నటుడిగా నా బాధ్యత పెరిగింది : ఎన్టీఆర్
‘‘నేను మామూలుగా సినిమా కలెక్షన్ల గురించి పట్టించుకోను. అభిమానుల కళ్లల్లో ఆనందమే నాకు ముఖ్యం. ఈ ‘టెంపర్’ చిత్రం ప్రతి అభిమానిలో ఆనందం నింపింది. అలాగే నటుడిగా నా బాధ్యతను కూడా పెంచింది. వక్కంతం వంశీ చాలా మంచి కథను ఇచ్చారు. పూరి జగన్నాథ్ తప్ప ఏ దర్శకుడూ ఈ కథను తెరకెక్కించలేరు. అంత బాగా తీశారు’’ అని హీరో ఎన్టీఆర్ అన్నారు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఎన్టీఆర్, కాజల్ అగర్వాల్ జంటగా బండ్ల గణేష్ నిర్మించిన చిత్రం ‘టెంపర్’.
ఈ చిత్ర విజయోత్సవం శనివారం సాయంత్రం హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ- ‘‘జీవితం చాలామందికి సరదా తీర్చేస్తుంది... అలానే ఓ బ్లాక్ బస్టర్ ఇస్తుంది. మాకది ‘టెంపర్’ రూపంలో వచ్చింది. నీతో (ఎన్టీఆర్) వర్క్ చేయడానికి నేనెప్పుడూ రెడీ. మంచి కథ ఇచ్చిన వంశీకి ధన్యవాదాలు. ‘ఇది మన జీవితాలను మార్చేసే సినిమా’ అని ప్రకాశ్‌రాజ్ అనేవారు. అది నిజమైంది’’ అన్నారు. ప్రకాశ్‌రాజ్ మాట్లాడుతూ - ‘‘మానవ సంబంధాల గురించి ఈ కథలో చాలా బాగా చెప్పారు. తారక్ నట విశ్వరూపాన్ని దయా పాత్ర చూపించింది. ఇలాంటి పాత్రలను అతను మళ్లీ మళ్లీ చేయాలి’’ అని చెప్పారు.
బండ్ల గణేశ్ మాట్లాడుతూ - ‘‘ఈ చిత్రం విడుదల రోజు వరకు మా అందరికీ టెంపర్! ఆ మరుసటిరోజు నుంచి బంపర్! పూరి, తారక్ అవకాశం ఇస్తే, మళ్లీ ‘టెంపర్’లాంటి సినిమా నిర్మిస్తా. ఈ చిత్ర విజయంతో ఏడాదికి రెండు సినిమాలు చేయాలనుకుం టున్నా’’ అన్నారు. రచయిత వక్కంతం వంశీ మాట్లాడుతూ - ‘‘ఏ రచయితకైనా స్వేచ్ఛ కావాలి. పూరి నాకు ఆ స్వేచ్ఛ ఇచ్చారు. మంచి ఎక్కడున్నా తీసు కోవడం పూరీగారిలో ఉన్న మంచి లక్షణం. ఆయనతో పని చేయాలని చాలాసార్లు ప్రయ త్నించా.
ఈ చిత్రంతో కుదిరింది. ఈ కథలో ఎన్టీఆర్‌ని తప్ప నేనెవర్నీ ఊహించ లేదు. దయా పాత్రలో ఆయన పరకాయ ప్రవేశం చేశారు’’ అని చెప్పారు. చిత్ర సాంకేతిక నిపుణులు అనూప్ రూబెన్స్, భాస్కరభట్ల, కందికొండ, బ్రహ్మ కడలితో పాటు గణేశ్ మిత్రుడైన నటుడు సచిన్ జోషీ, పి.నాగేంద్రకుమార్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అదే వేదికపై వక్కంతం వంశీ పుట్టినరోజు వేడుకలను నిర్వహించారు.