
అజారుద్దీన్ పాత్రలో హష్మి
బాలీవుడ్‌లో డర్టీ పిక్చర్, పాన్ సింగ్ తోమార్, భాగ్ మిల్కా భాగ్ చిత్రాల తర్వాత జీవిత కథల నేపథ్యం ఉన్న చిత్రాల నిర్మాణం జోరందుకుంది. తాజాగా బాక్సర్ మేరి కోమ్ జీవిత కథను ఆధారంగా చేసుకుని రూపొందుతోన్న ఓ చిత్రంలో ప్రియాంకా చోప్రా నటిస్తుండగా, సంజయ్‌లీలా భన్సాలీ నిర్మిస్తున్నారు. అదే ఊపులో క్రికెటర్ అజారుద్దీన్ బయోపిక్‌గా ఓ చిత్రంగా సిద్ధమవుతోంది. ఈ చిత్రంలో అజార్ పాత్రకోసం అజయ్ దేవగన్, ఇమ్రాన్ హష్మిల పేర్లను పరిశీలించారు. అయితే చిట్టచివరకు ఆ అవకాశం ‘సీరియల్ కిస్సర్’ హష్మీని వరించింది. స్వతహాగా క్రీడలంటే ఇష్టపడే హష్మీ... తనకు అజారుద్దీన్ పాత్ర దక్కడంపై ఆనందం వ్యక్తం చేస్తున్నాడు. క్రీడాకారుడిగానే కాకుండా ఎంపీగా సేవలందిస్తున్న అజార్ జీవితంలో మ్యాచ్ ఫిక్సింగ్, భార్యతో విడాకులు, ప్రమాదంలో కుమారుణ్ణి కోల్పోవడం లాంటి అనేక ఆసక్తికర అంశాలు ముడిపడి ఉన్న సంగతి తెలిసిందే. ప్రముఖ నిర్మాత ఏక్తా కపూర్ ఈ చిత్రానికి నిర్మాత అని సమాచారం.