దీపావళికి ముక్కోణపు పోటీ
దీపావళి, సంక్రాంతి వంటి పెద్ద పండుగల సమయాల్లో అగ్ర హీరోల సినిమాలు తెరపైకి రావడం అన్నది మామూలు విషయమే. ఆ సందర్భాల్లో అధిక సెలవు దినాలు రావడం, ప్రేక్షకులు సినిమాలు చూడడానికి ఆసక్తి చూపడం ఒక కారణం కావచ్చు. కాగా ఈ దీపావళి సందర్భంగా పలు చిత్రాలను తెరపైకి తీసుకురావడానికి దర్శక నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. అయితే అందులో చివరికి ఎన్ని చిత్రాలు విడుదలవుతాయన్నది కచ్చితంగా తెలియకపోయినా మూడు చిత్రాలు మాత్రం పోటీలో నిలవనున్నాయి. వాటిలో మంచి స్నేహితులు, నడిగర్ సంఘం కార్యదర్శి, కోశాధికారి చిత్రాలు చోటు చేసుకోవడం ఆసక్తిగా మారనుంది.
ఆ వివరాల్లోకెళ్లితే నటుడు, నడిగర్‌సంఘం కార్యదర్శి విశాల్ కథానాయకుడిగా నటిస్తున్న కత్తిసండై, నడిగర్ సంఘం కోశాధికారి కార్తీ హీరోగా నటిస్తున్న కాష్మోరా చిత్రాలతో పాటు ధనుష్ నటించిన కొడి చిత్రం దీపావళికి తెరపైకి రావడం ఖరారైంది. విశాల్‌తో నటి తమన్నా తొలిసారిగా జత కడుతున్న చిత్రం కత్తిసండై. చాలా కాలం తరువాత వడివేలు హాస్య పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో మరో కామెడి నటుడు సూరి నటిస్తున్నారు. సురాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మద్రాస్ ఎంటర్‌ప్రైజెస్ పతాకంపై ఎస్.నందగోపాల్ నిర్మిస్తున్నారు. కాగా కార్తీ, నయనతార, శ్రీదివ్య హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం కాష్మోరా. గోకుల్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి సంతోష్ నారాయణ్ సంగీతాన్ని అందిస్తున్నారు.
డ్రీమ్ వారియర్ ఫిలింస్ పతాకంపై ఎస్‌ఆర్.ప్రకాశ్‌బాబు, ఎస్‌ఆర్.ప్రభు నిర్మిస్తున్నారు. ఇక మూడో చిత్రం కొడి. ధనుష్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రంలో త్రిష, అనుపమ పరమేశ్వరన్‌లు నాయికలుగా నటించారు. ఎస్‌ఆర్.సెంథిల్‌కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ధనుష్ వుండర్‌బార్ ఫిలింస్, ఎస్కేప్ ఆర్టిస్ట్ మోషన్ పిక్చర్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
వీటితో పాటు దీపావళికి తెరపైకి రావడానికి సూర్య నటిస్తున్న ఎస్-3 చిత్రం, కమలహాసన్ నటించి దర్శకత్వం వహించిన విశ్వరూపం-2 చిత్రాలతో పాటు మరి కొన్ని చిన్న బడ్జెట్ చిత్రాల దర్శక నిర్మాతలు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఇన్ని భారీ చిత్రాలు ఒకేసారి విడుదలకు థియేటర్లు సరిపోవు గనుక అప్పటికి ఏఏ చిత్రాలు ముందుకొస్తాయో వేచి చూడాల్సిందే. మొత్తం మీద ఈ సారి దీపావళి అధిక చిత్రాలతోనే సందడి చేయనుండడం గమనార్హం.