
బిగ్‌బాస్‌లోకి మళ్లీ రాను: నటి
చెన్నై: తమిళ బిగ్‌బాస్ రియాలిటీ గేమ్ షోలోకి మళ్లీ వచ్చేది లేదని నటి ఓవియ స్పష్టం చేశారు. షోలో తనను కార్నర్ చేసిన వారిని ద్వేషించొద్దని అభిమానులను కోరారు. ఈ మేరకు యూట్యూబ్‌లో వీడియో పెట్టారు. బిగ్‌బాస్ షోలో తనకెదురైన అనుభవాలు, తాను బయటకు వెళ్లిపోవడానికి దారి తీసిన పరిస్థితులు, ఆరవ్‌తో తన ప్రేమాయణం, ఇటీవల మారిన తన హెయిర్‌స్టైల్ గురించి ఈ వీడియోలో ప్రస్తావించారు.
ప్రేమ పట్ల తనకు పూర్తి నమ్మకం ఉందని, తనది నిజమైన ప్రేమని స్పష్టం చేశారు. బిగ్‌బాస్ షో నుంచి తాను బయటకు రావడానికి కారణమైన జూలీ, శక్తిలను కార్నర్ చేయొద్దని అభిమానలకు విజ్ఞప్తి చేశారు. 'మనల్ని ఎవరైనా కార్నర్ చేస్తే ఆ బాధ ఎలావుంటుందో నాకు తెలుసు. అందుకే జూలీ, శక్తిలను కార్నర్ చేయొద్దని కోరుతున్నా. తప్పులు చేయడం మానవ నైజం. దానికి నేను కూడా మినహాయింపు కాదు. అందరిలాగే నేను కూడా పెర్‌ఫెక్ట్ కాదు. కాబట్టి వారిని కార్నర్ చేయొద్దు. అభిమానులు ఇలా చేయడం నాకు ఇష్టముండద'ని వీడియోలో ఓవియ పేర్కొన్నారు.
ప్రస్తుతం కేరళలోని కొచ్చిన్‌లో ఆనందంగా గడుపుతున్నానని తెలిపారు. మారిన తన హెయిర్ స్టెయిల్ గురించి చెబుతూ.. కేన్సర్ బాధితుల కోసం తన జుట్టును దానం చేసినట్టు వెల్లడించారు. బిగ్‌బాస్‌ను తిరిగిరానని, వెండి తెరపై తనను ఆదరించాలని అభిమానులను కోరారు.