బాహుబలి తర్వాత ఫిదాకే అలా జరిగింది
– ‘దిల్’ రాజు
‘‘పంపిణీదారుడిగా ఇరవై ఏళ్లు, నిర్మాతగా పధ్నాలుగేళ్ల నా ప్రయాణంలో ఏడో వారంలోనూ థియేటర్లు హౌస్‌ఫుల్ కావడమనేది ఈ మధ్య కాలంలో ‘బాహుబలి’ తర్వాత మా సినిమా విషయంలోనే అలా జరిగింది’’ అన్నారు ‘దిల్’ రాజు. వరుణ్‌తేజ్, సాయిపల్లవి జంటగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మించిన సినిమా ‘ఫిదా’.
ఈ శుక్రవారానికి (ఈ నెల 8) సినిమా విడుదలై 50 రోజులు. ఈ సందర్భంగా ఆదివారం హైదరాబాద్‌లో 50 రోజుల సంబరాలను నిర్వహించారు.‘దిల్’ రాజు మాట్లాడుతూ– ‘‘శేఖర్ కమ్ముల హాలిడేకి, నెక్ట్స్ సినిమా కోసం వరుణ్‌తేజ్ లండన్‌కి వెళ్తున్నారు. అందుకనే, ముందుగా ఈ రోజే 50 రోజుల వేడుక నిర్వహిస్తున్నాం. చిన్న సినిమాగా విడుదలైన ‘ఫిదా’కు ఇంత పెద్ద విజయాన్ని అందించిన తెలుగు ప్రేక్షకులకు కృతజ్ఞతలు’’ అన్నారు.
వరుణ్‌తేజ్ మాట్లాడుతూ– ‘‘ఇటీవల సిన్మాలు మూడు వారాలు ఆడుతున్నాయి. ఈలోపు డబ్బులు వచ్చేస్తుండడంతో థియేటర్లలోంచి తీసేస్తుంటారు. ఈ విషయంలో ‘ఫిదా’ మినహాయింపు సంపాదించుకుంది. ఈ విజయానికి అందరి కృషే కారణం. ఇంతమంచి సినిమాను మాతో చేసినందుకు శేఖర్‌గారికి థ్యాంక్స్’’ అన్నారు. శేఖర్ కమ్ముల మాట్లాడుతూ– ‘‘గట్టిగా అనుకుంటే జరుగుతుందని చాలామంది అటుంటారు. ‘ఫిదా’ గురించి మేము అలానే అనుకుని ఉంటాం.
‘హ్యాపీడేస్’ తర్వాత ఆ స్థాయి స్పందన రావడం సంతోషం. ఈ మేజిక్‌ని మళ్లీ మళ్లీ రిపీట్ చేయడానికి మా వంతుగా ప్రయత్నిస్తాం. నాకు మద్దతిచ్చిన నటీనటులు, సాంకేతిక నిపుణులకు థ్యాంక్స్’’ అన్నారు. ‘‘ఇప్పుడు నేనెక్కడికి వెళ్లినా భానుమతి అనే పిలుస్తున్నారు. ఇంత ప్రేమను పంచిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు’’ అన్నారు సాయిపల్లవి. చిత్రనిర్మాతల్లో ఒకరైన శిరీష్, నటి గీతా భాస్కర్, నేపథ్య సంగీతం అందించిన జీవన్‌బాబు తదితరులు పాల్గొన్నారు.