టైటిల్: పొన్నియన్ సెల్వన్-2
నటీనటులు: చియాన్ విక్రమ్, కార్తి, జయం రవి, త్రిష, ఐశ్వర్య రాయ్, ప్రకాశ్ రాజ్, పార్థిబన్, ఐశ్వర్య, ప్రభు, శరత్ కుమార్, విక్రమ్ ప్రభు, జయరాం తదితరులు
నిర్మాణ సంస్థలు: లైకా ప్రొడక్షన్స్, మద్రాస్ టాకీస్
దర్శకత్వం : మణిరత్నం
సంగీతం: ఏఆర్ రెహమాన్
సినిమాటోగ్రఫీ: రవి వర్మన్
విడుదల తేది: ఏప్రిల్28, 2022
ప్రముఖ దర్శకుడు మణిరత్నం ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన హిస్టారికల్ మూవీ ‘పొన్నియన్ సెల్వన్’. ఈ సినిమా మొదటి భాగం గతేడాది సెప్టెంబర్‌లో విడుదలై ఘన విజయం సాధించింది. దీంతో రెండో భాగం పొన్నియన్ సెల్వన్ 2 పై ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురుగు చూస్తున్నారు. భారీ అంచనాల మధ్య నేడు(ఏప్రిల్ 28) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉంది?రివ్యూలో చూద్దాం.
కథేంటంటే...
చోళ సామ్రాజ్యపు అధినేత సుందర చోళుడు(ప్రకాశ్ రాజ్) చిన్న కుమారుడు అరుళ్‌మోళి అలియాస్ పొన్నియన్ సెల్వన్(జయం రవి) నౌకలో తన రాజ్యానికి తిరిగివెళ్తుండగా శత్రువుడు దాడి చేయడం.. పోరాటం చేస్తూ ఆయన సముద్రంలో పడిపోవడం.. ఒక ముసలావిడ సముద్రంలో దూకి అతన్ని కాపాడటం. ఆ ముసలావిడకు పళవూరు రాణి నందిని (ఐశ్వర్యరాయ్) పోలికలు ఉన్నట్లు చూపించి మొదటి భాగాన్ని ముగించాడు దర్శకుడు మణిరత్నం.
(చదవండి: 'ఏజెంట్' మూవీ రివ్యూ.. ఎలా ఉందంటే?)
అసలు ఆ ముసలావిడ ఎవరు? నందినికి ఆ ముసలావిడకి ఎలాంటి సంబంధం ఉంది? అరుళ్‌మోళికి ఆపద వచ్చినప్పుడల్లా ఆ ముసలావిడ ఎందుకు కాపాడుతుంది? చోళరాజ్యాన్ని నాశనం చేయాలని ప్రతీజ్ఞ పూనిన పాండ్యుల లక్ష్యం నెరవేరిందా? ఆదిత్య కరికాలుడు(చియాన్ విక్రమ్)పై పగ పెంచుకున్న నందిని.. అతన్ని అంతం చేసేందుకు పన్నిన కుట్రలు ఫలించాయా? నందిని విషయంలో తప్పు చేశానని బాధపడుతున్న ఆదిత్య కరికాలుడు చివరకు ఏం చేశాడు? అసలు మందాకిని ఎవరు? ఆమెకు సుందర చోళుడుకి మధ్య ఉన్న సంబంధం ఏంటి? చివరకు చోళ సామ్రాజ్యానికి రాజు ఎవరయ్యారు? అనేది తెలియాలంటే పొన్నియన్ సెల్వన్ 2 చూడాల్సిందే.
ఎలా ఉందంటే..
తొలి భాగంలో చోళ రాజ్య వ్యవస్థను.. సింహాసనం కోసం సొంతమనుషులే అంతర్గత కుట్రలు చేయడం.. చోళ రాజ్యాన్ని పతనం చేసేందుకు శత్రురాజ్యాలు వేచి చూడడం చూపించారు. ఇక రెండో భాగంలో ఆ కుట్రల వెనుక ఉన్న కారణాలు తెలుపుతూ.. కథను మరింత లోతుగా చూపించాడు. ఆదిత్య కరికాలుడు, నందినిల ప్రేమ సన్నివేశాలతో సినిమా ప్రారంభం అవుతుంది. నందినిని పెళ్లి చేసుకోకుండా ఎవరు అడ్డుపడ్డారనేది మొదట్లోనే చూపించారు.
(చదవండి: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన రావణాసుర, ఎక్కడంటే?)
ఆ తర్వాత అరుళ్‌మోళి ఎలా ప్రాణాలతో బయటపడ్డాడు? అతను చనిపోయాడని భావించిన శుత్రువులు.. కరికాలుడిని, సుందర చోళుడిని చంపడానికి వేసిన కుట్రలు.. బౌద్దుల సమక్షంలో జరిగే నాటకీయ పరిణామాలతో ఫస్టాఫ్ ముగుస్తుంది. ఇక సెండాఫ్‌లో మందాకిని నేపథ్యం గురించి తెలిపే సన్నివేశాలు.. ఆదిత్య కరికాలుడు, నందిని మధ్య జరిగే సంఘర్షణలు ఆకట్టుకుంటాయి. నందిని పాత్రకి సంబంధించిన ట్విస్టులు బాగుంటాయి. రాజ్యాధికారం కోసం సొంతవాళ్లే చేసే కుట్రలు.. ప్రేమ, స్నేహం కోసం చేసే త్యాగాలు ఇందులో చూపించారు.
అయితే ‘పొన్నియన్ సెల్వన్’ అనేది చోళ రాజులకు సంబంధించిన చరిత్ర. అది ఉన్నది ఉన్నట్లుగా చూపించాలి. లేనిపోని మార్పులు చేస్తే చరిత్రకారులు విమర్శిస్తారు. అలా అని ఆసక్తికరంగా చూపించపోతే ప్రేక్షకులు మెచ్చరు. ఈ రెండిటిని బ్యాలెన్స్ చేస్తూ మణిరత్నం పీఎస్ 2ని తెరకెక్కించాడు. అయితే ఈ కథలో ఎక్కువ పాత్రలు ఉండడం.. అందులో ఒక్కో పాత్రకి రెండు,మూడు పేర్లు ఉండడం.. పైగా చరిత్రపై అందరికి పట్టుఉండకపోవడం ఈ సినిమాకు మైనస్.
ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులకు చోళుల చరిత్రపై అంతగా అవగాహన ఉండకపోవచ్చు. అందుకే పీఎస్1 టాలీవుడ్‌లో పెద్దగా ఆడలేదు. పీఎస్ 2 విషయంలో ప్లస్ పాయింట్ ఏంటంటే.. పీఎస్ 1 చూసిన ప్రేక్షకులకు చోళ రాజ్య వ్యవస్థపై కాస్త అవగాహన వస్తుంది కాబట్టి.. రెండో భాగం నచ్చే అవకాశం ఉంది. అయితే మొదటి భాగం చూసి వెళ్తేనే రెండో భాగం అర్థమవుతుంది.
ఎవరెలా చేశారంటే..
ఈ సినిమాలో అన్ని పాత్రలకు ప్రాధాన్యత ఉంది. ప్రతి ఒక్కరు తమతమ పాత్రల్లో ఒదిగిపోయారు. మొదటి భాగంతో పోలిస్తే.. రెండో భాగంలో ఐశ్వర్యరాయ్ పాత్రకు స్క్రీన్ స్పేస్ ఎక్కువగా ఉంది. నందినిగా ఆమె నటన అందరిని ఆకట్టుకుంటుంది. విక్రమ్ పాత్రకు నిడివి తక్కువే అయినా.. అతను కనిపించే సన్నివేశాలన్నీ అందరికి గుర్తిండిపోతాయి. పొన్నియన్ సెల్వన్‌గా జయం రవి చక్కగా నటించాడు. కుందవైగా త్రిష తెరపై అందంగా కనిపించింది. కానీ ఆమె నిడివి కూడా చాలా తక్కువే. మొదటి భాగంలో కార్తి పాత్రకు ఎక్కువ స్క్రీన్ స్పేస్ లభించింది. ఇందులో అంత నిడివి ఉండదు కానీ..ఒకటి రెండు బలమైన సన్నివేశాలు ఉన్నాయి.
పళవేట్టురాయర్‌గా శరత్‌కుమార్ మరోసారి తెరపై తన అనుభవాన్ని చూపించాడు. సుందర చోళుడు పాత్రను ప్రకాశ్ రాజ్ అద్భుతంగా పోషించాడు. తంజావూరు కోటసేనాధిపతి చిన పళవేట్టురాయన్‌గా ఆర్.పార్తిబన్, పడవ నడిపే మహిళ పూంగుళలిగా ఐశ్యర్య లక్ష్మీతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు.
ఇక సాంకేతిక విషయాలకొస్తే.. ఏఆర్ రెహమాన్ నేపథ్య సంగీతం, పాటలు బాగున్నాయి. విజువల్ ఎఫెక్ట్స్ క్వాలిటీ అంత బాగాలేదు. రవి వర్మన్ సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి.
-అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్
Comments
Please login to add a commentAdd a comment