తమిళంలో కన్నా తెలుగులోనే భారీగా..!
హీరోగా తమిళ నాట పరిచయం అయినా.. తెలుగులో కూడా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్న హీరో కార్తీ. తమిళ్తో పాటు తెలుగులో కూడా ఘన విజయాలు సాధించిన కార్తీ ప్రస్తుతం తన ప్రతీ సినిమాను తమిళ్తో పాటు తెలుగులోనే ఒకేసారి రిలీజ్ చేస్తున్నాడు. అదే బాటంలో తాజా చిత్రం కాష్మోరాను కూడా ఒకేసారి తెలుగు తమిళ భాషల్లో రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నాడు.
అయితే ఈ సినిమా తమిళ్లో కన్నా.. తెలుగులోనే ఎక్కువ థియేటర్లలో రిలీజ్ అవుతుండటం విశేషం. తమిళ నాట ధనుష్ హీరోగా తెరకెక్కుతున్న కోడి సినిమా కాష్మోరా రిలీజ్ రోజే రిలీజ్ అవుతుండటంతో థియేటర్ల సమస్య ఏర్పడింది, దీంతో కార్తీ సినిమాకు అక్కడ కేవలం 450 థియేటర్లు మాత్రమే దక్కాయి. అయితే తెలుగు నాట ఈ సినిమా పీవీపీ సంస్థ రిలీజ్ చేస్తుండటంతో దాదాపు 600 థియేటర్లలో కాష్మోరా రిలీజ్ కానుంది. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్లకు మంచి స్పందన రావటంతో సినిమా మీద కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి.