దర్శక దిగ్గజం సినీ ప్రస్థానం
చెన్నై: ప్రఖ్యాత దర్శకుడు కె.బాలచందర్ మంగళవారం రాత్రి 7.05 నిమిషాలకు చెన్నైలోని కావేరీ ఆసుపత్రిలో కన్నుమూశారు. ఆయన వయస్సు 84 సంవత్సరాలు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. అభిమానుల సందర్శనార్థం బాలచందర్ బౌతికకాయాన్ని రేపు ఆయన నివాసంలో ఉంచుతారు. గురువారం బీసెంట్ నగర్లోని శశ్మానవాటికలో ఆయన అంత్యక్రియలు నిర్వహిస్తామని బాలచందర్ కుమారుడు ప్రసన్న వెల్లడించారు.
1930, జులై 9న తమిళనాడులోని తంజావూర్లో బాలచందర్ జన్మించారు. 1964లో రచయితగా సినీ రంగ ప్రవేశం చేశారు. తమిళ, తెలుగు, కన్నడ, హిందీ చిత్ర రంగంలో దాదాపు 101 చిత్రాలకు దర్శకత్వం వహించారు. అలాగే పలు టీవీ సీరియళ్లకు రచన, దర్శకత్వం వహించారు. తెలుగులో భలే కోడళ్లు చిత్రానికి ఆయన దర్శకత్వం వహించారు. ఆకలిరాజ్యం, అంతులేని కథ, రుద్రవీణ, మరో చరిత్ర, గుప్పెడు మనసు, ఆడవాళ్లు మీకు జోహార్లు, భలే కోడళ్లు, సత్తెకాలపు సత్తయ్య, బొమ్మా బొరుసా, జీవితరంగం, తొలికోడి కూసింది, కోకిలమ్మ, చిలకమ్మ చెప్పింది తదితర చిత్రాలకు దర్శకత్వం వహించారు. రజనీకాంత్, కమల్ హాసన్, ముమ్ముటీ, ప్రకాశ్ రాజ్లను చిత్ర రంగానికి పరిచయం చేశారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంతో హిందీలో తొలి సారిగా పాటలు పాడించిన ఘనత బాలచందర్కే దక్కుతుంది. అబద్ధం, రెట్టసుళి, ఉత్తమ విలన్ చిత్రాలలో బాలచందర్ నటించారు.
పురస్కారాలు:
1973 లో తమిళనాడు ప్రభుత్వం నుంచి కలైమామణి అవార్డు అందుకున్నారు
1987లో భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో బాలచందర్ను సత్కరించింది.
2010లో దాదాసాహెబ్ పాల్కె అవార్డును అందుకున్నారు.
9 జాతీయ ఫిల్మ్ ఫేర్ అవార్డులు, పలు ఫిల్మ్ ఫేర్ అవార్డులు అందుకున్నారు.
1982లో ఏక్ దూజే కేలియే చిత్రానికి కథ స్క్రీన్ ప్లే ఉత్తమ అవార్డు అందుకున్నారు.
2010లో ఏఎన్ఆర్ అవార్డులను అందుకున్నారు.