గోదాలో ఆడపులులు | Fans pick Salman Khan's 'Sultan' look over Aamir Khan's 'Dangal' look! | Sakshi
Sakshi News home page

గోదాలో ఆడపులులు

Published Wed, Oct 14 2015 2:43 PM | Last Updated on Sun, Sep 3 2017 10:54 AM

గోదాలో ఆడపులులు

గోదాలో ఆడపులులు

దంగల్ అనే మాట మనకు తెలియదు. మనకు తెలిసింది కుస్తీ. మల్లయుద్ధం. రెజ్లింగ్. కాని ఉత్తర భారతదేశంలో దంగల్ అని కూడా అంటారు.

 దంగల్ అనే మాట మనకు తెలియదు. మనకు తెలిసింది కుస్తీ. మల్లయుద్ధం. రెజ్లింగ్. కాని ఉత్తర భారతదేశంలో దంగల్ అని కూడా అంటారు. ఇది కుస్తీ అనే మాటకు సమానం. కుస్తీ పోటీ అనే మాటకు సమానం. గోదా అనే అర్థంలో కూడా వాడతారు.
 
 పి.కె తర్వాత ఆమిర్‌ఖాన్ తన తర్వాతి చిత్రంగా ఈ గోదాలోని కథనే ఎంచుకున్నాడు. ఇప్పటి వరకూ చూసిన ఆమిర్ వేరు. ఇందులో కనిపించబోతున్న ఆమిర్ వేరు. ఈ సినిమాతో అతడు తండ్రిగా ప్రమోట్ కాబోతున్నాడు. అదీ చిన్నపిల్లల తండ్రిగా కాదు. వయసొచ్చిన ఆడపిల్లల తండ్రిగా. ఏ తండ్రైనా ఆడపిల్లలను పెంచి ఏవో నాలుగు అక్షరమ్ముక్కలు చదివించి ఒక అయ్య చేతిలో పెట్టాలి అనుకుంటాడు- ఉత్తర భారతదేశంలోని పల్లెసీమల్లో. కాని ఈ తండ్రి మాత్రం వేరేగా భావిస్తాడు. తన పిల్లలను మల్లయోధులను చేయాలనుకుంటాడు. అలాగే చేస్తాడు. అది దీని కథ.
 
 నిజజీవిత కథ
 మహావీర్ సింగ్ ఫోగట్ పేరు ఎవరూ విని ఉండరు. అతడు హర్యానాలోని ఒక పల్లెలో ఒక మోస్తారు మల్లయోధుడు. వ్యవసాయం వృత్తి. నలుగురు ఆడపిల్లలు సంతానం. సాదాసీదాగా నడుస్తున్న వీళ్ల జీవితంలో 2000 సంవత్సరం ఒక పెనుమార్పును తీసుకు వచ్చింది. ఆ సంవత్సరం మన తెలుగు అమ్మాయి కరణం మల్లీశ్వరి ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ సాధించింది. టీవీలో అందరితో పాటు ఆ వార్తను చూసిన మహావీర్ సింగ్ కొత్త ఉత్సాహంతో ఊగిపోయాడు. అరె... నాక్కూడా నలుగురు ఆడపిల్లలు ఉన్నారు... వీళ్లెందుకు ఒలంపిక్ మెడల్ తేలేరు అని అనుకున్నాడు. కుస్తీ తన ఒంట్లో ఉంది.
 
 పిల్లల ఒంట్లో కూడా ఉంది. దానిని సానబెడితే గెలుపు ఖాయం అనుకున్నాడు. తన పెద్ద కూతుళ్లు గీత, బబితలను ఆ రోజు నుంచి మల్లయోధ సాధనలో దింపాడు. చిన్న పల్లెవారిది. సరైన కుస్తీ ఉపకరణాలు లేవు. డైట్ చార్ట్ తెలియదు. వ్యాయామానికి తగిన పరికరాలు లేవు. ఉన్నవాటితోనో వాళ్లను కఠోర సాధనలో దింపాడు. సాటి మహిళా యోధులు అందుబాటులో లేకపోవడం వల్ల అబ్బాయిలతోనే వాళ్లకు పోటీ. వాళ్లతోనే సాధన చేయాలి. వెనకబడితే భరించలేక తిట్టేవాడు. ఒక్కోసారి కొట్టేవాడు. మేం అబ్బాయిలతో పోటీ పడలేం నాన్నా అని కూతుళ్లు అంటే ఏం... వాళ్ల కంటే మీకేం తక్కువ? వాళ్ల కంటే తక్కువ తినడం లేదు కదా అనేవాడు.

  అతని పట్టుదల వాళ్లకు ప్రాణం అయ్యింది. చివరకు 2010 కామన్‌వెల్త్ పోటీల్లో ఇద్దరూ ప్రతిభ చూపారు. ఒకరు బంగారు పతకం, మరొకరు వెండి పతకం సాధించారు. కాని ఆ తండ్రికి ఒలింపిక్స్‌లో బంగారు పతకం తన కూతుళ్లు సాధించాలన్న కోరిక మాత్రం మిగిలిపోయింది.సత్యమేవ జయతే కార్యక్రమం సందర్భంలో వీళ్ల గురించి తెలుసుకున్న ఆమిర్‌ఖాన్ వీళ్ల కథతో సినిమా తీయాలని అనుకొని ఉండవచ్చు. ఆ బాధ్యత దర్శకుడు నితిష్ తివారికి అప్పగించాడు. నితిష్ ఇంతకుమునుపు ‘చిల్లర్ పార్టీ’, ‘భూత్‌నాథ్ రిటర్న్స్’ వంటి సినిమాలు తీశాడు. ఇప్పుడు ఏకంగా ఈ సినిమా తీసే అవకాశం రావడం జాక్‌పాట్ కొట్టడంతో సమానం.
 
 100 కిలోల బరువు....
 ఈ సినిమా దాదాపు బయోపిక్ లాంటిది. నిజ జీవిత పాత్ర ఆధారంగా తీస్తున్నది కనుక ఆమిర్ తన పర్‌ఫెక్షనిజంతో చేయవలసిన కష్టం అంతా చేస్తున్నాడు. ఈ సినిమాలో అతడు కుర్ర మహావీర్‌గా, ముసలి మహావీర్‌గా రెండు పాత్రల్లో కనిపిస్తాడు. మొదట ముసలి మహావీర్‌గా నటించే సన్నివేశాల చిత్రీకరణ మొదలైంది. ఈ పాత్ర కోసం ఆమిర్ ఏకంగా 98 కిలోల బరువుకు చేరుకున్నాడు. 5 అడుగుల 5 అంగుళాల ఎత్తు ఉండే ఆమిర్ ఈ బరువును మోయడం కష్టమే. అయితే ఇంతకు మించిన కష్టం తర్వాతి పాత్ర సమయంలో ఎదురవుతుంది. దీని కోసం అతడు దాదాపు 27 కిలోల బరువు తగ్గాలి. ఇలా పెరగడం తగ్గడం ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాకపోయినా ఆమిర్ లక్ష్య పెట్టడం లేదు. కోరుకున్న విధంగా రిజల్డ్ రావడానికి కష్టం చేస్తున్నాడు.
 
 టీవీ నటి పక్కన...
 సతీ లీలావతి సినిమాలో కమల్ తన భార్యగా కోవై సరళను ఎంచుకున్నప్పుడు లోకం ఆశ్చర్యపోయింది. కాని సినిమా రిజల్డ్ చూశాక ఆయన ఎంపిక ఎంత కరెక్టో అర్థమైంది. బాలీవుడ్‌లో ఇంతమంది ఉండగా ఈ సినిమా కోసం ఆమిర్ తన పక్కన టీవీ నటి సాక్షి తన్వర్‌ను ఎంచుకున్నాడు. ఒక కుస్తీయోధుడి భార్య నాజూకుగా కాకుండా దిట్టంగా బలంగా కనిపించాలనే ఉద్దేశంతో ఆయన ఈ నిర్ణయం తీసుకుని ఉండవచ్చు. అలాగే కూతుళ్ల పాత్రలకు కూడా చాలా అన్వేషణే సాగింది. చివరకు ఫాతిమా సనా షేక్, సాన్యా మల్హోత్రా ఎంపికయ్యారు. ‘కాయ్ పోచే’, ‘క్వీన్’, ‘షహీద్’ వంటి సినిమాల్లో నటించిన రాజ్‌కుమార్ రావ్ ఇందులో సెలెక్టర్‌గా నటిస్తున్నాడు.
 
 భాష కోసం...
 ప్రతి సినిమాలో ప్రతి పాత్రకు ఒకే భాష మాట్లాడే హీరోలు ఉన్న మన చిత్రసీమలో పాత్ర మాట్లాడే భాష కోసం క్లాసులు తీసుకోవడం విడ్డూరమే. ఇందులో హర్యాన్వీ మాట్లాడటానికి ఆమిర్ ట్యూషన్లు పెట్టుకున్నాడు. ఆ భాషలో పట్టు కోసం ఆ ప్రాంతంలో తిరిగాడు. నిజ పాత్రలతోనే మాట్లాడాడు. అదొక్కటే కాదు.. ఈ కథలో చాలా పార్శ్వాలు ఉంటాయి. కూతుళ్లకు తండ్రి అంటే ప్రేమే. కాని తమను కఠోర కుస్తీ గోదాలో దించినందుకు కోపం. తండ్రికి కూతుళ్లంటే ప్రాణమే. కాని తన కలను అందుకోలేరేమోనన్న సందేహం. వీటి మధ్య ఈ మూడు పాత్రల సంవేదనే దంగల్. చారిత్రక బయోపిక్‌లు రుద్రమదేవి వంటి సినిమాలతో చూశాం. సాంఘిక బయోపిక్‌లు- కోడి రామ్మూర్తి కథను వెండి తెర మీద చూడాలంటే మనం ఎంతకాలం ఆగాలో.


 - సాక్షి ఫ్యామిలీ
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement