పెళ్లి చేసుకున్న భావనే లేదు
పెళ్లి చేసుకున్న భావనే లేదంటున్నారు నటి అమలాపాల్. అనతికాలంలోనే మలయాళం, తమిళం, తెలుగు భాషల్లో నటించి స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు పొందిన ఈ మైనా కుట్టి అంత తొందరగానే నటనకు విరామం ఇచ్చి దర్శకుడు విజయ్‌ను ప్రేమించి, పెళ్లి చేసుకున్నారు. కొన్ని రోజులు సంసార జీవితాన్ని ఎంజాయ్ చేసి మళ్లీ నటనకు రెడీ అయ్యారు. అంతేకాదు మరోపక్క చిత్ర నిర్మాణ బాధ్యతలు మోయడానికి సిద్ధమయ్యారు. తను నటిగా కొనసాగడం గురించి అమలాపాల్ మాట్లాడుతూ ఇప్పుడు తాను కళ్లు మూసుకుని చిత్రాలు అంగీకరించడం లేదన్నారు. సామాజిక స్పృహ ఉన్న పాత్రలనే ఎంపిక చేసుకోవాలని నిర్ణయించుకున్నానని తెలిపారు. ప్రస్తుతం సూర్య సరసన నటిస్తున్న హైకూ అలాంటిదేనని చెప్పారు.
కొన్ని పాత్రలు నిజజీవిత అనుభవం లేనిదే నటించడం కష్టమన్నారు. ఇక తన వివాహ జీవితం గురించి చెప్పాలంటే అసలు పెళ్లి అయిన భావనే లేదన్నారు. ఒక స్నేహితుడితో కలిసి జీవిస్తున్నట్లుందని అమలాపాల్ పేర్కొన్నారు. మరో విషయం ఏమిటంటే తాను గర్భం దాల్చానా? అని చాలా మంది అడుగుతున్నారనీ, ఈ విషయం గురించి అంత ఆసక్తి ఎందుకో తనకర్థం కావడం లేదని అన్నారు. అలా అమ్మ స్థానం పొందినప్పుడు తనే అందరికీ తెలియజేస్తానని చెప్పారు. అన్నట్టు ఈ భామ మరోసారి ఇళయదళపతితో కలిసి నటించారు. ఇంతకు ముందు తలైవా చిత్రంలో విజయ్‌కు జంటగా నటించిన విషయం తెలిసిందే. ఆ చిత్రం తరువాతే దర్శకుడు విజయ్‌ను ప్రేమ వివాహం చేసుకున్నారు. తాజాగా మరోసారి ఇళయదళపతితో కలిసి నటించారు. అయితే ఇది చిత్రం కాదు, ఒక వాణిజ్య ప్రకటన. ఇటీవలే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ కమర్శియల్ యాడ్ త్వరలో వెండితెర, బుల్లితెరలపైకి రానుంది.