ఆస్కార్ బరిలో బెస్ట్ డైరెక్టర్స్..
ఆస్కార్ అవార్డుల ప్రదానానికి సరిగ్గా రెండు వారాల సమయం ఉంది. ఒక సోమవారం పోయి, ఇంకో సోమవారం వచ్చేస్తే, ఎవరెవరు ఆస్కార్ చేతిలో పట్టుకొని ఇంటికెళతారో తెలిసిపోతుంది. ఇప్పటికే ఎవరెవరు గెలుస్తారనేదానిపై ఎక్కడిలేని చర్చ జరుగుతోంది. అందులోనూ ‘బెస్ట్ డైరెక్టర్’ క్యాటగిరీకి వచ్చేసరికి ఆ చర్చ తారాస్థాయికి చేరుకుంది. ఈసారి బెస్ట్ డైరెక్టర్‌కు నామినేట్ అయిన వారిలో అందరూ డిఫరెంట్ జానర్ సినిమాలకు నామినేట్ అయినవారే! ఈ లిస్ట్‌లో ఉన్నవారంతా ఇప్పటివరకూ ఒక్క ఆస్కార్ కూడా పొందలేదు. కాబట్టి ఇందులో ఎవ్వరు ఆస్కార్ కొట్టినా అది ఫస్టే!! బెస్ట్ డైరెక్టర్‌కు నామినేట్ అయిన దర్శకుల గురించి ఈ వారం చూద్దాం..
క్రిస్టొఫర్ నోలన్ (సినిమా: డంకర్క్)
ఇరవై ఏళ్లుగా హాలీవుడ్‌ను ఓ ఊపు ఊపేస్తోన్న డైరెక్టర్ క్రిస్టొఫర్ నోలన్. ఆయన సినిమాలకు పిచ్చిగా అభిమానులు ఉన్నారు. ఆయన సినిమా వస్తోందంటే బాక్సాఫీస్ బద్దలైపోతుంది. ఇప్పుడున్న వాళ్లలో టాప్ కమర్షియల్ డైరెక్టర్ ఎవరంటే అందరూ నోలన్ పేరే చెప్పేస్తారు. అలాంటి నోలన్‌కు బెస్ట్ డైరెక్టర్ క్యాటగిరీలో ‘డంకర్క్’ వరకూ ఒక్క నామినేషన్ కూడా దక్కలేదు. తన శైలికి భిన్నంగా.. రెండో ప్రపంచయుద్ధం నేపథ్యంలో, డంకర్క్ ఎవాక్యుయేషన్‌ను కథగా ఎంచుకున్న నోలన్, టైమ్ అనే అంశాన్ని ‘డంకర్క్’ సినిమాలో బలంగా వాడుకుంటూ సక్సెస్ సాధించాడు.
వార్ జానర్ సినిమాల్లో డంకర్క్ ఓ అద్భుతమైన ప్రయోగం. అలాంటి సినిమాకు నామినేట్ అవ్వడంతో సహజంగానే నోలన్ ఆస్కార్ కూడా అందుకోవడం పక్కా అని అభిమానులు భావిస్తున్నారు. గతంలో స్క్రీన్‌ప్లేకు రెండు, నిర్మాతగా ఒక ఆస్కార్‌కు నామినేట్ అయిన నోలన్.. ఒక్క ఆస్కార్ కూడా అందుకోలేదు. ఈసారి ఆయనకే అవార్డు వస్తే, బెస్ట్ డైరెక్టర్‌గా అవార్డు అందుకుంటాడు నోలన్. అది ఆయన అభిమానులు ఎప్పట్నుంచో కంటోన్న ఓ గొప్ప కల!
గెలెర్మో దెల్‌తోరో (సినిమా: ది షేప్ ఆఫ్ వాటర్)
నోలన్ తర్వాత ఈ లిస్ట్‌లో బెస్ట్ డైరెక్టర్ అవార్డు అందుకుంటాడన్న క్రేజ్ గెలెర్మో సొంతం చేసుకున్నాడు. ‘ది షేప్ ఆఫ్ వాటర్’తో ఇప్పటికే పలు అవార్డు వేడుకల్లో సత్తా చాటిన గెలెర్మో ఆస్కార్ రేసులో భారీ అంచనాల మధ్యనే అవార్డు అందుకుంటాడన్న పేరు తెచ్చుకున్నాడు. గెలెర్మోకి గతంలో ఒక నామినేషన్ దక్కింది. ఇప్పుడిది రెండోది. ఈసారి ఆస్కార్‌ను సొంతం చేసుకుంటే ఆయనకిది ఫస్ట్ ఆస్కార్. ‘ది షేప్ ఆఫ్ వాటర్’తో బెస్ట్ సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చాడన్న పేరు తెచ్చుకున్నాడు గెలెర్మొ.
జోర్డన్ పీలే ( సినిమా: గెటౌట్)
కామెడీ నటుడు, రచయిత జోర్డన్ పీలే దర్శకుడిగా మారి చేసిన మొదటి సినిమా ‘గెటౌట్’. మొదటి సినిమాకే జోర్డన్ ఆస్కార్‌కు నామినేట్ అవ్వడం విశేషం. ఆఫ్రికన్ – అమెరికన్ సంతతికి చెందిన వారిలో ఆస్కార్‌కు నామినేట్ అయిన ఐదోవాడు జోర్డన్. ఇతనే గనక బెస్ట్ డైరెక్టర్‌గా ఆస్కార్ కూడా అందుకుంటే, ఈ ఐదుగురిలో ఆస్కార్ అందుకున్న మొదటివాడవుతాడు జోర్డన్. హారర్ కామెడీ జానర్లో జోర్డన్ ‘గెటౌట్’లో చేసిన ప్రయోగం అద్భుతమైన రెస్పాన్స్ తెచ్చుకుంది. మేకింగ్ పరంగా తనకంటూ ఒక స్టైల్ సెట్ చేసుకున్నాడతను. నోలన్, గెల్మెరోలకు పోటీ ఇచ్చేలా జోర్డన్ కనిపించడం లేదని సినీ పండితుల అభిప్రాయం. కానీ ఆస్కార్‌కు నామినేట్ అయిన వారిలో ఎవరు గెలుస్తారన్నది చివరివరకూ చెప్పలేం కాబట్టి వేచి చూడాల్సిందే!
పాల్ థామస్ ఆండర్సన్ (సినిమా: ఫాంటమ్ థ్రెడ్)
ఆండర్సన్ ఈ లిస్ట్‌లో ఆస్కార్‌కు బాగా దగ్గరి వ్యక్తి. గతంలో ఆరుసార్లు ఆస్కార్‌కు నామినేట్ అయిన ఆండర్సన్, అవార్డు అయితే ఒక్కటీ అందుకోలేదు. ఇంగ్లాండ్ నేపథ్యంలో 1950ల కాలంలో నడిచే కథ పట్టుకొని, ‘ఫాంటమ్ థ్రెడ్’తో ఆండర్సన్ ఒక బెస్ట్ సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చాడు. మేకింగ్‌లో ఆయన స్థాయిని ఈ సినిమాలో అడుగడుగునా చూడొచ్చు. ‘ఫాంటమ్ థ్రెడ్’ కమర్షియల్‌గా మంచి సక్సెస్. విమర్శకుల ప్రశంసలను కూడా అందుకుంది.
ఇప్పటికే ఆరుసార్లు ఆస్కార్ మిస్ అయిన ఆండర్సన్ ఈసారైనా అవార్డు అందుకుంటాడని ఆయన అభిమానులు ఆశిస్తున్నారు. ఈ లిస్ట్‌లో ఆండర్సన్‌పై పెద్దగా అంచనాలైతే లేవుకానీ, పోటీ అయితే బాగానే ఇచ్చేలా కనిపిస్తున్నాడు. డిఫరెంట్ జానర్లో తమ బ్రాండ్ చాటుకున్న ఈ దర్శకుల్లో ఆస్కార్ ఎవరు అందుకుంటారన్నది తెలియాలంటే మార్చి 4 వరకూ ఎదురు చూడాల్సిందే! మరి ఆరోజు బెస్ట్ డైరెక్టర్ క్యాటగిరీలో ‘అన్డ్ ది అవార్డ్ గోస్ టూ..’ అనగానే ఎవరు లేచి నిలబడతారన్నది ఎదురు చూడాల్సిందే!!
గెటా గర్విగ్ (సినిమా: లేడీ బర్డ్)
ఏ సినీ పరిశ్రమలో అయినా డైరెక్టర్ అనేసరికి మేల్ డామినేషనే కనిపిస్తుంది. ఎక్కడో మెరుపుల్లా వుమన్ డైరెక్టర్స్ కనిపిస్తారు. గెటా గర్విగ్ చిన్న మెరుపు కాదు. మామూలు మెరుపు కూడా కాదు. ‘లేడీ బర్డ్’ సినిమాతో ఆమె హాలీవుడ్‌కు పరిచయమై, మొదటి సినిమాతోనే ఒక స్టార్ అనిపించుకుంది. 90 ఏళ్ల ఆస్కార్ చరిత్రలో బెస్ట్ డైరెక్టర్‌గా ఇప్పటివరకూ నామినేట్ అయిన లేడీ డైరెక్టర్స్ ఐదుగురే! అందులో ఒక్కరికే (కేథరిన్ బైగ్లో – 2010) అవార్డు దక్కించుకుంది. ఇప్పుడు గెటా గనక అవార్డు దక్కించుకుంటే ఆమె రెండో వ్యక్తి అవుతుంది. ఒక కమింగ్ ఆఫ్ ఏజ్ కథను చాలా సున్నితంగా, అద్భుతంగా సినిమాగా ఆవిష్కరించిన గెటా, ‘లేడీ బర్డ్’తో కమర్షియల్ సక్సెస్, విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది.
Comments
Please login to add a commentAdd a comment