
చిరంజీవి ఉన్నారు కాబట్టే అంతమంది హీరోలు..
– ‘ఫిదా’ ఆడియో ఫంక్షన్‌లో ‘దిల్’ రాజు
‘‘నేను ప్రేక్షకుడిగా ఉన్నప్పుడు సికింద్రాబాద్ ప్యారడైజ్ వద్ద ‘స్టేట్ రౌడీ’ షూటింగ్‌లో ఫస్ట్ టైమ్ చిరంజీవిగారిని చూశా. ‘అల్లుడా మజాకా’ చిత్రానికి డిస్ట్రిబ్యూటర్‌గా ఆయన చేతుల మీదగా షీల్డ్ తీసుకున్నా. ఆయనతో ఎన్నో మూమెంట్స్ నాకు’’ అన్నారు నిర్మాత ‘దిల్’ రాజు.
వరుణ్ తేజ, సాయి పల్లవి జంటగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మించిన చిత్రం ‘ఫిదా’. శక్తికాంత్ స్వరపరచిన ఈ చిత్రం పాటలను హైదరాబాద్‌లో విడుదల చేశారు. ‘దిల్’ రాజు మాట్లాడుతూ– ‘‘చిరంజీవిగారు ఉన్నారు కాబట్టే... తర్వాత పవన్ కల్యాణ్‌గారు, అల్లు అర్జున్, రామ్‌చరణ్, వరుణ్ తేజ్, సాయిధరమ్ తేజ్ వచ్చారు. చిరంజీవిగారిని తల్చుకోకుండా వరుణ్ ఫంక్షన్‌గానీ, ఏ ఫంక్షన్‌గానీ జరగదు. ఎందుకంటే ‘హీ ఈజ్ మెగాస్టార్’.
‘ఖైదీ నంబర్ 150’, ‘డీజే’కి పోలిక పెడుతూ సోషల్ మీడియాలో కొంతమంది వాంటెడ్‌గా పోస్ట్‌లు పెడుతున్నారు. చిరంజీవిగారి రేంజ్ ఎప్పుడూ తగ్గదు. ‘ఖైదీ’కి, ‘డీజే’కి పోలికే లేదు. ‘ఆనంద్’ మంచి కాఫీ లాంటి సినిమా అయితే ‘ఫిదా’ ‘ఖుషి’ లాంటి సినిమా. ‘ఆనంద్, హ్యాపీడేస్’ తర్వాత ‘ఫిదా’ అలా ఉండబోతోంది. ఇది హండ్రెడ్ పర్సెంట్ పక్కా శేఖర్ కమ్ముల ఫిల్మ్. ఈ ఆరు నెలల్లో మా బ్యానర్‌లో హ్యాట్రిక్ హిట్స్ కొట్టాం. ‘ఫిదా’ కూడా సూపర్‌హిట్ కాబోతోంది’’ అన్నారు.
శేఖర్ కమ్ముల మాట్లాడుతూ– ‘‘వరుణ్, సాయిపల్లవి ఈ సినిమాకి పెద్ద ఎస్సెట్. వారిని చూస్తే ‘ఖుషి, తొలిప్రేమ’ సినిమాలు గుర్తుకొస్తాయి. వరుణ్ నటనలో చిరంజీవి, పవన్, నాగబాబు షేడ్స్ కనిపిస్తుంటాయి’’ అన్నారు.
వరుణ్ తేజ్ మాట్లాడుతూ– ‘‘సత్యం థియేటర్‌లో ‘ఆనంద్, హ్యాపీడేస్’ సినిమాలు చూశా. ‘దిల్’ రాజుగారితో పనిచేయడం హ్యాపీ. అలాంటి.. ఇలాంటి సినిమాలు చేయండి అని పెదనాన్న (చిరంజీవి), బాబాయ్ (పవన్ కల్యాణ్) అభిమానుల నుంచి ఫీడ్‌బ్యాక్ వస్తుంటుంది. నేను అదే ధోరణిలో ట్రై చేస్తుంటాను. రెండు మూడు చోట్ల తప్పటడుగులు వేశా. ఐ ప్రామిస్.. ఇక నుంచి మంచి సినిమాలు చేస్తా. నాకు ఇటువంటి అభిమానులను ఇచ్చిన పెదనాన్న, బాబాయ్‌కి థ్యాంక్స్. ఈ నెల 21న విడుదలవుతోన్న ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నా’’ అన్నారు.
కాగా ఇదే వేదికపై ‘శతమానం భవతి, నేను లోకల్’ వంద రోజుల షీల్డ్‌లను చిత్రబృందానికి అందించారు. సాయిపల్లవి, సంగీత దర్శకుడు శక్తికాంత్, నటుడు సాయిచంద్, హీరోలు నాని, నవీన్ చంద్ర, దర్శకులు సుకుమార్, వంశీ పైడిపల్లి, సతీశ్ వేగేశ్న, అనిల్ రావిపూడి, తరుణ్ భాస్కర్, పాటల రచయితలు ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి, సుద్దాల అశోక్‌తేజ, వనమాలి తదితరులు పాల్గొన్నారు.