'కాష్మోరా' మూవీ రివ్యూ | Kashmora movie review | Sakshi
Sakshi News home page

'కాష్మోరా' మూవీ రివ్యూ

Published Fri, Oct 28 2016 12:44 PM | Last Updated on Mon, Sep 4 2017 6:35 PM

'కాష్మోరా' మూవీ రివ్యూ

'కాష్మోరా' మూవీ రివ్యూ

టైటిల్ : కాష్మోరా
జానర్ : హర్రర్ కామెడీ
తారాగణం : కార్తీ, నయనతార, శ్రీ దివ్య, వివేక్
సంగీతం : సంతోష్ నారాయణన్
దర్శకత్వం : గోకుల్
నిర్మాత : పీవీపీ, ఎస్ ఆర్ ప్రకాష్ బాబు, ఎస్ ఆర్ ప్రభు

సౌత్ నార్త్ అన్న తేడా లేకుండా అన్ని ఇండస్ట్రీలలో సక్సెస్ ఫార్ములాగా మారిన హర్రర్ కామెడీ జానర్ లో తెరకెక్కిన సినిమా కాష్మోరా. అయితే గత సినిమాలకు భిన్నంగా భారీ బడ్జెట్ తో అదే స్థాయి స్టార్ కాస్ట్ తో ఈ సినిమాను తెరకెక్కించటంతో సినిమా మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. హీరో కార్తీకి తమిళ్ తో పాటు తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ ఉండటంతో కాష్మోరా సినిమాను తెలుగు నాట కూడా భారీగా రిలీజ్ చేశారు. మరి ఇంతహైప్ క్రియేట్ చేసిన కాష్మోరా.. అనుకున్నట్టుగా ప్రేక్షకులను భయపెట్టాడా..?

కథ :
700 ఏళ్ల క్రితం మహాసామ్రాజ్యంగా విలసిల్లిన స్థలం విక్రాంత రాజ్యం. సైన్యాధ్యక్షుడైన రాజనాయక్(కార్తీ) శౌర్య పరాక్రమాల కారణంగా రాజ్యం సువిశాలంగా విస్తరిస్తుంది. అయితే కథనరంగంలో అరివీర భయంకరుడైన రాజనాయక్ స్త్రీలోలుడు. ఆ కారణంగానే విక్రాంత రాజ్య యువరాణి రత్నమహాదేవి(నయనతార)ని తన సొంతం చేసుకోవాలనుకుంటాడు.

అందుకోసం మహారాజు, యువరాజుతో పాటు యువరాణి ప్రేమించిన వ్యక్తిని కూడా చంపేస్తాడు. మహా పరాక్రమవంతురాలైన యువరాణి రత్నమహాదేవి పథకం ప్రకారం రాజనాయక్ ను అంతమొందిస్తుంది. కానీ ఆ పోరాటంలో ఆమె కూడా ప్రాణాలు విడుస్తుంది. చనిపోతూ రాజనాయక్ ఆత్మకు శాంతి కలగకుండా ఎప్పటికీ భూలోకంలోనే ప్రేతాత్మగా ఉండిపోవాలని శపిస్తుంది. అప్పటి నుంచి తన శాప విముక్తి కోసం ఆత్మగా ఎదురు చూస్తుంటాడు రాజనాయక్.

కాష్మోరా(కార్తీ) తనకు తాను పెద్ద భూతవైద్యుడిగా చెప్పుకుంటూ ప్రజలను మోసం చేస్తుంటాడు. అతనితో పాటు తల్లి, తండ్రి, చెల్లెలు చివరకు ఇంట్లో బామ్మ కూడా భూత వైద్యులుగా బిల్డప్ ఇస్తూ ప్రజల దగ్గరనుంచి డబ్బులు గుంజేస్తుంటారు. దెయ్యల మీద రిసెర్చ్ చేస్తున్న యామిని(శ్రీదివ్య) తన రిసెర్చ్ కు సాయం చేయమంటూ కాష్మోరా దగ్గర చేరుతుంది.

అదే సమయంలో ఓ రాజకీయ నాయకుణ్ని మోసం చేసి అతని అక్రమ సంపదనంతా తీసుకొని కుటుంబంతో సహా విదేశాలకు పారిపోవాలని ప్లాన్ చేస్తాడు కాష్మోరా. మరి అనుకున్నట్టుగా కాష్మోరా విదేశాలకు పారిపోయాడా..? కాష్మోరాకు రాజనాయక్ కు సంబంధం ఏంటి..? రాజనాయక్ కు శాపవిమోచనం అయ్యిందా..? అన్నదే మిగతా కథ.

నటీనటులు :
రాజనాయక్ గా, కాష్మోరాగా రెండు విభిన్న పాత్రల్లో నటించిన కార్తీ ఆకట్టుకున్నాడు. కాష్మోరాగా కామెడీ పండిస్తూనే రాజనాయక్ పాత్రలో క్రూరమైన విలన్ గా మెప్పించాడు. రెండు పాత్రలకు మంచి వేరియేషన్స్ చూపిస్తూ సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ గా నిలిచాడు. రత్నమహాదేవి పాత్రలో నయనతార మరోసారి సూపర్బ్ అనిపించింది. అందంగా కనిపిస్తూనే పరాక్రమవంతురాలైన యువరాణిగా ఆకట్టుకుంది. శ్రీదివ్య, వివేక్ లు తమ పరిధి మేరకు పాత్రకు న్యాయం చేశారు.

సాంకేతిక నిపుణులు :
700 ఏళ్ల క్రితం జరిగిన సంఘటనకు ప్రస్తుత పరిస్థితులను ముడిపెడుతూ రాసుకున్న కథతో దర్శకుడు గోకుల్ మంచి ఎంటర్టైనర్ ను తెరకెక్కించాడు. ముఖ్యంగా రాజనాయక్ పాత్ర తీరు ఆకట్టుకుంటుంది. హీరోయిజం, విలనిజం కలిసిన పాత్రగా రాజనాయక్ ను చూపించిన తీరు బాగుంది. హర్రర్ సినిమాకు కీలకమైన సంగీతం విషయంలో మరింత దృష్టి పెట్టాల్సింది. పాటలు ఏమాత్రం అలరించకపోగా నేపథ్య సంగీతం కూడా ఆకట్టుకునే స్థాయిలోలేదు. ఎడిటింగ్ కూడా సినిమా స్థాయికి తగ్గట్టుగా లేదు. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ లెంగ్త్ ఇంకాస్త తగ్గించి ఉంటే బాగుండేది. సినిమా కోసం వేసి సెట్స్, కార్తీ మేకప్ సూపర్బ్ గా  ఉన్నాయి. గ్రాఫిక్స్, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.
 
ప్లస్ పాయింట్స్ :
కార్తీ
ఫ్లాఫ్బ్యాక్ ఎపిసోడ్

మైనస్ పాయింట్స్ :
సంగీతం
ఎడిటింగ్

ఓవరాల్గా కాష్మోరా, రొటీన్ హర్రర్ కామెడీలకు భిన్నంగా తెరకెక్కిన కమర్షియల్ ఎంటర్టైనర్

- సతీష్ రెడ్డి, ఇంటర్నెట్ డెస్క్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement