Bhag Milkha Bhag
-
సాధారణ సినిమా కాదు
ఒక క్రీడాకారిణి జీవిత చరిత్రను ఆధారంగా తీసుకుని నిర్మించిన ‘మేరీ కోమ్’ సినిమాను మామూలు సినిమాల్లా పరిగణించవద్దని బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా కోరింది. ఒలంపిక్స్‌లో మెడల్ సాధించిన మహిళా బాక్సర్ మేరీకోమ్ జీవిత చరిత్రను ఆధారంగా ఈ సినిమా తీసిన సంగతి తెలిసిందే. ఇందులో మేరీకోమ్‌గా ప్రియాంక చోప్రా నటించింది. పరుగుల వీరుడు మిల్కా సింగ్ జీవిత చరిత్ర ఆధారంగా నిర్మితమై గతేడాది విడుదలైన ‘భాగ్ మిల్కా భాగ్’ పలు అవార్డులను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఆ సినిమాతో మేరీకోమ్ సినిమాను పోల్చడం సరికాదని ప్రియాంక అభిప్రాయపడింది. దేశంలో మొదటిసారి ఒక మహిళా క్రీడాకారిణి జీవితాన్ని ఆధారంగా తీసిన ఈ సినిమాను వేరే సినిమాలతో పోలిస్తే అది ఆమెను అవమానించినట్లే అవుతుందని ప్రియాంక స్పష్టం చేసింది. మేరీకోమ్ మనజాతి గర్వించదగ్గ క్రీడాకారిణి.. అని ఆమె వ్యాఖ్యానించింది. ముంబైలో బుధవారం ‘మేరీకోమ్’ ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ప్రియాంక మాట్లాడుతూ తన నటజీవితంలో ఈ సినిమాకు కష్టపడినట్లు దేనికీ కష్టపడలేదని చెప్పింది. మేరీ వ్యక్తిత్వాన్ని తెరపై ఆవిష్కరించేందుకు చాలా కష్టపడాల్సి వచ్చిందని తెలిపింది. ఒక సాధారణ వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చి క్రీడా ప్రపంచంలో రాణించడమంటే మాటలు కాదని, అటువంటి అద్భుతాన్ని మేరీ సాధించిందని ఆమెను ప్రియాంక పొగడ్తల్లో ముంచెత్తింది. ఈ సినిమాలో మేరీలా శరీరాకృ తిని ప్రదర్శించడానికి రోజూ 15 గంటలపాటు శిక్షణ పొందాల్సి వచ్చిందని తెలిపింది. బాక్సింగ్‌లో ప్రవేశించేందుకు మేరీ చాలా ఇబ్బందులు ఎదుర్కొందని, ఆమె తండ్రి బాక్సింగ్ వద్దని కట్టడి చేసినా పట్టుదలగా నేర్చుకుని ప్రపంచస్థాయిలో భారత్ కీర్తిపతాకం ఎగిరేలా ఒలంపిక్స్‌లో పతకం సాధించిందని ప్రియాంక వివరించింది. ఈ సినిమాకు డెరైక్టర్ దేబుటంగే ఒమాంగ్ కుమార్. సెప్టెంబర్ 5వ తేదీన ఇది థియేటర్లలో విడుదల కానుంది. -
ఆ రెండే నా బలం
న్యూఢిల్లీ: ప్రస్తుతం నటనతో బిజీగా ఉన్నా, రచన, దర్శకత్వ విభాగాల్లోనే తనకు పట్టు ఎక్కువని ఫర్హాన్ అఖ్తర్ చెబుతున్నాడు. హీరోగా కనిపించడానికి ముందు మనోడు చాలా సినిమాలకు దర్శకుడు, రచయిత, నిర్మాతగా వ్యవహరించాడు. ‘దిల్ చాహతా హై, లక్ష్య, డాన్ సినిమాలకు పనిచేసేటప్పుడు నటులతో ఎంతో సన్నిహితంగా ఉండేవాణ్ని. దర్శకుడిగా ఎన్నో విషయాలు నేర్చుకున్నాను కాబట్టి నటనను కూడా ప్రయత్నించాలని అనుకున్నాను. మొదటి సినిమా రాకాన్ హిట్ అయింది కాబట్టి మరిన్ని అవకాశాలు వచ్చాయి. నా గురించి వేరే వాళ్లు ఏమనుకుంటారనేది నాకు అనవసరం. పనిని మరింత సమర్థంగా చేయాలన్నది నా పద్ధతి. ఇన్నేళ్లుగా నన్ను ఆదరిస్తున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు’ అని వివరించాడు. ఫర్హాన్ తాజా చిత్రం షాదీ కే సైడ్ ఎఫెక్ట్స్ ప్రచారం కోసం ముంబైలో బుధవారం రాత్రి నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడుతూ పైవిషయాలు చెప్పాడు. ఇటీవల విడుదలైన భాగ్ మిల్ఖా భాగ్ హిట్ కావడంతో ఫర్హాన్‌కు మరిన్ని అవకాశాలు వస్తున్నాయి. ఈ సినిమాకు పని చేసిన ప్రతి ఒక్కరి శ్రమకూ గుర్తింపు దక్కిందన్నాడు. ‘ప్రేక్షకులు నా నుంచి ఏదైనా ఆశిస్తే నా దృష్టంతా దానిపైనే ఉంటుంది. నాకు అది స్ఫూర్తిని కూడా ఇస్తుంది. మల్టీస్టారర్ లేదా సోలో అన్నది కాదు.. కథ బాగుంటే ఎలాంటి వాటిలోనైనా నటిస్తాను’ అని చెప్పాడు. కార్తిక్ కాలింగ్ కార్తిక్, భాగ్ మిల్ఖా భాగ్ మినహా ఫర్హాన్ నటించినవన్నీ మల్టీస్టారర్ సినిమాలే. జోయా అఖ్తర్ తదుపరి సినిమాలోనూ ఈ 40 ఏళ్ల నటుడు రణ్వీర్ సింగ్, అనుష్క శర్మ, ప్రియాంక చోప్రాతోపాటు కనిపిస్తున్నాడు. సాకేత్ చౌదరి దర్శకత్వం వహించిన షాదీ కే సైడ్ ఎఫెక్ట్స్ ఈ నెల 28న విడుదలవుతోంది. ఈ శృంగార వినోదాద్మతక కథలో ఫర్హాన్, విద్యాబాలన్ జోడీగా కనిపిస్తారు. -
ఫిల్మ్‌ఫేర్‌లో ‘మిల్కా’ జోరు
ముంబై: ‘ఫ్లయింగ్ సిఖ్’ మిల్కాసింగ్ జీవితం ఆధారంగా వచ్చిన బాలీవుడ్ సినిమా ‘భాగ్ మిల్కా భాగ్’కు 59వ ఫిల్మ్‌ఫేర్ అవార్డుల పంటపండింది. 2013కు గానూ ఉత్తమ చిత్రం, నటుడు, దర్శకత్వం, గీతం, ప్రొడక్షన్ డిజైన్, దుస్తులు విభాగాల్లో ఆ చిత్రం అవార్డులు దక్కించుకుంది. ఉత్తమ నటి అవార్డును ‘గలియోంకా రాస్లీలా రామ్‌లీలా’ చిత్రానికి గానూ దీపికా పదుకొణే దక్కించుకుంది. తమిళ నటుడు ధనుష్ ఉత్తమ కొత్త నటుడి అవార్డు గెలుచుకున్నాడు. అవార్డుల వివరాలు - ఉత్తమ నటుడు: ఫర్హాన్ అక్తర్ (భాగ్ మిల్కా భాగ్) - ఉత్తమ నటి: దీపికా పదుకొణే (గలియోంకా రాస్లీలా రామ్‌లీలా) - ఉత్తమ దర్శకుడు: రాకేష్ ఓం ప్రకాశ్ మెహ్రా (భాగ్ మిల్కా భాగ్) - సోనీ ట్రెండ్ సెట్టర్ ఆఫ్ ది ఇయర్: చెన్నై ఎక్స్‌ప్రెస్ - జీవితసాఫల్య అవార్డు: తనూజ - ఉత్తమ గాయకుడు: అర్జిత్ సింగ్ (తుమ్హీ హో-ఆషిఖీ-2) - ఉత్తమ గాయని: మోనాలీ ఠాకూర్ (సావర్‌లూన్- లుటేరా) - ఉత్తమ గీతం: ప్రశూన్ జోషి (జిందా- భాగ్ మిల్కా భాగ్) - బెస్ట్ వీఎఫ్ఎక్స్: టాటా ఎలిక్సిస్ (ధూమ్-3) ఇక్కడి వైఆర్ఎఫ్ స్టూడియోలో నిర్వహించిన ఈ అవార్డుల ప్రదానోత్సవాన్ని ఆదివారం సోనీ టీవీ ప్రసారం చేయనుంది.