సాక్షి, చెన్నై : డీఎంకె అధినేత, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎం. కరుణానిధి(94) కన్నుమూశారు. కావేరి ఆస్పత్రిలో ఆయన మంగళవారం సాయంత్రం 6.10 నిమిషాలకు తుదిశ్వాస విడిచారు. ఈ మేరకు కావేరి ఆస్పత్రి అధికారిక ప్రకటన విడుదల చేసింది. కరుణానిధి మరణంతో ఆయన కుటుంబ సభ్యులు, డీఎంకే కార్యకర్తలు, అభిమానులు విషాదంలో మునిగిపోయారు. కొద్ది రోజులుగా మృత్యువుతో పోరాడిన ఆయన ఈ సాయంత్రం తనువు చాలించారు. జూలై 24 నుంచి ఆయన కావేరి ఆస్పత్రిలో ఉన్నారు. కరుణానిధిని కాపాడేందుకు వైద్యులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. అవయవాలు చికిత్సకు స్పందించకపోవడంతో ఆయన చనిపోయారని డాక్టర్లు ప్రకటించారు. కరుణానిధి పార్థీవ దేహాన్ని కాసేపట్లో ఆస్పత్రి నుంచి గోపాలపురంలోని నివాసానికి తరలించనున్నారు.రాజకీయ కురువృద్ధుడు కరుణానిధి మరణవార్త తెలియగానే డీఎంకే నాయకులు, కార్యకర్తలు, అభిమానులు విషాదంలో ముగినిపోయారు. తమ అభిమాన నాయకుడు ఇక లేరన్న వాస్తవాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. మరోవైపు రాష్ట్రంలో పరిస్థితులు అదుపు తప్పకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. చెన్నైతో పాటు పలు ప్రాంతాల్లో భారీ సంఖ్యలో పోలీసులను మొహరించారు. తమిళనాడు-కర్ణాటక సరిహద్దులో భద్రతను కట్టుదిట్టం చేశారు.
ఏడు రోజుల పాటు సంతాప దినాలు
తమిళనాడులో రేపు, ఎల్లుండి ప్రభుత్వ కార్యక్రమాలు రద్దయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం రేపు సెలవు ప్రకటించింది. ఏడు రోజుల పాటు సంతాప దినాలు పాటించాలని నిర్ణయించింది. రేపు ఉదయం 7 గంటల నుంచి రాజాజీ హాల్లో అభిమానుల సందర్శనార్థం కరుణానిధి పార్థీవదేహాన్ని ఉంచుతారు.
చదవండి - ఎం. కరుణానిధి జీవిత చరిత్ర
(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
కావేరి ఆస్పత్రి వద్ద టెన్షన్ (మరిన్ని చిత్రాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
Comments
Please login to add a commentAdd a comment