'బాహుబలి-2' విడుదల చేయొద్దని పిటిషన్
చెన్నై: టాలీవుడ్ స్టార్ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన బాహుబలి-2 మూవీకి తాజాగా ఓ సమస్య తలెత్తింది. ఇటీవల తమిళ వెర్షన్ ఆడియో విడుదల కార్యక్రమాన్ని మూవీ యూనిట్ అట్టహాసంగా నిర్వహించింది. ప్రస్తుతం ప్రమోషన్లలో బిజీగా ఉన్న తరుణంలో మూవీని నిలిపి వేయాలని కోరుతూ ఓ పిటిషన్ దాఖలైంది. ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ శరవణన్ మద్రాస్ హైకోర్టులో ఈ పిటిషన్ దాఖలు చేశారు. తనకు రావలసిన బకాయిలు చెల్లించేవరకూ బాహుబలి-2 విడుదలను నిలిపివేయాలని తన పిటిషన్‌లో శరవణన్ పేర్కొన్నారు.
రూ.1.18 కోట్ల మేర బకాయిలు తనకు అందాల్సి ఉందని ఆయన ఆరోపిస్తున్నారు. భారతీయ సినిమాను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన ప్రాజెక్టు బాహుబలి. అయితే మూవీ రిలీజ్‌ను అడ్డుకోవాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు కావడంతో సినీ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఇండస్ట్రీలో ఈ పిటిషన్ ప్రస్తుతం హాట్ టాపిక్ అయింది. మూవీ దర్శకుడు, నిర్మాతలుగానీ ఈ పిటిషన్‌పై ఏ విధంగానూ స్పందించలేదు. 'బహుబలి: ది బిగినింగ్' కి సీక్వెల్ అయిన బాహుబలి-2 ఈ నెల 28న దేశంలోనే రికార్డు సంఖ్య థియేటర్లలో విడుదల కానున్న విషయం తెలిసిందే. శరవణన్ దాఖలు చేసిన పిటిషన్ త్వరలోనే విచారణకు రానున్నట్లు సమాచారం.