ప్రేక్షకులు గెలిచి... మమ్మల్ని గెలిపించారు
- దర్శకుడు క్రాంతి మాధవ్
వెండితెరకు ఎన్నో ప్రేమకథలు వస్తుంటాయ్. కానీ, ఎప్పటికీ గుర్తుండిపోయేవి కొన్నే ఉంటాయ్. అలాంటివాటిలో ‘మళ్లీ మళ్లీ ఇది రాని రోజు’కి సముచిత స్థానమే ఉంటుంది. ‘తియ్యని బాధ’ అంటారు.. ఈ చిత్రం ప్రేక్షకులను అలాంటి అనుభూతికే గురి చేస్తుంది. శర్వానంద్, నిత్యామీనన్ జంటగా క్రాంతి మాధవ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం గత వారం విడుదలైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా క్రాంతి మాధవ్‌తో జరిపిన ఇంటర్వ్యూ...
‘ఓనమాలు’వంటి చక్కని చిత్రం తర్వాత మీరు చేసిన చిత్రం ఇది.. కమర్షియల్ సక్సెస్ విషయంలో ఏమైనా టెన్షన్ పడ్డారా?
కమర్షియల్ సక్సెస్ ముఖ్యమే. కానీ, నేను రాసుకున్న ప్రేమ కథ సినిమాటిక్‌గా ఉండదు. ప్రేమలో ఓ నమ్మకం ఉంటుంది. ఆ నమ్మకాన్ని నమ్మి, ఈ చిత్రాన్ని వెండితెరపై ఆవిష్కరించాలనుకున్నాను. స్వచ్ఛమైన ప్రయత్నానికి గెలుపు ఖాయం అని నమ్మాను. రామారావుగారు, శర్వానంద్, నిత్యామీనన్ అందరూ కథను నమ్మారు. మా నమ్మకం నిజమైంది.
ఇందులో టీనేజ్ పిల్లలకు తల్లిదండ్రులుగా నటించాలనప్పుడు శర్వానంద్, నిత్యామీనన్ ఏమన్నారు?
ఈ కథ రాసుకున్న తర్వాత, హీరో హీరోయిన్లుగా శర్వానంద్, నిత్యామీనన్ అయితేనే న్యాయం జరుగుతుందనుకున్నా. కథ వినగానే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఇద్దరూ ఒప్పుకున్నారు. వాళ్లు కథను నమ్మినట్లుగానే ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులూ నమ్మారు. ఇంతమంది నమ్మకం నిజం కావాలనుకున్నా. అదే జరిగింది.
ప్రేక్షకులతో కలిసి ఈ చిత్రం చూశారా?
స్వయంగా వారి స్పందన తెలుసుకోవాలని థియేటర్‌కెళ్లా. హౌస్‌ఫుల్ బోర్డ్ చూసి, పులకించిపోయా. ప్రేక్షకులు స్పందించిన తీరు చూసి, ఓ దర్శకుడిగా ఇంతకన్నా కావాల్సింది ఏముంది? అనిపించింది. ఇలాంటి మంచి చిత్రాన్ని ఆదరించడం ద్వారా ప్రేక్షకులు గెలిచి.. మమ్మల్ని గెలిపించారు.
ఈ సినిమా విజయానికి ప్రధాన కారణాలేమిటనుకుంటున్నారు?
శర్వానంద్, నిత్యామీనన్‌ల నటనతో పాటు బుర్రా సాయిమాధవ్ సంభాషణలు, గోపీసుందర్ సంగీతం, జ్ఞానశేఖర్ ఛాయాగ్రహణం.. ఈ చిత్రవిజయానికి ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఈ సినిమాకి ఏం అడిగినా కాదనుకుండా సమకూర్చిన కేయస్ రామారావుగారి గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది.
ఈ విజయం ఎలాంటి అనుభూతిని మిగిల్చింది?
మంచి కథతో సినిమాలు తీస్తే ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకం మరింత బలపడింది. అందుకే నా తదుపరి చిత్రాలకు కూడా కథపై ఎక్కువ దృష్టి సారిస్తా.
ఈ మధ్యకాలంలో వచ్చిన ప్రేమకథలు చాలావరకు యువతను లక్ష్యంగా చేసి, తీసినట్లుగా ఉంటాయి. కానీ.. ఈ చిత్రాన్ని..?
యూత్‌తో పాటు కుటుంబ ప్రేక్షకులను టార్గెట్ చేసి, తీశా. అన్ని వయసులవారూ ఈ సినిమా చూసి, బాగుందంటున్నారు. అభ్యంతరకరమైన సీన్లు, ద్వంద్వార్థాలు లేకుండా సినిమా హాయిగా ఉందంటున్నారు.
మీ తదుపరి చిత్రం?
ఈ విజయాన్ని ఆస్వాదిస్తున్నా. ఓ ఉద్వేగపూరితమైన ప్రేమకథను అందించాను. తదుపరి మరో వినూత్న కథాంశంతో సినిమా చేయాలనుకుంటున్నా.