ఈ సినిమా ఓ అందమైన పూలగుత్తి | KS Rama Rao lashes out at 'I' | Sakshi
Sakshi News home page

ఈ సినిమా ఓ అందమైన పూలగుత్తి

Published Sat, Jan 17 2015 11:27 PM | Last Updated on Sat, Sep 2 2017 7:49 PM

ఈ సినిమా ఓ అందమైన పూలగుత్తి

ఈ సినిమా ఓ అందమైన పూలగుత్తి

‘‘ఈమధ్యకాలంలో వచ్చిన ప్రేమకథలన్నింటి కన్నా గొప్ప ప్రేమకథ ఇది. అలా ఎందుకంటున్నానంటే ఈ మధ్య వచ్చే ప్రేమకథలు ఘాటుగా ఉంటున్నాయి. కానీ, ఈ కథ సున్నితంగా ఉండటంతో పాటు ఎంతో పవిత్రంగా ఉంటుంది’’ అని నిర్మాత కేయస్ రామారావు అన్నారు. ఆయన సమర్పణలో సీసీ మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ లిమిటెడ్ పతాకంపై క్రాంతిమాధవ్ దర్శకత్వంలో కె.ఎ. వల్లభ నిర్మించిన చిత్రం ‘మళ్లీ మళ్లీ ఇది రాని రోజు’. శర్వానంద్, నిత్యామీనన్ జంటగా రూపొందిన ఈ చిత్రాన్ని ఈ నెలలోనే విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ సందర్భంగా శనివారం విలేకరుల సమావేశంలో కేయస్ రామారావు మాట్లాడుతూ -‘‘ఒక చక్కని పూలగుత్తి చూసినప్పుడు కలిగే మంచి భావన ఈ చిత్రం చూసినప్పుడు కలుగుతుంది. 1980లలో ‘రాక్షసుడు’ చిత్రానికి ఇళయరాజాగారు స్వరపరచిన ‘మళ్లీ మళ్లీ ఇది రాని రోజు..’ పాట ఇప్పటికీ అందరికీ గుర్తే.
 
 ఈ కథకు ‘మళ్లీ మళ్లీ ఇది రాని రోజు..’ టైటిల్ నప్పుతుందని క్రాంతిమాధవ్, శర్వానంద్ సూచించారు. అంతకు మించిన మంచి టైటిల్ దొరక్కపోవడంతో దీన్నే ఖరారు చేశాం. కథ చెప్పినదాని కన్నా మించి క్రాంతి మాధవ్ అద్భుతంగా తీశాడు. శర్వానంద్, నిత్య పోటాపోటీగా నటించారు. ఈ సినిమాకి మరో ఆకర్షణ సాయిమాధవ్ బుర్రా రాసిన సంభాషణలు. ఇద్దరు ప్రేమికులు ఎలా మాట్లాడుకుంటారో అలానే సహజంగా మాటలు ఉంటాయి. గుణశేఖర్ కెమెరా, గోపీసుందర్ స్వరపరచిన పాటలు, క్రాంతి మాధవ్ టేకింగ్... వెరసి ఈ చిత్రం ఓ ‘వెండితెర కావ్యం’లా తయారైంది’’ అని చెప్పారు. అన్ని పనులూ పూర్తయినప్పటికీ ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేయకుండా వాయిదా వేయడానికి కారణం ‘గోపాల గోపాల’, ‘ఐ’ చిత్రాలేనా? అని ‘సాక్షి’ అడిగిన ప్రశ్నకు -‘‘అవును. రెండు పెద్ద చిత్రాల మధ్య ఈ చిత్రాన్ని విడుదల చేస్తే నలిగిపోతుందని బయ్యర్లు అన్నారు.
 
 పైగా థియేటర్లు దొరకవు. అందుకే, నా సినిమా మీద నాకు నమ్మకం ఉన్నా విడుదల చేయలేదు’’ అన్నారు. పండగకు రెండు భారీ చిత్రాలు విడుదల కావడంవల్ల మీ సినిమా అనే కాకుండా మరో ఐదారు చిత్రాల విడుదల వాయిదా పడింది కదా? అనే ప్రశ్నకు - ‘‘అవును. పెద్ద చిత్రాలకు థియేటర్లు కేటాయించడం వల్ల ఇతర చిత్రాలు వెనక్కి వెళ్లాల్సి వచ్చింది. పెద్ద చిత్రాలైతేనే ప్రేక్షకులు వస్తారనే నమ్మకం ఉంటుంది. అది కొంతవరకు వాస్తవం. పెద్ద సినిమాలైతే 75 థియేటర్లలో ఫుల్ అవుతుంది. అదే, నా ‘మళ్లీ మళ్లీ ఇది రాని రోజు’ వంటి చిత్రాలైతే అన్ని థియేటర్లు ఫుల్ కావు. అందుకని, పెద్ద సినిమాలకే థియేటర్లు ఇస్తారు. ఏదేమైనా పండగకు విడుదలైన రెండు సినిమాలకు పూర్తి భిన్నమైన చిత్రం నాది. నాదో అందమైన ప్రేమకథా చిత్రం. పండగకు వచ్చి ఉంటే బాగానే ఉండేది’’ అని చెప్పారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement