర్ ఆరోగ్యం విషమించింది. తాము ఎంత ప్రయత్నించినా చికిత్సకు ఆయన శరీరం స్పందించడం లేదని వైద్యులు అంటున్నారు. దాదాపు 80 ఏళ్ల వయసు ఉండటంతో చికిత్స కూడా కష్టం అవుతోందన్నారు. ప్రస్తుతం చెన్నైలోని కావేరి ఆస్పత్రి వద్ద బాలచందర్ అల్లుడు, మరికొందరు బంధువులు ఉన్నారు.