
అంతా దైవ నిర్ణయం!
‘‘ఈ చిత్ర దర్శక, నిర్మాతలు ఓ పాత్ర కోసం నన్ను సంప్రతించారు. అప్పుడు మా అబ్బాయిని చూసి హీరో చేద్దామని అడిగారు. ఇదంతా దైవ నిర్ణయంగా భావించి ఓకే చెప్పాను’’ అని నటుడు బాలాజీ చెప్పారు. సీరియల్స్, సినిమాల ద్వారా బాలాజీ మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే. ఆయన తనయుడు రోహన్ హీరోగా సూరజ్ ప్రొడక్షన్స్ పతాకంపై గోపి కాకర్ల దర్శకత్వంలో ఉమ నిర్మిస్తున్న చిత్రం ‘అవంతిక’. మనీషా కథానాయిక.
ఈ సినిమా ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత దామోదర్‌ప్రసాద్ కెమెరా స్విచ్చాన్ చేయగా, తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ క్లాప్ ఇచ్చారు. ‘‘ఇద్దరు ప్రేమికులు తమకెదురైన సమస్యలను పరిష్కరించుకుంటూ ప్రేమను ఎలా గెలిపించుకున్నారనే కథాంశంతో ఈ చిత్రం ఉంటుంది’’ అని దర్శకుడు అన్నారు. వచ్చే నెలలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తామని నిర్మాత తెలిపారు. లవర్‌బోయ్ పాత్రలో కనిపించనున్నానని హీరో రోహన్ తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: భోలే శావలి, కెమెరా: ఎస్.వి.శివారెడ్డి, ఎడిటింగ్: వినాయక్.