ప్రముఖ దర్శకుడు బాలచందర్ పరిస్థితి విషమం
ప్రముఖ దర్శకుడు కె.బాలచందర్ పరిస్థితి విషమంగా మారింది. ప్రస్తుతం చెన్నై నగరంలోని కావేరి ఆస్పత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. ఆయన పరిస్థితి ఇబ్బందికరంగా ఉన్నట్లు అక్కడి వైద్యులు తెలిపారు. విశ్వవిఖ్యాత నటుడు కమల్హాసన్ తన గురువుగా బాలచందర్ను అభివర్ణిస్తారు. రజనీకాంత్, కమల్హాసన్, ప్రకాష్ రాజ్ లాంటి అనేకమంది ప్రముఖ నటులను చిత్ర పరిశ్రమకు పరిచయం చేసిన ఘనత బాలచందర్దే. అనారోగ్యం విషయం తెలిసిన వెంటనే కమల్హాసన్ ఆయన కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి వివరాలు కనుక్కున్నారు.
కొంతకాలంగా బాలచందర్ అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయనకు శ్వాసకోశ సమస్యలతో పాటు, మూత్రపిండాలకు సంబంధించిన సమస్యలు కూడా ఉన్నాయి. దీంతోనే ఆయన కావేరి ఆస్పత్రిలోచికిత్స పొందుతున్నారు. అయితే, సోమవారం ఉదయం ఉన్నట్టుండి బాలచందర్ ఆరోగ్యం విషమించింది. తాము ఎంత ప్రయత్నించినా చికిత్సకు ఆయన శరీరం స్పందించడం లేదని వైద్యులు అంటున్నారు. దాదాపు 80 ఏళ్ల వయసు ఉండటంతో చికిత్స కూడా కష్టం అవుతోందన్నారు. ప్రస్తుతం చెన్నైలోని కావేరి ఆస్పత్రి వద్ద బాలచందర్ అల్లుడు, మరికొందరు బంధువులు ఉన్నారు.