సినిమా రివ్యూ - మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు! | malli malli idi rani roju cinema review | Sakshi
Sakshi News home page

సినిమా రివ్యూ - మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు!

Published Sun, Feb 8 2015 1:28 PM | Last Updated on Sat, Aug 11 2018 8:27 PM

సినిమా రివ్యూ - మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు! - Sakshi

సినిమా రివ్యూ - మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు!

 చిత్రం - మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు, తారాగణం - శర్వానంద్, నిత్యామీనన్, పవిత్రా లోకేశ్, నాజర్, సూర్య, మాటలు - సాయిమాధవ్ బుర్రా, పాటలు - సాహితి, రామజోగయ్యశాస్త్రి,  సంగీతం -  గోపీ సుందర్, కెమేరా - జ్ఞానశేఖర్,  ఎడిటింగ్ - కోటగిరి వెంకటేశ్వరరావు, సమర్పణ - కె.ఎస్. రామారావు, నిర్మాత - కె. వల్లభ, దర్శకత్వం - కె. క్రాంతిమాధవ్
 .....................................
 
 ఇటీవలి కాలంలో తెలుగు సినిమా ఒక నిర్దిష్టమైన కొలతల మధ్యలో సాగుతోంది. కామెడీ ట్రాక్‌లు, విలన్ ఇంటికే హీరో వెళ్ళి, హీరోయిన్‌ను పెళ్ళాడడం, లేదంటే హీరో వర్సెస్ విలన్ - ఇలాంటి కథల మధ్యనే దారీతెన్నూ లేక కొట్టుమిట్టాడుతోంది. అందుకే, ఈ మూసను బద్దలు కొట్టే ఏ చిన్న ప్రయత్నమైనా సరే, ఈ రోజుల్లో అది పెద్ద విషయం. కామెడీ ట్రాక్‌లు, ఫైట్లు, యువతను ఆకర్షించే అతి జోకులు లేకుండానే వచ్చిన వెండితెర ప్రయత్నం - ‘మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు’. అందుకే, ఈ సినిమాను ప్రత్యేకంగా చూడాలి. అసలైన ప్రేమలు పోయి, అశాశ్వతమైన ఆకర్షణలే ప్రేమగా నవతరం భ్రమపడుతున్న సమయంలో వచ్చిన పాతకాలపు ప్రేమకథ... అసలు సిసలు ప్రేమంటే ఇదీ అనే చెప్పే కథ... ఇది.


 కథేమిటంటే...


  ఈ పాతకాలపు ఆహ్లాదకరమైన ప్రేమకథలో రాజారామ్ (శర్వానంద్) ఓ కోటీశ్వరుడు. మైదానంలో పరిగెడుతున్న నవతరం అథ్లెట్లను చూస్తూ, ఒకప్పటి తన అథ్లెట్ జీవితాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటాడు. అతని కూతురు పార్వతి. ఓ ప్రైవేట్ రేడియో చానల్‌లో రేడియో జాకీగా పనిచేస్తుంటుంది. ప్రేమ విషయంలో విఫలమైన రాజారామ్ ఫ్లాష్‌బ్యాక్‌కు వెళితే... పరుగుపందేనికి అవసరమైన స్పైక్ షూస్ కొనుక్కునే స్థోమత కూడా లేని ఓ సగటు మధ్యతరగతి కుటుంబానికి చెందిన అథ్లెట్ రాజారామ్. అతని తల్లి పార్వతమ్మ (పవిత్రా లోకేశ్) కష్టపడి, పిల్లలకు సంగీత పాఠాలు చెబుతూ ఆ డబ్బులతో ఇల్లు గడుపుతుంటుంది. స్టేట్ ఛాంపియన్‌గా నిలిచి, నేషనల్స్‌కు వెళుతున్న రాజారామ్, కాలేజీలోని సాయిబుల అమ్మాయి నజీరా (నిత్యామీనన్) బురఖాలో చూసి, తొలిచూపులోనే ప్రేమిస్తాడు. కళ్ళను మాత్రమే చూసి ప్రేమించినది అతనైతే, అతణ్ణి, అతనిలోని ప్రతిభనూ చూసి తానూ ప్రేమిస్తుంది నజీరా. తీరా వాళ్ళ ప్రేమ ఒక కొలిక్కి వచ్చే సందర్భంలో హీరో, తన తల్లిని కోల్పోతాడు. హీరోయిన్ అనుకోని రీతిలో మలేసియాలో తండ్రి దగ్గరకు వెళుతుంది. ఈ మతాంతర వివాహానికి అమ్మాయి తండ్రి (నాజర్) కూడా ఒప్పుకోడు. దాంతో, మలేసియాలో ఆమె, ఇండియాలో ఇతను ఉండిపోతారు. దొరికిన పిల్లను పెంచి పెద్ద చేసి, కనకుండానే అమ్మ అయిన హీరోయిన్ తన కూతురితో అసలైన ప్రేమ గురించి సవాలు విసిరి, ఇండియాకు వస్తుంది. మలేసియా నుంచి వచ్చిన హీరోయిన్, ఇండియాలోనే ఉండిపోయిన హీరోల మధ్య ఏం జరిగిందన్నది మిగతా కథ.


 ఎలా చేశారంటే...


  స్క్రీన్‌ప్లే, భావుకత ఆధారంగా నడిచే ఈ చిత్రంలో ఇటు అమ్మనూ, అటు పరుగునూ, మరోపక్క కథానాయిక నజీరా (నిత్యామీనన్)నూ హీరో ప్రేమిస్తుండడంతో, ఏకకాలంలో మూడు ప్రేమకథలుగా సినిమా నడుస్తుంది. కథానాయకుడు రాజారామ్ పాత్రలో శర్వానంద్ బాగున్నారు. అభినయంలో కొన్నిచోట్ల అల్లు అర్జున్ సహా ఇతర నటీనటుల్ని గుర్తుచేశారు. ఇక, కథానాయికగా నిత్యామీనన్ ఈ చిత్రానికి ఎస్సెట్. ఇలాంటి పాత్రను, ముఖ్యంగా చిత్ర ద్వితీయార్ధంలో వచ్చే వయసుకూ, ఇమేజ్‌కూ మించిన పాత్రను ఎంచుకోవడం ఆమె ధైర్యానికీ, ఇమేజ్‌కు అతీతమైన సాహసానికీ నిదర్శనం. మిగిలిన పాత్రలన్నీ కథకు తగ్గట్లుగా వచ్చి వెళ్ళేవి. నాజర్ కనిపించేది ఒక సీన్‌లోనే అయినా కథకు వేగం తీసుకొచ్చిన పాత్ర అది. సముద్రపుటొడ్డున క్యాంటీన్ నడిపే వ్యక్తిగా చాలా రోజుల తరువాత నటుడు చిన్నా తెరపై కనిపించారు.


   సాంకేతిక విభాగాల పనితీరు ఈ చిత్రానికి పెద్ద బలం. ముఖ్యంగా, జ్ఞానశేఖర్ ఛాయాగ్రహణం పరిసరాలను అద్భుతంగా తెరకెక్కించింది. ప్రతి దృశ్యాన్నీ కంటికి హాయిగొలిపేలా చూపింది. ఇక, మలయాళ సంగీత దర్శకుడు గోపీ సుందర్ అందించిన బాణీలు, రీ-రికార్డింగ్ తెర మీది దృశ్యాలకు కలిసొచ్చాయి. ‘ఎన్నో ఎన్నో వర్ణాల...’ లాంటి పాటలు, చిత్రీకరణ బాగున్నాయి.సాయిమాధవ్ బుర్రా రాసిన మాటలు ప్రథమార్ధంలో వ్యక్తిత్వ వికాస పాఠాలుగా నడుస్తాయి. ద్వితీయార్ధంలో తండ్రీ కూతుళ్ళ మధ్య, తల్లీ కూతుళ్ళ మధ్య సహజమైన రీతిలో సాగిన సంభాషణలు బాగున్నాయి. ఇక, చిత్ర నిర్మాణ విలువలు పుష్కలంగా తెర కనిపిస్తాయి. కాస్తంత పాత జ్ఞాపకంగా అనిపించే ఇలాంటి మొన్నటి తరం ప్రేమకథను తెర పైకి ఎక్కించడానికి కోట్లాది రూపాయల సాహసం చేసినందుకు నిర్మాత కె.ఎస్. రామారావునూ, ఆయన కుమారుడు కె.ఎ. వల్లభనూ అభినందించాలి. గతంలో ‘ఓనమాలు’ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమైన భావుక యువ దర్శకుడు క్రాంతిమాధవ్ ఈ రకమైన కథాంశం ఎంచుకోవడం కూడా కెరీర్‌పరంగా సాహసమే. ఆ సాహసం ఆయనలోని భావుకతకూ, అభిరుచితో కూడిన ఆలోచనలకూ ప్రతిబింబం. మరికొంత రాటుదేలి, కథనవేగంపై దృష్టి పెడితే, ఆయన నుంచి మరిన్ని మంచి సినిమాలు, మరింత జనరంజకంగా వస్తాయని ఆశించవచ్చు.


 ఎలా ఉందంటే...


    దర్శకుడిగా బుడిబుడి నడకలు నడుస్తున్న కె. క్రాంతిమాధవ్‌కు ఇది రెండో సినిమా. ఆ సంగతి సినిమా టేకింగ్‌లో కొన్నిచోట్ల తెలుస్తూనే ఉంటుంది. ముఖ్యంగా, చిత్ర ప్రథమార్ధంలో కథను నిదానంగా నడిపించిన తీరు లాంటివి అర్థమవుతుంటాయి. ఫస్టాఫ్‌లో కొన్నిచోట్ల విజువల్స్‌కూ, డైలాగ్‌కూ పొంతన కుదరని ఒకటి రెండు సందర్భాలు, కర్చీఫ్ మీద ‘ఎన్’ అనే అక్షరం ఉన్నట్లు చూపించకుండానే ‘ఎన్ అంటే ఏమిట’ని హీరో అడిగినట్లున్న డైలాగ్ లాంటివి పోస్ట్ ప్రొడక్షన్‌లోనైనా సరిచేసుకోవాల్సింది. అలాగే, సంగీతం నేర్పే హీరో అమ్మ పాడిన ‘మహా గణపతిమ్...’ లాంటి శాస్త్రీయ కీర్తనలు తమిళ పద్ధతిలో ‘త’ బదులు ‘ద’గా ‘గణపదిమ్’ అని డాల్బీ సౌండ్ సిస్టమ్‌లో స్పష్టంగా వినిపించేస్తుండడం భాషాభిమానుల చెవులకు కొంత ఇబ్బందే.
 
 

కానీ, ఈ చిన్న లోపాలేవీ సెకండాఫ్‌కు వచ్చేసరికి ఈ ఫీల్ గుడ్ సినిమా అనుభవానికి అడ్డుకావు. ఫస్టాఫ్‌లో దర్శకత్వం, సన్నివేశాల కన్నా రచనది పైచేయి అయినట్లనిపిస్తే, ద్వితీయార్ధంలో సమతూకం సాధ్యమైందనిపిస్తుంది. ముఖ్యంగా తండ్రీ కూతుళ్ళ (నాజర్, నిత్యామీనన్‌ల) ఎపిసోడ్, తల్లీ కూతుళ్ళ వాదన ఘట్టం లాంటివి ఈ సినిమా పట్ల ఇష్టం పెంచుతాయి.‘చూడడానికి ఎలా ఉన్నా, బతకడానికి బాగుంటుంది’ (ఇండియా గురించి హీరోయిన్), ‘‘బతుకును లెక్క చేయకపోయినా ఫరవాలేదు. చావును గౌరవించాలి’’, ‘‘ప్రేమనే వదిలేసినదాన్ని ప్రాణం వదిలేయడం కష్టం కాదు’’ (తల్లితో హీరోయిన్), ‘‘కన్నీళ్ళు, మనం కవలపిల్లలే. పుట్టినప్పటి నుంచి పోయే దాకా కలిసే ఉంటాం’’ లాంటి డైలాగులు గుండె గదిని తడతాయి.  మొత్తం మీద చూసినప్పుడు సినిమాకు మంచి మార్కులు పడతాయి. చాలాకాలం తరువాత ఒక మంచి, ఫీల్ గుడ్ సినిమా చూశామని అనిపిస్తుంది. ఒక్కముక్కలో చెప్పాలంటే, సమకాలీన బాక్సాఫీస్ రణగొణధ్వని మధ్య ఈ చిత్రం నిజంగానే ‘మళ్ళీ మళ్ళీ ఇది రాని’ సినిమాగా మిగులుతుంది. మల్టీప్లెక్స్ ప్రేక్షకుల మధ్య బాక్సాఫీస్ వద్ద వెలుగుతుంది.
 - రెంటాల జయదేవ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement