ఆ రెండే నా బలం
ఆ రెండే నా బలం
Published Thu, Jan 30 2014 10:55 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM
న్యూఢిల్లీ: ప్రస్తుతం నటనతో బిజీగా ఉన్నా, రచన, దర్శకత్వ విభాగాల్లోనే తనకు పట్టు ఎక్కువని ఫర్హాన్ అఖ్తర్ చెబుతున్నాడు. హీరోగా కనిపించడానికి ముందు మనోడు చాలా సినిమాలకు దర్శకుడు, రచయిత, నిర్మాతగా వ్యవహరించాడు. ‘దిల్ చాహతా హై, లక్ష్య, డాన్ సినిమాలకు పనిచేసేటప్పుడు నటులతో ఎంతో సన్నిహితంగా ఉండేవాణ్ని. దర్శకుడిగా ఎన్నో విషయాలు నేర్చుకున్నాను కాబట్టి నటనను కూడా ప్రయత్నించాలని అనుకున్నాను. మొదటి సినిమా రాకాన్ హిట్ అయింది కాబట్టి మరిన్ని అవకాశాలు వచ్చాయి. నా గురించి వేరే వాళ్లు ఏమనుకుంటారనేది నాకు అనవసరం. పనిని మరింత సమర్థంగా చేయాలన్నది నా పద్ధతి. ఇన్నేళ్లుగా నన్ను ఆదరిస్తున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు’ అని వివరించాడు. ఫర్హాన్ తాజా చిత్రం షాదీ కే సైడ్ ఎఫెక్ట్స్ ప్రచారం కోసం ముంబైలో బుధవారం రాత్రి నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడుతూ పైవిషయాలు చెప్పాడు.
ఇటీవల విడుదలైన భాగ్ మిల్ఖా భాగ్ హిట్ కావడంతో ఫర్హాన్‌కు మరిన్ని అవకాశాలు వస్తున్నాయి. ఈ సినిమాకు పని చేసిన ప్రతి ఒక్కరి శ్రమకూ గుర్తింపు దక్కిందన్నాడు. ‘ప్రేక్షకులు నా నుంచి ఏదైనా ఆశిస్తే నా దృష్టంతా దానిపైనే ఉంటుంది. నాకు అది స్ఫూర్తిని కూడా ఇస్తుంది. మల్టీస్టారర్ లేదా సోలో అన్నది కాదు.. కథ బాగుంటే ఎలాంటి వాటిలోనైనా నటిస్తాను’ అని చెప్పాడు. కార్తిక్ కాలింగ్ కార్తిక్, భాగ్ మిల్ఖా భాగ్ మినహా ఫర్హాన్ నటించినవన్నీ మల్టీస్టారర్ సినిమాలే. జోయా అఖ్తర్ తదుపరి సినిమాలోనూ ఈ 40 ఏళ్ల నటుడు రణ్‌వీర్ సింగ్, అనుష్క శర్మ, ప్రియాంక చోప్రాతోపాటు కనిపిస్తున్నాడు. సాకేత్ చౌదరి దర్శకత్వం వహించిన షాదీ కే సైడ్ ఎఫెక్ట్స్ ఈ నెల 28న విడుదలవుతోంది. ఈ శృంగార వినోదాద్మతక కథలో ఫర్హాన్, విద్యాబాలన్ జోడీగా కనిపిస్తారు.
Advertisement
Advertisement