ప్రతి సినిమాకీ ఐదారు కిలోలు తగ్గుతా! | fida movie will be released on friday | Sakshi
Sakshi News home page

ప్రతి సినిమాకీ ఐదారు కిలోలు తగ్గుతా!

Published Wed, Jul 19 2017 12:07 AM | Last Updated on Tue, Sep 5 2017 4:19 PM

ప్రతి సినిమాకీ ఐదారు కిలోలు తగ్గుతా!

ప్రతి సినిమాకీ ఐదారు కిలోలు తగ్గుతా!

‘‘శేఖర్‌ కమ్ముల సినిమా కావాలనే ‘దిల్‌’ రాజుగారు గానీ, ఎవరైనా నా దగ్గరకొస్తారు. ఎందుకంటే... నేను వేరేలా చేయలేను. ఇందులో ఏమైనా ట్వీక్‌ (సర్దుబాట్లు) చేస్తే మొదటికే దెబ్బ పడుతుంది. అది ఆయనకు (‘దిల్‌’ రాజు) తెలుసు. ఎవరో కాదు, నేనే ఒకసారి రాసిన సీన్‌ను లేపితే మళ్లీ రాయలేను. ఇదేదో గొప్పగా చెప్పడం లేదు. నేనంతే! నీ స్టైల్‌లో సినిమా తీయమని ‘దిల్‌’ రాజు చెప్పారు’’ అన్నారు శేఖర్‌ కమ్ముల. వరుణ్‌ తేజ్, సాయి పల్లవి జంటగా ఆయన దర్శకత్వంలో ‘దిల్‌’ రాజు, శిరీష్‌ నిర్మించిన సినిమా ‘ఫిదా’. ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొస్తున్న ఈ సిన్మా గురించి శేఖర్‌ కమ్ముల చెప్పిన సంగతులు...

కథ బాగా వచ్చేవరకూ నేను వెయిట్‌ చేస్తా. ‘ఫిదా’ విషయంలోనూ నా పంథా మారలేదు. అందువల్ల ‘అనామిక’ తర్వాత మరో సిన్మాతో రావడానికి మూడేళ్లు టైమ్‌ పట్టింది. అయితే... మధ్యలో స్టార్స్‌ను (మహేశ్‌బాబు, రామ్‌చరణ్‌) కలిశా. ఓ ప్రేమకథ ఉంది. చేద్దామా? వద్దా? అనే డిస్కషన్స్‌లోనే ఆగింది. కానీ, పూర్తి కథను మాత్రం ఎవరికీ చెప్పలేదు.

నేను అమెరికాలో ఉండొచ్చాను కాబట్టి ఎప్పట్నుంచో ఆ నేపథ్యంలో ఓ ప్రేమకథ చేయాలనుకున్నా. కథ రాస్తున్న టైమ్‌లో అమ్మాయి నేపథ్యం తెలంగాణ ఏరియాకి చెందిన పల్లెటూరు అయితే బాగుంటుందనుకున్నా. సాధారణంగా పల్లెటూరు అంటే మనకు కోనసీమే చూపిస్తారు. తెలంగాణలో భాన్సువాడను చూపించడం మంచి నిర్ణయం. ‘ఆనంద్‌’ కథేంటి? అనడిగితే నేను చెప్పలేను. అలాగే, ఈ కథ కూడా! ఫీల్‌ ఉన్న చిత్రమిది. సినిమా చూస్తే తెలంగాణ ఇంత పచ్చగా, అందంగా ఉంటుందా? అనిపిస్తుంది. అమెరికాలోనూ స్టాట్యూ ఆఫ్‌ లిబర్టీ వంటి టూరిజమ్‌ స్పాట్స్‌ కాకుండా అక్కడ ఎన్నారైల లైఫ్‌ స్టైల్, రియల్‌ లొకేషన్స్‌ చూపించా.

సిన్మాలో వరుణ్‌ది ఓ యాటిట్యూడ్‌ అయితే సాయి పల్లవిది ఇంకో యాటిట్యూడ్‌. పల్లవి నటన గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇంకా నటించగలదనే ఫీల్‌ ఇచ్చింది. ఆమెకు ధీటుగా వరుణ్‌ నటించాడు. నేను చేసిన హీరోల్లో అతనిది చాలా ఎక్స్‌ప్రెసివ్‌ ఫేస్‌. కళ్లు చూస్తే చిరంజీవి, పవన్‌కల్యాణ్‌గార్ల చమక్‌లు కనిపిస్తాయి.

ప్రతి ఒక్కరు ఈ సినిమాను రెండు మూడుసార్లు చూస్తారు. దుమ్ము దులుపుతుందంతే. దుమ్ము దులపడమంటే... బ్లాక్‌బస్టర్‌ అని కాదు, ఇట్స్‌ రీ–ఫ్రెషింగ్‌ ఫిల్మ్‌. యంగ్‌స్టర్స్, ఫ్యామిలీలకు బాగా నచ్చుతుంది. అమ్మాయిలు గర్వపడే చిత్రమిది. నేను ఎంచుకున్న నేపథ్యం, కథకు న్యాయం చేయడం నా స్టైల్‌. ‘ఫిదా’ నా స్టైల్‌లో అందంగా, కవితాత్మకంగా... వర్షం పడుతున్నట్టు ఉంటుంది.

మూడేళ్ల తర్వాత చేస్తున్న సినిమా... ప్రేక్షకుల అభిరుచులు మారాయా? వేరే ట్రెండ్‌ వచ్చిందా? అనే భయాలు నాలోనూ ఉన్నాయి. అయితే, ఇలాంటి సిన్మా ప్రేక్షకులు చూసుండరు. నాకు తెలిసి ప్రపంచంలో ఎవరూ మూడు కంటే గొప్ప కథలు రాయలేరు. ఆ తర్వాత తవ్వుకుంటుంటాం. ప్రేమకథలైతే మరీ ఎక్కువ రాయలేం. ఫీలయ్యి రాయాలి కాబట్టి! ఒక్కసారే మేజిక్‌ జరుగుతుంది. ఈ సిన్మాకు అది జరిగింది. నా ఆశ ఏంటంటే... స్టార్స్‌ ఎప్పుడో ఒకప్పుడు ఇలాంటి సినిమాలు చేయడానికి ముందుకొస్తారు. వాళ్లకూ మాస్‌ కమర్షియల్‌ సినిమాలు చేసి బోర్‌ కొడుతుంది.

తర్వాత ఏ సినిమా చేయాలనేది ఇంకా ఏం ఆలోచించుకోలేదన్నారు. మీ ఫ్యాన్స్‌ మీరు బ్యాక్‌ టు బ్యాక్‌ సినిమాలు చేయాలని ఆశిస్తున్నారు? అని శేఖర్‌ కమ్ములను ప్రశ్నించగా... ‘‘నా వల్ల కాదు. ఇలాంటి సినిమా స్పీడుగా చేయలేం. ఎక్కువ టైమ్‌ తినేస్తుంది. నా లైఫ్‌లో అదో పార్ట్‌. ప్రతి సినిమాకు నేను ఓ ఐదారు కేజీల బరువు తగ్గుతా. కళ్లు పీక్కుపోతాయి. ఇంట్లో వాళ్లంతా కంగారు పడతారు. నాతో పాటు మా టీమంతా అంతే కష్టపడతారు. నేను త్వరగా సినిమా చేస్తే మరో ‘అనామిక’ అవుతుందేమో. నా నుంచి ఏదైతే కోరుకుంటారో... అది నా దురదృష్టం. లైబ్రరీలో ఉండే సినిమాలు తీయాలనుకుంటున్నా. నేను మామూలుగా సినిమాలు తీస్తే ఆడవు’’ అన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement