► స్వల్ప వ్యవధిలో రెండోసారి
►నిలకడగా ఉందన్న వైద్యులు
► కరుణ ఆరోగ్యంపై కలకలం
అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత కన్నుమూసి పదిరోజులు దాటగానే డీఎంకే అధ్యక్షులు కరుణానిధి అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరడం రాష్ట్రంలో కలకలం సృష్టించింది. స్వల్ప వ్యవధిలో రెండుమార్లు ఆసుపత్రి పాలుకావడంతో పార్టీ కార్యకర్తలు ఆందోళన చెందారు. పలువురు నేతలు ఆస్పత్రికి వెళ్లి కరుణను పరామర్శించారు.
సాక్షి ప్రతినిధి, చెన్నై: వృద్ధాప్యంతో బాధపడుతున్న కరుణానిధి అనారోగ్యానికి గురికావడంతో ఈనెల 1వ తేదీన చెన్నై ఆళ్వార్‌పేటలోని కావేరీ ఆసుపత్రిలో చేరారు. డీహైడ్రేషన్, పౌష్టికాహారలోపం ఏర్పడడంతో అనారోగ్యంపాలైనట్లు వైద్యులు తెలిపారు. అనేక వైద్య పరీక్షలు నిర్వహించి చికిత్స చేశారు. దీంతో ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోగా ఈనెల 7వ తేదీన డిశ్చార్జ్ అయ్యారు. ఇదిలా ఉండగా, నగరంలో తీవ్రమైన చలివాతావరణం నెలకొనడంతో గురువారం రాత్రి శ్వాసతీసుకునేందుకు ఇబ్బంది పడ్డారు. దీంతో ఆయన కుటుంబ సభ్యులు హడావుడిగా వైద్యులను ఇంటికి రప్పించారు.
గొంతునొప్పి, ఊపిరితిత్తుల వ్యాధి, ఇన్ ఫెక్షన్ల వల్ల శ్వాస తీసుకోవడంలో ఆయన ఇబ్బంది పడుతున్నారని, ఆసుపత్రిలో చేర్చి చికిత్స చేయాల్సిన అవసరం ఉందని పరీక్షలు నిర్వహించిన వైద్యులు తెలిపారు. దీంతో కరుణ కుటుంబ సభ్యులు గురువారం రాత్రి 11.10 గంటల సమయంలో హుటాహుటిన చెన్నై ఆళ్వార్‌పేటలోని కావేరీ ఆసుపత్రిలో చేర్చారు. కరుణానిధితోపాటూ ఆయన సతీమణి రాజాత్తి అమ్మాళ్, కుమారుడు స్టాలిన్, కుటుంబ సభ్యులు ఆసుపత్రికి చేరుకున్నారు. అత్యవసర చికిత్సా విభాగంలో ఉంచి కరుణకు చికిత్స అందిస్తున్నారు. చికిత్సకు ఆయన శరీరం స్పందిస్తున్నదని, ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో వైద్యులు పేర్కొన్నారు.
కావేరీ ఆసుపత్రి మేనేజింగ్ డైరెక్టర్ అరవిందన్ మాట్లాడుతూ, ఊపిరితిత్తులు, గొంతులో ఇన్ఫెక్షన్ తో కరుణానిధి బాధపడుతున్నారని చెప్పారు. ఆయనకు జరుగుతున్న చికిత్సతో కోలుకుంటున్నారని తెలిపారు. కరుణకు జరుగుతున్న చికిత్సను గోప్యంగా ఉంచబోమని డీఎంకే ఎమ్మెల్యే దురైమురుగన్ స్పష్టం చేశారు. తమిళనాడు కాంగ్రెస్ కమిటీ మాజీ అధ్యక్షులు ఈవీకేఎస్ ఇళంగోవన్, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి త పాండియన్, వీసీకే అధ్యక్షులు తిరుమావళవన్ పరామర్శించారు.
కరుణ ఆరోగ్యంపై కంగారు:కరుణానిధి ఆసుపత్రిలో చేరారనే సమాచారం డీఎంకే నేతలు, కార్యకర్తల్లో కంగారురేకెత్తించింది. ఈనెల మొదటి వారంలో ఆసుపత్రిలో చేరి ఆరోగ్యం కుదుటపడిందని 7వ తేదీన డిశ్చార్జయిన కరుణానిధి వారం రోజుల్లో మళ్లీ ఆసుపత్రి పాలుకావడం ఆందోళన కలిగించింది. శుక్రవారం తెల్లవారగానే పెద్ద సంఖ్యలో పార్టీ నేతలు, కార్యకర్తలు కావేరీ ఆసుపత్రి ముందు గుమికూడారు. తమ నేత ఆరోగ్యం ఎలా ఉందని ఆడిగి తెలుసుకున్నారు. కరుణానిధికి వచ్చిన ముప్పు ఏమీలేదు, కోలుకుంటున్నారని నచ్చజెప్పి పంపుతున్నారు.