కుటుంబానికి ప్రాధాన్యత ఇవ్వండి | First Priority To Family Suriya Sharing Massage To fans | Sakshi
Sakshi News home page

కుటుంబానికి ప్రాధాన్యత ఇవ్వండి

Published Mon, Jul 23 2018 8:29 AM | Last Updated on Mon, Jul 23 2018 8:29 AM

First Priority To Family Suriya Sharing Massage To fans - Sakshi

తమిళసినిమా: కుటుంబానికి ప్రాధాన్యత ఇవ్వండి అని నటుడు సూర్య తన అభిమానులకు హితవు పలికారు. నటుడు, నిర్మాత సూర్య ఇప్పుడు రెట్టింపు ఉత్సాహంతో ఉన్నారు. సోదరుడు కార్తీ కథానాయకుడిగా, ఆయన నిర్మించిన కడైకుట్టిసింగం ఇటీవల విడుదలై మంచి విజయం సాధించింది. ఇక సోమవారం ఆయన పుట్టిన రోజును జరుపుకుంటున్నారు. సూర్య అభిమానులు రాష్ట్ర వ్యాప్తంగా అన్నదానం, రక్తదానం అంటూ పలు సేవాకార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా సూర్య తన అభిమానులనుద్ధేశించి ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రకటనలో తన కొత్త అనుభవాలను, అభిమానులు ఆచరించాల్సిన విషయాలను తెలిపారు. అవేమిటో చూద్దాం. నేను చిన్నతనంలో తొలుత సైకిల్‌ కొనుక్కోవాలని ఆశ పడ్డాను. ఆ తరువాత మోటార్‌బైక్‌ కొనమని నాన్నను ఒత్తిడి చేశాను. ఆ తరువాత కారు ఇలా జీవితంలో కొత్త కొత్త విషయాలు ఉత్సాహాన్నిస్తాయి. అదే విధంగా కళాశాల చదువు, ఉద్యోగం, వివాహం అంటూ జీవితం సాగిపోతుంది.

ఇలా ఒక్కో వ్యక్తి జీవితంలో ఒక్కోరకమైన ఆసక్తి కలుగుతుంది. అయితే కొందరికి అలాంటి ఆసక్తి తగ్గుతూ పోతోందనిపిస్తుంది. ఇక చాలులే, అనే అసహనం ఏర్పడుతుంది. అయితే అలా కాకుండా ఇది చాలదు. ఇంకా తెలుసుకోవాలి. కొత్త కొత్త అనుభవాలు పొందాలని కోరుకోవాలి. చేసే పనిలో నేనే బెస్ట్‌ అనుకోవాలి. జీవితంలో సంతోషం చాలా ముఖ్యం. ఏ కారణంగానూ సంతోషాన్ని మనం వదులుకోకూడదు. అయితే డబ్బు మాత్రమే సంతోషాన్నివ్వదు. మనసును సంతోషంగా ఉంచుకోవడం ఒక కళ. ఎంత విద్యావేత్త అయినా ఎవరితోనూ మాట్లాడకుండా మౌనంగా ఉంటే ఎవరూ దరి చేరరు. అదే ఎప్పుడూ నవ్వుతూ కనిపిస్తే కారణం లేకుండానే పది మంది చుట్టూ చేరతారు. ఎవరూ ఎవరితోనూ పోల్చుకోకూడదు. అది అనవసరంగా మనస్తాపానికి గురి చేస్తుంది.

అభిమానులు నాపై ఎనలేని అభిమానం కురిపిస్తున్నారు. అంతే అభిమానం నాకు మీపై ఉంది. వయసు అయిపోతూనే ఉంటుంది. అంతలోగానే  ఉన్నత స్థాయికి చేరుకోవాలి. అవయవదానం, రక్తదానం చేస్తూ సేవాకార్యక్రమాల్లో పాలు పంచుకుంటున్న నా అభిమానులు ఎవరికీ బానిసలుగా ఉండనవసరం లేదు. అలా ఉండరని భావిస్తున్నాను. మంచి అలవాట్లను అలవరచుకోండి. అన్నింటి కంటే ముఖ్యం తల్లిదండ్రులకు ప్రాధాన్యతనివ్వండి అని సూర్య పేర్కొన్నారు. ఈయన నటుడు, నిర్మాతగా ఉంటూనే అగరం ఫౌండేషన్‌ ద్వారా విద్యాదానంతో పాటు పలు సేవాకార్యక్రమాలను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.సూర్య వాణిజ్య ప్రకటనలోనూ ఎక్కువగానే నటిస్తున్నారు. అయితే తద్వారా వచ్చిన మొత్తాన్ని అగరం ఫౌండేషన్‌ ద్వారా సేవాకార్యక్రమాలకు కేటాయిస్తున్నారన్నది గమనార్హం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement