త్రిషయితాన్
సైతాన్... దయ్యం... పిశాచి... అమ్మో అనుకోకండి. ఒక స్టార్ సత్తా చూపడానికి ఈ పాత్రలే గీటురాళ్లు. నమ్మకం లేదా? జ్యోతిక వేసిన ‘చంద్రముఖి’ చూడండి. అద్గదీ సంగతి. త్రిష కూడా ఇప్పుడు ఆ బాటలో తన సత్తా చూపే కొత్త పాత్ర చేస్తోంది...
నటిగా పదిహేనేళ్ళ కెరీర్ పూర్తి చేసుకున్న గ్లామర్ హీరో యిన్ త్రిష. అందంగా, పక్కింటి అమ్మాయిలా కనిపిస్తా రనే పేరున్న త్రిష ‘‘ఇక ఈ దశలో కొత్త తరహా పాత్రలు చేయాల్సిన అవసరముంది’’ అని గ్రహించారు. అందుకు తగ్గట్లే ఒక వినూత్న తరహా పాత్ర పోషించడానికి సిద్ధమవుతున్నారు. హార్రర్ సినిమాలో కథానాయిక పాత్ర పోషిస్తున్నారు. రాజ్ కందుకూరి సమర్పణలో గిరిధర్ ప్రొడక్షన్స్ హౌస్ పతాకంపై ఏకకాలంలో తెలుగు - తమిళ భాషల్లో ఈ చిత్రం తయారవు తోంది. రెండు భాషల్లోనూ ‘నాయకి’ అని టైటిల్ పెట్టారు. ‘షి వాచెస్ అండ్ క్యాచెస్ యు’ అనే వినూత్నమైన స్లోగన్ వాడుతున్నారు. దీర్ఘకాలంగా త్రిషకు మేనేజర్‌గా వ్యవహరిస్తున్న ఎం. గిరిధర్, శ్రీమతి పద్మజ మామిడిపల్లి ఈ చిత్రాన్ని నిర్మిస్తు న్నారు. చెన్నైలోని ఏ.వి.ఎం. స్టూడియోలోని వినాయకుడి గుడి దగ్గర గురువారం ఈ చిత్ర పూజా కార్యక్రమాలు జరిగాయి. నిర్మాత గిరిధర్, దర్శకుడు గోవి, పబ్లి సిటీ డిజైనర్ లంకా భాస్కర్ తదితర చిత్ర యూనిట్‌తో పాటు ప్రముఖ తెలుగు నిర్మాత కాట్రగడ్డ ప్రసాద్ పూజలో పాల్గొన్నారు.
అయిదు నిమిషాలకే ఓ.కె!
‘‘హైదరాబాద్‌లో ఒక సినిమా షూటింగ్‌లో ఉండగా, దర్శకుడు గోవి వచ్చి, ఈ ‘నాయకి’ చిత్రం కథ చెప్పారు. చెప్పడం మొదలుపెట్టిన అయిదు నిమిషాలకే నాకు కథ నచ్చేసింది. సినిమా చేయాలని మెంటల్‌గా ఫిక్స్ అయిపోయా. కానీ, ఎంతో ఆత్రంగా గోవి కథ చెబుతున్న తీరు చూసి, ఆయనకు అడ్డుపడదలుచుకోలేదు. దాదాపు గంటసేపు ఆయన స్క్రిప్ట్ వివరంగా చెబుతుంటే, ఆసక్తిగా విన్నా’’ అని త్రిష పేర్కొన్నారు. ఈ హార్రర్ - కామెడీ జానర్ సినిమా గురించి త్రిష వివరిస్తూ, ఇలాంటి తరహా పాత్ర ఇంతకు ముందెప్పుడూ చేయలేదన్నారు. తనతో పాటు మరికొందరు తారలు కూడా నటిస్తున్న ఈ చిత్రాన్ని ‘‘మల్టీ స్టారర్’’గా త్రిష పేర్కొనడం విశేషం. గణేశ్ వెంకట్రామ్, ‘సత్యం’ రాజేశ్, జయప్రకాశ్, బ్రహ్మానందం, మనోబాల, కోవై సరళ తదితరులు చిత్రంలోని ఇతర పాత్రధారులు. కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం గోవి నిర్విహ స్తుంటే, రఘు కుంచె సంగీతం, గౌతంరాజు ఎడిటింగ్ బాధ్యతలు స్వీకరించారు.
భయపెట్టే పాత్రలో...
గమ్మత్తేమిటంటే, హార్రర్ తరహా సినిమాలు చేయాలంటే ఇష్టమంటున్న త్రిష ఇప్పుడు సరిగ్గా అలాంటి పాత్రే చేస్తుండడం విశేషం. ‘‘హార్రర్ -కామెడీ జానర్‌లో గతంలో కూడా సినిమాలు వచ్చాయి. వాటిలో నూటికి 90 సినిమాలు సూపర్‌హిట్స్. ప్రత్యేకించి ఆ జానర్ అందరికీ బాగా నచ్చింది. కాగా, మేమిప్పుడు చేస్తున్న ‘నాయకి’ కథాకాలం కానీ, ఆ నేపథ్యం కానీ చాలా డిఫరెంట్‌గా ఉంటాయి’’ అని త్రిష వివరించారు.
అప్పటి లుక్‌లో...
1980ల నాటికి చెందిన కథతో సాగే ఈ చిత్రంలో త్రిష లుక్స్ అప్పటి తరహా దుస్తుల్లో, ప్రత్యేకంగా ఉంటాయి. ఇప్పటికే, షూటింగ్ షురూ పోస్టర్స్ గురించి చర్చ జరుగుతోంది. సాక్షాత్తూ రాజమౌళి సైతం ‘‘ఈ మధ్య పోస్టర్లతో ఆసక్తి రేకెత్తించిన చిత్రాల్లో ‘నాయకి’ ఒకటి. చేతిలో కత్తితో, పెదవులపై చిరునవ్వుతో, వినూత్నమైన గెటప్‌తో త్రిష లుక్ బాగుంది’’ అని ట్వీట్ చేశారు. ఇవన్నీ విని ఆనందిస్తున్న త్రిష ఈ చిత్రాన్ని ‘రెట్రో హార్రర్ - కామెడీ’ అన్నారు. ‘‘హీరోయిన్లకు అరుదుగా వచ్చే స్క్రిప్ట్ ఇది. మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని స్క్రిప్ట్ రూపొందించే దర్శక, రచ యితలు ఉండడం అదృష్టం. ఈ స్క్రిప్ట్‌కు నేను న్యాయం చేస్తాననే అనుకుంటున్నా’’ అంటున్నారు త్రిష. మరి, ఇంతకీ ఈ సినిమాలో త్రిష పోషిస్తు న్నది హంతకురాలి పాత్రా, బాధితురాలి పాత్రా, లేక దయ్యం పాత్రా? అది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్సే!