Malli Malli Idi Rani Roju
-
మ్యూజిక్ డైరెక్టర్ టు హీరో!
‘మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు, భలే భలే మగాడివోయ్, ఊపిరి, ప్రేమమ్, నిన్ను కోరి’ వంటి చిత్రాలకు పాటలు అందించి, తెలుగు శ్రోతలను ఆకట్టుకున్నారు మలయాళ సంగీత దర్శకుడు గోపీ సుందర్. మలయాళంలో ఎన్నో సినిమాలకు సంగీతం అందించిన ఆయన తమిళ, హిందీ సినిమాలకూ మ్యూజిక్ అందిస్తుంటారు. ఇప్పుడు ఆయన నటనపై దృష్టి సారించారు. హరికృష్ణన్ దర్శకత్వంలో గోపీసుందర్ లీడ్ రోల్ చేస్తున్న సినిమా ‘టోల్ గేట్’. ‘టాలెంటెడ్ అండ్ మై గుడ్ ఫ్రెండ్ గోపీ సుందర్ యాక్ట్ చేస్తున్న మొదటి సినిమాని అనౌన్స్ చేయడం ఆనందంగా ఉంది. మ్యూజిక్‌తో మ్యాజిక్ చేసిన గోపీ యాక్టింగ్‌తోనూ ఆడియన్స్‌ను మ్యాజిక్ చేస్తాడని నమ్ముతున్నాను’’ అంటూ గోపీ సుందర్ ఫస్ట్ లుక్‌ను హీరో దుల్కర్ రిలీజ్ చేశారు. ‘మిస్టర్ ఫ్రాడ్’, ‘సలాలా మొబైల్స్’ చిత్రాల్లో గెస్ట్ రోల్ చేసిన గోపీ ఇప్పుడు ఫుల్ లెంగ్త్ రోల్ చేస్తున్న తొలి చిత్రం ‘టోల్ గేట్’. -
లక్ష్మి మంచు 'మళ్లీమళ్లీ ఇది రానిరోజు'
చెన్నై: లక్ష్మీ టాక్ షో, ప్రేమతో మీ లక్ష్మి వంటి కార్యక్రమాలతో బుల్లితెరపై తన ప్రత్యేకతను నిలుపుకున్న నటి, నిర్మాత లక్ష్మి మంచు మళ్లీ మరో కొత్త టీవీషోతో మెరవనున్నారు. 'మళ్లీమళ్లీ ఇది రానిరోజు' అనే కార్యక్రమంతో బుల్లితెర పునఃప్రవేశానికి సిద్ధమవుతున్నారు. బుల్లితెరపై పునఃప్రవేశానికి తాను ఆత్రంగా ఎదురు చూస్తున్నట్లు లక్ష్మి మంచు చెప్పారు. తన మునుపటి కార్యక్రమాలకు ఇది చాలా భిన్నంగా ఉంటుందని తెలిపారు. అద్భుతమైన ఈ అవకాశం పట్ల తాను చాలా సంతోషంగా ఉన్నట్లు చెప్పారు. ఈ షోకు కావలసిన సెట్ పని జరుగుతోందన్నారు. ఈ నెల 25 నుంచి షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉందని తెలిపారు. ప్రముఖ ఎంటర్టెయిన్మెంట్ ఛానల్లో జూన్ 1 నుంచి ఈ షో ప్రారంభమవుతుందని లక్ష్మి మంచు చెప్పారు. -
ప్రేక్షకులు గెలిచి... మమ్మల్ని గెలిపించారు
- దర్శకుడు క్రాంతి మాధవ్ వెండితెరకు ఎన్నో ప్రేమకథలు వస్తుంటాయ్. కానీ, ఎప్పటికీ గుర్తుండిపోయేవి కొన్నే ఉంటాయ్. అలాంటివాటిలో ‘మళ్లీ మళ్లీ ఇది రాని రోజు’కి సముచిత స్థానమే ఉంటుంది. ‘తియ్యని బాధ’ అంటారు.. ఈ చిత్రం ప్రేక్షకులను అలాంటి అనుభూతికే గురి చేస్తుంది. శర్వానంద్, నిత్యామీనన్ జంటగా క్రాంతి మాధవ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం గత వారం విడుదలైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా క్రాంతి మాధవ్‌తో జరిపిన ఇంటర్వ్యూ... ‘ఓనమాలు’వంటి చక్కని చిత్రం తర్వాత మీరు చేసిన చిత్రం ఇది.. కమర్షియల్ సక్సెస్ విషయంలో ఏమైనా టెన్షన్ పడ్డారా? కమర్షియల్ సక్సెస్ ముఖ్యమే. కానీ, నేను రాసుకున్న ప్రేమ కథ సినిమాటిక్‌గా ఉండదు. ప్రేమలో ఓ నమ్మకం ఉంటుంది. ఆ నమ్మకాన్ని నమ్మి, ఈ చిత్రాన్ని వెండితెరపై ఆవిష్కరించాలనుకున్నాను. స్వచ్ఛమైన ప్రయత్నానికి గెలుపు ఖాయం అని నమ్మాను. రామారావుగారు, శర్వానంద్, నిత్యామీనన్ అందరూ కథను నమ్మారు. మా నమ్మకం నిజమైంది. ఇందులో టీనేజ్ పిల్లలకు తల్లిదండ్రులుగా నటించాలనప్పుడు శర్వానంద్, నిత్యామీనన్ ఏమన్నారు? ఈ కథ రాసుకున్న తర్వాత, హీరో హీరోయిన్లుగా శర్వానంద్, నిత్యామీనన్ అయితేనే న్యాయం జరుగుతుందనుకున్నా. కథ వినగానే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఇద్దరూ ఒప్పుకున్నారు. వాళ్లు కథను నమ్మినట్లుగానే ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులూ నమ్మారు. ఇంతమంది నమ్మకం నిజం కావాలనుకున్నా. అదే జరిగింది. ప్రేక్షకులతో కలిసి ఈ చిత్రం చూశారా? స్వయంగా వారి స్పందన తెలుసుకోవాలని థియేటర్‌కెళ్లా. హౌస్‌ఫుల్ బోర్డ్ చూసి, పులకించిపోయా. ప్రేక్షకులు స్పందించిన తీరు చూసి, ఓ దర్శకుడిగా ఇంతకన్నా కావాల్సింది ఏముంది? అనిపించింది. ఇలాంటి మంచి చిత్రాన్ని ఆదరించడం ద్వారా ప్రేక్షకులు గెలిచి.. మమ్మల్ని గెలిపించారు. ఈ సినిమా విజయానికి ప్రధాన కారణాలేమిటనుకుంటున్నారు? శర్వానంద్, నిత్యామీనన్ల నటనతో పాటు బుర్రా సాయిమాధవ్ సంభాషణలు, గోపీసుందర్ సంగీతం, జ్ఞానశేఖర్ ఛాయాగ్రహణం.. ఈ చిత్రవిజయానికి ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఈ సినిమాకి ఏం అడిగినా కాదనుకుండా సమకూర్చిన కేయస్ రామారావుగారి గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఈ విజయం ఎలాంటి అనుభూతిని మిగిల్చింది? మంచి కథతో సినిమాలు తీస్తే ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకం మరింత బలపడింది. అందుకే నా తదుపరి చిత్రాలకు కూడా కథపై ఎక్కువ దృష్టి సారిస్తా. ఈ మధ్యకాలంలో వచ్చిన ప్రేమకథలు చాలావరకు యువతను లక్ష్యంగా చేసి, తీసినట్లుగా ఉంటాయి. కానీ.. ఈ చిత్రాన్ని..? యూత్‌తో పాటు కుటుంబ ప్రేక్షకులను టార్గెట్ చేసి, తీశా. అన్ని వయసులవారూ ఈ సినిమా చూసి, బాగుందంటున్నారు. అభ్యంతరకరమైన సీన్లు, ద్వంద్వార్థాలు లేకుండా సినిమా హాయిగా ఉందంటున్నారు. మీ తదుపరి చిత్రం? ఈ విజయాన్ని ఆస్వాదిస్తున్నా. ఓ ఉద్వేగపూరితమైన ప్రేమకథను అందించాను. తదుపరి మరో వినూత్న కథాంశంతో సినిమా చేయాలనుకుంటున్నా. -
సినిమా రివ్యూ - మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు!
చిత్రం - మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు, తారాగణం - శర్వానంద్, నిత్యామీనన్, పవిత్రా లోకేశ్, నాజర్, సూర్య, మాటలు - సాయిమాధవ్ బుర్రా, పాటలు - సాహితి, రామజోగయ్యశాస్త్రి, సంగీతం - గోపీ సుందర్, కెమేరా - జ్ఞానశేఖర్, ఎడిటింగ్ - కోటగిరి వెంకటేశ్వరరావు, సమర్పణ - కె.ఎస్. రామారావు, నిర్మాత - కె. వల్లభ, దర్శకత్వం - కె. క్రాంతిమాధవ్ ..................................... ఇటీవలి కాలంలో తెలుగు సినిమా ఒక నిర్దిష్టమైన కొలతల మధ్యలో సాగుతోంది. కామెడీ ట్రాక్‌లు, విలన్ ఇంటికే హీరో వెళ్ళి, హీరోయిన్ను పెళ్ళాడడం, లేదంటే హీరో వర్సెస్ విలన్ - ఇలాంటి కథల మధ్యనే దారీతెన్నూ లేక కొట్టుమిట్టాడుతోంది. అందుకే, ఈ మూసను బద్దలు కొట్టే ఏ చిన్న ప్రయత్నమైనా సరే, ఈ రోజుల్లో అది పెద్ద విషయం. కామెడీ ట్రాక్‌లు, ఫైట్లు, యువతను ఆకర్షించే అతి జోకులు లేకుండానే వచ్చిన వెండితెర ప్రయత్నం - ‘మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు’. అందుకే, ఈ సినిమాను ప్రత్యేకంగా చూడాలి. అసలైన ప్రేమలు పోయి, అశాశ్వతమైన ఆకర్షణలే ప్రేమగా నవతరం భ్రమపడుతున్న సమయంలో వచ్చిన పాతకాలపు ప్రేమకథ... అసలు సిసలు ప్రేమంటే ఇదీ అనే చెప్పే కథ... ఇది. కథేమిటంటే... ఈ పాతకాలపు ఆహ్లాదకరమైన ప్రేమకథలో రాజారామ్ (శర్వానంద్) ఓ కోటీశ్వరుడు. మైదానంలో పరిగెడుతున్న నవతరం అథ్లెట్లను చూస్తూ, ఒకప్పటి తన అథ్లెట్ జీవితాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటాడు. అతని కూతురు పార్వతి. ఓ ప్రైవేట్ రేడియో చానల్లో రేడియో జాకీగా పనిచేస్తుంటుంది. ప్రేమ విషయంలో విఫలమైన రాజారామ్ ఫ్లాష్‌బ్యాక్‌కు వెళితే... పరుగుపందేనికి అవసరమైన స్పైక్ షూస్ కొనుక్కునే స్థోమత కూడా లేని ఓ సగటు మధ్యతరగతి కుటుంబానికి చెందిన అథ్లెట్ రాజారామ్. అతని తల్లి పార్వతమ్మ (పవిత్రా లోకేశ్) కష్టపడి, పిల్లలకు సంగీత పాఠాలు చెబుతూ ఆ డబ్బులతో ఇల్లు గడుపుతుంటుంది. స్టేట్ ఛాంపియన్‌గా నిలిచి, నేషనల్స్‌కు వెళుతున్న రాజారామ్, కాలేజీలోని సాయిబుల అమ్మాయి నజీరా (నిత్యామీనన్) బురఖాలో చూసి, తొలిచూపులోనే ప్రేమిస్తాడు. కళ్ళను మాత్రమే చూసి ప్రేమించినది అతనైతే, అతణ్ణి, అతనిలోని ప్రతిభనూ చూసి తానూ ప్రేమిస్తుంది నజీరా. తీరా వాళ్ళ ప్రేమ ఒక కొలిక్కి వచ్చే సందర్భంలో హీరో, తన తల్లిని కోల్పోతాడు. హీరోయిన్ అనుకోని రీతిలో మలేసియాలో తండ్రి దగ్గరకు వెళుతుంది. ఈ మతాంతర వివాహానికి అమ్మాయి తండ్రి (నాజర్) కూడా ఒప్పుకోడు. దాంతో, మలేసియాలో ఆమె, ఇండియాలో ఇతను ఉండిపోతారు. దొరికిన పిల్లను పెంచి పెద్ద చేసి, కనకుండానే అమ్మ అయిన హీరోయిన్ తన కూతురితో అసలైన ప్రేమ గురించి సవాలు విసిరి, ఇండియాకు వస్తుంది. మలేసియా నుంచి వచ్చిన హీరోయిన్, ఇండియాలోనే ఉండిపోయిన హీరోల మధ్య ఏం జరిగిందన్నది మిగతా కథ. ఎలా చేశారంటే... స్క్రీన్‌ప్లే, భావుకత ఆధారంగా నడిచే ఈ చిత్రంలో ఇటు అమ్మనూ, అటు పరుగునూ, మరోపక్క కథానాయిక నజీరా (నిత్యామీనన్)నూ హీరో ప్రేమిస్తుండడంతో, ఏకకాలంలో మూడు ప్రేమకథలుగా సినిమా నడుస్తుంది. కథానాయకుడు రాజారామ్ పాత్రలో శర్వానంద్ బాగున్నారు. అభినయంలో కొన్నిచోట్ల అల్లు అర్జున్ సహా ఇతర నటీనటుల్ని గుర్తుచేశారు. ఇక, కథానాయికగా నిత్యామీనన్ ఈ చిత్రానికి ఎస్సెట్. ఇలాంటి పాత్రను, ముఖ్యంగా చిత్ర ద్వితీయార్ధంలో వచ్చే వయసుకూ, ఇమేజ్‌కూ మించిన పాత్రను ఎంచుకోవడం ఆమె ధైర్యానికీ, ఇమేజ్‌కు అతీతమైన సాహసానికీ నిదర్శనం. మిగిలిన పాత్రలన్నీ కథకు తగ్గట్లుగా వచ్చి వెళ్ళేవి. నాజర్ కనిపించేది ఒక సీన్లోనే అయినా కథకు వేగం తీసుకొచ్చిన పాత్ర అది. సముద్రపుటొడ్డున క్యాంటీన్ నడిపే వ్యక్తిగా చాలా రోజుల తరువాత నటుడు చిన్నా తెరపై కనిపించారు. సాంకేతిక విభాగాల పనితీరు ఈ చిత్రానికి పెద్ద బలం. ముఖ్యంగా, జ్ఞానశేఖర్ ఛాయాగ్రహణం పరిసరాలను అద్భుతంగా తెరకెక్కించింది. ప్రతి దృశ్యాన్నీ కంటికి హాయిగొలిపేలా చూపింది. ఇక, మలయాళ సంగీత దర్శకుడు గోపీ సుందర్ అందించిన బాణీలు, రీ-రికార్డింగ్ తెర మీది దృశ్యాలకు కలిసొచ్చాయి. ‘ఎన్నో ఎన్నో వర్ణాల...’ లాంటి పాటలు, చిత్రీకరణ బాగున్నాయి.సాయిమాధవ్ బుర్రా రాసిన మాటలు ప్రథమార్ధంలో వ్యక్తిత్వ వికాస పాఠాలుగా నడుస్తాయి. ద్వితీయార్ధంలో తండ్రీ కూతుళ్ళ మధ్య, తల్లీ కూతుళ్ళ మధ్య సహజమైన రీతిలో సాగిన సంభాషణలు బాగున్నాయి. ఇక, చిత్ర నిర్మాణ విలువలు పుష్కలంగా తెర కనిపిస్తాయి. కాస్తంత పాత జ్ఞాపకంగా అనిపించే ఇలాంటి మొన్నటి తరం ప్రేమకథను తెర పైకి ఎక్కించడానికి కోట్లాది రూపాయల సాహసం చేసినందుకు నిర్మాత కె.ఎస్. రామారావునూ, ఆయన కుమారుడు కె.ఎ. వల్లభనూ అభినందించాలి. గతంలో ‘ఓనమాలు’ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమైన భావుక యువ దర్శకుడు క్రాంతిమాధవ్ ఈ రకమైన కథాంశం ఎంచుకోవడం కూడా కెరీర్‌పరంగా సాహసమే. ఆ సాహసం ఆయనలోని భావుకతకూ, అభిరుచితో కూడిన ఆలోచనలకూ ప్రతిబింబం. మరికొంత రాటుదేలి, కథనవేగంపై దృష్టి పెడితే, ఆయన నుంచి మరిన్ని మంచి సినిమాలు, మరింత జనరంజకంగా వస్తాయని ఆశించవచ్చు. ఎలా ఉందంటే... దర్శకుడిగా బుడిబుడి నడకలు నడుస్తున్న కె. క్రాంతిమాధవ్‌కు ఇది రెండో సినిమా. ఆ సంగతి సినిమా టేకింగ్‌లో కొన్నిచోట్ల తెలుస్తూనే ఉంటుంది. ముఖ్యంగా, చిత్ర ప్రథమార్ధంలో కథను నిదానంగా నడిపించిన తీరు లాంటివి అర్థమవుతుంటాయి. ఫస్టాఫ్‌లో కొన్నిచోట్ల విజువల్స్కూ, డైలాగ్‌కూ పొంతన కుదరని ఒకటి రెండు సందర్భాలు, కర్చీఫ్ మీద ‘ఎన్’ అనే అక్షరం ఉన్నట్లు చూపించకుండానే ‘ఎన్ అంటే ఏమిట’ని హీరో అడిగినట్లున్న డైలాగ్ లాంటివి పోస్ట్ ప్రొడక్షన్‌లోనైనా సరిచేసుకోవాల్సింది. అలాగే, సంగీతం నేర్పే హీరో అమ్మ పాడిన ‘మహా గణపతిమ్...’ లాంటి శాస్త్రీయ కీర్తనలు తమిళ పద్ధతిలో ‘త’ బదులు ‘ద’గా ‘గణపదిమ్’ అని డాల్బీ సౌండ్ సిస్టమ్‌లో స్పష్టంగా వినిపించేస్తుండడం భాషాభిమానుల చెవులకు కొంత ఇబ్బందే. కానీ, ఈ చిన్న లోపాలేవీ సెకండాఫ్‌కు వచ్చేసరికి ఈ ఫీల్ గుడ్ సినిమా అనుభవానికి అడ్డుకావు. ఫస్టాఫ్‌లో దర్శకత్వం, సన్నివేశాల కన్నా రచనది పైచేయి అయినట్లనిపిస్తే, ద్వితీయార్ధంలో సమతూకం సాధ్యమైందనిపిస్తుంది. ముఖ్యంగా తండ్రీ కూతుళ్ళ (నాజర్, నిత్యామీనన్ల) ఎపిసోడ్, తల్లీ కూతుళ్ళ వాదన ఘట్టం లాంటివి ఈ సినిమా పట్ల ఇష్టం పెంచుతాయి.‘చూడడానికి ఎలా ఉన్నా, బతకడానికి బాగుంటుంది’ (ఇండియా గురించి హీరోయిన్), ‘‘బతుకును లెక్క చేయకపోయినా ఫరవాలేదు. చావును గౌరవించాలి’’, ‘‘ప్రేమనే వదిలేసినదాన్ని ప్రాణం వదిలేయడం కష్టం కాదు’’ (తల్లితో హీరోయిన్), ‘‘కన్నీళ్ళు, మనం కవలపిల్లలే. పుట్టినప్పటి నుంచి పోయే దాకా కలిసే ఉంటాం’’ లాంటి డైలాగులు గుండె గదిని తడతాయి. మొత్తం మీద చూసినప్పుడు సినిమాకు మంచి మార్కులు పడతాయి. చాలాకాలం తరువాత ఒక మంచి, ఫీల్ గుడ్ సినిమా చూశామని అనిపిస్తుంది. ఒక్కముక్కలో చెప్పాలంటే, సమకాలీన బాక్సాఫీస్ రణగొణధ్వని మధ్య ఈ చిత్రం నిజంగానే ‘మళ్ళీ మళ్ళీ ఇది రాని’ సినిమాగా మిగులుతుంది. మల్టీప్లెక్స్ ప్రేక్షకుల మధ్య బాక్సాఫీస్ వద్ద వెలుగుతుంది. - రెంటాల జయదేవ -
ఈ సినిమా ఓ అందమైన పూలగుత్తి
‘‘ఈమధ్యకాలంలో వచ్చిన ప్రేమకథలన్నింటి కన్నా గొప్ప ప్రేమకథ ఇది. అలా ఎందుకంటున్నానంటే ఈ మధ్య వచ్చే ప్రేమకథలు ఘాటుగా ఉంటున్నాయి. కానీ, ఈ కథ సున్నితంగా ఉండటంతో పాటు ఎంతో పవిత్రంగా ఉంటుంది’’ అని నిర్మాత కేయస్ రామారావు అన్నారు. ఆయన సమర్పణలో సీసీ మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ లిమిటెడ్ పతాకంపై క్రాంతిమాధవ్ దర్శకత్వంలో కె.ఎ. వల్లభ నిర్మించిన చిత్రం ‘మళ్లీ మళ్లీ ఇది రాని రోజు’. శర్వానంద్, నిత్యామీనన్ జంటగా రూపొందిన ఈ చిత్రాన్ని ఈ నెలలోనే విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ సందర్భంగా శనివారం విలేకరుల సమావేశంలో కేయస్ రామారావు మాట్లాడుతూ -‘‘ఒక చక్కని పూలగుత్తి చూసినప్పుడు కలిగే మంచి భావన ఈ చిత్రం చూసినప్పుడు కలుగుతుంది. 1980లలో ‘రాక్షసుడు’ చిత్రానికి ఇళయరాజాగారు స్వరపరచిన ‘మళ్లీ మళ్లీ ఇది రాని రోజు..’ పాట ఇప్పటికీ అందరికీ గుర్తే. ఈ కథకు ‘మళ్లీ మళ్లీ ఇది రాని రోజు..’ టైటిల్ నప్పుతుందని క్రాంతిమాధవ్, శర్వానంద్ సూచించారు. అంతకు మించిన మంచి టైటిల్ దొరక్కపోవడంతో దీన్నే ఖరారు చేశాం. కథ చెప్పినదాని కన్నా మించి క్రాంతి మాధవ్ అద్భుతంగా తీశాడు. శర్వానంద్, నిత్య పోటాపోటీగా నటించారు. ఈ సినిమాకి మరో ఆకర్షణ సాయిమాధవ్ బుర్రా రాసిన సంభాషణలు. ఇద్దరు ప్రేమికులు ఎలా మాట్లాడుకుంటారో అలానే సహజంగా మాటలు ఉంటాయి. గుణశేఖర్ కెమెరా, గోపీసుందర్ స్వరపరచిన పాటలు, క్రాంతి మాధవ్ టేకింగ్... వెరసి ఈ చిత్రం ఓ ‘వెండితెర కావ్యం’లా తయారైంది’’ అని చెప్పారు. అన్ని పనులూ పూర్తయినప్పటికీ ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేయకుండా వాయిదా వేయడానికి కారణం ‘గోపాల గోపాల’, ‘ఐ’ చిత్రాలేనా? అని ‘సాక్షి’ అడిగిన ప్రశ్నకు -‘‘అవును. రెండు పెద్ద చిత్రాల మధ్య ఈ చిత్రాన్ని విడుదల చేస్తే నలిగిపోతుందని బయ్యర్లు అన్నారు. పైగా థియేటర్లు దొరకవు. అందుకే, నా సినిమా మీద నాకు నమ్మకం ఉన్నా విడుదల చేయలేదు’’ అన్నారు. పండగకు రెండు భారీ చిత్రాలు విడుదల కావడంవల్ల మీ సినిమా అనే కాకుండా మరో ఐదారు చిత్రాల విడుదల వాయిదా పడింది కదా? అనే ప్రశ్నకు - ‘‘అవును. పెద్ద చిత్రాలకు థియేటర్లు కేటాయించడం వల్ల ఇతర చిత్రాలు వెనక్కి వెళ్లాల్సి వచ్చింది. పెద్ద చిత్రాలైతేనే ప్రేక్షకులు వస్తారనే నమ్మకం ఉంటుంది. అది కొంతవరకు వాస్తవం. పెద్ద సినిమాలైతే 75 థియేటర్లలో ఫుల్ అవుతుంది. అదే, నా ‘మళ్లీ మళ్లీ ఇది రాని రోజు’ వంటి చిత్రాలైతే అన్ని థియేటర్లు ఫుల్ కావు. అందుకని, పెద్ద సినిమాలకే థియేటర్లు ఇస్తారు. ఏదేమైనా పండగకు విడుదలైన రెండు సినిమాలకు పూర్తి భిన్నమైన చిత్రం నాది. నాదో అందమైన ప్రేమకథా చిత్రం. పండగకు వచ్చి ఉంటే బాగానే ఉండేది’’ అని చెప్పారు. -
ఈ సినిమాకు ఏదీ పోటీ కాదు - కె.ఎస్. రామారావు
‘‘40 ఏళ్లుగా సినిమాలు తీస్తున్నా. అన్ని రకాల సినిమాలూ తీసినా... ప్రేమకథలంటే నాకు ప్రత్యేకమైన అభిమానం. నిత్యామీనన్ ద్వారా ఈ కథ నా దగ్గరకొచ్చింది. క్రాంతిమాధవ్ కథను కళ్లకు కట్టినట్టు చెప్పాడు. ఎలా చెప్పాడో అంతకంటే అద్భుతంగా తెరకెక్కించాడు. జ్ఞానశేఖర్ కెమెరా, గోపీసుందర్ సంగీతం ప్రేక్షకులకు ఓ తీయని అనుభూతిని అందిస్తాయి’’ అని కె.ఎస్.రామారావు అన్నారు. శర్వానంద్, నిత్యామీనన్ జంటగా క్రాంతిమాధవ్ దర్శకత్వంలో అలెగ్జాండర్ వల్లభ నిర్మిస్తున్న చిత్రం ‘మళ్లీ మళ్లీ ఇది రాని రోజు’. ఈ చిత్రం పాటలను, ప్రచార చిత్రాలను రమేశ్ ప్రసాద్ విడుదల చేశారు. ఈ సందర్భంగా చిత్ర సమర్పకుడు కె.ఎస్.రామారావు మాట్లాడుతూ -‘‘ఈ చిత్రానికి ప్రధాన బలం స్క్రిప్ట్. సాయిమాధవ్ బుర్రా అద్భు తంగా సంభాషణలు రాశాడు. వెంకటేశ్, పవన్‌కల్యాణ్‌ల ‘గోపాల గోపాల’ చిత్రానికి కూడా ఆయనే సంభాషణలు అందిస్తున్నారు. పంపిణీదారులందరూ సహకరిస్తే... ఈ సినిమాను కూడా ‘గోపాల గోపాల’తోనే సంక్రాంతి కానుకగా విడుదల చేస్తా. ఇది చక్కని ప్రేమకథ కాబట్టి, దీనికి ఏ సినిమా పోటీ కాదు’’ అని తెలిపారు. మనసుల్ని మెలిపెట్టే ప్రేమకావ్యంగా క్రాంతిమాధవ్ ఈ చిత్రాన్ని మలిచారని శర్వానంద్ అన్నారు. ఈ సినిమాకు పెట్టినంత ఎఫర్ట్ ఇంతవరకూ తాను ఏ సినిమాకూ పెట్టలేదని నిత్యామీనన్ తెలిపారు. తెలుగు భాషంటే తనకు ఇష్టమనీ, క్రాంతిమాధవ్, నిత్యామీనన్ వల్లనే తెలుగు సినిమా చేసే అవకాశం తనకు లభించిందనీ, సంగీత దర్శకుడు గోపీ సుందర్ చెప్పారు. -
మళ్లి మళ్లీ ఇది రాని రోజు మూవీ స్టిల్స్
-
ఆ రోజు మళ్లీ రాదు..!
‘‘ప్రేమ గాయానికి మందు లేదు. కాలగమనంలో ఎన్ని విజయాలు అందుకున్నా, ఎన్ని శిఖరాలు అధిరోహించినా... ప్రేమ గాయం తాలూకు బాధ మాత్రం అంతర్లీనంగా బాధిస్తూనే ఉంటుంది. బతికున్నంతవరకూ వేధిస్తూనే ఉంటుంది. దూరమైన మనసు కోసం గాలిస్తూనే ఉంటుంది. దానికి కాలంతో పని లేదు... సింపుల్‌గా మా చిత్రకథ ఇదే’’ అంటున్నారు దర్శకుడు క్రాంతిమాధవ్. క్రియేటివ్ కమర్షియల్స్ పతాకంపై క్రాంతిమాధవ్ దర్శకత్వంలో శర్వానంద్, నిత్యామీనన్ జంటగా నటిస్తున్న చిత్రానికి ‘మళ్లీ మళ్లీ ఇది రాని రోజు’ అనే పేరును ఖరారు చేశారు. కేఎస్ రామారావు సమర్పణలో అలెగ్జాండర్ వల్లభ నిర్మిస్తున్న ఈ చిత్రం గురించి దర్శకుడు మాట్లాడుతూ -‘‘సీతాకోకచిలుక, అభినందన, గీతాంజలి, ప్రేమ... 80ల్లో వచ్చిన ఈ సినిమాలన్నీ మనసుల్ని మెలిపెట్టే ప్రేమకథలే. ఇప్పుడు అలాంటి ప్రేమకథలు రావడం లేదు. మా ‘మళ్లీ మళ్లీ ఇది రాని రోజు’ చిత్రం ఆ లోటును భర్తీ చేస్తుంది. ఎన్నో ప్రత్యేకతలతో రూపొందుతోన్న ఈ చిత్రానికి స్క్రిప్ట్ ప్రధాన బలం. సాయిమాధవ్ బుర్రా అద్భుతమైన సంభాషణలు అందించారు. ఒక పాట మినహా చిత్రీకరణ పూర్తయింది’’ అని తెలిపారు. -
‘మళ్ళీ మళ్ళీఇది రాని రోజు’ మూవీ స్టిల్స్