Kashmora
-
కాష్మోరా దర్శకుడితో విజయ్‌సేతుపతి
విజయ్‌సేతుపతి హీరోగా చిత్రం అంటే నిర్మాతలు చీకూచింతా లేకుండా నిర్మించడానికి సిద్ధం అవుతున్నారు. కారణం వారి గల్లాపెట్టెలు నింపే కథానాయకుడిగా విజయ్‌సేతుపతి ఎదగడమే. ఈయన నటించిన ఆరు చిత్రాలు ఈ ఏడాది తెరపైకి వచ్చాయి. అన్నీ సక్సెస్ బాటలోనే పయనించాయి. ప్రస్తుతం విజయ్‌సేతుపతి చేతిలో మరో ఐదు చిత్రాలు ఉన్నాయి. తాజాగా మరో చిత్రానికి పచ్చజెండా ఊపారు. కాష్మోరా చిత్ర దర్శకుడు గోకుల్‌తో చిత్రం చేయడానికి రెడీ అవుతున్నారు. ఇంతకు ముందు వీరిద్దరి కాంబినేషన్లో రూపొందిన ‘ఇదర్కుదానే ఆశైపడ్డాయ్ బాలకుమారా’ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. దీనికి సీక్వెల్ ఉంటుందన్న ప్రచారం చాలా కాలంగా జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో గోకుల్ విజయ్‌సేతుపతి హీరోగా చిత్రం చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. దీని గురించి గోకుల్ తెలుపుతూ విజయ్‌సేతుపతితో తాను చేసే చిత్రం ఇదర్కుదానే ఆశైపడ్డాయ్ బాలకుమారా చిత్రానికి సీక్వెల్ కాదని స్పష్టం చేశారు. ఇది తాజా కథ అనీ, యాక్షన్ ఎలిమెంట్స్‌తో కూడిన వినోదభరిత కథా చిత్రంగా ఉంటుందని చెప్పారు. త్వరలో సెట్ పైకి వెళ్లే ఈ చిత్రంలో నటించే ఇతర నటీనటులు, సాంకేతిక వర్గం ఎంపిక జరుగుతోందనీ తెలిపారు. తాను ఆరేళ్లలో మూడు చిత్రాలకే దర్శకత్వం వహించాననీ, అందులో కాష్మోరా చిత్రం నిర్మాణం చాలా ఆలస్యమైందన్నారు. అయినా ఆ చిత్రం తనకు లైఫ్‌టైమ్ అనుభవం అని పేర్కొన్నారు. ఇకపై చిత్రాల విషయంలో వేగం పెంచనున్నట్లు చెప్పారు. -
'అద్భుతం సృష్టించామనే అనుకుంటున్నాం'
ఈ శుక్రవారం కాష్మోరా సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చిన కార్తీ, తన ఆనందాన్ని మీడియాతో పంచుకున్నారు. ఇన్నాళ్లు లవర్ బాయ్, యాక్షన్ హీరోగా కనిపించిన కార్తీ ఈ సినిమాతో పూర్తి డిఫరెంట్ లుక్ లో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా ఊపిరి లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తరువాత తెలుగులో వస్తున్న సినిమా కావటంతో తెలుగు మార్కెట్ మీద కూడా చాలా ఆశలు పెట్టుకున్నాడు. 'దర్శకుడు గోకుల్ తో కలిసి తాము ఓ అద్భుతాన్ని సృష్టించామని భావిస్తున్నాం. ముఖ్యంగా నాకు ఒకే తరహా పాత్రల్లో నటించటం ఇష్టం ఉండదు. అలా చేయటం అంటే చావుతో సమానం. ఈ సినిమాతో కొత్తగా కనిపించే అవకాశం లభించింది. కాష్మోరా ఓ కాస్ట్యూమ్ డ్రామా. సినిమాలో కేవలం 30 నిమిషాలు మాత్రం పీరియడ్ డ్రామా ఉంటుంది. ఈ సినిమాలో కీలకమైన రాజనాయక్ పాత్ర కోసం చాలా శ్రమించాం. ఈ పాత్ర ఇప్పటి వరకు నేను చేసిన అన్న పాత్రలలో ప్రత్యేకమైనది' అని తెలిపారు. డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించిన గోకుల్ తొలి ప్రయత్నంగా కాష్మోరా సినిమాను తెరకెక్కించారు. కథ కన్నాముందే కార్తీకి రాజనాయక్, కాష్మోరా పాత్రలను వివరించటంతో కార్తీ వెంటనే సినిమా చేయడానికి అంగీకరించారు. ఓ సక్సెస్ ఫుల్ సినిమాకు కావాల్సిన అన్ని ఎలిమెంట్స్ ఈ సినిమాలో ఉన్నాయి. హర్రర్, చేతబబి, ఫైట్స్ అన్నింటికీ మించి కామెడీ లాంటి అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉన్నాయి. రాజనాయక్ పాత్ర కోసం ఫిజికల్ గా కూడా కార్తీ చాలా కష్టపడ్డాడు. భారీ దేహంతో క్రూరుడిగా కనిపించేందుకు నెలతరబడి శిక్షణ తీసుకున్నాడు. పాత్ర పరంగా రాజనాయక్ స్త్రీలోలుడు అయినా తెర మీద ఎలాంటి అసభ్యకర సన్నివేశాలు లేకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. అందుకే ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ కు చేరువైందంటున్నారు చిత్రయూనిట్. కార్తీతో పాటు ఈ దీపావళికి ఆడియన్స్ ముందుకు వచ్చిన ధనుష్ కోడి సినిమాపై స్పందించిన కార్తీ... తనకు ఇండస్ట్రీలో ఎవరితో పోటి లేదని.. 'నా సినిమాకు నా గత సినిమాతోనే పోటి' అన్నాడు. కాష్మోరా షూటింగ్ 40 శాతానికి పైగా పూర్తయిన తరువాత బాహుబలి రిలీజ్ కావటంతో తప్పని సరి పరిస్థితుల్లో షూటింగ్ ఆపేసి తిరిగి కాస్ట్యూమ్స్ గ్రాఫిక్స్ లాంటి అంశాల మీద వర్క్ చేశామని తెలిపాడు. అయితే బడ్జెట్ పరంగా బాహుబలి స్థాయిలో తెరకెక్కించలేకపోయినా.. మా పరిథిలో సాధ్యమైనంత బెస్ట్ క్వాలిటీ సినిమాను రూపొదించామని, ప్రేక్షకుల నుంచి కూడా మంచి స్పందన వస్తుండటం ఆనందాన్నిస్తుంది తెలిపారు. బాలీవుడ్ నుంచి అవకాశాలు వస్తున్నప్పటికీ ఇప్పట్లో హిందీ సినిమా చేసే ఆలోచన లేదన్నారు. -
'కాష్మోరా' మూవీ రివ్యూ
టైటిల్ : కాష్మోరా జానర్ : హర్రర్ కామెడీ తారాగణం : కార్తీ, నయనతార, శ్రీ దివ్య, వివేక్ సంగీతం : సంతోష్ నారాయణన్ దర్శకత్వం : గోకుల్ నిర్మాత : పీవీపీ, ఎస్ ఆర్ ప్రకాష్ బాబు, ఎస్ ఆర్ ప్రభు సౌత్ నార్త్ అన్న తేడా లేకుండా అన్ని ఇండస్ట్రీలలో సక్సెస్ ఫార్ములాగా మారిన హర్రర్ కామెడీ జానర్ లో తెరకెక్కిన సినిమా కాష్మోరా. అయితే గత సినిమాలకు భిన్నంగా భారీ బడ్జెట్ తో అదే స్థాయి స్టార్ కాస్ట్ తో ఈ సినిమాను తెరకెక్కించటంతో సినిమా మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. హీరో కార్తీకి తమిళ్ తో పాటు తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ ఉండటంతో కాష్మోరా సినిమాను తెలుగు నాట కూడా భారీగా రిలీజ్ చేశారు. మరి ఇంతహైప్ క్రియేట్ చేసిన కాష్మోరా.. అనుకున్నట్టుగా ప్రేక్షకులను భయపెట్టాడా..? కథ : 700 ఏళ్ల క్రితం మహాసామ్రాజ్యంగా విలసిల్లిన స్థలం విక్రాంత రాజ్యం. సైన్యాధ్యక్షుడైన రాజనాయక్(కార్తీ) శౌర్య పరాక్రమాల కారణంగా రాజ్యం సువిశాలంగా విస్తరిస్తుంది. అయితే కథనరంగంలో అరివీర భయంకరుడైన రాజనాయక్ స్త్రీలోలుడు. ఆ కారణంగానే విక్రాంత రాజ్య యువరాణి రత్నమహాదేవి(నయనతార)ని తన సొంతం చేసుకోవాలనుకుంటాడు. అందుకోసం మహారాజు, యువరాజుతో పాటు యువరాణి ప్రేమించిన వ్యక్తిని కూడా చంపేస్తాడు. మహా పరాక్రమవంతురాలైన యువరాణి రత్నమహాదేవి పథకం ప్రకారం రాజనాయక్ ను అంతమొందిస్తుంది. కానీ ఆ పోరాటంలో ఆమె కూడా ప్రాణాలు విడుస్తుంది. చనిపోతూ రాజనాయక్ ఆత్మకు శాంతి కలగకుండా ఎప్పటికీ భూలోకంలోనే ప్రేతాత్మగా ఉండిపోవాలని శపిస్తుంది. అప్పటి నుంచి తన శాప విముక్తి కోసం ఆత్మగా ఎదురు చూస్తుంటాడు రాజనాయక్. కాష్మోరా(కార్తీ) తనకు తాను పెద్ద భూతవైద్యుడిగా చెప్పుకుంటూ ప్రజలను మోసం చేస్తుంటాడు. అతనితో పాటు తల్లి, తండ్రి, చెల్లెలు చివరకు ఇంట్లో బామ్మ కూడా భూత వైద్యులుగా బిల్డప్ ఇస్తూ ప్రజల దగ్గరనుంచి డబ్బులు గుంజేస్తుంటారు. దెయ్యల మీద రిసెర్చ్ చేస్తున్న యామిని(శ్రీదివ్య) తన రిసెర్చ్ కు సాయం చేయమంటూ కాష్మోరా దగ్గర చేరుతుంది. అదే సమయంలో ఓ రాజకీయ నాయకుణ్ని మోసం చేసి అతని అక్రమ సంపదనంతా తీసుకొని కుటుంబంతో సహా విదేశాలకు పారిపోవాలని ప్లాన్ చేస్తాడు కాష్మోరా. మరి అనుకున్నట్టుగా కాష్మోరా విదేశాలకు పారిపోయాడా..? కాష్మోరాకు రాజనాయక్ కు సంబంధం ఏంటి..? రాజనాయక్ కు శాపవిమోచనం అయ్యిందా..? అన్నదే మిగతా కథ. నటీనటులు : రాజనాయక్ గా, కాష్మోరాగా రెండు విభిన్న పాత్రల్లో నటించిన కార్తీ ఆకట్టుకున్నాడు. కాష్మోరాగా కామెడీ పండిస్తూనే రాజనాయక్ పాత్రలో క్రూరమైన విలన్ గా మెప్పించాడు. రెండు పాత్రలకు మంచి వేరియేషన్స్ చూపిస్తూ సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ గా నిలిచాడు. రత్నమహాదేవి పాత్రలో నయనతార మరోసారి సూపర్బ్ అనిపించింది. అందంగా కనిపిస్తూనే పరాక్రమవంతురాలైన యువరాణిగా ఆకట్టుకుంది. శ్రీదివ్య, వివేక్ లు తమ పరిధి మేరకు పాత్రకు న్యాయం చేశారు. సాంకేతిక నిపుణులు : 700 ఏళ్ల క్రితం జరిగిన సంఘటనకు ప్రస్తుత పరిస్థితులను ముడిపెడుతూ రాసుకున్న కథతో దర్శకుడు గోకుల్ మంచి ఎంటర్టైనర్ ను తెరకెక్కించాడు. ముఖ్యంగా రాజనాయక్ పాత్ర తీరు ఆకట్టుకుంటుంది. హీరోయిజం, విలనిజం కలిసిన పాత్రగా రాజనాయక్ ను చూపించిన తీరు బాగుంది. హర్రర్ సినిమాకు కీలకమైన సంగీతం విషయంలో మరింత దృష్టి పెట్టాల్సింది. పాటలు ఏమాత్రం అలరించకపోగా నేపథ్య సంగీతం కూడా ఆకట్టుకునే స్థాయిలోలేదు. ఎడిటింగ్ కూడా సినిమా స్థాయికి తగ్గట్టుగా లేదు. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ లెంగ్త్ ఇంకాస్త తగ్గించి ఉంటే బాగుండేది. సినిమా కోసం వేసి సెట్స్, కార్తీ మేకప్ సూపర్బ్ గా ఉన్నాయి. గ్రాఫిక్స్, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. ప్లస్ పాయింట్స్ : కార్తీ ఫ్లాఫ్బ్యాక్ ఎపిసోడ్ మైనస్ పాయింట్స్ : సంగీతం ఎడిటింగ్ ఓవరాల్‌గా కాష్మోరా, రొటీన్ హర్రర్ కామెడీలకు భిన్నంగా తెరకెక్కిన కమర్షియల్ ఎంటర్టైనర్ - సతీష్ రెడ్డి, ఇంటర్నెట్ డెస్క్ -
మా మధ్య నో లవ్.. ఓన్లీ యాక్షన్..- హీరో కార్తీ
‘‘రెండు చిత్రాలు తీసిన గోకుల్‌తో ఏ నమ్మకంతో ‘కాష్మోరా’ వంటి చిత్రం చేశారని తమిళ నటుడు వివేక్ నన్నడిగారు. ఇలాంటి సినిమాలను దర్శకులపై నమ్మకంతో చేయాలి. నా కెరీర్ ప్రారంభంలో ‘పరుత్తివీరన్’, ‘యుగానికొక్కడు’ వంటి చిత్రాలు డెరైక్టర్లు నాపై నమ్మకంతో తీశారు. వారి నమ్మకం వల్లే నేను ఈ స్థాయిలో ఉన్నా’’ అని హీరో కార్తీ చెప్పారు. కార్తీ, నయనతార, శ్రీదివ్య ముఖ్య పాత్రల్లో గోకుల్ దర్శకత్వంలో పీవీపీ సినిమా, డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై నిర్మించిన ‘కాష్మోరా’ ఈ శుక్రవారం విడుదలవుతోంది. పెరల్ వి.పొట్లూరి, పరమ్ వి.పొట్లూరి, కవిన్ అన్నే, ఎస్ఆర్ ప్రకాశ్ బాబు, ఎస్ఆర్ ప్రభు నిర్మాతలు. ఈ సందర్భంగా కార్తీ మాట్లాడుతూ- ‘‘ఈ చిత్రంలో విజువల్ ఎఫెక్ట్స్‌కి చాలా ప్రాముఖ్యత ఉంది. ‘బాహుబలి’ చూశాక మా చిత్రాన్ని మరికొంత నాణ్యతగా తీర్చిదిద్దేందుకు కొంత సమయం తీసుకున్నాం. ‘మగధీర’ చిత్రంలానే చారిత్రక నేపథ్యం ఉంటుంది. ‘కాష్మోరా’ లో రెండు పాత్రలు చేస్తున్నప్పుడు ‘దశావతారం’లో కమల్‌హాసన్‌గారు గుర్తొచ్చారు. ఈ చిత్రంలో నాకు, నయనతారకు మధ్య లవ్ సీన్స్ ఉండవు. యాక్షన్ సన్నివేశాలు మాత్రమే ఉంటాయి’’ అన్నారు. ‘‘ఊపిరి’ తర్వాత కార్తీ, నా కాంబినేషన్లో వస్తున్న చిత్రమిది. సోషియల్ మాస్ మసాలా ఎంటర్టైనర్గా తెరకెక్కింది. రెండు విభిన్న పాత్రలు చేసేందు కు కార్తీ చాలా కష్టపడ్డాడు. సినిమా మొత్తం తెలుగుదనంతో ఉంటుంది’’ అని ప్రసాద్ వి.పొట్లూరి అన్నారు. హీరోయిన్ శ్రీదివ్య పాల్గొన్నారు. -
తమిళంలో కన్నా తెలుగులోనే భారీగా..!
హీరోగా తమిళ నాట పరిచయం అయినా.. తెలుగులో కూడా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్న హీరో కార్తీ. తమిళ్‌తో పాటు తెలుగులో కూడా ఘన విజయాలు సాధించిన కార్తీ ప్రస్తుతం తన ప్రతీ సినిమాను తమిళ్‌తో పాటు తెలుగులోనే ఒకేసారి రిలీజ్ చేస్తున్నాడు. అదే బాటంలో తాజా చిత్రం కాష్మోరాను కూడా ఒకేసారి తెలుగు తమిళ భాషల్లో రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. అయితే ఈ సినిమా తమిళ్లో కన్నా.. తెలుగులోనే ఎక్కువ థియేటర్లలో రిలీజ్ అవుతుండటం విశేషం. తమిళ నాట ధనుష్ హీరోగా తెరకెక్కుతున్న కోడి సినిమా కాష్మోరా రిలీజ్ రోజే రిలీజ్ అవుతుండటంతో థియేటర్ల సమస్య ఏర్పడింది, దీంతో కార్తీ సినిమాకు అక్కడ కేవలం 450 థియేటర్లు మాత్రమే దక్కాయి. అయితే తెలుగు నాట ఈ సినిమా పీవీపీ సంస్థ రిలీజ్ చేస్తుండటంతో దాదాపు 600 థియేటర్లలో కాష్మోరా రిలీజ్ కానుంది. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్లకు మంచి స్పందన రావటంతో సినిమా మీద కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. -
'కాష్మోరా' మూవీ స్టిల్స్
-
'కాష్మోరా' ఆడియో విడుదల
-
రత్నమహాదేవిగా నయన్
తమిళ హీరో కార్తీ హీరోగా తెరకెక్కుతున్న పీరియడ్ డ్రామా కాష్మోరా. కార్తీ మూడు విభిన్న పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం పొస్డ్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది. ఇప్పటికే రిలీజ్ అయిన కార్తీ లుక్స్ సినిమా మీద భారీ హైప్ క్రియేట్ చేయగా తాజాగా ఈ సినిమాలో లీడ్ రోల్లో నటిస్తున్న నయనతార్ లుక్‌ను రివీల్ చేశారు. గోకుల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నయనతార రత్నమహాదేవిగా నటిస్తోంది. రాణి వేషదారణలో రౌధ్రంగా కనిపిస్తున్న నయన్ లుక్స్ సినిమా మీద అంచనాలను మరింతగా పెంచేస్తున్నాయి. శ్రీదివ్య మరో కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాను డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ పై ప్రకాష్ బాబు, ప్రభులు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. -
దీపావళికి ముక్కోణపు పోటీ
దీపావళి, సంక్రాంతి వంటి పెద్ద పండుగల సమయాల్లో అగ్ర హీరోల సినిమాలు తెరపైకి రావడం అన్నది మామూలు విషయమే. ఆ సందర్భాల్లో అధిక సెలవు దినాలు రావడం, ప్రేక్షకులు సినిమాలు చూడడానికి ఆసక్తి చూపడం ఒక కారణం కావచ్చు. కాగా ఈ దీపావళి సందర్భంగా పలు చిత్రాలను తెరపైకి తీసుకురావడానికి దర్శక నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. అయితే అందులో చివరికి ఎన్ని చిత్రాలు విడుదలవుతాయన్నది కచ్చితంగా తెలియకపోయినా మూడు చిత్రాలు మాత్రం పోటీలో నిలవనున్నాయి. వాటిలో మంచి స్నేహితులు, నడిగర్ సంఘం కార్యదర్శి, కోశాధికారి చిత్రాలు చోటు చేసుకోవడం ఆసక్తిగా మారనుంది. ఆ వివరాల్లోకెళ్లితే నటుడు, నడిగర్‌సంఘం కార్యదర్శి విశాల్ కథానాయకుడిగా నటిస్తున్న కత్తిసండై, నడిగర్ సంఘం కోశాధికారి కార్తీ హీరోగా నటిస్తున్న కాష్మోరా చిత్రాలతో పాటు ధనుష్ నటించిన కొడి చిత్రం దీపావళికి తెరపైకి రావడం ఖరారైంది. విశాల్‌తో నటి తమన్నా తొలిసారిగా జత కడుతున్న చిత్రం కత్తిసండై. చాలా కాలం తరువాత వడివేలు హాస్య పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో మరో కామెడి నటుడు సూరి నటిస్తున్నారు. సురాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మద్రాస్ ఎంటర్ప్రైజెస్ పతాకంపై ఎస్.నందగోపాల్ నిర్మిస్తున్నారు. కాగా కార్తీ, నయనతార, శ్రీదివ్య హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం కాష్మోరా. గోకుల్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి సంతోష్ నారాయణ్ సంగీతాన్ని అందిస్తున్నారు. డ్రీమ్ వారియర్ ఫిలింస్ పతాకంపై ఎస్ఆర్.ప్రకాశ్‌బాబు, ఎస్ఆర్.ప్రభు నిర్మిస్తున్నారు. ఇక మూడో చిత్రం కొడి. ధనుష్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రంలో త్రిష, అనుపమ పరమేశ్వరన్‌లు నాయికలుగా నటించారు. ఎస్ఆర్.సెంథిల్‌కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ధనుష్ వుండర్‌బార్ ఫిలింస్, ఎస్కేప్ ఆర్టిస్ట్ మోషన్ పిక్చర్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. వీటితో పాటు దీపావళికి తెరపైకి రావడానికి సూర్య నటిస్తున్న ఎస్-3 చిత్రం, కమలహాసన్ నటించి దర్శకత్వం వహించిన విశ్వరూపం-2 చిత్రాలతో పాటు మరి కొన్ని చిన్న బడ్జెట్ చిత్రాల దర్శక నిర్మాతలు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఇన్ని భారీ చిత్రాలు ఒకేసారి విడుదలకు థియేటర్లు సరిపోవు గనుక అప్పటికి ఏఏ చిత్రాలు ముందుకొస్తాయో వేచి చూడాల్సిందే. మొత్తం మీద ఈ సారి దీపావళి అధిక చిత్రాలతోనే సందడి చేయనుండడం గమనార్హం. -
కాష్మోరాతో భయపెడతా
కొంబన్, తోళా చిత్రాల విజయాలతో మంచి జోష్‌లో ఉన్న నటుడు కార్తీ తాజాగా కాష్మోరాగా మారి బ్రహ్మాండాలతో భయపెట్టడానికి సిద్ధం అవుతున్నారు.మాయ, ఇటీవల జోకర్ వంటి విభిన్న, విజయవంతమైన చిత్రాలను నిర్మించిన డ్రీమ్ వారియర్ సంస్థ అధినేతలు ఎస్ఆర్.ప్రకాశ్‌బాబు,ఎస్ఆర్.ప్రభు నిర్మిస్తున్న తాజా భారీ చిత్రం కాష్మోరా. కార్తీ త్రిపాత్రాభినయం చేస్తున్న ఈ చిత్రంలో నాయికలుగా నయనతార, శ్రీదివ్య నటిస్తున్నారు. నటుడు వివేక్ ముఖ్య పాత్ర పోషిస్తున్న ఈ చిత్రానికి ఇంతకు ముందు ఇదర్కుదానే అశైపట్టాయ్ బాల కుమారా చిత్రానికి దర్శకత్వం వహించిన గోకుల్ కథ,కథనం,దర్శకత్వం బాధ్యతల్ని నిర్వహిస్తున్నారు. షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న కాష్మోరా చిత్రం గురించి నిర్మాతలు తెలుపుతూ హారర్, కామెడీ, యాక్షన్ ఇత్యాధి అంశాలతో తెరకెక్కుతున్న తొలి తమిళ చిత్రం ఇదని తెలిపారు. ఇందులో కార్తీ మూడు విభిన్న పాత్రల్లో నటిస్తున్నారని చెప్పారు. ఈ చిత్రం కోసం ఆయన మూడు నెలలు సమయం తీసుకుని 47 గెటప్‌లు పరిశీలించి అందులో మూడింటిని ఎంపిక చేసుకుని నటించడం విశేషం అన్నారు. కాష్మోరా చిత్రం కోసం పలు ప్రాంతాల్లో పలు భారీ సెట్స్ వేసి చిత్రీకరణ జరిపినట్లు తెలిపారు. పలు ఆసక్తికరమైన అంశాలతో బ్రహ్మాండంగా కాష్మోరా చిత్రం ఉంటుందని తెలిపారు. దీనికి సంతోష్నారాయణన్ సంగీతం అదనపు ఆకర్షణగా నిలుస్తుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. -
కాష్మోరాగా కార్తీ
ఇన్నాళ్లు లవర్ బాయ్‌గా, మాస్ హీరోగా ఆకట్టుకున్న కార్తీ ఇప్పుడు అన్న సూర్య బాటలో నడిచేందుకు రెడీ అవుతున్నాడు. తొలిసారిగా ప్రయోగాత్మకంగా తెరకెక్కుతున్నకాష్మోరా సినిమాలో నటిస్తున్నాడు కార్తీ. తెలుగు తమిళ భాషల్లో ఒకేసారి తెరకెక్కుతున్న ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని 60 కోట్లతో పీవీపీ సంస్థ నిర్మిస్తోంది. గోకుల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నయనతార, శ్రీదివ్యలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాలో కార్తీ తొలిసారిగా త్రిపాత్రాభినయం చేస్తుండటం కూడా సినిమా మీద అంచనాలను పెంచేస్తోంది. భారతీయ సినీ చరిత్రలో తొలిసారిగా 3డి ఫేస్ స్కానింగ్, 360 డిగ్రీ ఓమ్నీ డైరెక్షనల్ కెమరా టెక్నాలజీస్‌ను ఈ సినిమా కోసం వినియోగించారు. ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ అయ్యింది. కార్తీ కాష్మోరా లుక్‌లో కనిపిస్తున్న ఈ పోస్టర్ సినిమా మీద అంచనాలను మరింతగా పెంచేస్తుంది.ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న కాష్మోరా, దీపావళి కానుకగా రిలీజ్‌కు రెడీ అవుతోంది. -
శ్రీదివ్యకు షాక్
అనుకున్నవి జరగకపోవడం, ఊహించనివి జరగడమే జీవితం. నటి శ్రీదివ్య ప్రస్తుతం ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నారని చెప్పవచ్చు. నిజం చెప్పాలంటే కోలీవుడ్‌లో లక్కీ హీరోయిన్లలో టాలీవుడ్ చిన్నది శ్రీదివ్య ఒకరని చెప్పకతప్పదు. వరుత్తపడాదవాలిభన్ చిత్రం ఈ బ్యూటీ జీవితాన్ని మార్చేసింది. అంతే కాదు తదుపరి నటించిన చిత్రాలు విజయం సాధించడంతో సక్సెస్ఫుల్ హీరోయిన్గా ముద్ర వేసుకున్నారు. ఇటీవల విశాల్‌కు జంటగా నటించిన మరుదు చిత్రం వరకూ శ్రీదివ్య కెరీర్ విజయవంతంగా సాగింది. ప్రస్తుతం ఈ అమ్మడు కార్తీతో కాష్మోరా, జీవాకు జంటగా సంగిలి బుంగిలి చిత్రాలలో నటిస్తున్నారు. అయితే చిక్కంతా వచ్చింది ఎక్కడంటే కాష్మోరా చిత్రంలో నయనతార నాయకిగా నటిస్తున్నారు. దీంతో శ్రీదివ్య రెండో నాయకి స్థాయికి పడిపోయారు. అయినా ఫర్వాలేదనుకున్న సమయంలో ఈ చిత్రంలో మరో నాయకిగా నటి మనీషా యాదవ్ వచ్చి చేరింది. దీంతో కాష్మోరాలో ముగ్గురు నాయికలు అయ్యారు. అయినా ఫర్వాలేదని సర్దుకు పోయి నటిస్తున్న శ్రీదివ్యకు తాజాగా రెండవ నాయకి పాత్రలు వరుస కడుతున్నాయట. దీంతో షాక్‌కు గురైన శ్రీదివ్య తాను కాష్మోరా చిత్రంలో ముగ్గురు హీరోయిన్లలో ఒకరిగా నటిస్తున్నా ఇందులో త్రిపాత్రాభినయం చేస్తున్న కార్తీకి ఒక పాత్రలో తాను నాయకినని పేర్కొన్నారు. ఈ చిత్రం విడుదలైన తరువాత ఈ విషయం మీకే తెలుస్తుందనీ అంటూ తాజాగా వస్తున్న సెకెండ్ హీరోయిన్ పాత్రలను నిరాకరిస్తున్నారట. ఏదేమైనా ఇటాంటి పరిస్థితులను శ్రీదివ్య ఎదుర్కోవడం ఆమె వర్గాలను ఆలోచనలో పడేసిందంటున్నారు కోలీవుడ్ వర్గాలు. -
కార్తీ సినిమాకు కత్తి లాంటి కెమెరా!
చెన్నై: తమిళంలో కార్తీ, నయనతార జంటగా నటిస్తున్న 'కాష్మోరా' సినిమాకు అత్యంత అధునాతనమైన కెమెరాను వాడుతున్నారట. ఈ విషయాన్ని స్వయంగా చిత్ర దర్శకుడు గోగుల్ ప్రకటించారు. భారతదేశంలో మొట్టమొదటి సారిగా 360 డిగ్రీ ఆమ్నిడైరెక్షనల్ కెమెరా పరికరాన్ని వాడుతున్నట్లు తెలిపారు. కొన్ని ప్రత్యేకమైన దృశ్యాల చిత్రకీరణకు ఈ కెమెరాను ఉపయోగిస్తున్నట్లు దర్శకుడు చెప్పారు. అయితే అందుబాటులో ఉన్న టెక్నాలజీతో షూటింగ్ చేద్దామని అనుకున్నా, క్వాలిటీలో ఎక్కడా రాజీపడకూడదనే ఈనిర్ణయం తీసుకున్నామని ఆయన తెలిపారు. పనోరమా ఫోటోగ్రఫీ లాగానే ఉన్నా 360 డిగ్రీ ఆమ్నిడైరెక్షనల్ కెమెరా ద్వారా మరింత నాణ్యంగా చాలా దూరంగా ఉన్న దృశ్యాలను కూడా చాలా స్పష్టంగా చూపించడం దీని ప్రత్యేకత అని గోకుల్ పేర్కొన్నారు. కొన్ని యాక్షన్ సన్నివేశాలను, ఒక పాటను ఈ కెమెరా ద్వారా చిత్రీకరించినట్టు సినిమా వర్గాలు తెలిపాయి. ఈ సినిమాలో తెలుగు నటి శ్రీదివ్య కూడా ముఖ్య భూమికను పోషిస్తోంది.