
కుప్పకూలిన ఏరోస్,మంధనా షేర్లు
ముంబైః బాలీవుడ్ అగ్ర కథానాయకుడు సల్మాన్ ఖాన్ను దోషిగా నిర్ధారిస్తూ ముంబై సెషన్స్ కోర్టు వెలువరించిన తీర్పు స్టాక్ మార్కెట్ లోని మీడియా షేర్లపై ప్రభావాన్ని చూపించింది. తీర్పు వెలువడిన వెంటనే సల్మాన్ ఖాన్ తో సంబంధం ఉన్న షేర్లు కుప్పకూలాయి. ముఖ్యంగా ప్రముఖ నిర్మాణ సంస్థ ఏరోస్ ఇంటర్ నేషనల్ మీడియా, మంధనా ఇండస్ట్రీస్ లిమిటెడ్ షేర్లలో భారీగా అమ్మకాలు జరిగాయి. ఈరెండు షేర్లు బిఎస్సీలో దాదాపు 5 శాతం నష్టాలను చవి చూశాయి.
సల్లూ భాయ్ ఆధ్వర్యంలో నడుస్తున్న ఫౌండేషన్ బీయింగ్ హ్యూమన్ కు మంథన్ ఇండస్ట్రీస్ మధ్య వాణిజ్య ఒప్పందం కూడా ఉంది. ఈ ఫౌండేషన్కు సంబంధించిన వస్త్ర డిజైనింగ్, మార్కెటింగ్ మరియు పంపిణీ కి సంబంధించిన అంశాలలో వీరి మధ్య అవగాహన ఉన్నట్టు సమచారం. అలాగే సల్మాన్ అప్ కమింగ్ మూవీస్ భజరంగి భాయిజాన్, హీరో సినిమాలకు సంబంధించి గత డిసెంబర్లో ఏరోస్ ఇంటర్నేషనల్ సంస్థతో ఒపందం కుదుర్చుకున్నాడు సల్మాన్. దీంతో తాజా తీర్పు నేపథ్యంలో ఆందోళనకు గురైన ఇన్వెస్టర్లు భారీగా అమ్మకాలకు పాల్పడినట్టు ఎనలిస్టులు అంచనా వేస్తున్నారు.
కాగా హిట్ అండ్ రన్ కేసులో బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్కు అయిదేళ్ల జైలు శిక్షను విధిస్తే బుధవారం మధ్యాహ్నం ముంబై సెషన్స్ కోర్టు న్యాయమూర్తి డీడబ్ల్యూ దేశ్‌పాండే ఈ మేరకు తీర్పును వెలువరించారు. సల్మాన్ కు జైలు శిక్షతో పాటు 25 వేల రూపాయల జరిమానా విధించారు. సల్మాన్ ను ముంబయి పోలీసులు అదుపులోకి తీసుకుని ఆర్థర్ రోడ్డు జైలుకు తరలించారు.