
ఫిలింఫేర్ అవార్డనేది ఒక డ్రీమ్
ఫిలింఫేర్ అవార్డునందుకోవాలన్నది ప్రతి ఒక నటుడి కల అని ధనుష్ పేర్కొన్నారు. ఇప్పటికీ నాలుగు ఫిలింఫేర్ అవార్డులందుకున్న ఈయన మంగళవారం సాయంత్రం చెన్నై గిండీలోని నక్షత్ర హోటల్లో జరిగిన 61వ దక్షిణాది ఫిలింఫేర్ అవార్డుల ప్రెస్‌మీట్ కార్యక్రమంలో అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఫిలింఫేర్ పత్రిక సీఈవో తరుణ్‌రామ్, ఐడియా సెల్యులార్ సీసీ ఎఓ రాజత్ ముఖర్జి పాల్గొన్నారు. ధనుష్ మాట్లాడుతూ ఫిలింఫేర్ అవార్డు అందుకోవాలని ప్రతి నటుడు, నటి కలలు కంటారని చెప్పారు.
తాను నటుడిగా రంగ ప్రవేశం చేసిన తరువాత 2004 నుంచి 2008 వరకు ఫిలింఫేర్ అవార్డు కోసం ఎంతగానో ఎదురు చూశానన్నారు. అలాంటిది 2009లో ఆడుగళం చిత్రానికి మొదటిసారి ఫిలింఫేర్ అవార్డు అందుకున్నానని తెలిపారు. అలా వరుసగా నాలుగు ఫిలింఫేర్ అవార్డులను గెలుచుకున్నానన్నారు. ఈ మధ్య రాష్ట్రీయ, దేశీయ ఉత్తమ నటుడు అవార్డులను అందుకున్న తరువాత కూడా గత ఏడాది హిందీ చిత్రం రాంజనా చిత్రానికి గాను ఉత్తమ నూతన అవార్డును అందుకోవడం సరికొత్త అనుభవంగా పేర్కొన్నారు. కాగా 61వ దక్షిణాది ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం జూలై 12న చెన్నైలోని నెహ్రు ఇండోర్ స్టేడియంలో ఘనంగా నిర్వహించనున్నట్లు నిర్వాహకులు ఈ సందర్భంగా వెల్లడించారు.