'అద్భుతం సృష్టించామనే అనుకుంటున్నాం'
ఈ శుక్రవారం కాష్మోరా సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చిన కార్తీ, తన ఆనందాన్ని మీడియాతో పంచుకున్నారు. ఇన్నాళ్లు లవర్ బాయ్, యాక్షన్ హీరోగా కనిపించిన కార్తీ ఈ సినిమాతో పూర్తి డిఫరెంట్ లుక్ లో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా ఊపిరి లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తరువాత తెలుగులో వస్తున్న సినిమా కావటంతో తెలుగు మార్కెట్ మీద కూడా చాలా ఆశలు పెట్టుకున్నాడు.
'దర్శకుడు గోకుల్ తో కలిసి తాము ఓ అద్భుతాన్ని సృష్టించామని భావిస్తున్నాం. ముఖ్యంగా నాకు ఒకే తరహా పాత్రల్లో నటించటం ఇష్టం ఉండదు. అలా చేయటం అంటే చావుతో సమానం. ఈ సినిమాతో కొత్తగా కనిపించే అవకాశం లభించింది. కాష్మోరా ఓ కాస్ట్యూమ్ డ్రామా. సినిమాలో కేవలం 30 నిమిషాలు మాత్రం పీరియడ్ డ్రామా ఉంటుంది. ఈ సినిమాలో కీలకమైన రాజనాయక్ పాత్ర కోసం చాలా శ్రమించాం. ఈ పాత్ర ఇప్పటి వరకు నేను చేసిన అన్న పాత్రలలో ప్రత్యేకమైనది' అని తెలిపారు.
డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించిన గోకుల్ తొలి ప్రయత్నంగా కాష్మోరా సినిమాను తెరకెక్కించారు. కథ కన్నాముందే కార్తీకి రాజనాయక్, కాష్మోరా పాత్రలను వివరించటంతో కార్తీ వెంటనే సినిమా చేయడానికి అంగీకరించారు. ఓ సక్సెస్ ఫుల్ సినిమాకు కావాల్సిన అన్ని ఎలిమెంట్స్ ఈ సినిమాలో ఉన్నాయి. హర్రర్, చేతబబి, ఫైట్స్ అన్నింటికీ మించి కామెడీ లాంటి అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉన్నాయి. రాజనాయక్ పాత్ర కోసం ఫిజికల్ గా కూడా కార్తీ చాలా కష్టపడ్డాడు. భారీ దేహంతో క్రూరుడిగా కనిపించేందుకు నెలతరబడి శిక్షణ తీసుకున్నాడు. పాత్ర పరంగా రాజనాయక్ స్త్రీలోలుడు అయినా తెర మీద ఎలాంటి అసభ్యకర సన్నివేశాలు లేకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. అందుకే ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ కు చేరువైందంటున్నారు చిత్రయూనిట్. కార్తీతో పాటు ఈ దీపావళికి ఆడియన్స్ ముందుకు వచ్చిన ధనుష్ కోడి సినిమాపై స్పందించిన కార్తీ... తనకు ఇండస్ట్రీలో ఎవరితో పోటి లేదని.. 'నా సినిమాకు నా గత సినిమాతోనే పోటి' అన్నాడు.
కాష్మోరా షూటింగ్ 40 శాతానికి పైగా పూర్తయిన తరువాత బాహుబలి రిలీజ్ కావటంతో తప్పని సరి పరిస్థితుల్లో షూటింగ్ ఆపేసి తిరిగి కాస్ట్యూమ్స్ గ్రాఫిక్స్ లాంటి అంశాల మీద వర్క్ చేశామని తెలిపాడు. అయితే బడ్జెట్ పరంగా బాహుబలి స్థాయిలో తెరకెక్కించలేకపోయినా.. మా పరిథిలో సాధ్యమైనంత బెస్ట్ క్వాలిటీ సినిమాను రూపొదించామని, ప్రేక్షకుల నుంచి కూడా మంచి స్పందన వస్తుండటం ఆనందాన్నిస్తుంది తెలిపారు. బాలీవుడ్ నుంచి అవకాశాలు వస్తున్నప్పటికీ ఇప్పట్లో హిందీ సినిమా చేసే ఆలోచన లేదన్నారు.