
వ్యవసాయదారుల చిత్రం 49ఓ
వ్యవసాయం, వ్యవసాయదారుల ఇతివృత్తంగా తెర కెక్కించిన చిత్రం 49ఓ అని ఆ చిత్ర కథానాయకుడు గౌండ్రమణి తెలిపారు. నిర్మాత శివబాలన్ నిర్మించిన ఈ చిత్నానికి ఆరోగ్యన్ కథ, కథనం, మాటలు, దర్శకత్వం బాధ్యతల్ని నిర్వహించారు. సుమారు 39 ఏళ్ల తరువాత సీనియర్ హాస్యనటుడు గౌండ్రమణి కథానాయకుడిగా రీఎంట్రీ అవుతున్న చిత్రం 49ఓ. ఈ చిత్రం ఈ నెల 17న తెరపైకి రానుంది. కాగా సంగీత దర్శకుడు కే సంగీతబాణీలు కట్టిన ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం ఆదివారం సాయంత్రం చెన్నైలోని ప్రసాద్‌ల్యాబ్‌లో జరిగింది. చిత్ర ఆడియోను నటుడు సత్యరాజ్, శివకార్తికేయన్‌లు ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా చిత్ర హీరో గౌండ్రమణి మాట్లాడుతూ ఐటమ్ సాంగ్స్, ఆరు ఫైట్స్, పాటలు అంటూ చిత్రాలు వస్తున్న ఈ రోజుల్లో వ్యవసాయం గురించి చిత్రం చేయడానికి ముందుకొచ్చిన నిర్మాత శివబాలన్‌ను అభినందించాలన్నారు. వ్యవసాయం, వ్యవసాయదారులు లేకుంటే ఈ లోకమే లేదు అని చెప్పే చిత్రమే 49ఓ అని వివరించారు. అలాంటి వ్యసాయాన్ని కాలరాసే ప్రయత్నాలు జరుగుతున్నారన్నారు. కొందరు రియల్టర్లు వ్యవసాయ పొలాల్లో పెద్ద పెద్ద కట్టడాలను కట్టేస్తున్నారన్నారు. అలాంటి వారికి పంట భూముల్ని విక్రయించవద్దు అని హితవు పలికారు. రైతులు కొందరు వ్యవసాయం లాభించడం లేదని పొలాలను అమ్ముకుంటున్నారని తెలిపారు. ఒక ఏడాది పంటలు పండకపోయినా మరో ఏడాది పండుతాయని, పొలాల్ని అమ్ముకోవద్దని చెప్పే చిత్రం 49ఓ అని తెలిపారు.